పరాయి తాయి

Sakshi Special Story On Cure hospital

ఈ రోజు పంజాగుట్ట క్యూర్‌ హాస్పిటల్లో ఉన్న వీరంతా గత సంవత్సరం ఇదే సమయానికి ఎక్కడెక్కడో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండే ఉంటారు. కానీ అది ఆనందం అని అప్పుడు వీళ్ళెవరికీ తెలియదు. ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్లుగా రోగాలతో బాధపడుతున్నప్పుడు మాత్రం ఆరోగ్యం కుదుటపడితే అంతే చాలనుకుంటున్నారు.ఎమర్జెన్సీ వార్డ్, పీడియాట్రిక్‌ వార్డ్, జనరల్‌ వార్డ్, ఆర్ధోపెడిక్‌ వార్డ్, ట్రామా కేర్, ఐ.సీ.యూ, ఐ.సి.సి.యూ ఇలా ఏ వార్డు చూసినా పేషెంట్లు, వారి ఎస్కార్టులు వేలాడేసిన ముఖాలతో దిగాలుగా ఉంటారు.

ఒక్క లేబర్‌ వార్డ్‌ మాత్రం దీనికి మినహాయింపు. అప్పటివరకు వాళ్ళు పడ్డ ఆందోళనలన్నీ అప్పుడే పుట్టిన పిల్లల ఏడుపులలో కొట్టుకుపోతాయి. అటువంటి లేబర్‌ వార్డ్‌ బయట కూడా ఒక్క యజ్ఞ మాత్రమే అభావంగా కూర్చుంది.రెండు రోజుల్నుంచి యజ్ఞ ఫోన్‌ చేస్తుంటే కట్‌ చేస్తున్నాడు అమితాబ్‌ బచ్చన్‌. అతడి భార్య జయా బచ్చన్‌ నంబర్‌ యజ్ఞ దగ్గర లేదు. యజ్ఞ వాట్సాప్‌లో ‘అమితాబ్‌ బచ్చన్, అమరావతి’ అని ఉంటుంది అతని పేరు. మూడేళ్ళ క్రితమే అతను యజ్ఞ పని చేస్తున్న ఐ.వీ.ఎఫ్‌. సెంటర్‌కి వచ్చి ఉంటే గనుక ‘అమితాబ్‌ బచ్చన్, మంగళగిరి’ అని సేవ్‌ చేసుకునేదేమో!

గర్భాలయా ఐ.వీ.ఎఫ్‌.  టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ వాళ్ళు, యజ్ఞ లాంటి ఏజెంట్లకు క్లైంట్ల అసలు పేర్లు చెప్పరు కాబట్టి క్లైంట్ల ఆనవాళ్ళను బట్టీ ఏజెంట్లే ఏదో ఒక ఫేక్‌ నేం పెట్టుకోవాలని ఆ అమితాబ్‌ బచ్చన్‌కి తెలియదు. అసలు అతని పేరు అమితాబ్‌ బచ్చన్‌ అని యజ్ఞ పెట్టుకుందని కూడా అతనికి తెలియదు. పొడుగ్గా ఉన్నాడు కాబట్టి అమితాబ్‌ బచ్చన్‌ అని పెట్టుకుంది. అతని భార్య మాత్రం జయా బచ్చన్‌లా లేదు. ‘మాకు పదేళ్ళుగా పిల్లల్లేరు. మీరే ఏదోలా మాకు సంతానం కలిగేలా చెయ్యాలి’ అని వాళ్ళ డాక్టర్‌ పునర్నవి చేతులు పట్టుకుని తడి కళ్ళతో ఆమె బ్రతిమిలాడ్డం యజ్ఞకు ఇంకా గుర్తుంది.

అమితాబ్‌ బచ్చన్‌ వాట్సాప్‌ కాన్వర్సేషన్‌ ఓపెన్‌ చేస్తే లాస్ట్‌ సీన్‌ 5 మినిట్స్‌ ఎగో అని ఉంది. మరి అయిదు నిమిషాల క్రితమే వాట్సాప్‌ చెక్‌ చేసుకున్న వ్యక్తి, నిన్న పొద్దున్న యజ్ఞ పంపిన ‘్గౌu ్చట్ఛ b ్ఛటట్ఛఛీ ఠీజ్టీజి ్చ b్చby జజీట ’ అనే మెసేజ్‌ చూసుకుని ఉండడా ?మొన్న సాయంత్రం డాక్టర్‌ గారు నార్మల్‌ డెలివరీ అవ్వడానికి ఇంజక్షన్‌ చేయబోతుండగా యజ్ఞ కాల్‌ చేస్తే... దుర్ముహూర్తం పోయేంత వరకు ఆగి తెల్లవారు ఝామునే స్వాతీ నక్షత్రంలో సిజేరియన్‌ చెయ్యమన్నాడు.

కొడుకు పుడితే అభిషేక్‌ బచ్చన్‌ అని పేరు పెట్టుకునేవాడేమో. కానీ అమ్మాయి పుట్టింది. అమితాబ్‌ బచ్చన్‌ కూతురి పేరేమిటి ?గర్భాలయా ఐ.వీ.ఎఫ్‌.  టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ మేనేజర్‌ యజ్ఞ కి ఫోన్‌ చేశాడు. ఏం అడుగుతాడో తెలుసు కాబట్టి ఫోన్‌ ఎత్తగానే...‘‘హలో సార్‌. ఆ అమితాబ్‌ బచ్చన్‌కి కూతురు పుట్టిందని నిన్న పొద్దున్నే మెసేజ్‌ పెట్టాను. అప్పటి నుండి ఫోన్‌ చేస్తున్నా అతను తీయలేదు. మీ దగ్గర అతని భార్య నంబరుందా?’’ అని అడిగింది. మధ్యలో కొన్ని అక్షరాలు నత్తిపోయినా సరేననుకుంది.

‘‘నీకు బుద్ధి ఉందా ?’’
‘‘అసలు వాళ్ళకి పాప పుట్టిందని నిన్ను ఎవడు చెప్పమన్నాడు? డెలివరీ అయిపోవచ్చింది రమ్మని పిలవొచ్చుగా. ఇప్పుడు చూడు... ఆడపిల్ల పుట్టింది కాబట్టి మాకు అక్కర్లేదు అంటున్నారు వాళ్ళు. పైగా ఇప్పటి వరకు హాస్పిటల్‌ బిల్స్‌ అన్నీ మన టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌నే పెట్టుకోమంటున్నాడు’’ తిట్టవలసిన అవసరం లేకపోయినా అమితాబ్‌ బచ్చన్‌ మీద కోపం యజ్ఞ మీద చూపించాడు మేనేజర్‌.‘‘మరి రోహిణీ పరిస్థితేంటి సార్‌ ఇప్పుడు’’ ఈ వాక్యం కొంచెం పెద్దగా అనేసరికి లేబర్‌ వార్డ్‌ నర్స్‌ ‘ష్‌...’ అంది.

‘‘రోహిణి ఎవరు?’’
‘‘అదే సార్‌.. సరొగేట్‌ మదర్‌’’ అమితాబ్‌ బచ్చన్, జయా బచ్చన్‌ దంపతుల సరొగేట్‌ బేబీని తొమ్మిది నెలలుగా మోస్తున్నావిడ పేరు కూడా తెలియదు వీడికి.‘‘ఉండవమ్మా నువ్వు.. మన పరిస్థితేంటో అర్ధం కాక నేను ఏడుస్తుంటే నువ్వు ఆవిడెవరి గురించో ఆలోచిస్తావేంటి ? అసలు నువ్విప్పుడు ఎక్కడున్నావ్‌ ?’‘‘డెలివరీ వార్డ్‌ బయట సార్‌’’ లేబర్‌ వార్డ్‌ అంటే అర్ధం కాదేమోనని అలా చెప్పింది.
‘‘ముందు అక్కడి నుంచి వెళ్ళిపో’’‘‘సర్‌ ఆ అమ్మాయి ఎనీమిక్‌. బోలెడంత రక్తం పోయింది. ఐ.సీ.యూ.లో పెట్టారు. ఇక్కడ బేబీ ని ఇంక్యుబేటర్లో ఉంచారు. వీళ్ళకేమైనా అయితే...’’‘‘సరే ఫోన్‌ పెట్టెయ్‌.. నేను వస్తున్నాను’’ అని కట్‌ చేశాడు.ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్ఠి వర్ధనం!ఉర్వారుకమివ బంధనాన్‌ మృత్యోర్ముక్షీయమామృతాత్‌!!రోగుల యోగ క్షేమాలు కోరి గ్రౌండ్‌ ఫ్లోర్‌ లాబీలో మృత్యుంజయ హోమం చేయిస్తుంది యాజమాన్యం. ‘‘ప్రసాదం తీస్కో’’ అంది కొబ్బరిముక్క తీసుకొచ్చిన నర్స్‌.‘‘నాకు వదు’్ద’

‘‘ఒక్క కొబ్బరి ముక్క తింటే సచ్చిపోతావా? తినెహే’’ అంటే తీసుకుంది.‘‘ఎడ్వాన్స్‌ బిల్‌ కూడా ఇంకా కట్టలేదటగా. ముందు ఆ పని చూడు. డబ్బులు కట్టకపోతే పాపని బయట వరండాలో పడేస్తాను. ఆ తర్వాత ఏమైనా పట్టించుకోను. మళ్ళీ నన్ననొదు’యజ్ఞ నోట్లో కోరని కొబ్బరి కరకరలాడింది. ‘‘ప్రసాదం కళ్ళకి అద్దుకోవాలని కూడా తెలియదు.. హయ్యో..’’ అని వెళ్ళిపోయింది మహా భక్త పరాయణురాలైన నర్స్‌.దటి సారి రోహిణికి ప్రసాదం ఇచ్చినప్పుడు ఇలాగే కళ్ళకద్దుకోకుండా వేసుకుంటే యజ్ఞ కూడా మనసులో ఇప్పుడు నర్స్‌ అన్నట్లే అనుకుంది కానీ సంస్కారహీనంగా బయటకి అనలేదు.‘‘ఏం భయపడక్కర్లేదు. నీకు లక్షన్నర ఇస్తారు. ఈ తొమ్మిది నెలలూ నీ ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకుంటారు. ఈ తొమ్మిది నెలలూ వాళ్ళ బిడ్డ నీ కడుపులో పెరుగుతాడు. దీన్నే సరోగసీ అంటారిక్కడ. మరి మీ బళ్ళారిలో ఏమంటారో నాకు తెలియదు. అర్ధమయ్యిందా?’’‘‘అర్ధ’’

‘‘నీకు తెలుగు రాదా’’ ‘‘అర్ధం చేస్తాను. మాట్లాడేకి రాదు. బళ్ళారిలో కన్నడ మాతనాడతాం’’  ‘‘నువ్వు సరోగసీలో ఎవరి బిడ్డనో మొయ్యబోతున్నావని నీ భర్తకి తెలుసా ?’’‘‘మేరేజ్‌ ఇల్ల’’ అని ఇబ్బందిగా నవ్వింది రోహిణి.‘‘అయ్యో.. ఇంకా పెళ్ళి కాలేదా? మరి సరొగేట్‌ మదర్‌గా ఉండటం తర్వాత ఇబ్బంది అవుతుందేమో ఆలోచించుకో. పెళ్ళి కావలసినదానివి! రేపు నిన్ను పెళ్ళి చేసుకునేవాడికి నీకు పెళ్ళికి ముందే పిల్లలున్నారని తెలిస్తే నీకు పెళ్ళి కాకపోవచ్చు’’ అని హితవాక్యాలేవీ చెప్పలేదు యజ్ఞ. తనొక ఏజెంట్‌. ఏజెంట్‌ మాత్రమే.

డబ్బు అవసరమున్న ఆరోగ్యవంతమైన స్త్రీలను సరోగేట్‌ మదర్‌ గా ఉండటానికి ఒప్పించి, సంతానం లేని దంపతులకు సరోగెసీ ద్వారా కలగబోయే పిల్లలకు సరోగేట్‌ మదర్‌తో తొమ్మిది నెలలు మోయించి ప్రసవం అయ్యాక వాళ్ళ బిడ్డలని వాళ్ళకి అప్పజెప్పడం తన పని. పిల్లల్ని కనే తల్లులకి అందేది నేతి బీరకాయలో నెయ్యంత. ఐవీఎఫ్‌ సెంటర్‌కి దక్కేది తిరుపతి లడ్డులో నెయ్యంత. ‘‘నువ్వు ఇలా సరోగేట్‌ మదర్‌గా ఎవరి బిడ్డనో మోస్తున్న విషయం ఇంకెవరికీ తెలియకూడదు. మా ఆఫీస్‌కి ఒక ఫ్లాట్‌ ఉంది. అందులో నీలాంటి సరోగేట్‌ మదర్స్‌ ఇంకో ముగ్గురున్నారు. వాళ్ళతో పాటు ఈ తొమ్మిది నెలలూ నువ్వు ఇక్కడే ఉండాలి. మిమ్మల్ని చూసుకోవడానికో ఆయా ఉంది.  డెలివరీ తర్వాత మళ్ళీ మీ బళ్ళారి వెళ్ళిపోవచ్చు. సరేనా?’’
తలతో సరేనంది.

‘‘ఆల్‌ ది బెస్ట్‌. అమ్మా...’’‘‘అమ్మా ఇల్లం తాయి’’ అని నవ్వింది. కన్నడలో అమ్మని తాయి అంటారన్నమాట!ఆఫీస్‌ ఫ్లాట్లో చేరిన దగ్గర్నుండి రోహిణికి పోషకాహారం అందడం వల్ల ఆమె రంగుతేలింది. బలంగా తయారయ్యింది. రోహిణితో పాటు యశోద, నర్మద, వింధ్య అనే మరో ముగ్గురు గర్భిణులుండేవారు. మిగతా గర్భిణులను చూసుకున్నట్లే రోహిణిని కూడా జాగ్రత్తగా చూసుకునేది ఆయమ్మ. రోహిణిని చూడ్డానికి ఎప్పుడైనా వెళ్తే యజ్ఞని ఆమె అడిగే ప్రశ్నలు ఇలా ఉండేవి ...‘‘బేబీ పేరెంట్స్‌ నా బేబీని జాగ్రత్తగా చూసుకుంటారా?’’‘‘రేపెప్పుడైనా ఎక్కడైనా నా బిడ్డ నాకు కనబడితే పోల్చగలనా?’’ ‘‘తనను కన్న తల్లి చాలా పేదదనీ..

 అణగారిన వర్గంలో పుట్టిందనీ.. డబ్బుకోసం వేరే ఎవరి బిడ్డనో మోసి, కనేసి వెళ్ళిపోయిందనీ నా బిడ్డకి తెలిసే అవకాశముందా?’’  ఆఖరి ప్రశ్న వేసినప్పుడు తన ఎరుపెక్కిన కళ్ళు యజ్ఞ చూడకూడదని చాకచక్యంగా అటు తిరిగేది.రోహిణి కన్సీవ్‌ అయిన విషయం తెలుసుకున్న అమితాబ్‌ బచ్చన్‌ దంపతులు అమితానందం వ్యక్తం చేసారు. ఆమెను చూడ్డానికి హైదరాబాద్‌ వస్తామంటే సరోగేట్‌ మదర్‌ని క్లైంట్సూ, క్లైంట్స్‌ని సరోగేట్‌ మదరూ చూడ్డానికి వాళ్ళ రూల్స్‌ ఒప్పుకోవని చెప్పి జాగ్రత్తపడేది యజ్ఞ. ‘సరోగసీ చట్ట విరుద్దం. ఇలా చేశామని తెలిస్తే అందర్నీ జైల్లో పడేస్తారు’ అని బెదిరించింది. తరువాత ఎప్పుడైనా వీళ్ళ మనసు కరిగి తము కన్న బిడ్డ తనకే సొంతమని సరోగేట్‌ మదర్సూ, వాళ్ళ మనసు విరిగి ఈ బిడ్డ మాకక్కర్లేదని క్లైంట్సూ పేచీ పెట్టకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంది.కానీ ఇలా ఆడపిల్ల పుట్టిందని బిడ్డని తిరస్కరించే అమితాబ్‌ బచ్చన్‌ లాంటి వాళ్ళు యజ్ఞకెప్పుడూ ఎదురుపడలేదు.

‘ఛ! ఇంత నీచుడికి, తన ఆస్తిలో సగం వాటా కూతురికే ఇస్తానని ప్రకటించిన అమితాబ్‌ బచ్చన్‌ లాంటి హీరో  పేరు ఏంటి నాన్సెన్స్‌? పెద్దాయన పరువు తీయడం కాకపోతే. వీడి పేరు.. సోను సూద్‌. ఛ! సోనూ సూద్‌ విలన్‌ అయినా అందగాడు. సోనూ సూద్‌ పేరు కూడా వీడికి తగదు. వీడి పేరు... వీడి పేరు... ఆ.. ’చలపతి రావు’. తెలుగు సినిమా విలన్‌ చలపతి రావు కాదు. నా మొగుడు చలపతి రావు’ అనుకుంది యజ్ఞ.

తన మొగుడు చలపతిరావు సినిమాలో విలన్‌ చలపతి రావు కంటే దుర్మార్గుడని యజ్ఞ నమ్మకం. స్కానింగ్‌లో ఆడపిల్లని తెలిసి ఆరు సార్లు యజ్ఞకి అబార్షన్‌ చేయించాడు. ఆ పైన ఎబార్షన్‌ చెయ్యించాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే యజ్ఞ తల్లి అయ్యే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయింది.తన మొగుడి పేరూ, ఈ అమితాబ్‌ బచ్చన్‌ పేరూ ఒకటైపోతే ఎలా? అనుకుందో ఏమో ఫోన్లో అమితాబ్‌ బచ్చన్‌ పేరుని ‘చలపతి బచ్చన్‌’ అని మార్చి కసిగా నవ్వుకుంది.‘‘ఏమ్మా... రోహిణీ తాలూకా ఎవరూ ’’ అడిగారెవరో.

‘‘నేనేనండీ...’’
‘‘రోహిణి హెల్త్‌ బాగానే ఉంది. బ్లడ్‌ ట్రాన్స్‌ ఫ్యూజ్‌ చేసాక రికవర్‌ అవుతుంది. రేపు ఉదయం వరకు హాస్పిటల్లో ఉండాలి’’ అని డాక్టర్‌ చెప్పారు కానీ బిడ్డని ఎవరు పెంచాలో, బిల్‌ ఎవరు కట్టాలో చెప్పలేదు.

‘‘చూడొచ్చా..’’
‘‘చూడొచ్చు’’

ప్లాస్టిక్‌ వైర్లు ఒళ్ళంతా తగిలించుకుని అచేతనంగా మంచంపై పడుకున్న రోహిణి, యజ్ఞను చూడగానే బలవంతంగా పెదవులు విప్పార్చింది.

ఆ నవ్వులో నవ్వు లేదు. నొప్పి ఉంది.
కడుపును రంపంతో కోస్తున్న నొప్పి.
ఎముకలను చిత్రిక పడుతున్న నొప్పి.
వెన్నుపూసని తొలిచిన ఎపిడ్యూరల్‌ షాట్‌ నొప్పి.

వెన్నుపామునుంచి తలకెక్కిన మగత, సహస్ర సమ్మెటలుగా మారి తలని బద్దలుగొడుతున్న నొప్పి.‘‘ఎలా ఉంది?’’ అని అడిగింది యజ్ఞ. అంతకన్నా అర్ధరహితమైన ప్రశ్న మరొకటి ఉండదు.ఇంకొంచెం పెదవులని సాగదీసింది రోహిణి. మాతృత్వం అంటే ఏంటో తెలియని/ తెలిసే అవకాశమే లేని యజ్ఞకి ఎంత చెప్పినా తక్కువే. మాతృత్వం అనుభవైకవేద్యమే గానీ వర్ణింపశక్యం కాదు.‘‘నొప్పిగా ఉందా?’’ పెదాలు రెండూ పంటి వరుసల మధ్యలోకి పోనిచ్చి భృకుటి ముడి సాయంతో అదిమి పట్టింది.

‘‘నీకు ఒక...’’ పాప పుట్టిందని యజ్ఞ చెప్పబోతే చెప్పొద్దన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది.‘‘ఏ తల్లైనా ఇంత నొప్పిని తన బిడ్డ కోసమే భరిస్తుంది. అలాంటిది ఆ బిడ్డ తనతో ఉండబోదని తెలిసీ ఇంత నొప్పి పడడం దేని కోసం?’’ అని అడగకుండా తమను తాము నియంత్రించుకోడానికన్నట్లు ఆమె మునిపంటి కింద పెదాలు మరింత నలిగాయి.విజిటింగ్‌ టైం అయిపోయిందని యజ్ఞను ఐ.సి.యూ. నుంచి  వెళ్ళిపోమన్నారు. ఆమె ఐ.సీ.యూ.నుంచి బయటకు రాగానే ఎదురయ్యాడు మేనేజర్‌. పోలీస్‌ కేస్‌ అవుతుందేమోనని భయపడి రోహిణి బిల్‌ క్లియర్‌ చేశానన్నాడు.

‘‘మరి పాపది?’’
‘‘చాల్లే.. రోహిణీ బిల్‌ కట్టడానికే మేడం ఒప్పుకోలేదు. మీడియాని పిలిచి అల్లరి చేస్తుందేమోనని భయపడి ఒప్పుకున్నారు. పాపని తీసుకోవడానికి వాళ్ళు రాకపోతే మనకేం సంబంధం?’’
‘‘మరి రోహిణికి ఏం చెప్తాం?’’‘‘పాపని వాళ్ళకి ఇచ్చేశామని చెప్తాం’’‘‘మరి పాప పరిస్థితేంటి?’’ అంటే దీనంగా ముఖం పెట్టి చలపతి బచ్చన్‌ని తిట్టడం మొదలు పెట్టాడు.అతని అసలు పేరు రామకృష్ణట. ఏడాది క్రితం సరోగసీ కోసం అయిదు లక్షలు అవుతుందంటే పదైనా పర్వాలేదన్నాడట.

‘మరి నాతో నాలుగు లక్షలని చెప్పారు... లక్ష మేనేజ్‌ మెంట్‌ నొక్కేసిందన్నమాట’ అనుకుంది.‘‘నిజానికి నాకు మీరిచ్చే లక్షన్నరా చాలదు. ఇంకో రెండు లక్షలు కావాలి. ఈ బిడ్డని కన్నాక ఒక మూడు నెలలు పోనిచ్చి మళ్ళీ వస్తా. ఈసారి క్లైంట్‌కి చెప్పి రెండు లక్షలకి ఒప్పించవా’’ అని రోహిణి ఎప్పుడో అనడం యజ్ఞకు గుర్తొచ్చి గుచ్చుకుంది. రెండు రోజుల్లో విశ్వకాల పరిస్థితుల్లో పెద్దగా మార్పులుండవు కానీ... రామకృష్ణ నంబర్‌ మార్చేశాడు.తను కన్నబిడ్డ తన అసలైన తల్లిదండ్రుల వద్దకు చేరి ఉంటుందన్న భ్రమలో రోహిణి డిస్చారై్జ బళ్ళారి వెళ్ళిపోయింది.

బిడ్డని తల్లిదండ్రులు తిరస్కరిస్తే బిడ్డ పట్ల తమ బాధ్యత లేదన్నారు టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ యాజమాన్యం.ఇంకో ఇరవై నాలుగు గంటల్లో బిడ్డను తీసుకోడానికి ఎవరూ రాక పోతే రెండు వీధులవతల చెత్త కుండీలో బిడ్డను విసిరేద్దామనుకుంది మహా భక్త పరాయణురాలైన నర్సమ్మ.ఒక్కసారి ఆఖరుగా బిడ్డను చూసుకుని ఇంటికి వెళ్ళిపోయింది యజ్ఞ.

‘రేపు ఏ పేపర్లోనో చెత్తకుప్పలో దొరికిన పాప గురించి వార్త వస్తే అది రోహిణి కన్న పాపో వేరే ఎవరో కన్న పాపో ఎలా తెలిసేది?’ అన్న ఆలోచనతో ఆమెకు నిద్ర పట్టడం కాస్త ఆలస్యమైనా ఆ రాత్రి పడుకుంది.మర్నాటి ఉదయం హాస్పిటల్‌ నుంచి నేరుగా ఆఫీస్‌ ఫ్లాట్‌కి వెళ్ళిన యజ్ఞకి గుమ్మంలోనే ఆయమ్మ ఎదురై ‘‘యజ్ఞమ్మగారూ... నర్మదమ్మ గారు ఎళ్ళిపోయారమ్మా...’  అని చెప్పింది.
‘‘ఫ్లాటంతా సరిగ్గా వెతికావా? నెలలు నిండిన ఆడది ఎక్కడికెళ్తుంది’’ తన మాటల్లో కంగారు ఆయాకి తెలియకుండా జాగ్రత్త పడింది యజ్ఞ.

‘‘అప్పుడు డబ్బులు అవసరమయ్యి ఈ పనికి ఒప్పుకున్నాను. ఇప్పుడు డబ్బు ఏర్పాటైంది. తొమ్మిది నెలలు మోసిన బిడ్డను ఇంకొకళ్ళకి అప్పజెప్పడానికి మనసొప్పట్లేదు... నేనెళ్ళిపోతన్నాను అని ఉత్తరం రాసి మరీ ఎళ్ళిపోయిందమ్మా’’ అంది ఆయా.యజ్ఞ సమయస్ఫూర్తికి కామన్‌ సెన్స్‌కి కనెక్షన్‌ ఇస్తే ఒక ఐడియా వెలిగింది.వెంటనే తన మొబైల్‌ అందుకుని ‘సచిన్‌ సత్తెనపల్లి’ అని సేవ్‌ చేసి ఉన్న నంబర్‌కి ఫోన్‌ చేసింది.‘‘సార్‌... నిన్న రాత్రి మీ బిడ్డను మోస్తున్న సరొగేట్‌ మదర్‌కి డెలివరీ అయ్యింది. వెంటనే పంజాగుట్ట క్యూర్‌ హాస్పిటల్‌కి వెళ్ళండి. మీరిస్తానన్న అయిదు లక్షలు ఇమ్మీడియట్‌గా పంపించండి. మనీ ఎకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్‌ అయితేనే బేబీని మీకు హాస్పిటల్‌ వాళ్ళు ఇస్తారు. ఐ.ఎం.పి.ఎస్‌. చేయండి’’ అని ఫోన్‌ పెట్టేసింది.

ఆయమ్మకి ఏమీ అర్ధం కాలేదు. యజ్ఞ ముందు నిట్టూర్చి తరువాత చిన్నగా నవ్వింది. మళ్ళీ ఫోన్‌ అందుకుని వాళ్ళ మేనేజర్‌కి ఫోన్‌ చేసింది.‘‘సార్‌.. గుడ్‌ న్యూస్‌. సరొగేట్‌ మదర్‌ నర్మద వెళ్ళిపోయింది. మీరు క్యూర్‌ హాస్పిటల్‌కి వెళ్ళి రోహిణి కన్న బిడ్డను ఆ సత్తెనపల్లి వాళ్ళకి అప్పజెప్పండి. డెలివరీ ఆన్‌ క్యాష్‌. బిడ్డ వివరాలు నోట్‌ చేసుకోండి...’’ అని పక్కనే ఉన్న క్యాలెండర్‌ చూస్తూ ఇలా చెప్తుంది... రోహిణీ నక్షత్రం... అష్టమి... వృషభ రాశి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top