రంగరంగ వైభవంగా... సాక్షి బతుకమ్మ పాట

రంగరంగ వైభవంగా...  సాక్షి  బతుకమ్మ  పాట


బతుకమ్మ



సాకి: నల్లా నల్లా రేగళ్ళ నల్లా రేగళ్ళళ్ళ బంగారంలా మెరిసేవమ్మా... మా బతుకుల్లో ఎలుగే నువ్వమ్మా... పల్లెనుండీ పట్నాలు ఆనుంచి పరదేశాలు  చేరాయి ఆ అంబరాలు... ఓ



బతుకమ్మ నీ సంబరాలు...

వచ్చెర వచ్చెర దసర ముందర తెచ్చెర తెచ్చెర మళ్ళా జాతర పిల్లాజెల్లల సందడి జూడర పుట్టమన్నుదెద్దామ్‌ పదరా

గూనుగు పూల గుంపును గోయరా అక్కాచెల్లెల దోసిట బోయెర పట్టూబట్టలు ప్రేమగ బెట్టర ఆడబిడ్డల పండగ ఇదిరా



పల్లవి:  హే రంగరంగ వైభవంగ తంగేడు పూలు గోయంగా..

ఆ సింగిడిలా వుంది నేల సిరిసిల్లా చీరగట్టంగా..

కొండామల్లి కొండామల్లి నవ్వినాది ఓనాగో

గుండెనిండా సంబూరాలు పొంగినాయి ఓనాగో

పంటసేలు ఊగంగా గోవులిల్లు జేరంగా

పండు ముసలి పసి పడుసు అమ్మలక్కలంతజేరి

సుట్టూగాముళ్లు ఆడంగా...

అల్లో నేరేడల్లో మన ఊరూవాడా వాకిళ్ళలో పండగియ్యాలో

అల్లో నేరేడల్లో పల్లె పాలపిట్టలు పాడె రామరామ ఉయ్యాలో (2)



చరణం 1

రామరామ ఉయ్యాలో రామనె శ్రీరామ ఉయ్యాలో

డప్పులతో దరువులతో సందడి షురు ఇయ్యాలో

ఇద్దరక్కచెల్లెళ్ళను ఉయ్యాలో ఒక్కూరుకిచ్చిరి ఉయ్యాలో

లచ్చువమ్మోరులా ఆ ఊరికెన్ని భాగ్యాలో

నంది వర్దనాలు ఉయ్యాలో బీరపూలు కట్టి ఉయ్యాలో

జిల్లేడు జిలుగులతో జిల్లాలన్నీ మెరవాలో

పట్టుకుచ్చులు కనకాంబరాలు గుమ్మడి పూలు గుచ్చాలో

తమలపాకు దూది వస్త్రం వక్కా ఊదుబుల్లలో

రూపాయి కాయిన్‌బెట్టి లోపాలన్ని కడిగే

ఆ గంగమ్మతల్లి మురిసిపోగ ఇయ్యాలో

నింగే రాలినట్టు నేలా ఈనినట్టు

బంగరు బతుకమ్మల ధూముధాము జెయ్యాలో...

చేదబావి నీళ్ళు దోడె చంద్రకళ రావమ్మో

కమ్మని నీగొంతుతొ కైగట్టి పాటబాడమ్మో

అత్తా కోడలోజట్టూ వదిన మరదలోజట్టూ

అమ్మగారి ఇంటికొచ్చిన ఆడబిడ్డలూ కొత్త కోడళ్ళుచుట్టూముట్టు

అల్లోనేరేడల్లో మన ఊరూ చెరువుగట్టుపైన ఎన్ని అందాలో

అల్లో నేరేడల్లో గ్రామ దేవతలే గౌరమ్మను ఆడుతున్నారో...



చరణం 2

సెలకలే పులకించి మొలకేసే ఓ గౌరమ్మా

మూగ జీవులు రాగమేదీసే

ఆకుపచ్చని చీరలే బరిచే

ఈ భూదేవి బతుకమ్మా ఆడగా పిలిచే

పూలతో దేవుళ్ళ గొలిచే ఆనవాయితి దాటి ఇప్పుడు

పూలనే దేవుళ్ళు జేసే తీరు నీదమ్మా...

సిన్న పెద్దా తేడలేక అందరిని ఒక్కాడ జేర్చి

ఐకమత్యం మొక్కనాటే చెట్టు నువ్వమ్మా

మా బతుకు నువ్వే మెతుకు నువ్వే సిరుల బతుకమ్మా...



ఊరుచివర సెరువుకెళ్ళి సద్దుల బతుకమ్మను

సాగనంపి కలుపుదాము తనలో గంగమ్మనూ

కరువుదీరిపోయేల కాలాలు మంచిగయ్యేలా

పల్లెలన్ని పరవశించి సకల సిరులు అందుకోగ

గౌరమ్మను గౌరవించాలో...

అల్లో నేరేడల్లో గుండె బరువులతో బతుకమ్మను సాగనంపాలో

అల్లో నేరేడల్లో వచ్చే ఏడాది తల్లీ మాకై మళ్ళా రావాలో

రచన: చరణ్‌ అర్జున్‌

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top