స్మార్ట్‌ బానిసత్వం

Smart slavery - Sakshi

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చి ఈ ఏడాదితో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ ‘స్మార్ట్‌’ దశాబ్దంలో మనుషుల్లో చాలా మార్పులే వచ్చాయి. అవసరం ఉన్నా, లేకున్నా స్మార్ట్‌ఫోన్‌లకు గంటల తరబడి అతుక్కుపోతున్న మనుషులు సాటి మనుషులతో మాత్రం అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ప్రతి అవసరానికీ స్మార్ట్‌ఫోన్‌లపై ఆధారపడటం ఈ దశాబ్దకాలంలో బాగా పెరిగింది. ఆకలేస్తే ఆహారం ఆర్డర్‌ చేయడానికి, ఆరోగ్యం బాగులేకపోతే డాక్టర్ల అపాయింట్‌మెంట్‌ కోసం, పరిచితులతో అపరిచితులతో కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడానికి, షాపింగ్‌ చేయడానికి... ఇలా నానా అవసరాలకు, చాలా అనవసరాలకు స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోయే వారి సంఖ్య ఈ దశాబ్దకాలంలో గణనీయంగా పెరిగింది.

స్మార్ట్‌ఫోన్‌ల వాడకం చాలామందికి వ్యసనంగా మారిందని, ఇలాంటి వాళ్లు ఎంతసేపూ స్మార్ట్‌ఫోన్‌ల తోడిదే లోకంగా గడిపేస్తూ, పక్కనే ఉన్న మనుషులను పట్టించుకోని స్థితిలో ఉంటున్నారని, ఈ పరిస్థితి నుంచి బయటపడకపోతే తీవ్రమైన మానసిక సమస్యల్లో చిక్కుకుంటారని మానసిక శాస్త్ర నిపుణులు హెచ్చరికలు చేస్తున్నా, ‘స్మార్ట్‌’తరం మనుషుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పొద్దున లేచీ లేవగానే వెంటనే స్మార్ట్‌ఫోన్‌ను తరచి చూడనిదే పక్క దిగని వారి సంఖ్య 62 శాతం ఉంటే, వారం రోజుల పాటు మనుషులకు దూరంగా ఉండమంటే ఉండగలం గాని, స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండటం తమ వల్ల కాదంటున్న వారి సంఖ్య 45 శాతం ఉన్నట్లు మొబైల్‌ఫోన్‌ల తయారీ సంస్థ ‘మోటొరోలా’ నిర్వహించిన సర్వేలో తేలింది. ‘స్మార్ట్‌’ వ్యసనానికి ఈ గణాంకాలను మించిన నిదర్శనాలింకేముంటాయి?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top