తర్వాతి రోజుల్లో ఒక రాత్రి

Ray Bradbury Story The Last Night Of The World - Sakshi

కథాసారం

‘‘ప్రపంచానికి ఇదే చివరి రాత్రి అని తెలిస్తే నువ్వేం చేస్తావు?’’
‘‘నేనేం చేస్తాను; సీరియస్‌గానే అడుగుతున్నావా?’’
‘‘అవును, సీరియస్‌గానే.’’
‘‘నాకు తెలీదు– నేను ఆలోచించలేదు’’. వెండి కాఫీపాత్ర హ్యాండిల్‌ను అతడి వైపు తిప్పి, సాసర్లలో రెండు కప్పులు పెట్టింది. అతడు కొంచెం కాఫీ వంపాడు. వెనక లాంతరు వెలుగులో ఇద్దరు బాలికలు బ్లాక్స్‌ ఆడుతున్నారు. సాయంత్రం గాలి కాఫీ వాసన వేస్తోంది.
‘‘ఇప్పుడు ఆలోచించరాదూ,’’ అన్నాడతను.
‘‘ఏంటి యుద్ధమా?’’ అతడు తలూపాడు.
‘‘హైడ్రోజనో, ఆటంబాంబో కాదుగా.’’
‘‘కాదు.’’
‘‘లేదంటే ఈ బయో వార్‌?’’
కాఫీని నెమ్మదిగా కలుపుతూ, ఆ నల్లటి వలయపు లోతుల్లోకి చూస్తూ, ‘‘అవేమీ కాదు, ఒక కథ ముగిసిపోవడం అనుకుందాం’’ అన్నాడు.
‘‘నాకేమీ అర్థం కావడం లేదు.’’
‘‘చెప్పాలంటే నాకూ కాలేదు. ఏదో ఒక ఫీలింగ్‌; కొన్నిసార్లు అది భయపెడుతుంది, కొన్నిసార్లు అసలు భయమే వేయకపోగా శాంతిగా ఉంటుంది.’’ అతడు అమ్మాయిల వైపు చూశాడు. దీపం వెలుగులో వారి పసుపు రంగు జుట్టు మెరుస్తోంది. ‘‘నేను నీకు చెప్పలేదుగానీ నాలుగు రాత్రుల క్రితం మొదటిసారి అనిపించింది.’’
‘‘ఏంటి?’’
‘‘నాకో కలొచ్చింది. ఇదంతా ముగిసిపోనుందని ఏదో గొంతు చెబుతోంది, అది నాకు తెలిసిన గొంతయితే కాదు. కానీ ఈ భూమ్మీద అన్నీ ఆగిపోతాయని చెప్పింది. నిద్ర లేచాక దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఆ ఫీలింగ్‌ మాత్రం ఆ రోజంతా నాతో ఉండింది. మధ్యాహ్నం కిటికీలోంచి బయటకు చూస్తున్న స్టాన్‌ విల్లీస్‌తో, ‘స్టాన్, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్‌’ అనగానే, ‘నాకు రాత్రో కల వచ్చింది’ అని అతడు మొదలుపెట్టబోయేంతలోనే, అతడికి వచ్చిన కలేమిటో నాకు తెలిసిపోయింది. నాకూ అలాంటి కలే వచ్చిందని చెబితే అతడేమీ ఆశ్చర్యపోలేదు. విశ్రాంతిగా కనిపించాడు కూడా. ఊరికే అలా నడుచుకుంటూ ఆఫీసంతా కలయదిరిగాం. ప్రతి ఒక్కరూ కిటికీల వైపో, చేతుల వైపో చూస్తున్నారు.’’
‘‘వారందరూ అదే కలగన్నారంటావా?’’
‘‘అందరూ. అదే కల, మార్పే లేకుండా.’’
‘‘మరి ఎప్పుడు ముగుస్తుందంటావు? అంటే, ఈ ప్రపంచం.’’
‘‘రాత్రిలో ఏదో ఒక సమయంలో మనకు, ఎలా రాత్రవుతే అలా మిగతా ప్రపంచానికి. మొత్తం పోవడానికి 24 గంటలు పడుతుంది.’’
కాసేపు వాళ్లు కాఫీని తాకకుండా కూర్చున్నారు. మళ్లీ నెమ్మదిగా చేతుల్లోకి తీసుకుని, ఒకరినొకరు చూసుకుంటూ తాగారు.
‘‘నిజంగా మనకు ఇలా జరగాల్సిన వాళ్లమా?’’ అడిగిందామె.
‘‘జరగాల్సిన వాళ్లమా, కాదా అని కాదు. ఏదో తేడా జరిగిందంతే. కానీ నువ్వు దీని గురించి ఏమీ వాదించలేదు, ఏం?’’
‘‘దానికో కారణం ఉంది. చెప్పాలనిపించలేదు గానీ రాత్రే ఆ కల నాకూ వచ్చింది. మన వీధిలో ఉన్న ఆడవాళ్లు కూడా అదే మాట్లాడుకుంటున్నారు.’’ సాయంత్రం దినపత్రికను అతడి వైపు పెడుతూ, ‘‘కానీ ఇందులో దీని గురించి వార్తే లేదు’’ అంది.
‘‘అందరికీ తెలిసిపోయిం తర్వాత ఇంకెందుకు?’’ అతడు పత్రికను తీసుకుని, విరామంగా కుర్చీలో కూర్చుని, చిన్నారుల వంకోసారి చూశాడు. ‘‘నువ్వు భయపడ్డావా?’’
‘‘ఊహు. పిల్లల కోసం కూడా భయపడలేదు. చచ్చేంత భయమవుతుందని అనుకున్నాను గానీ కాలేదు.’’
‘‘మనుషులు తమను తాము కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారని శాస్త్రవేత్తలు తెగ మాట్లాడుతుంటారే.’’
‘‘జరుగుతుందంతా తార్కికంగానే ఉందనుకున్నప్పుడు నువ్వు అంత ఉద్వేగపడవు. మనం బతికిన విధానానికి ఇంకోలా జరిగే వీలే లేదు.’’
‘‘మనం అంత చెడుగా ఏమీ ప్రవర్తించలేదు, అవునా?’’
‘‘లేదు, అలాగని గొప్ప మంచిగా కూడా లేము. నేననుకోవడం అదే సమస్య. ప్రపంచం ఎన్నో రకాల ఘోరాల్లో మునిగివున్నప్పుడు, మన గురించి తప్ప మనం ఇంక దేనిగురించీ పెద్ద పట్టించుకోలేదు.’’
అమ్మాయిలు చేతులు ఊపుతూ బ్లాక్స్‌ కింద పడగొట్టి నవ్వుతున్నారు.
‘‘ఇట్లాంటి సమయాల్లో జనమంతా వీధుల్లో అరుస్తూ ఉంటారనుకున్నాను.’’
‘‘వాస్తవమైన విషయానికి ఎవరూ అరవరు.’’
‘‘నిన్నూ పాపలనూ మిస్సవుతానని తప్పిస్తే నాకేం బాధలేదు. ఈ సిటీ, ఆటోలు, ఫ్యాక్టరీలు, నా పని– ఇవేమీ ఎట్లాగూ నాకు నచ్చలేదు. నా కుటుంబమూ, వాతావరణంలో జరిగే మార్పులూ, ఎండలో వచ్చినప్పుడు గ్లాసెడు చల్లటి నీళ్లూ, నిద్ర అనే విలాసమూ, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కోల్పోతాను. ఇట్లా కూర్చుని మనం ఎట్లా మాట్లాడుకోగలం చెప్పు?’’
‘‘ఎట్లాగూ ఇంకేం చేయలేకా?’’
‘‘అట్లాగే అనుకో, ఒకవేళ ఉంటే అవే చేసేవాళ్లం. మనుషులు ప్రతి ఒక్కరికీ చివరి రాత్రి ఏమేం చేయబోతున్నారో తెలియడం నేననుకోవడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి.’’
‘‘ఈ సాయంత్రం, ఈ కొన్ని గంటలు మనుషులంతా ఏం చేస్తుంటారో కదా!’’
‘‘ఏదో షోకు వెళ్లడం, రేడియో వినడం, టీవీ చూడటం, పేకాడటం, పిల్లల్ని నిద్రపుచ్చడం, వాళ్లు  నిద్రపోవడం, ఎప్పటిలాగే.’’
‘‘ఎప్పటిలాగే మనం ఎంతోకొంత గర్వపడే విషయాలు.’’
‘‘మనం అంత చెడ్డవాళ్లమేం కాదు.’’
వాళ్లు అలా క్షణం ఉన్నాక, అతడు మరింత కాఫీ పోశాడు. ‘‘ఈరోజే అని ఎందుకు అనుకుంటున్నావు?’’
‘‘ఎందుకంటే’’
‘‘గత శతాబ్దిలోని ఓ పదేళ్ల కిందటి రాత్రో, ఓ ఐదో పదో వందల ఏళ్ల కిందో ఎందుక్కాదని?’’
‘‘ఎందుకంటే, చరిత్రలో ఇంతకుముందెన్నడూ 1951 ఫిబ్రవరి 30 అనే తేదీ లేదు గనక, ఇప్పుడు మాత్రమే ఉంది గనక, ఏ తేదీకీ లేని ప్రాముఖ్యత ఈ తేదీకి మాత్రమే ఉన్నది గనుక, 
ఈ సంవత్సరం మాత్రమే పరిస్థితులు ప్రపంచమంతటా ఎలా ఉండాలో అలా ఉన్నాయి గనక, అందుకే ఇది అంతం.’’
‘‘మహాసముద్రం మీద ఇరువైపులా ఈరాత్రి ప్రయాణిస్తున్న బాంబర్స్‌ ఇంకెప్పటికీ భూమిని చూడలేవు.’’
‘‘కారణాల్లో అది కూడా ఒక భాగం.’’
‘‘సరే అయితే, తర్వాతేంటి? గిన్నెలు తోమడమా?’’ అన్నాడతను.
గిన్నెలను ఇద్దరూ చాలా జాగ్రత్తగా శుభ్రం చేసి, అంతే నీటుగా వాటిని ఎక్కడివక్కడ సర్దారు.
ఎనిమిదిన్నరకు అమ్మాయిలను మంచం మీద నిద్రపుచ్చి, వారికి గుడ్‌నైట్‌ ముద్దిచ్చి, మంచాల పక్కన ఉన్న చిన్న లైట్లను మాత్రం వేసి, గది తలుపును కొద్దిగా తెరిచివుండేట్టుగా దగ్గరకు వేశారు.
‘‘నాకు అర్థం కావట్లేదు,’’ అన్నాడు భర్త, గదిలోంచి బయటికి వస్తూ, ఓసారి మళ్లీ వెనక్కి చూసి, తన పైపును అలాగే కాసేపు పట్టుకుని నిలబడి.
‘‘ఏంటి?’’
‘‘తలుపులు మొత్తం వేసేద్దామా, లేక వాళ్లు దేనికైనా పిలిస్తే వినబడేట్టు కొంచెం తెరిచివుంచుదామా?’’
‘‘నేనైతే పిల్లలకు తెలుసనుకోవట్లేదు, వాళ్లతో ఎవరూ ఏమీ చెప్పివుండరు.’’
‘‘అంతేలే. లేదంటే వాళ్లు మనల్ని అడిగివుండేవారుగా.’’
వాళ్లు కూర్చుని కాసేపు న్యూస్‌ పేపర్‌ చదివారు, కాసేపు రేడియోలో సంగీతం విన్నారు. తర్వాత ఇద్దరూ కట్టెబొగ్గుల్ని చూస్తూ పొయ్యి దగ్గర కూర్చున్నారు. గడియారం పదిన్నర, పదకొండు, పదకొండున్నర కొట్టింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఈ సాయంత్రాన్ని తమకే సొంతమైన రీతిలో గడిపివుంటారని వాళ్లు తలపోశారు.
అతడు భార్యను దగ్గరకు తీసుకుని చాలాసేపు ముద్దాడాడు.
‘‘మనం అయితే ఒకరికొకరం బానేవున్నాం.’’
‘‘నీకు ఏడవాలనిపిస్తోందా?’’ అడిగాడు అతను.
‘‘అట్లేం లేదు.’’
వాళ్లు ఇంట్లోకి వెళ్లి, తలుపులు వేసి, లైట్లన్నీ ఆర్పి, పడకగదిలోకి వెళ్లారు.
‘‘నేను అలిసిపోయాను.’’
‘‘ఇద్దరం అలిసిపోయాం.’’
ఇద్దరూ మంచంలోకి ఎక్కి అట్లా ఒరిగారు. ‘‘ఇప్పుడే వస్తా,’’ అంటూ ఆమె లేచింది.
ఆమె ఇంటివెనగ్గా వెళ్లడమూ, తరుపు తెరుచుకోవడమూ అతడికి వినబడింది. క్షణంలో ఆమె తిరిగొచ్చింది. ‘‘కిచెన్లో నల్లా మరిచిపోయినట్టు ఉన్నాను, ఆపేసి వచ్చాను,’’ అంది.
అదెందుకో తమాషాగా కనబడి అతడికి నవ్వొచ్చింది.
ఆమెక్కూడా తను చేసిన పని చిత్రంగా అనిపించి, ఆ నవ్వుతో జత కలిపింది.
కాసేపటికి ఇద్దరూ నవ్వడం ఆపేసి, తలలు దగ్గరగా జరిపి, ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని, విశ్రాంతిగా పడుకున్నారు.
కాసేపటికి, ‘‘గుడ్‌ నైట్‌’’ అన్నాడతను.
ఆమె ‘‘గుడ్‌ నైట్‌’’ అని, దానికి మృదువుగా ‘‘డియర్‌’’ అని చేర్చింది.

రే బ్య్రాడ్బరీ (1920–2012) కథ ‘ద లాస్ట్‌ నైట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ సంక్షిప్త స్వేచ్ఛానువాదం ఇది. అనువాదం: సాహిత్యం డెస్క్‌. నిజంగానే ఆ యుగాంతం లాంటిది సంభవించనుందని మనుషులకు ముందే తెలిస్తే? ఈ కథ దీన్నే చిత్రిస్తుంది. ఇది మొదటిసారి 1951లో ప్రచురితమైంది. ఈ అమెరికన్‌ రచయిత చాలా చిన్నప్పుడే, తాను ఏదో ఒక కళలోకి ప్రవేశిస్తానని అనుకున్నాడు. పదకొండేళ్ల వయసు నుంచే రాయడం మొదలుపెట్టాడు. ఫాంటసీ, సైన్స్‌ ఫిక్షన్, హారర్‌ లాంటి రకరకాల జాన్రాల్లో గొప్ప కథలు రాశాడు. ఫారిన్‌హీట్‌ 451 ఆయన ప్రసిద్ధ నవల. 

రే బ్య్రాడ్బరీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top