సాహో కటింగ్‌

Sahoo cutting - Sakshi

బాహుబలి వల్ల కాలకేయులకు ఏం కష్టం వచ్చిందో తెలియదుకాని ప్రభాస్‌ వల్ల ఇంట్లో పెద్ద కష్టమే వచ్చింది. చిన్నాడు ‘సాహో’ ఫస్ట్‌లుక్‌ చూసి ‘ఐ వాంట్‌ దిస్‌’ అన్నాడు. చూస్తే ప్రభాస్‌ కొత్తరకం కటింగ్‌లో కనిపించాడు. ‘ఐ వాంట్‌ దిస్‌ కైండ్‌ ఆఫ్‌ కటింగ్‌ ఐసే’ అన్నాడు వాడు. ఏదైనా దబాయించాలనుకున్నప్పుడు వాడు బ్రిటిష్‌ లాంగ్వేజ్‌ను వాడుతుంటాడు. చెవుల మీద ఏమీ లేకుండా మాడు మీద మాత్రం ఎక్కువ వెంట్రుకలు పెట్టుకుని ప్రభాస్‌ కొత్త స్టయిల్‌ కొడుతున్నాడు. ‘నీకు బాగోదు’ అంది వాళ్లమ్మ. ‘నాకు కావాల్సిందే’ అన్నాడు వాడు. ‘కుదర్దు’ అంది వాళ్లమ్మ.‘నథింగ్‌ డూయింగ్‌’ అన్నాడు వాడు. వాళ్లమ్మ అంటే నా శ్రీమతి బాల్యం కోస్తా జిల్లాలో చిన్న పల్లెటూళ్లో గడిచింది.

వాళ్ల నాన్న కరెక్టుగా రెండు నెలలకు ఒకసారి క్రాఫ్‌ చేయించుకునేవాడు. నెలకు ఒకసారి చేయించుకుంటే డబ్బు లాస్‌ అనేది ఆయన థియరీ. రెండు నెలల తర్వాత కూడా ఇచ్చే రెండు రూపాయలకు ప్రతి పైసా రాబట్టాలని నెత్తి మీద అన్ని వెంట్రుకలు అర సెంటీమీటర్‌ కూడా ఉండకుండా మళ్లీ పెరగడానికి భయపడే లెవల్‌లో డిప్ప కటింగ్‌ చేయించుకునేవాడు. అంతే కాదు ఒక్కగానొక్క కొడుకును కూడా బార్బర్‌ సీట్‌లో కూర్చోపెట్టి దాదాపు గుండేమో అనిపించేలా క్రాఫు చేయించేవాడు. ఆ ముద్ర ఆమె నుంచి చెరిగిపోలేదు. ‘డబ్బులు చెట్టుకు కాస్తున్నాయా... సిటీలో క్రాఫ్‌కు వంద రూపాయలు తీసుకుంటున్నారు. తల మీద జుట్టుంటే ఊరుకోను. ఫుల్‌ డిప్పం చేయించాల్సిందే’ అని మా ఆవిడ. ‘నాకు స్పైకులు లేవాల్సిందే’ అన్నాడు మావాడు. ఇంట్లో రణరంగం పరిస్థితి ఏర్పడింది.

ఇంతకీ వాడి వయసు ఎంత? ఎనిమిది. పాపం పెద్దాడు సాధుజీవి. వాడికి పాత ఎన్‌టి రామారావు, రేలంగి, చివరకి రమణారెడ్డి క్రాఫు చేయించినా పట్టింపు ఉండదు. ‘కాన్ఫిడెన్స్‌ జుట్టు వల్ల రాదు బుద్ధి వల్ల’ అని వాడు టెక్ట్స్‌బుక్స్‌ నమలడంలో బిజీగా ఉంటాడు. చిన్నాడితోనే పేచీ. వాడితో పేచీ పడటంలో మా ఆవిడ పెద్ద బూచీ. ఆ రోజు ఆదివారం. క్రాఫ్‌ చేయించకపోతే మళ్లీ వారం దాకా టైమ్‌ కుదరదు. తల్లీ కొడుకులేమో ఎవరి పంతాల్లో వాళ్లున్నారు. ‘అది కాదు జానూ.. ఈసారికి వాడి మాట కానిద్దాం. ఎందుకంటే’... ‘మీరు మధ్యలోకి రాకండి’ ‘వాణ్ని సాధించి నువ్వు ఏం బావుకుంటావు చెప్పు’ ‘పిల్లల్ని ఇప్పట్నించే అదుపులో పెట్టాలి. వాడు ఇవాళ సాహో అన్నాడు. రేపు రోబో టూ పాయింట్‌ ఓ అంటాడు.

ఆ తర్వాత కేసీఆర్‌ క్రాఫూ మోడీ క్రాఫూ అంటే ఏం చేస్తారండీ మీరూ’ ‘నీ మాటకు గౌరవం ఇచ్చేవాణ్ని నేనున్నాను కదా. నీ మాట విని మొన్న అరగుండు కటింగ్‌ చేయించుకున్నానా లేదా చెప్పు ‘ఎవరి కోసం చేయించుకుంటారండీ. నా కోసమా మీ కోసమా. అది చేయించుకున్నాక మీరెంత హెల్దీగా మారిపోయారో తెలీదు. ఎవరూ దిష్టి పెట్టడం లేదు మీకు. ఇంతకు ముందు దిష్టికి చీటికి మాటికి అడ్డం పడటమే ఉండేది’ పచ్చి అబద్ధం. మొన్నొకసారి ఆ కింద ఫ్లోర్‌ ఆమె నేను స్కూటర్‌ స్టార్ట్‌ చేసుకుని పోతూ ఉంటే ఒక నిమిషం ఆగి చూసిందట. ఆ పక్కరోజే నాకు అరగుండు క్రాఫ్‌ ఆర్డర్‌ వేసింది మా ఆవిడ.

ఇప్పుడేమో దిష్టి తగలకుండా అని ఢిల్లీ ప్రసంగం చేస్తోంది. ‘ఇంతకీ ఏమంటావు?’ ‘సంవిధాన్‌ కే అనుసార్‌ ఉస్‌కో డిప్పం కరానా హీ చాహియే’ అంది. వాళ్ల నాన్న ప్రాథమిక, మధ్యమిక చదివించడం నా చావుకొచ్చింది. ‘సరే’ అని మా వాణ్ని తీసుకుని, సెలూన్‌కు వెళ్లి, గూగుల్‌లో సాహో ఫస్ట్‌లుక్‌ చూపించి ప్రభాస్‌ కటింగ్‌ ఎలా ఉందో ఎగ్జాక్ట్‌గా  అలాంటి కటింగే చేయించుకుని వచ్చాను. వస్తూ వస్తూ మా ఆవిడ నంబర్‌కు రెండు వందలు టాక్‌టైమ్‌ చేయించాను. దారిలో ఉండగానే ఫోన్‌ చేసింది. ‘ఏంటి టాక్‌టైమ్‌ వేయించారా?’

‘అవును’ ‘ఎందుకు?’ ‘నువ్వు పీనాసితనంతో అసలు మీ అమ్మతో మాట్లాడటమే లేదు. అందుకే వేయించాను. ఇక మీదట నీ బడ్జెట్‌లో నువ్వు ఎంత టాక్‌టైమ్‌ వేయించుకుంటావో వేయించుకో. నేను మాత్రం రెండొందలకు ఎక్స్‌ట్రా టాక్‌ టైమ్‌ వేయిస్తాను. బందర్‌లో ఉన్న మీ చెల్లితో, రూర్కెలాలో ఉన్న మీ తమ్ముడితో నువ్వు మాట్లాడుకుంటూ హాయిగా ఉండటమేగా నాకు కావలసింది’ ‘మీరెంత మంచివారండీ’ ‘నువ్వే మంచిదానివి. నాకు ఇష్టం ఉండదని సాహో కటింగ్‌ వద్దన్నావు కాని నీకు మాత్రం మన చిన్నాడంటే ప్రేమలేకనా?’ ‘సరె సరె.. వాడికి కావలసిందేదో చేయించుకుని రండి. వంట ముగించాను కానీ మీ కోసం పొరుటు చేస్తాను రండి’ అని ఫోన్‌ పెట్టేసింది. గండం గట్టెక్కడానికి దేవుడు ఎప్పుడూ మార్గాలు తెరుస్తూనే ఉంటాడు. ముఖ్యంగా మగవాళ్లకు. లేకుంటే ఈ సంసార సాగరం ఎప్పుడో ఎండిపోయి ఉండును కదూ.
 

నా శ్రీమతి బాల్యం కోస్తా జిల్లాలో చిన్న పల్లెటూళ్లో గడిచింది. వాళ్ల నాన్న కరెక్టుగా రెండు నెలలకు ఒకసారి క్రాఫ్‌ చేయించుకునేవాడు. నెలకు ఒకసారి చేయించుకుంటే డబ్బు లాస్‌ అనేది ఆయన థియరీ. రెండు నెలల తర్వాత కూడా ఇచ్చే రెండు రూపాయలకు ప్రతి పైసా రాబట్టాలని నెత్తి మీద అన్ని వెంట్రుకలు అర సెంటీమీటర్‌ కూడా ఉండకుండా మళ్లీ పెరగడానికి భయపడే లెవల్‌లో డిప్ప కటింగ్‌ చేయించుకునేవాడు. ఆయన తన కొడుకుకు గుండేమో అనిపించేలా క్రాఫు చేయించేవాడు. ఆ ముద్ర ఆమె నుంచి చెరిగిపోలేదు.

– నిష్ఠల

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top