కొత్త బంగారం

sakshi literature articles - Sakshi

కలకూ నిజానికీ మధ్య ఊగే బోంబే

నార్కోపోలీస్‌ పుస్తకం ప్రారంభమయ్యేది 1970లలో, బోంబేలో ఉన్న శుక్లాజీ ఓపియమ్‌ హౌస్‌లో. పట్టణానికి నడిబొడ్డునున్న కామాథీపూరా రెడ్‌ లైట్‌ ప్రాంతంలో ఉన్న చందూఖానా(ఓపియమ్‌ గది)కి అనునిత్యం వచ్చే కథకుడైన డోమ్‌ ఉలిస్, చిత్రకారుడైన జేవియర్, ఖానావాలా రషీద్, అక్కడే ఉండే లింగమార్పిడి అయిన డింపిల్‌/జీనత్‌ నుంచీ, తళతళలాడే పట్టణపు అడుగుభాగంలో– మురికిలో జీవించే లాలాజీ, రూమీ వరకూ ఇందులో పరుచుకుంటారు.

పుస్తకంలో చూపించిన చాలా సంఘటనలు ఓపియమ్‌ హౌసువే. నైతికంగా పతనమవుతున్న ముంబయి పట్టణపు సందుల్లో, సమాజపు అంచుల మీద నివసిస్తున్న వ్యక్తుల గురించి వర్ణిస్తుందిది. మాదకద్రవ్యాలు, లైంగిక వాంఛలు, ప్రేమ, దేవుడు గురించిన చర్చలుంటాయి. తన మాదకద్రవ్యాల వ్యసనం వల్ల అమెరికా నుండి బహిష్కరించబడిన డోమ్‌ 2004లో తిరిగి ఇక్కడికే వస్తాడు. అప్పటికే, పట్టణంలో అనేకమైన మార్పులు చోటు చేసుకుని ఉంటాయి. ఓపియమ్‌కి బదులు, పాకిస్తాన్‌ నుండి వచ్చిన హెరాయిన్‌ కనిపిస్తుంది.

చైతన్యస్రవంతిలో సాగే ఈ నవలకి తరచూ కొత్త సంఘటనలూ, కొత్త కథకులూ అడ్డం పడుతుంటాయి/రు. ‘అతను’, ‘ఆమె’ అన్న ప్రస్తావనలున్నప్పటికీ, కొసవరకూ వారెవరో అన్నది పాఠకులకి ఉదహరింపుల ద్వారా తప్ప అర్థం కాదు. పుస్తకం నాలుగు భాగాల్లో ఉంటుంది. ‘నేను’ అన్న కథకుని కంఠం మొదటి భాగపు మధ్యలోనే మాయమై, తిరిగి మూడవ భాగంలో వినిపిస్తుంది. ఈ లోగా– పాత్రల మానసిక స్థితీ, వారి వ్యక్తిగత చరిత్రల గురించీ పాఠకులకి చెప్పే, పేరు తెలియని ప్ర«థమ పురుష స్వరం ఒకటి ముందుకొస్తుంది. దీన్ని నవల అనేకన్నా ముంబై చీకటి వీధుల గురించిన కొన్ని పొట్టి కథల సంకలనం అనుకోవచ్చు.
జీత్‌ థాయిల్‌ దీన్ని తన జీవితపు అనుభవాలే ఆధారంగా చేసుకుని రాశారు. 20 సంవత్సరాలపాటు తనకున్న వ్యసనంతో రచయిత పడిన సంఘర్షణ గురించిన ప్రస్తావన ఉంటుంది.

నవల ఒక సామాన్యమైన అభిరుచి(ఓపియమ్‌) వల్ల కట్టుబడి ఉన్న కొద్దిమంది గురించినది. బోంబేకున్న ఆకర్షణనీ, జీవనశైలినీ పక్కకు నెట్టి, పట్టణానికున్న మరోకోణం వైపు మన దృష్టిని మళ్లిస్తుంది. 1970ల నుంచీ 2000 వరకూ బోంబే చేసిన ప్రయాణాన్ని నవల చెబుతుంది. అందుకే కొత్త పేరైన ‘ముంబయి’ని ఎక్కడా వాడరు రచయిత.  భారతదేశపు జీవితాల్లో ఉన్న సంక్లిష్టతలనీ, వైరుధ్యాలనీ, కాపట్యాలనీ ఎత్తి చూపుతారు థాయిల్‌. యథార్థతకీ, భ్రమకీ మధ్య రచన ఊగిసలాడుతుంది. ఆఖర్న, తన అపార్టుమెంట్లో డోమ్‌ ఓపియమ్‌ పైప్‌ పీలుస్తున్నప్పుడు గానీ ఈ పుస్తకం అతని ఓపియమ్‌ కలల్లో ఒకటి మాత్రమేనని పాఠకులు తెలుసుకోలేరు.

ముందుమాటలో ఉన్న 7 పేజీల పొడుగాటి వాక్యంలో కేవలం ఒకే ఒక ఫుల్‌స్టాప్‌ను ఉపయోగించి, తక్కిన పుస్తకాన్ని పరిచయం చేస్తారు రచయిత.  ఈ పాక్షిక స్వీయచరిత్ర 2012లో బుకర్‌ బహుమతి లిస్టుకి ఎంపిక అయింది. థాయిల్‌ అప్పటికే నాలుగు కవితా సంకలనాలు రాసి ఉండటం వల్ల, ఇందులో కూడా కవిత్వపు ఛాయలు కనిపిస్తాయి.  -- క్రిష్ణవేణి

జీత్‌ థాయిల్‌
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top