నేను, మీ సామ్‌ని..

Serial Actress Marina Abraham Special Story - Sakshi

సీరియల్‌

‘అమెరికా అమ్మాయి’గా పరిచయమై ‘సిరి సిరి మువ్వలు’తో సందడి చేస్తూ ‘ప్రేమ’గా ఆకట్టుకుంటున్న నటి మెరీనా అబ్రహం. గోవా ఇంటి అమ్మాయి బుల్లితెర ద్వారా తెలుగింటి ప్రేక్షకుల అభిమాన నటి అయ్యారు. అవకాశం ఉన్నన్నాళ్లూ బుల్లితెరనే తన ప్రపంచం అని అంటున్న మెరీనా చెబుతున్న ముచ్చట్లివి.

‘జీ తెలుగులో వచ్చిన ‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌లో ‘సామ్‌’గా మీ అందరికీ దగ్గరయ్యాను. ఇప్పుడు జీ తెలుగులో వచ్చే ‘ప్రేమ’ సీరియల్‌ ద్వారా మరోసారి మీ ముందుకు వచ్చాను. నన్ను మీ కుటుంబంలో ఒకరిగా భావిస్తున్న అందరికీ ధన్యవాదాలు.

నా గురించి..
నేను పుట్టి పెరిగింది అంతా గోవాలోనే. అమ్మ అక్కడ స్కూల్‌ టీచర్‌గా వర్క్‌ చేసేది. నాన్న అనారోగ్యకారణం వల్ల నా చిన్నప్పుడే చనిపోయారు. అలా అమ్మకు నేను –నాకు అమ్మ, ఇదే మా ప్రపంచంగా ఉండేది. నేను టెన్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడు అమ్మకు హైదరాబాద్‌లో స్కూల్‌ ప్రిన్సిపల్‌గా అవకాశం వచ్చింది. అలా నన్ను తీసుకొని అమ్మ ఇక్కడకు వచ్చేసింది. అప్పటి నుంచి ఇక్కడే. ఇంటర్‌ పూర్తయ్యాక పాకెట్‌ మనీ కోసం అనుకోకుండా మోడలింగ్‌ వైపు వచ్చాను. కొన్నాళ్లు ట్యూషన్లు చెప్పాను. మోడలింగ్‌లో ఉండటం వల్ల ఒక సినిమాలో అవకాశం వచ్చింది. మా అమ్మ స్నేహితురాలు చెన్నైలో టీవీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఆవిడ నాకు సీరియల్స్‌ గురించి చెప్పడం, ‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌లో అవకాశం రావడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే, అమ్మ మాత్రం డిగ్రీ పూర్తయిన తర్వాతే కెరియర్‌ అంది. అలా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను.

మాది ప్రేమ పెళ్లి
ఒక సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’ని పెళ్లి చేసుకున్నాను. తనూ సీరియల్స్‌లో నటిస్తున్నారు. మా పెళ్లయి ఏడాదిన్నర అవుతోంది. అత్తమామ, మరిది, అమ్మ, నేనూ–మా వారు.. ఇదీ ఇప్పుడు మా కుటుంబం. నేనూ–మా వారు నెలలో 20–25 రోజులు షూటింగ్స్‌లోనే ఉంటాం. ఉన్న కాస్త టైమ్‌లో షాపింగ్, రెస్టారెంట్స్‌.. హడావిడిగా గడిచిపోతాయి.

వీడియోకాల్‌తో షాపింగ్‌
నా కాస్ట్యూమ్స్‌ని ఎక్కువగా మా అమ్మ ఎంపిక చేస్తుంది. మా వారు ఖాళీ టైమ్‌లో ఉండి, నేను షూటింగ్‌లో ఉంటే తనూ నాకు షాపింగ్‌లో హెల్ప్‌ చేస్తారు. షాప్‌లో ఉండి వీడియో కాల్‌ చేసి ‘ఈ శారీ కలర్‌ ఎలా ఉంది, ఈ డ్రెస్‌ ఎలా ఉంది?’ అని అడుగుతుంటారు. (నవ్వుతూ)‘ఆ శారీలో నేను ఎలా ఉంటానో ఊహించుకొని తీసుకోండి ..’ అని చెబుతుంటాను. బ్లౌజ్‌ డిజైన్స్‌ కోసం మాత్రం షూటింగ్‌ బ్రేక్‌ టైమ్‌లో ప్లాన్‌ చేసుకుంటాను. అన్నీ కలిపి ఒకేసారి టైలర్‌కిచ్చి డిజైన్‌ చేయించుకుంటాను.

రీ ప్లేస్‌ ‘ప్రేమ’
‘జీ తెలుగు’లో వచ్చే ‘ప్రేమ’ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ చేస్తున్నాను. ఈ సీరియల్‌కి తొమ్మిదినెలలుగా వర్క్‌ చేస్తున్నాను. గతంలో ఉన్న హీరోయిన్‌ ప్లేస్‌ని నేను భర్తీ చేస్తున్నాను. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. శాస్త్రీయ నృత్యకారిణి కావాలనుకున్న కల ‘సిరి సిరి మువ్వలు’ సీరియల్‌తో తీరింది.

అవకాశాలు ఉన్నంత కాలం
యాక్టింగ్‌ ఫీల్డ్‌లో ఉన్న గొప్పతనం ఏంటంటే.. ఎన్నో క్యారెక్టర్లని పోషిస్తాం. ఒక క్యారెక్టర్‌ని పోషించడం ద్వారా ఒక జీవితాన్నే ఫీల్‌ అవ్వచ్చు. నాకెంత కాలం ఇందులో అవకాశాలు వస్తే అంతకాలం నటిస్తూనే ఉండాలనేది నా అభిలాష. అమెరికా అమ్మాయి సీరియల్‌లో నా పాత్ర పేరు సమంత. అందరూ సామ్‌ అని పిలుస్తారు. ఇప్పటికీ నన్ను అభిమానించేవారంతా ‘సామ్‌’ అనే పిలుస్తారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది.

మళ్లీ గోవా వెళ్ల లేదు
నేను గోవాలో పుట్టి పెరిగినా మళ్ళీ ఇప్పటి వరకు గోవా వెళ్లడం కుదరలేదు. అక్కడ ఉన్న మా బంధువులందరినీ కలిసి రావాలంటే 10–15 రోజులైనా పడుతుంది. అందుకే ఇంకా మా ట్రిప్‌ ప్లానింగ్‌లోనే ఉంది.’’
– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top