అక్కడ అలా..ఇక్కడ ఇలా..


ప్రేమ మంత్‌రం : ఎంత అందమైనది ఫిబ్రవరి నెల! వాలెంటైన్స్‌ డే కి ముందు ఒక వారం, తర్వాత ఒక వారం.. అన్నీ.. ప్రేమికుల రోజులే. ఫిబ్రవరి 7 ‘రోజ్‌ డే’. ఫిబ్రవరి 8 ‘ప్రపోజ్‌ డే’. ఫిబ్రవరి 9 ‘చాక్లెట్‌ డే’. ఫిబ్రవరి 10 ‘టెడ్డీ డే’. ఫిబ్రవరి 11 ‘ప్రామిస్‌ డే’. ఫిబ్రవరి 12 ‘హగ్‌ డే’. ఫిబ్రవరి 13 ‘కిస్‌ డే’. ఇవన్నీ అయ్యాక.. ఫైనల్‌గా వాలెంటైన్స్‌ డే. ఆ తర్వాత కూడా ఏదో ఒక రూపంలో ప్రేమ పరిమళిస్తూనే ఉంటుంది. ఫిబ్రవరి 15 హ్యాపీ శ్లాప్‌ డే. 16 హ్యాపీ కిక్‌ డే. 17 హ్యాపీ పెర్‌ఫ్యూమ్‌ డే. 18 హ్యాపీ ఫ్లర్టింగ్‌ డే. 19 హ్యాపీ కన్ఫెషన్‌ డే. 20 హ్యాపీ మిస్సింగ్‌ డే. 21 హ్యాపీ బ్రేకప్‌ డే. అయ్యో! బ్రేకప్‌ కూడా ప్రేమికుల రోజేనా! ఎందుక్కాదూ. బ్రేకప్‌ కూడా ప్రేమలోంచి పుట్టిందే కదా. బ్రేకప్‌ తర్వాత పుట్టేదీ మళ్లీ ప్రేమే కదా. 



అక్కడ అలా..: కొలంబియాలో ఇవాళ్టి నుండి మహిళల ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతున్నాయి. ఆ దేశంలో మహిళలు ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ ఆడడం ఇదే తొలిసారి. 2023లో జరిగే ‘ఫిఫా ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌’ పోటీలకు ఆతిథ్యం ఇవ్వాలంటే.. కొలంబియా ఇప్పుడీ జాతీయస్థాయి ఉమెన్స్‌ లీగ్‌ను నిర్వహించడం తప్పనిసరి.  కొలంబియా





ఇక్కడ ఇలా..: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని అజాదీ స్టేడియంలో ఫుట్‌బాల్‌ పోటీలు జరుగుతున్నాయి. స్టేడియం కిక్కిరిసి ఉంది. సందర్శకుల మార్గం నుంచి ఎనిమిది మంది అబ్బాయిలు స్టేడియం లోపలికి ప్రవేశించారు. వాళ్ల దగ్గర పాస్‌లు ఉన్నాయి. వాటిని తీసుకుని లోపలికి అనుమతిస్తూ, ఆ ద్వారం దగ్గరి భద్రతా సిబ్బంది ఎందుకనో తలగోక్కున్నారు. నొసలు చిట్లించారు. నోటి మీద వేలేసుకున్నారు. ఇవన్నీ జరిగే లోపు అబ్బాయిలు జంప్‌ అయ్యారు! అయితే వాళ్లు పూర్తిగా జంప్‌ కాకముందే అక్కడికక్కడ ఆపేసి, ‘యు ఆర్‌ నాట్‌ ఎలౌడ్‌’ అనేశారు సెక్యూరిటీ! ‘ఎందుక్కాదు?’ అని బుకాయించారు అబ్బాయిలు. ‘ఎందుక్కాదంటే... అబ్బాయిల డ్రస్‌ వేసుకున్నంత మాత్రాన అమ్మాయిలు అబ్బాయిలు అయిపోరు’ అనేసి వెనక్కు పంపించారు స్టేడియం స్టాఫ్‌. విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. అబ్బాయిల వేషంలో వచ్చిన ఎనిమిది మంది అమ్మాయిలు వాళ్లు! ఇరాన్‌లో అమ్మాయిలు కానీ, మహిళలు కానీ స్టేడియంకి వెళ్లి మగాళ్లు ఆడే ఫుడ్‌బాల్‌ గేమ్‌ చూడడం నిషేధం. క్రీడాకారుల ఆట తీరును బట్టి గ్యాలరీలలో ఉండేవాళ్లు అసభ్య పదజాలం ఉపయోగిస్తారనీ, అలాగే.. అమ్మాయిలు కనిపిస్తే వెకిలిగా చూస్తారనీ ఇరాన్‌ ప్రభుత్వం ఈ నిషే«ధాన్ని ఏళ్లుగా అమలు చేస్తోంది. 1979 నాటి ఇస్లాం విప్లవంలో ఇరాన్‌ అనేక నిబంధనలు, నియమాలు ఏర్పరచుకుంది. అందులో ఒకటి.. ఆడవాళ్లను మగాళ్ల స్టేడియంలలోకి అనుమతించకపోవడం. పాపం.. వేషం మార్చుకుని మరీ స్టేడియంలోకి వచ్చారంటే.. ఫుట్‌బాల్‌ అంటే ఎంత ఇష్టమో కదా ఆ అమ్మాయిలకు! -  ఇరాన్‌



డాక్టరు గారికి బుద్ధిలేక.. పేషెంటుకు ప్రేమలేఖ : డాక్టర్‌ సచీంద్ర అమరగిరి వయసు 59. లండన్‌లో పేరున్న సర్జన్‌. ఇంకో ఏడాది గడిస్తే 60 ఏళ్లు వచ్చి ఉండేవి. సీనియర్‌ సిటిజన్‌ అన్న గౌరవం కూడా దక్కేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నారు డాక్టర్‌ సచీంద్ర. ‘ఛీ ఫో.. నువ్వు డాక్టరుగా పనికిరావు. డాక్టర్‌ వృత్తికే కళంకం తెచ్చావు’ అని యు.కె.మెడికల్‌ ట్రిబ్యునల్‌ ఆయన్ని వైద్యవృత్తి నుంచి బహిష్కరించింది. ఈ పెద్ద మనిషి అంత పెద్ద తప్పు ఏం చేసినట్లు? రాంగ్‌ ట్రీట్‌మెంట్‌తో రోగిని ఏకంగా పైకే పంపించేశారా?! పంపలేదు. ఒకవేళ పంపినా ఆయనకు అంత పెద్ద శిక్ష పడి ఉండేది కాదేమో! మరేం చేశాడు? ఏం చేశాడా.. ప్రేమలేఖ రాశాడు. ప్రేమలేఖా? ఎవరికి? ఒక పేషెంటుకి!! కడుపునొప్పితో బాధపడుతూ ఆయన క్లినిక్‌కి వచ్చిన ఒక అందమైన యువతిని ట్రీట్‌ చేస్తూ ఆమెతో ప్రేమలో పడిపోయాడు డాక్టర్‌ సచీంద్ర. అక్కడితో ఆగకుండా ఆమెకు ప్రేమలేఖ కూడా రాశాడు. విషయం బయటికి పొక్కి, ఇదిగో... మన దాకా వచ్చింది!



రెండో ప్రపంచ ప్రేమ : ఎడిత్‌ స్టెయినర్‌ వయసు 92 ఏళ్లు. ఆమెది హంగేరి. జాన్‌ మ్యాకీ వయసు 96 ఏళ్లు. అతడిది స్కాట్లాండ్‌. మొన్న ఈ దంపతులు 71వ వాలెంటైన్స్‌ డేని జరుపుకున్నారు! వీళ్లదొక అపురూపమైన ప్రేమకథ. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు జర్మనీలోని ఔష్‌విట్జ్‌ క్యాంప్‌లో వందలమందిని నిర్బంధించారు. వారిలో ఎడిత్‌ కూడా ఒకరు. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. యుద్ధం అయ్యాక నిర్బంధ శిబిరాల్లో ఉన్నవాళ్లను విడిపించే క్రమంలో ఔష్‌విట్జ్‌ శిబిరానికి వెళ్లిన సైనికులలో జాన్‌ మ్యాకీ కూడా ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 23. ఆ రోజు ఎడిత్, జాన్‌ ఒకర్నొకరు పరిశీలనగా చూసుకోలేదు. ‘బతుకు జీవుడా’ అని ఎడిత్‌ బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుంది. జాన్‌ మ్యాకీ మిగతా శిబిరాల్లోని వారికి విముక్తి కల్పించే పనిలో పడిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు ఇద్దరూ ఒక డాన్స్‌ హాల్లో కలుసుకున్నారు. ‘ఆ రోజు థ్యాంక్స్‌ చెప్పలేకపోయాను’ అంది ఎడిత్‌. ‘ఇవాళ గానీ చెబుతారా ఏంటీ?’ అని భయం నటించాడు జాన్‌. అమ్మాయి నవ్వింది. ఆ నవ్వు అబ్బాయికి నచ్చింది. ప్రేమ మొదలైంది. యుద్ధం ముగియగానే 1946లో పెళ్లయింది. వధువును స్లాట్లాండ్‌ తీసుకెళ్లాడు వరుడు. అప్పట్నుంచీ ఏటా వాలెంటైన్స్‌ డేని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జంట డుండీ సిటీలోని కేర్‌ హోమ్‌లో ఉంటోంది.



నాడు ఎడిత్, జాన్‌





నేడు ఎడిత్, జాన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top