మధురానుభూతుల మాసం

sankranthi festival special - Sakshi

సంక్రాంతి నెల్లాళ్లు ఆడపిల్లలకు పండగే పండుగ. చీకటి పడేసరికల్లా వీధంతా తుడిచి, కళ్లాపి చల్లి, పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడం, పసుపుకుంకుమలతో అలంకరించిన గొబ్బిళ్లను తెల్లవారుజామునే ముగ్గులలో ఉంచి మురిసిపోవడం, బంతిపూలు చల్లడం. మధురానుభూతులు మిగిల్చే పండుగ.

సంక్రాంతి పండుగ రాగానే సోమిదేవమ్మగారు చాలామందికి గుర్తుకు వస్తారు. విజయవాడలోని జదగం వారి సందులో ఆ ఇంటి పేరు ఆవు పేడ వారి ఇల్లు. అలా పేరు రావడం వెనుక ఎంతో సంప్రదాయమైన కారణమే ఉంది. సోమిదేవమ్మగారి ఇల్లు మూడు ఆవులు, ఆరు కోడె దూడలతో కళకళలాడుతూ ఉండేది. అంతేనా... ఇంటి నిండా మనవలతో మరింత కళకళలాడుతూ ఉండేది. సొంత మనవలు మాత్రమే కాదు, ఆ పేటలో ఉన్నవారంతా ఆవిడ మనవలే. ఎలాగంటారా... సంక్రాంతికి గొబ్బిళ్లు పెట్టడం తెలుగునాట సంప్రదాయంగా ఉంది. ఇంటి ముందు ‘ముత్యాల ముగ్గుల్లు... ముగ్గుల్లో గొబ్బిళ్లు...’ అంటూ ప్రతి వాకిలి పలకరిస్తుంది. ఆవు పేడతో చేసే గొబ్బిళ్లతో భూమాతకు బూరెలు నైవేద్యం పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఆ గొబ్బిళ్ల కోసం పేడ సేకరించడం ప్రతి ఇంటి ఆడ పిల్ల పని.

తెల్లవారుజామునే చిట్టి చిట్టి ఆడపిల్లలు నిద్ర లేచి, సోమిదేవమ్మగారింటికి వెళ్లి క్యూ కట్టాల్సిందే ఈ నెల రోజులు. ఆవిడ పగలంతా ఆవులు వేసిన పేడను సేకరించి, ఉండలు తయారుచేసి పక్కన పెట్టేవారు. వేకువజామున వచ్చిన ఆడపిల్లలందరికీ ఒక్కో ఉండ ఇచ్చేవారు. వాళ్లకోసమని ఆవిడ ఉదయం మూడు గంటలకే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని, దీపాలు వేసి సిద్ధంగా ఉండేవారు. ఒక్కనాడు కూడా ఆవిడను నిద్రలేపవలసిన అవసరం రాలేదు. ఎనిమిది పదులు నిండిన పండు వయసులో కూడా ఆవిడ ఆరోగ్యంగా తిరుగుతూ, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదరుచూస్తూ ఉండేవారు.

ఆవిడది వెన్నలాంటి మనసు. సంవత్సరంలో పదకొండు నెలలు ఎలా గడిచినా, ధనుర్మాసం నెల్లాళ్లు మాత్రం ఆవిడకు ఎంత సరదానో. రోజంతా తీరిక లేకుండా హడావుడిగా గడుపుతారు. ఒక్కరోజు ఒక్క అమ్మాయి తగ్గినా ఆవిడకు తెలిసిపోతుంది. ఏవే కమలా! ఈ రోజు కామేశ్వరి రాలేదేమిటి? ఒంట్లో బాగా లేదా? నిద్ర లేవలేదా? అని ఆదుర్డా పడుతూ, ‘మీరెవరైనా తీసుకువెళ్లి దానికి కూడా పేడ ఉండ ఇవ్వండి’ అని మరో ఉండ చేతిలో పెట్టేవారు. ఇంటికి వచ్చిన వారెవ్వరూ పేడ లేకుండా ఉత్త చేతులతో వెళితే ఆవిడ మనసు ఆ రోజంతా నిశ్శబ్దంగా బాధపడుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఆ పరిస్థితి రాలేదు.

ఒకవేళ వస్తే, తన ఇంట్లో పిల్లలకు తగ్గించి వారికి ఇవ్వాలని నిశ్చయించుకుంది సోమిదేవమ్మ. ఉదయాన్నే నిద్ర లేచి, ఎంతో దూరం నుంచి వచ్చిన ఆ పిల్లలు ఉత్తి చేతులతో వెళితే ఆవిడ ముదుసలి మనసు గాయపడదా మరి. ధనుర్మాసంలో రోజువారి గొబ్బిళ్లు కాకుండా సందె గొబ్బిళ్లు పెట్టుకోవడం ఆడపిల్లలకు ఎంతో సరదా. ప్రతిరోజూ ఉదయాన్నే గొబ్బిళ్లు పెట్టుకోవడం సాధారణం. సందె గొబ్బిళ్లంటే సాయంత్రాలు పెట్టుకుంటారు. స్నేహితులందరినీ పేరంటానికి పిలుస్తారు. పెద్ద పెద్ద గొబ్బిళ్లు తయారుచేస్తారు. ఒకటి పెద్దది,... అదే తల్లి గొబ్బెమ్మ. నాలుగు పిల్ల గొబ్బెమ్మలు. వాటిని తల్లి గొబ్బెమ్మకు చుట్టూ పెడతారు. తల్లి గొబ్బెమ్మ తల మీద చిన్న పసి గొబ్బెమ్మను ఉంచుతారు.

గొబ్బిళ్లను పసుపు, కుంకుమ, బియ్యప్పిండితో అందంగా అలంకరించి, గొబ్బి పూలను తురుముతారు. వాటిని గౌరీదేవిగా భావిస్తారు. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు పాడతారు. ‘కొలను గోపరికి గొబ్బిళ్లో యదుకులస్వామికిని గొబ్బిళ్లో’ ‘అటవీస్థలములకరుగుదమా ... వట పత్రమ్ములు కోయుదమా’ అని చేతులతో తప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. పూర్తయ్యాక సెనగలు వంటివి అందరూ కలిసి తింటారు. సందె గొబ్బెమ్మలకి మరింత ఎక్కువ పేడ కావాలి కనుక, సోమిదేవమ్మగారికి ముందుగానే చెప్పి రిజర్వు చేసుకునేవారు. ఆవిడ బాగా గుర్తు పెట్టుకునేవారు. వారి కోసం మరి కాస్త పేడ తీసి పక్కన ఉంచేవారు.

అక్కడితో ఆగకుండా పిడకలు కూడా తయారుచేసి పక్కన ఉంచేవారు. భోగిమంట వేయడానికి ముందు రోజే పేడ కోసం వచ్చినప్పుడు అందరికీ తలో పది పిడకలు దండలా గుచ్చి ఇచ్చేవారు. మంటలో ఎన్ని మామూలు పిడకలు వేసినా, ఆవు పేడ పిడకలు ఒక్కటైనా వేయాలని అంటారు. అందుకే సోమిదేవమ్మగారు ఆవు పేడ పిడకలు తయారుచేసి ఉంచేవారు. ఇలాంటి వారు ఉండేవారంటే ఎవరైనా నమ్ముతారా. కోట్లలో ఒక్కరైనా ఉండకపోతారా.  అలాంటివారు ఉన్నారు. నమ్మకపోవచ్చు. ఉంటారు. ఉండితీరతారు. ఇది సోమిదేవమ్మగారి ప్రహసనమైతే... మరో ప్రహసనం వీధివీధిలో కనిపించేది...

సాయంకాలం స్కూల్‌ నుంచి రాగానే... ఆడపిల్లలంతా వీధుల్లోకి వచ్చి ఆవులకోసం వెతుకులాడేవారు. ఎక్కడైనా ఒక ఆవు కనిపించగానే, గుంపులో ఉన్న ఆడపిల్లల్లో ఒకళ్లు హడావుడిగా ‘ఇది నా ఆవు’ అనేవారు. అంటే ఆ ఆవు వేసిన పేడ ఇంకెవరూ ముట్టుకోకూడదు. మిగిలిన పిల్లలు మరో ఆవు కోసం వెతకడానికి బయలుదేరేవారు. ఇలా ఆ ఆవు దగ్గర కాపలాగా నిలబడి, ఆ ఆవు ఎప్పటికీ లేవకపోతే, దాని తోక పట్టుకుని లాగేవారు. ఆవుతో బలవంతంగా పేడ వేయించి, కవర్లు లేదా చిన్న బకెట్‌లోకి తీసుకుని, వికసించిన ముఖాలతో ఇంటి ముఖం పట్టేవారు. పాపం ఆ ఆవులు ఎన్నడూ వీరి మీద తిరగబడేవి కాదు. వారికి పూర్తిగా సహకరించేవి. ఇలా సంక్రాంతి అంటే చాలామందికి ఇటువంటి సోమిదేవమ్మలు, ఆవులు గుర్తుకు వచ్చే మూడు రోజుల తీపి జ్ఞాపకాల పండుగ ఇది.
– డా. వైజయంతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top