బ్రదరాఫ్‌ సూర్య

special chit chat with tamil hero karthi - Sakshi

నో కంపేరిజన్‌

ఇంట్లో తమ్ముళ్లు ఉంటారు.. అన్నయ్యలు తమ బిస్కెట్‌లో భాగం తమ్ముళ్లకు ఇచ్చేస్తుంటారు. తమ్ముడు భుజం మీద చెయ్యేస్తుంటాడు. కష్టం వస్తే అన్నయ్య భుజం అడ్డేస్తుంటాడు. అందరి ఇళ్లల్లో ఇది మనం చూసేదే. కానీ, సినిమాల్లో సూర్యని చూసినవాళ్లు ఆ పవర్, ఆ పెర్ఫార్మెన్‌ చూశాక.. తనతో తమ్ముణ్ణి కంపేర్‌ చేయకుండా భుజం అడ్డేసి కాపాడగలడా? నిలబెట్టగలడా? ఇప్పటికి కూడా కార్తీ షూటింగ్‌కి వెళ్లినప్పుడు.. ‘మీ అన్నయ్య అయితే ఇలా చేసేవాడు’ అని చెబుతుంటారట. ఈసారి సూర్య షూటింగ్‌కి వెళ్లినప్పుడు ‘కార్తీ అయితే ఇలా చేసేవాడు’ అనే కామెంట్‌ వినాలని కోరుకుంటూ... ‘సాక్షి’ పాఠకులకు ఎక్స్‌క్లూజివ్‌.

చాలా రోజులైంది కనిపించి.. ఎలా ఉన్నారు. మీ అమ్మాయి ఉమయాళ్‌ బాగుందా?
సూపర్‌ అండి. ఈ ఇయర్‌ నుంచి ఉమయాళ్‌ స్కూల్‌కి వెళుతోంది. కొంచెం అల్లరి పిల్ల.

స్కూల్‌కి వెళ్లనని మారాంలాంటిది?
అప్పుడప్పుడూ చేస్తోంది. సండే కాకపోయినా ‘ఇవాళ స్కూల్‌ లేదుగా’ అంటుంటుంది (నవ్వుతూ). అలాంటప్పుడు మాత్రం రెడీ చేసి, పంపించడం కష్టమవుతుంది. పిల్లలన్నాక ఇలాంటివి కామన్‌ కదా.

చాలామంది హీరోలు చేయడానికి వెనక్కి తగ్గే క్యారెక్టర్‌ని లాస్ట్‌ ఇయర్‌ ‘ఊపిరి’లో మీరు చేశారు...
నేను కూడా కాస్త ఆలోచించాను. వంశీ పైడిపల్లిగారు స్క్రిప్ట్‌ చెప్పడానికి వస్తానన్నప్పుడు.. విన్నాక, ‘త్వరలో ‘కాష్మోరా’ సినిమా స్టార్ట్‌ చేయబోతున్నాం. ఇది చేయడానికి కుదరదు’ అని చెబుదామనుకున్నా. అయితే స్టోరీ విన్నాక.. ‘వంశీగారూ.. నిజంగా నాకే ఈ రోల్‌ ఆఫర్‌ చేస్తున్నారా?’ అనడిగాను. ‘సూపర్‌ క్యారెక్టౖరైజేషన్, హిట్‌ మూవీ’ అని అప్పుడే డిసైడ్‌ అయ్యాను. నటించడానికి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ అది. చాలా ఎంజాయ్‌ చేశాను.

ఈ ఇయర్‌ ‘చెలియా’తో లాస్ట్‌ ఇయర్‌ హిట్‌ కంటిన్యూ కాకపోవడం బాధగా అనిపించిందా?
‘మనం ఓ ప్రయత్నం చేస్తున్నాం’ అని మణిరత్నంగారు ముందే చెప్పారు. సినిమా అనేది ఒక ఆర్ట్‌. ప్రతిసారీ లాభాలు, విజయాలు ఆశించలేం. కొన్ని ప్రయోగాలు చేయాలి. నేను పైలట్‌ క్యారెక్టర్‌ చేస్తానని ఎవరూ ఊహించి ఉండరు. 10 కిలోలు తగ్గాను. పర్సనల్‌గా పైలట్స్‌తో టైమ్‌ స్పెండ్‌ చేశా.  సినిమా రిలీజ్‌ తర్వాత.. బాగా చేశారంటూ ఫ్యాన్స్‌ మెసేజ్‌లు చేశారు. నటనపరంగా చాలా తృప్తి కలిగింది. ఈ సినిమా నుంచి నేనేమీ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. సినిమా డిఫరెంట్‌ కాబట్టి.. హిట్‌ అయితే హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. లేకపోతే ఆశించినది జరగదని ఫిక్స్‌ అయ్యాం. సినిమా చేస్తున్నప్పుడు మణిరత్నంగారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. అందుకు హ్యాపీ.

ఇంట్లో ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు... ఇద్దరూ సక్సెస్‌ అవ్వాలనే టెన్షన్‌ అమ్మానాన్నలకు ఉంటుంది కదా?
నిజానికి నా ఎయిమ్‌ డైరెక్షన్‌. నేను డైరెక్టర్‌ అవుతానన్నప్పుడల్లా అమ్మ టెన్షన్‌ పడేది. డైరెక్టర్స్‌కి ఒత్తిడి ఎక్కువ ఉంటుందని, చాలామందికి హార్ట్‌ స్ట్రోక్స్‌ వస్తున్నాయని, జుట్టు త్వరగా ఊడిపోతుందనేది. ‘ఇంజనీరింగ్‌ చేశావు కాబట్టి, ఏదైనా జాబ్‌ చేసుకోవచ్చు కదా’ అనేది. ఆ తర్వాత హీరో అవుతానన్నాను. అప్పుడు అమ్మ టెన్షన్‌ మొత్తం పోయింది (నవ్వుతూ). తన కొడుకులిద్దరూ సక్సెస్‌ అవ్వాలని కోరుకునేది. నాన్న కూడా అంతే. గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌. ఇద్దరం బాగా నటిస్తున్నాం.

మీ నాన్నగారు అప్పట్లో పెద్ద హీరో కాబట్టి మీరు గోల్డెన్‌ స్పూన్‌ అనుకోవచ్చా?
కొన్ని ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్స్‌ తెలుసు. నాన్న హీరో నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారినప్పుడు నేను, అన్నయ్య కాలేజీలో చదువుతున్నాం. నేను బస్‌లో, అన్నయ్య బైక్‌లో వెళ్లేవాళ్లం. అప్పుడప్పుడూ ఫ్రెండ్స్‌ కార్‌లో వెళ్లేవాళ్లం. టోటల్‌గా మేం గోల్డెన్‌ స్పూన్‌ అని చెప్పలేం. ముఖ్యంగా నేను యూఎస్‌ వెళ్లే టైమ్‌లో చాలా ఇబ్బందిపడ్డాం. అలా ఎందుకు జరిగిందంటే నాన్నగారు సినిమాలు తప్ప.. వేరే బిజినెస్‌ చేయలేదు. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌ వచ్చే సోర్స్‌ లేదు. ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదు. ఆయనెప్పుడూ మాతో, ‘సినిమా నాకు అమ్మ లాంటిది. నా అమ్మ మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది’ అనేవారు. నిజంగానే అలానే చూసుకుంటోంది. నాన్న తర్వాత అన్నయ్య, అన్నయ్య తర్వాత నేను.. మా ముగ్గురినీ ఆదరించింది.

మీకు పెళ్లయ్యాక వేరు కాపురం పెడతారేమో అని కొంతమంది ఊహించారు. అయితే.. చక్కగా జాయింట్‌ ఫ్యామిలీగా ఉండటం చాలామందికి ఇన్‌స్పిరేషన్‌...
బాధ అయినా.. సంతోషం అయినా.. నేనేదీ సింగిల్‌గా బేర్‌ చేసుకోలేను. లైఫ్‌లో డౌన్‌ఫాల్స్‌ ఉంటాయి. అప్పుడు అయినవాళ్లు ధైర్యం చెబితే అదో బలం. చిన్న ప్రాబ్లమ్‌ అయినా పదే పదే చెప్పడం నా అలవాటు. అప్పుడు ఇంట్లోవాళ్లు ‘అసలు నీ ప్రాబ్లమ్‌... ఒక ప్రాబ్లమే కాదు.. ఇక ఆపు’ అంటుంటారు. ఆ రేంజ్‌లో బాధపడిపోతుంటా (నవ్వుతూ). జాయింట్‌ ఫ్యామిలీ అంటే ఫిజికల్‌ సెక్యూరిటీయే కాదు... మెంటల్‌ సెక్యూరిటీ కూడా.

సూర్యగారి వైఫ్‌ జ్యోతిక, మీ వైఫ్‌ రంజిత.. ఇద్దరి మధ్య బాండింగ్‌ ఎలా ఉంటుంది?
ఇద్దరి మధ్య ఏజ్‌ డిఫరెన్స్‌ ఎక్కువ. వేరే ఇళ్లల్లో తోడికోడళ్లు పిలిచేట్లే.. మా వదినను నా వైఫ్‌ ‘అక్కా’ అని పిలుస్తుంది. ఇంటికి సంబంధించింది ఏదైనా ఇద్దరూ మాట్లాడుకుంటారు. చక్కగా నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లిద్దరి మధ్య ఆ బాండింగ్‌ లేకపోతే జాయింట్‌ ఫ్యామిలీ కష్టమై ఉండేదేమో (నవ్వులు).

మీరు రొమాంటిక్‌ సీన్స్‌ చేస్తే రంజిత ఏమీ అనరా?
లవ్‌స్టోరీ సినిమాల్లో టచ్‌ చేయకుండా నటించలేరా? అని అడుగుతుంది. ‘చేయొచ్చు.. కానీ, పెళ్లి తర్వాత వచ్చే సీన్స్‌లో టచ్‌ చేయాల్సిందే కదా’ అని నవ్వుతూ అంటుంటాను. అలా అన్నప్పుడల్లా సరదాగా గొడవపడుతుంది.  

మరి.. జ్యోతికగారి సంగతేంటి?
వదిన కూడా సేమ్‌ టు సేమ్‌ అండి. అన్నయ్య హీరోగా నటించిన లవ్‌స్టోరీ మూవీస్‌ చూడదు. వదిన కూడా హీరోయిన్‌గా చేసింది. తనే అలా అంటే.. ఇక మామూలు అమ్మాయిలు ఎలా రియాక్ట్‌ అవుతారో ఊహించుకోవచ్చు. అదంతా భర్త మీద ఉన్న ప్రేమ.

‘అగరమ్‌ ఫౌండేషన్‌’ ద్వారా మీ ఫ్యామిలీ ఎంతోమంది పిల్లలను చదివి స్తోంది. అది నిజంగా మంచి హెల్ప్‌..
అవునండి. మా అందరికీ సంతృప్తినిచ్చే విషయం అది. ఫస్ట్‌ ప్రిఫరెన్స్‌ అనా«థ పిల్లలకు, తర్వాత శరణార్థులకు కల్పిస్తోంది. సింగిల్‌ పేరెంట్‌ పిల్లలు,  అమ్మనాన్నలు ఇద్దరు ఉన్నప్పుడు.. నాన్న ఆల్కహాలిక్‌ అయితే  ఆ పిల్లలకు, గుడ్‌ స్టూడెంట్‌ అయ్యుండి.. ఇంట్లో ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల మార్కులు తగ్గిన వాళ్లకూ హెల్ప్‌ చేస్తాం. ఒక అమ్మాయి ఉంది. యాక్సిడెంట్‌లో అమ్మనాన్నలు చనిపోయారు. ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. నాన్నమ్మ మాత్రమే ఉంది. ఎగ్జామ్‌ ముందు రోజు ఇంటి రెంట్‌ కట్టలేదని వీళ్లను బయటకు పంపించేశారు. ఇంట్లో ఉన్న హాల్‌ టికెట్‌ ఇవ్వమన్నా ఇవ్వలేదు. అసలది ఇల్లే కాదు. ఒక షెడ్‌లా ఉంది. పక్కింటివాళ్లు కల్పించుకుని, హాల్‌ టికెట్‌ ఇప్పించారు. ఆ అమ్మాయికి హెల్ప్‌ చేశాం. ఇప్పుడు నర్స్‌గా చేస్తోంది. తమ్ముళ్ల్లను చదివిస్తోంది. తన విలేజ్‌లో ఉన్న పిల్లలను మోటివేట్‌ చేస్తోంది. ఎందుకంటే ఆ విలేజ్‌లో చదువుకున్న మొట్టమొదటి అమ్మాయి తనే. అంతేకాదు అగరం ఫౌండేషన్‌కు తనవంతు సాయం చేస్తానంటోంది. ఇలాంటి సంఘటనలను చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది.

చిన్నప్పటి నుంచి నిన్న మొన్నటివరకూ మీరు ఉన్న ఇంటిని ఈ ఫౌండేషన్‌ కార్యకలాపాలకు మీ నాన్నగారు ఇచ్చారట.. ఏమైనా బాధ అనిపించిందా?
నాన్నగారి కష్టార్జితం అది. ఆఫీస్‌ పనులకు సిటీ లోపల ఉంటే బెటర్‌ అనుకున్నాం. అందుకే ఆ ఇంటిని ఉపయోగిద్దామని నాన్నగారు అనుకున్నారు. మేమందరం ఉండటానికి వేరే ఇల్లు కట్టించారు. పాత ఇంటితో అమ్మది ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్‌. కొత్తింట్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఇంటి గురించి అప్పుడప్పుడూ మాట్లాడుతుంటుంది. అమ్మ అంత బాధ మాకు ఉండదు.

ఇంట్లో ఫైనాన్షియల్‌ వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటారు.. మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎక్కువగా ఉంటుందా?
నాకు డబ్బు విలువ అంత బాగా తెలీదు. అందుకని ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇన్‌వాల్వ్‌మెంట్‌ తక్కువ. అయితే ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కి ట్రెజరర్‌ అయ్యాక ఎకౌంట్స్‌ చూడటం మొదలుపెట్టాను. ఎందుకంటే, అక్కడ ఉండేది నా మనీ కాదు.. పబ్లిక్‌ది.

‘ఖాకి ’ సినిమా విషయానికొద్దాం. పోలీస్‌ సినిమాలు చాలా వచ్చాయి కదా. ఇందులో ఉన్న  డిఫరెన్స్‌ ఏంటి?
‘విక్రమార్కుడు’ తమిళ రీమేక్‌ ఒప్పుకున్నప్పుడు ఓ పోలీసాఫీసర్‌ని కలిసి, కొన్ని రియల్‌ ఇన్సిడెంట్స్‌ చెప్పమన్నాను. ఆయన ఓ ఛాలెంజింగ్‌ కేసు గురించి చెప్పారు. ఆ కేసు సాల్వ్‌ చేయడానికి పదేళ్లు పట్టింది. వరుస హత్యలు జరిగాయి. చిన్న ఆధారం కూడా లేదు. ఓ స్మాల్‌ టీమ్‌తో ఆ ఛాలెంజింగ్‌ కేసును ఆయన సాల్వ్‌ చేశారు. దర్శకుడు వినోద్‌ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ రియల్‌ స్టోరీ చెప్పారు నాకు. ‘అరే.. ఈ స్టోరీ నాకూ తెలుసు’ అన్నాను. వినోద్‌ స్టోరీని, పోలీస్‌ క్యారెక్టర్‌ని డిఫరెంట్‌గా ట్రీట్‌ చేశారు. డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు ఈ సినిమాతో ఏ మూవీనైనా పోల్చవచ్చా? అని చెక్‌ చేసుకున్నా. కంపేర్‌ చేయడం వేస్ట్‌ అనిపించింది. ఈ 17న మీరు చూస్తారుగా! అప్పుడు ఒప్పుకుంటారు.. డిఫరెంట్‌ మూవీ అని!

‘సింగమ్‌ సిరీస్‌లో మీ అన్నయ్య సూర్య రెచ్చిపోయారు. ఆయనతో మిమ్మల్ని కంపేర్‌ చేయడం సహజం కదా..
అన్నయ్య నటించిన ‘సింగం’ ఫస్ట్‌ పార్ట్‌లో సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా చేసిన బోస్‌ వెంకట్‌ ‘ఖాకి’లో కూడా చేశారు. ‘సార్‌.. అన్నయ్య అయితే ఈ సీన్‌లో ఇలా అదరగొట్టేవారు’ అనేవారు. ‘సార్‌.. ఇక్కడ ఉన్నది అన్నయ్య కాదు.. నేను’ అనేవాణ్ణి. ‘సింగమ్‌’లోలా లౌడ్‌ డైలాగ్స్‌ ఉండవు. తక్కువ మాటలతో, ఎక్స్‌ప్రెషన్స్‌తో నా పాత్ర ఉంటుంది.  

ఆ మధ్య తమిళనాడు నటీనటుల సంఘం ఎన్నికలు పోటా పోటీగా జరిగాయి.. సీనియర్లను (శరత్‌కుమార్‌) సునాయాసంగా ఓడించేశారు.
స్మాల్‌ క్వశ్చన్స్‌ అడిగాం. కానీ, ఎలా అడుగుతారన్నట్లు వ్యవహరించారు. ఏంటిది? అనిపించింది. సమాజంలో అందరూ ప్రశ్నలు అడగలేరు. అందరికీ ఆ శక్తి ఉండదు. కానీ అడగాల్సిన వాళ్లు కూడా అడగకపోతే అందరూ బాధపడాలి. ఆ ఫీలింగ్‌ వచ్చింది. అందుకే సీరియస్‌గా తీసుకున్నాం. పోటీపడ్డాం.

తమిళనాడు రాజకీయాలు హాట్‌ హాట్‌గా ఉన్నాయి. కమల్‌గారు పాలిటిక్స్‌లో వచ్చేట్లు ఉన్నారు. మీ ఒపీనియన్‌?
కమల్‌హాసన్‌గారు ఏ బాధ్యత తీసుకున్నా చక్కగా చేస్తారని నా నమ్మకం. రాజకీయాల పరంగా ఓ స్పేస్‌ ఏర్పడింది. ఎవరొకరు ఆ స్పేస్‌ని ఫిల్‌ చేయాలి. ప్రూవ్‌ చేసుకోవాలి. ఒక పెద్ద లీర్‌ చనిపోయినప్పుడు నంబర్‌ 1, నంబర్‌ 2 లేకపోతే ఇలానే ప్రాబ్లమ్‌ వస్తుంది. ఎమ్‌జీఆర్‌గారు చనిపోయిన తర్వాత పరిస్థితులు సర్దుకోవడానికి ఐదేళ్లు పట్టింది. ఇప్పుడా పరిస్థితి వచ్చింది.

కాబోయే సీయం సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే చాన్స్‌ ఉందా?
ఎవరైనా మంచివాళ్లు వస్తే చాలండి. సీయం అంటే చిన్న జాబ్‌ కాదు. అది 24 గంటల పని. ఏం చెప్పినా, ఏం చేసినా వ్యతిరేకించేవాళ్లు ఉంటారు. ఏ గవర్నమెంట్‌ అందరినీ సంతృప్తిపరచలేదు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. స్ట్రాంగ్‌ హ్యాండ్‌ ఉండాలి. ప్రజల గురించి ఆలోచించే లీడర్స్‌ రావాలి. అప్పుడే సమాజం బాగుంటుంది.

సినిమారంగంపై రాజకీయాల ఒత్తిడి ఉంది. ఉదాహరణకు విజయ్‌ ‘మెర్సల్‌’లో జీఎస్‌టీ గురించి చర్చించారని సినిమా విడుదలను అడ్డుకోవడం ఎలా అనిపించింది?
ఎప్పుడైనా సినిమా అనేది సాఫ్ట్‌ టార్గెట్‌. జీఎస్‌టీ గురించి చాలామందిలో ఉన్న ప్రశ్నలను సినిమాలో అడిగేసరికి పెద్ద వివాదం అయింది. అది సినిమాకి మంచి పబ్లిసిటీ అయింది. నేను ‘శకుని’ అనే పొలిటికల్‌ సెటైరికల్‌ మూవీ చేశాను. ఆ సినిమాలో డైలాగ్స్‌ ఇప్పటి పరిస్థితులకు సూటవుతాయని ఇప్పుడు అందరూ అంటున్నారు. అప్పుడు ప్రజల్లో ఇంత నెగిటివిటీ లేదు. ఇప్పుడు పెరిగిపోయింది. సోషల్‌ మీడియా ప్రభావం చాలా ఉంది. అందుకే రజనీకాంత్‌గారు.. ‘‘నెగిటివిటీ మానుకోండి. ఎవరి గురించీ చెడు ప్రచారం చేయకండి. నెగిటివిటీ మంచిది కాదు. ప్రతి విషయంలోనూ చెడుని చూడొద్దు. పాజిటివ్‌గా ఉండండి’ అంటున్నారు. వినాలి కదా.

ఫైనల్లీ... మీరు ఫుల్‌ పాజిటివ్వా?
చెప్పడం ఈజీ. కానీ, ఉండటం కష్టం. నేను పాజిటివ్‌గా ఉండటానికి ట్రై చేస్తున్నాను. నా లైఫ్‌ గురించి నాకు ఫుల్‌ పాజిటివిటీ ఉంది. ప్రొఫెషనల్‌గానూ అంతే. గెలవడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. గెలవచ్చు.. ఓడిపోవచ్చు... గెలవడానికి కష్టపడాలి. ఆ కష్టంలో పాజిటివిటీ ఉండాలి. లక్‌తో ప్రతిసారీ గెలవలేం. అందుకే కష్టాన్ని నమ్ముకుంటాను. అదే పాజిటివ్‌ అనుకుంటాను.

పండగలు కూడా భలే జరుపుకుంటుంటారు. ఆ ప్లాన్‌ అంతా ఎవరిది?
అమ్మానాన్న ఫుల్‌ ట్రెడిషనల్‌. వాళ్ల దగ్గర పెరిగిన మేమూ అంతే. ఇంటికొచ్చిన కోడళ్ల సంగతి సరేసరి. అన్ని పండగలూ సంప్రదాయబద్ధంగా జరపాల్సిందే అంటుంది వదిన. తను నార్త్‌ అమ్మాయి అయినా.. పెళ్లి తర్వాత సౌత్‌ ట్రెడిషన్‌ గురించి బాగా తెలుసుకుంది. పండగలు ఎలా చేయాలో తనే ప్లాన్‌ చేస్తుంది. మేం పాటిస్తాం. మా ఇంట్లో ఇయర్‌ స్టార్టింగ్‌లో వచ్చే సంక్రాంతి నుంచి ఎండింగ్‌లో వచ్చే క్రిస్మస్‌ పండగ వరకూ.. అన్నీ జరుపుకుంటాం. పిల్లలకు మన కల్చర్‌ తెలియాలి. పండగలప్పుడే కదా.. తెలిసేది. పైగా అందరూ వస్తుంటారు. చాలా బాగుంటుంది. విడిగా ఎవరి పని వారు చేసుకుంటూపోతే సందడేముంటుంది? అందరూ కలిసి జరుపుకునేందుకే ఫెస్టివల్స్‌ ఉన్నాయని మేం నమ్ముతాం.

మీ అన్నయ్యతో మిమ్మల్ని కంపేర్‌ చేస్తే మీకు కోపం వస్తుంటుందా?
కోపం రాదు. అన్నయ్యతో కంపేర్‌ చేస్తే మంచిదే. అయితే చేయకూడదంటాను. ఎందుకంటే, నేను పోలీస్‌గా చేసేటప్పుడు నా మైండ్‌లో ఏం ఉందో అదే చేస్తాను. ‘అన్నయ్య అయితే ఈ షాట్‌లో మూడు కిక్‌లు ఇచ్చేవారు’ అని లొకేషన్‌లో అంటుంటారు. అప్పుడు ‘నేను ఒక్క కిక్‌ మాత్రమే ఇవ్వగలను’ అంటుంటా. ఏం చేద్దాం? అన్నయ్య అంటే చాలా సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్నారు. నేను సడన్‌గా సినిమాల్లోకి వచ్చాను. నా ఫిజిక్‌ డిఫరెంట్‌. అన్నయ్య ఫిజిక్‌ డిఫరెంట్‌. నాకు వచ్చే క్యారెక్టర్స్‌ డిఫరెంట్‌. నేను నాలానే చేయగలుగుతాను.
– డి.జి. భవాని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top