ఐ యామ్‌ ఇన్‌ లవ్‌

Special interview with kajal agarwal  - Sakshi

ఒకర్ని ప్రేమించలేం. మరొకరు మనల్ని ప్రేమించలేరు. ప్రయత్నిస్తే అయ్యేది ప్రేమే కాదు. ఒకరోజు పొద్దున్నే లేచి చూస్తే మొక్కలో పువ్వు కనబడుతుంది! నిన్న కనబడని పువ్వు హఠాత్తుగా ఇవాళ కనబడితే ఎలా ఉంటుందో.. ప్రేమా అలాంటిదే.  ‘ఇట్‌ జస్ట్‌ హ్యాపెన్స్‌’. నిజానికి నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోతే ఎవర్నీ ప్రేమించలేవు. ఎవరూ నిన్ను ప్రేమించలేరు. నన్ను నేను గాఢంగా ప్రేమించుకుంటున్నా. ‘ఐ యామ్‌ ఇన్‌ లవ్‌’

చూస్తూ చూస్తూ మీరొచ్చి పదేళ్లయింది. ఈ పదేళ్ల కెరీర్‌ ఎలా అనిపిస్తోంది?
కాజల్‌: ఆల్వేస్‌ హ్యాపీ. ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఊహించనంత ఎత్తుకి ఎదిగాను. అయితే ఇది తేలికగా వచ్చిన స్థాయి కాదు. దాని వెనకాల నా హార్డ్‌వర్క్, టాలెంట్‌ ఉన్నాయి. అఫ్‌కోర్స్‌ దేవుడి ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయి. ఇక అభిమానుల గురించి చెప్పకపోతే తప్పవుతుంది. నాకు మంచి మంచి అవకాశాలిచ్చి నేను మంచి స్థాయికి రావడానికి కారణమైన దర్శక–నిర్మాతలు అందరికీ థ్యాంక్స్‌.

హ్యాపీగానే ఉన్నప్పటికీ హీరోయిన్‌ అయినందుకు ఎప్పుడైనా పశ్చాత్తాపం, అభద్రతాభావం ఏమైనా?
లేదండి. ఇండస్ట్రీ నాకెంతో ఇచ్చింది. రియల్‌గా నేను కానిది రీల్‌పై చేసే అవకాశం వస్తోంది. ఇన్‌సెక్యూరిటీ అస్సలు లేదు. దానికి కారణం నా పేరెంట్స్‌. నన్ను, నా చెల్లెలు నిషాని మా అమ్మానాన్న చాలా స్ట్రాంగ్‌గా పెంచారు. ఇప్పుడు నా జోన్‌లో నేను సేఫ్‌ అండ్‌ సెక్యూర్‌గా ఉన్నాను.  

ఏ వృత్తిలో అయినా ప్లస్సులు, మైనస్సులు కామన్‌. మరి.. నటిగా ఉండటంలో ప్లస్సులు, మైనస్సులు చెబుతారా?
నేను మామూలు అమ్మాయిగా ఉండి ఉంటే అది చాలా చిన్న ప్రపంచం. సినిమాల్లోకి రావడం వల్ల పెద్ద ప్రపంచం పరిచయమైంది. అందుకని ఎన్నో విషయాలు నేర్చుకునే వీలు ఉంటుంది. నా పదేళ్ల కెరీర్‌... జీవితం గురించి ఇంకో పదేళ్లకు సరిపడా నేర్పించింది.

ఇప్పుడు నా ఫ్రెండ్స్‌ని తీసుకుందాం. వాళ్లందరికన్నా నా మెచ్యూర్టీ లెవల్స్‌ ఎక్కువ. జీవితం గురించి వారికన్నా నాకున్న అవగాహన ఎక్కువ. ఒక సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? వ్యక్తులను ఎలా డీల్‌ చేయాలి? అనే విషయంలో క్లారిటీ ఉంటుంది. ఇక మైనస్సుల గురించి చెప్పాలంటే.. మేం ప్రైవసీ కోల్పోతాం.

ఎక్కడికెళ్లాలన్నా ఒంటరిగా వెళ్లలేం. ‘నువ్వు పబ్లిక్‌ ఫిగర్‌ అవుతున్నావంటే నీ ప్రైవేట్‌ లైఫ్‌ విషయంలో కొంచెం కాంప్రమైజ్‌ కావాల్సిందే’ అని హీరోయిన్‌గా కొంచెం పేరు రావడం మొదలుపెట్టాక అనుకున్నా. పేరు, స్వేచ్ఛ.. రెండూ కావాలనుకుంటే కుదరదు. రెండోది వదులుకున్నా. అలాగే లైమ్‌లైట్‌లో ఉండటంవల్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసినా ‘కాజల్‌ ఇలాంటి అమ్మాయి’ అని ఈజీగా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న మైనస్సులను ప్లస్‌ అనుకోకపోతే ఇండస్ట్రీలో ఉండలేం.

ఎంత ప్లస్‌ అనుకున్నా.. ఈజీగా కామెంట్‌ చేస్తే బాధగా ఉంటుంది కదా...
నేనో ఫార్ములా నమ్ముతాను. ఆ ఫార్ములా పేరు ‘జస్ట్‌ ఇగ్నోర్‌ ఇట్‌’. మనల్ని కామెంట్‌ చేసేవాళ్లందరి మీద ఫైట్‌ చేయలేం కదా. ఆర్టిస్ట్‌గా నా లైఫ్‌ ఫుల్‌ బిజీ. అది వదిలేసి ఎవరో ఏదో అన్నారని వాళ్లని అనడం మొదలుపెడితే నా టైమ్‌ వేస్ట్‌ అవుతుంది. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య సమాజంలో. ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి.

నా గురించి కొందరికి మంచి అభిప్రాయం ఉండొచ్చు. కొందరు చెడుగా అనుకోవచ్చు. నేనేం చేయలేను కదా. చెడుగా అనుకునేవాళ్ల దగ్గరికెళ్లి ‘నేను మంచిదాన్ని. నా గురించి మీ అభిప్రాయాన్ని మార్చుకోండి’ అని చెప్పలేను కదా.

ఆస్కార్‌ అవార్డ్స్‌లో హాలీవుడ్‌ నటి మెక్‌డొర్మండ్‌ ‘ఇంక్లూజన్‌ రైడర్‌’ గురించి మాట్లాడారు. మీరూ అలా జరగాలని కోరుకుంటారా?
నేను సరిగ్గా ఫాలో అవ్వలేదు. ‘ఇంక్లూజన్‌ రైడర్‌’ గురించి నాకు తెలియదు. కొంచెం చెబుతారా?

అంటే.. ఒక సినిమా టీమ్‌లో 50 శాతం ఫీమేల్‌ ఉండాలని దాని అర్థం. ఈ 50 శాతంలో ట్రాన్స్‌జెండర్, గే, లెస్బియన్‌లకు కూడా స్థానం కల్పించాలన్నది ‘ఇంక్లూజర్‌ రైడర్‌’. ఈ మధ్య ఆస్కార్‌ గెలుచుకున్న సందర్భంగా వేదికపై మెక్‌డొర్మండ్‌ ఈ విషయం చెప్పారు. మరి.. ఇండియన్‌ ఇండస్ట్రీ ‘మేల్‌ డామినేటెడ్‌’ కాబట్టి ఇక్కడ ఇలాంటి రూల్‌ పెడితే కష్టమే కదా?
ఏమో.. పెద్ద సబ్జెక్ట్‌లా అనిపిస్తోంది (నవ్వుతూ). ఏదైనా నిబంధన గురించి చెప్పేటప్పుడు వయసు, అనుభవం ముఖ్యం. మెక్‌డొర్మండ్‌కి 60 ఏళ్లు. ఆమె అన్నట్లుగా జరిగితే బాగుంటుంది. కానీ మన ఇండస్ట్రీలో కష్టమేమో. ఎందుకంటే మన ఇండస్ట్రీలో మెజారిటీ మగాళ్లు ఉంటారు కదా.

మీరెప్పుడైనా డామినేషన్‌కి గురయ్యారా?
నేను చాలా స్ట్రాంగ్‌. ఒకవేళ అలాంటిది ఉన్నా కూడా నేను అస్సలు ఎఫెక్ట్‌ అవ్వను. ఎందుకంటే  నా ఒపీనియన్‌ని నేను చెప్పగలను. నా రైట్స్‌ కోసం నేను నిలబడగలను.

మీరు చాలా కూల్‌గా కనిపిస్తారు.. కారణం చెబుతారా?
యోగా. యోగాలో ధ్యానం కూడా భాగమే. అయితే రోజూ చేయను. మనల్ని మనం కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే మాత్రం యోగా, మెడిటేషన్‌ చాలా ఇంపార్టెంట్‌ అని నమ్ముతాను.

మీరు పుస్తకాలు బాగా చదువుతారా? ఫేవరెట్‌ రైటర్‌?
విపరీతంగా చదువుతాను. పర్సనల్‌ డెవలప్‌మెంట్‌లో బుక్‌ రీడింగ్‌ కీ రోల్‌ ప్లే చేస్తుందని నమ్ముతాను. చాలామంది ఇష్టం. అయితే ఫేవరెట్‌ అంటే మాత్రం ‘అలెన్‌ డే బోతన్‌’ అనే స్విస్‌ రచయిత. ఆయన రచనలను ఎక్కువ ఇష్టపడతాను. ఆయన ఎక్కువగా రిలేషన్‌షిప్స్‌ గురించి రాస్తుంటారు. నా ఫేవరెట్‌ సబ్జెక్ట్‌.  

మీ సిస్టర్‌ (నిషా అగర్వాల్‌) పెళ్లి చేసుకున్నారు. మీ పెళ్లెప్పుడు? పెళ్లయితేనే లైఫ్‌లో సెటిలైనట్లు అని సమాజం అంటుంది కదా?
ఐయామ్‌ ఆల్రెడీ సెటిల్డ్‌. ఫైనాన్షియల్‌గా సెక్యూర్డ్‌ పొజిషన్‌లో ఉన్నాను. ఎమోషనల్‌గానూ అలానే ఉన్నాను.  నాకు మంచి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ ఉన్నారు. మంచి ప్రొఫెషన్‌లో ఉన్నాను. ఇక మంచి వరుడిని వెతుక్కోవడమే. అయితే పెళ్లికి, లైఫ్‌లో సెటిల్‌మెంట్‌కీ సంబంధం లేదేమో.

అసలు సెటిల్‌ అవ్వడమంటేనే ఏ పని చేయకుండా  హ్యాపీగా ఉండటం కదా (నవ్వేస్తూ). చాలామంది పెళ్లి చేసుకుని కూడా సంతోషంగా లేరు. మన వేవ్‌లెంగ్త్‌కి మ్యాచ్‌ అయ్యేవాడు దొరక్కపోతే లైఫ్‌లో సెటిలైనట్లు కాదు.

మీరు చాలా లవ్‌స్టోరీల్లో నటించారు.. ఎప్పుడైనా లవ్‌లో పడాలని అనిపించలేదా??
గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది సినిమా అని. అవన్నీ ఫిల్మీ థింగ్స్‌.  

కానీ అందరికీ అనిపిస్తుంది కదా ప్రేమించబడాలని....
అఫ్‌కోర్స్‌. కానీ అంతకంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోగలగాలి. నీతో నువ్వు సంతోషంగా ఉండగలగాలి. అంతే కానీ ప్రేమ కోసం వేరే వాళ్ల మీద ఆధార పడటం కరెక్ట్‌ కాదు. మీ ఫ్యామిలీ అయినా, గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్‌ ఎవరైనా తమంతట తాము మిమ్మల్ని ప్రేమించాలి. అంతే కానీ ప్రేమను డిమాండ్‌ చేయకూడదు. ఎక్స్‌పెక్ట్‌ చేయడం తప్పు. నన్ను నేను గాఢంగా ప్రేమించుకుంటున్నా. ‘ఐ యామ్‌ ఇన్‌ లవ్‌’.

అసలు ప్రపంచంలో అతి పెద్ద ప్రాబ్లమ్‌ ఏంటంటే ‘ఎక్స్‌పెక్టేషన్స్‌’ కదా?
ఎగ్జాట్లీ. ‘ఎక్స్‌పెక్టేషన్స్‌ లీడ్స్‌ టు డిజప్పాయింట్‌మెంట్‌’. బేసిక్‌ హ్యూమన్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ కొన్ని ఉంటాయి. ప్రేమించేవాళ్లు నిజాయితీగా ఉండాలని. ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్‌ కాలేము. లాయల్టీ విషయంలో నేను చాలా పర్టిక్యులర్‌.

ప్రైవసీ కోల్పోతాం అన్నారు. మీరు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు ఎంతో ప్రేమ లభిస్తుంది. సేమ్‌ టైమ్‌ ఆ మధ్య తమన్నాపై ఒకతను చెప్పు విసిరాడు.. అలాంటివీ ఎదురవుతుంటాయి కదా?
స్క్రీన్‌పై మమ్మల్ని చూసి, అభిమానిస్తుంటారు. ఆ ప్రేమకు థ్యాంక్స్‌. అయితే పబ్లిక్‌లోకి మేం వచ్చినప్పుడు కొందరు ఇలాంటివి చేస్తుంటారు. ఆ ప్లేస్‌లో నేను లేకపోయినా విన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. మేం ఏం చేసినా ఆడియన్స్‌ కోసమే కదా. మా ప్రేమను వాళ్లు అర్థం చేసుకోవాలి.

కొంతమంది హీరోయిన్లు డిప్రెషన్‌లోకి వెళ్లామంటుంటారు. ఫర్‌ ఎగ్జాంపుల్‌ దీపికా పదుకోన్‌. ఇక్కడి పరిస్థితులు తట్టుకోలేకే అలా అయిపోతుంటారా?
ఆ విషయం గురించి నేను చెప్పలేను. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన అనుభవాలు ఎదురు కావు కదా. సున్నిత మనస్కులు త్వరగా హర్ట్‌ అవుతారు. తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళతారేమో. నా మట్టుకు నేను ఎప్పుడూ ఇలా అవ్వలేదు. అంటే నేను చాలా స్ట్రాంగ్‌ అనే కదా అర్థం. నా ఫ్యామిలీ నాకెప్పుడూ సపోర్టింగ్‌గా ఉంటుంది. మై ఫ్రెండ్స్‌ ఆర్‌ అమేజింగ్‌.

సంతోషం, బాధ.. ఈ రెంటినీ ఫస్ట్‌ ఎవరితో పంచుకుంటారు?
అమ్మ, చెల్లెలు. ఏదైనా వీళ్లతోనే ఎక్కువగా షేర్‌ చేసుకుంటాను. ఆ తర్వాత మా డాడ్‌ అండ్‌ స్కూల్‌ ఫ్రెండ్స్‌. మా గ్యాంగ్‌లో ఐదుగురం అమ్మాయిలం ఉన్నాం. మేం బాగా క్లోజ్‌గా ఉంటాం.

సోషల్‌ మీడియా వచ్చాక డైరెక్ట్‌గా మీ ట్వీటర్‌కో, ఫేస్‌బుక్‌కో నెగటివ్‌ కామెంట్స్‌ పెడుతుంటారు. దాని గురించి ఏమంటారు?
 సోషల్‌ మీడియాను కావల్సినంత వరకే యూజ్‌ చేస్తాను. సోషల్‌ మీడియా అనేది  ఇన్‌ఫర్మేషన్‌ పాస్‌ చేయడం కోసం, నా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ అవ్వడం కోసం వరకే. అందులోనే ఉండిపోలేం కదా. నాకూ ఓ లైఫ్‌ ఉంది. సోషల్‌ మీడియా ప్రాబ్లమ్‌ నా ప్రాబ్లమ్‌ కాదు. నేను వెంటనే డిస్కనెక్ట్‌ అయిపోతాను. అవతలి వాళ్ల ఒపీనియన్‌ తీసుకుని మనం బతకలేం కదా.  మనం అందర్నీ హ్యాపీగా ఉంచలేం. బెస్ట్‌ ఏంటంటే మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోగలగటం.  

‘సినిమా ఇండస్ట్రీయా’ అని చాలామంది తేలికగా మాట్లాడతారు. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లల్లో కొందరు అలాంటి కామెంట్‌ పాస్‌ చేస్తే ఎలా అనిపిస్తుంది?
బయటివాళ్లకు ఇండస్ట్రీ గురించి ఐడియా ఉండదు. వాళ్లూ వీళ్లూ చెప్పినది విని ఒక ఐడియాకి వస్తారు. మంచి విషయాలు వింటే ఇండస్ట్రీ గురించి మంచి అభిప్రాయం ఉంటుంది. చెడు వింటే అలానే అనుకుంటారు. అందుకని బయటివాళ్ల గురించి కామెంట్‌ చేయను. నేను నా ఇండస్ట్రీని చాలా గౌరవిస్తాను. ఇది నా ప్రొఫెషన్‌. ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీని గౌరవించని వాళ్లంటే నాకు నచ్చదు.

ఇండస్ట్రీ అంటే గౌరవం అన్నారు. మరి ఈ ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా గౌరవిస్తోంది? ఇక్కడ గౌరవం అనేది ‘హిట్స్‌’ మీద ఆధారపడి ఉంటుందని కొందరు అంటుంటారు..
నా ఫస్ట్‌ సినిమా అప్పుడు ఎలా ట్రీట్‌ చేశారో ఇప్పుడూ అలానే గౌరవిస్తున్నారు. గౌరవం అడిగితేనో ఆశిస్తేనో రాదు. ఎదుటి వ్యక్తిని గౌరవించడం అనేది మన బాధ్యత అని భావించాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా అందర్నీ గౌరవిస్తాం. ఎదుటి వ్యక్తిని గౌరవించే సంస్కారం లేనివాళ్లు ఉంటారు. వాళ్లు కామెంట్‌ చేసినప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. ‘హార్డ్‌ హార్టెడ్‌’గా ఉండాలి. లేకపోతే ఇలాంటివి అస్సలు డీల్‌ చేయలేం.

ఫైనల్లీ మీ పదేళ్ల సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌లో మీ ఫ్యాన్స్‌ స్థానం చాలా గొప్పది. ‘కాజలిజమ్‌ డే’ అని కూడా సెలబ్రేట్‌ చేస్తుంటారు. వాళ్ల గురించి ఏం చెబుతారు?
డిసెంబర్‌ 20. మా మామ్‌ (అమ్మ) బర్త్‌డే. ఆ రోజు ‘కాజలి జమ్‌ డే’ అని సెలబ్రేట్‌ చేస్తారు. చాలా స్వీట్‌. నేను కచ్చితంగా ఏదో ఒక పుణ్యం చేసుకొని ఉంటాను. ఇదంతా కర్మఫలం అని నమ్ముతాను. ఇంత ప్రేమ లభించటం అంటే మాటలు కాదు. అందుకే సొసైటీని రైట్‌ వేలో ప్రభావితం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను.

మీరందరూ (ఫ్యాన్స్‌) లేకపోతే నేను లేను. ఐ లవ్‌ యూ ఆల్‌. సేమ్‌ టైమ్‌  నేను కోరుకునేది ఏంటంటే  మీ లైఫ్‌పై మీరు ఫోకస్డ్‌గా ఉండి, సొసైటీలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. మనందరం ఎలా జీవిద్దాం అంటే సొసైటీలో ఏదో విధంగా మార్పు తీసుకొచ్చేలా ఉండాలి. అది ఎంత చిన్నదైనా.

– డి.జి. భవాని , గౌతమ్‌ మల్లాది

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top