బోరబండ పార్టీ

Special Story On 29/12/2019 In Funday - Sakshi

డిసెంబర్‌ 31 పార్టీ–2019
వేదిక: మార్‌ ముంత జనతా బార్, ఎల్‌ఐసీ ఆఫీస్‌ ఎదురుగా, బోరబండ, హైదరాబాద్‌.
పార్టీలో పాల్గొంటున్నవారు...
శ్రీ కిమ్‌ జోంగ్, ఉత్తర కొరియా ప్రెసిడెంట్‌.
శ్రీ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్‌.
శ్రీ రామ్‌గోపాల్‌వర్మ, టాలీవుడ్‌ డైరెక్టర్, బాలీవుడ్‌ డైరెక్టర్,  మళ్లీ టాలీవుడ్‌ డైరెక్టర్, కాబోయ్‌ హాలీవుడ్‌ డైరెక్టర్‌.
శ్రీ పాల్, ‘ప్రజాశాంతి’ పార్టీ స్థాపకులు.

‘‘ఛీ...ర్స్‌’’ అంటూ చేతిలో గ్లాసు ఎత్తాడు వర్మ.
కొండ చరియలు విరిగి పడినా వినిపించేంత గాఢమైన నిశ్శబ్దం. ఏ ఒక్కరూ గ్లాసెత్తలేదు!
‘‘అదేమిటీ ఎవరు గ్లాసెత్తడం లేదు! అసలు మీ దగ్గర గ్లాసులే లేవు’’ ఆశ్చర్యపోయాడు వర్మ.
‘‘మిత్రమా, మందు మాట విన్నా విందు మాట విన్నా నాకు వొళ్లు మండుతుంది. అసలు మనం ఈ  భూప్రెపంచానికి ఏటికి వచ్చాం? ప్రపంచ శాంతి కోసం వచ్చాం...’’ చెప్పుకుంటూ పోతున్నాడు పాల్‌.
‘‘అసలు ఇక్కడికి  ఎందుకు వచ్చావు? అది చెప్పి చావు’’ అని కళ్లతోనే గద్దించాడు వర్మ.

‘‘నీకోసం ఎవడొచ్చాడోయ్‌? ట్రంపు గారూ, అలాగే ఉత్తర కొరియాగారు, పాల్‌గారు...నా చిరకాల మిత్రులు. వారిని మర్యాదపూర్వకంగా కలవడానికి ఈ బోరబండ–2019 పార్టీకి రావడం జరిగింది. అంతేకాని నీతో కలిసి వోడ్కా కొట్టడానికి కాదు..’’ వివరణ ఇచ్చాడు పాల్‌.
‘‘అదిసరే, నువ్వే పాల్‌ కదా! మరి ఇంకో పాల్‌ ఎవరు?’’ అడిగాడు వర్మ.
‘‘నేనే...సారీ...నా పేరు నేనే చెప్పుకున్నాను. మిత్రమా...అసలు ఈ ప్రెపంచంలో గొప్ప విషయం ఏమిటో తెలుసా? ఆస్తి కాదు అందం కాదు...ఎదుటి వ్యక్తిని క్షమాపణ కోరడం....’’ అన్నాడు పాల్‌.
తొలి పెగ్గు పూర్తి చేసిన వర్మ ‘‘ఆల్కహాల్‌ మ్యాన్స్‌ వరస్ట్‌ ఎనిమీ. బట్‌ యూ మస్ట్‌ లవ్‌ యువర్‌ ఎనిమీ. దట్సాల్‌’’ అంటూ ఆవేశపడిపోయాడు.

‘‘నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు సుమీ’’ అన్నాడు పాల్,æ వర్మ ముందున్న చికెన్‌ ముక్కలను చూస్తూ.
‘‘నాకు  ఆవేశం వచ్చినప్పుడల్లా ఇలా ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటాను. ఆ డైలాగులు నీకు అర్థమయ్యాయా, అసలు నాకే ఏమైనా  అర్థమయ్యాయా అనేది నాకు అనవసరం. నా డైలాగు నా ఇష్టం.  అవసరమైతే కోర్టులో కేసు  వేసుకో...ఈమధ్య తరచుగా కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని కోర్టు దగ్గరే ఇల్లు అద్దెకు తీసుకున్నాను’’ అంటూ రెండో పెగ్గెత్తాడు వర్మ. 
‘‘ఏయ్‌ మిస్టర్, నేను వచ్చి రెండు గంటలు అవుతుంది. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావు. మా ఉత్తర కొరియాలో ఇలా కాదు...నేను మాత్రమే మాట్లాడాలి...మా ప్రజల చెవులు మాత్రమే పనిచేస్తాయి. నోళ్లు పనిచేయవు. ఐ లవ్‌ యూ కొరియా’’ అని రస్నా బేబీలా  మెలికలు తిరిగాడు ఉత్తర కొరియా ప్రెసిడెంట్‌  కిమ్‌ జోంగ్‌.

‘‘ఇది ఉత్తర కొరియా కాదు బోరబండ’’ అని గుర్తు చేశాడు ట్రంపు.
‘‘అదిసరే, నువ్వేంటి చాలా డల్‌గా ఉన్నావు?’ ఆరా తీశాడు కిమ్‌ జోంగ్‌.
‘‘నీకు తెలియనింది ఏముంది మిత్రమా! ఇంటి పోరు ఇంతింత కాదయా...అన్నారు కదా పెద్దలు. మళ్లీ మా ఆవిడ మెలానియాతో గొడవ వచ్చేసింది. ప్రతినిధుల సభ అభిశంసన లొల్లి మరోవైపు. నన్ను సీటుపై నుంచి దింపడానికి కాచుకొని కూర్చున్నారు. అందుకే నాకు  వైరాగ్యం ఆవహించింది. ఈ భవబంధాలు, పదవులు తుపుక్‌ తుపుక్‌ అనిపించాయి.  అందుకే హిమాలయాలకు పోదామని డిసైడై ఇలా వచ్చాను. హిమాలయాలకు వెళ్లడానికి ముందు...చిన్న పార్టీ...న్యూ ఇయర్‌ పార్టీ అని ఫ్రెండ్స్‌ ఆహ్వానిస్తే ఇలా వచ్చాను. ఇక ఇదే నా చివరి పార్టీ, ఇక నాకు ఏ పొలిటికల్‌ పార్టీలతో æ సంబంధం లేదు. ఇక నా శాశ్వత చిరునామా హిమాలయాలే’’ అని ధ్యానముద్రతో  కళ్లు మూసుకున్నాడు ట్రంప్‌.

‘‘హిమాలయాలకు వెళ్లి ఏంచేస్తావు మిత్రమా?’’ అంతులేని ఆశ్చర్యంతో అడిగాడు కిమ్‌ జోంగ్‌.
‘‘బుట్టల కొద్దీ ఐస్‌ సేకరించి, వాటితో ఐస్‌క్రీమ్‌లు తయారుచేసి సైకిల్‌ మీద తిరుగుతూ ఐస్‌క్రీమ్‌లో...ఐస్‌క్రీమ్‌ అని అమ్ముతాను. వెధవ డౌట్లూ నువ్వూనూ...హిమాలయాలకు ఎందుకు వెళతారో తెలియదా...’’ అని గుగ్గి మీద అగ్గిలం అయ్యాడు ట్రంప్‌.

‘‘మొన్న నేను  ‘హిమాలయా: ఎడ్వెంచర్స్, మెడిటేషన్, లైఫ్‌ ఆఫ్‌ రస్కిన్‌బాండ్‌’ పుస్తకం చదివా! ఆ పుస్తకంలో ఒక చోట...’’ అని వర్మ అన్నాడో లేదో...
‘‘జేమ్స్‌బాండ్‌కు రస్కిన్‌బాండ్‌ ఏమవుతాడండీ?’’ పాత చుట్ట  వెలిగించి కొత్త డౌటు అడిగాడు కిమ్‌.
 తట్టుకోలేక తల గోడకు కొట్టుకొని...జండుబామ్‌ రాసుకున్నాడు ట్రంప్‌.

‘‘ఏమిటండీ ఈ నాన్సెన్స్‌...న్యూ ఇయర్‌ పార్టీ అని పిలిచారు. ఒక్కరూ మందు ముట్టడం లేదు. వాళ్లిద్దరి సంగతి సరే, అసలు నీకేమైంది? బకెట్లకు బకెట్లు తాగుతావు కదా!’’ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ని చూస్తూ అడిగాడు వర్మ.
‘‘ప్రతిరోజూ తాగుతాను కదా...ఈరోజు కూడా తాగితే స్పెషలేముంటుంది? అందుకే  ఈరోజు తాగొద్దు అనుకుంటున్నాను. తాగకపోవడమే నా దృష్టిలో  పార్టీ’’ తనదైన సై్టల్‌లో  వివరించాడు కిమ్‌ జోంగ్‌.
‘‘తాగడంలో మాత్రమే జోష్‌ ఉండదు. ఆటలోనూ జోష్‌ ఉంటుంది. కావున...అందరం కలిసి కబడ్డీ ఆడుదాం. సోదరుడు వర్మ నేను ఒక జట్టు, మీరిద్దరు ఒక జట్టు...’’ అన్నాడు పాల్‌.
‘‘ఓకే’’ అన్నారు అందరూ సంతోషంగా.
ఆట మొదలైంది.

‘కబేది కబేది’ అని అమెరికన్‌ యాసతో  ట్రంప్‌ కూతకు రావడం వినోదంగా అనిపించింది. ఆ తరువాత...నోట్లో చుట్ట కాలుతుండగానే, ఆ చుట్ట తీయకుండానే  కూతకు వెళ్లి ‘కబోద్‌ కబోద్‌’ అన్నాడు కిమ్‌ జోంగ్‌. అంతే...ఆ చుట్ట వెళ్లి పాల్‌ నెత్తి మీద పడింది.
‘‘ఏమాయ్య బుద్దీ జ్నానం ఉందా నీకు...’’ అంటూ ప్రపంచం నలుమూలలలో ఉన్న తిట్లన్నీ శాంతస్వరంతో తిట్టాడు పాల్‌. రెఫరీ ఇరువర్గాలను  కూల్‌ చేశాడు. ఆట మళ్లీ మొదలైంది. ఈసారి వర్మ కూతకు వచ్చాడు...
‘‘రంగీలా... రంగీలా.... రంగీలా’’
‘‘రంగీలా రంగీలా కాదయ్యా బాబు...కబడ్డీ కబడ్డీ అనాలి’’ అన్నాడు కోపంగా  రెఫరీ.

‘‘నా కూత నా ఇష్టం...అవసరమైతే కోర్టులో కేసు వేసుకో. మా ఇల్లు కోర్టు దగ్గరే తెలుసా!’’ అని వర్మ అంటుండగానే గడియారంలో గంట మోగింది. పన్నెండు అయింది. 2020 వచ్చింది. అందరూ ‘హ్యాపీ న్యూ ఇయర్‌’లు చెప్పుకున్నారు. ఆతరువాత...
‘‘మేము బస చేసిన హోటల్‌కు ఆటోలో వెళ్లమంటారా? క్యాబ్‌లో వెళ్లమంటారా?’’ చివరి చుట్ట వెలిగిస్తూ అడిగాడు  కిమ్‌ జోంగ్‌.
‘‘అక్కర్లేదండీ...హీరో రాజశేఖర్‌కి ఫోన్‌ చేశాను. మిమ్మల్ని తన కారులో డ్రాప్‌ చేస్తానన్నాడు. వస్తున్నాడు...’’ అన్నాడో లేదో ‘వామ్మో’ అని ఆ ముగ్గురు వెనక్కి చూడకుండా  ఎటువాళ్లు అటు పారిపోయారు!
– యాకుబ్‌ పాషా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top