మా అన్నయ్య పెళ్లిలో సందడి చేస్తాం

మా అన్నయ్య పెళ్లిలో సందడి చేస్తాం


‘‘ప్రభాస్‌ మాకు ఓన్‌ బ్రదర్‌ కాకపోయినా.. సొంత అన్నయ్యలానే అనుకుంటాం. హీ ఈజ్‌ రెబల్‌ స్టార్‌. మాకు కూల్‌ స్టార్‌’’ అంటున్నారు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ముద్దుల కుమార్తెలు ఈ ముగ్గురూ. పెదనాన్న కూతుళ్లను ప్రభాస్‌ ప్రేమగా చూసుకుంటారు. ప్రతి సంవత్సరం అన్నయ్యకు రాఖీ కడతారు చెల్లెళ్లు. సాయి ప్రకీర్తి చెప్పిన విశేషాలు...



ప్రభాస్‌గారు మీ ముగ్గురితో ఎలా ఉంటారు?

ఆదివారం ఫ్రెండ్‌షిప్‌ డే కదా. రాఖీ గురించి చెప్పే ముందు ఫ్రెండ్‌షిప్‌ డే గురించి చెప్పాలి. మా అన్నయ్య మాకు మంచి ఫ్రెండ్‌. మా ముగ్గురితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. బాగా టీజ్‌ చేస్తారు. నేనైతే ఉక్రోషం ఆపుకోలేక కొట్టేస్తుంటాను. మా అన్నయ్య తిరిగి కొడితే నేనెక్కడ? చెప్పండి. ఎంత కొట్టినా ఏమీ అనరు. నవ్వుకుంటూ ఉంటారు.



ఎలా టీజ్‌ చేస్తారు.. ఒక ఇన్సిడెంట్‌ చెబుతారా?

ఫర్‌ ఎగ్జాంపుల్‌ నాకు చాక్లెట్స్‌ చాలా ఇష్టం. నా ఫేవరెట్‌ చాక్లెట్‌ తింటూ కనిపించాననుకోండి లాగేసుకుని, తినేస్తారు. అప్పుడు నేను ఉక్రోషంగా ముఖం పెడితే నవ్వుకుంటారు.



మీ అన్నయ్యని ‘రు’ అని రెస్పెక్ట్‌ ఇచ్చి, పిలుస్తారా?

అవును. మా ఫ్యామిలీలో రెస్పెక్ట్‌కి ఇంపార్టెన్స్‌ ఇస్తాం. అన్నయ్యను ‘మీరు’ అంటాం. కోపం వచ్చినప్పుడు ‘మీరిలా చేయడం బాగాలేదు.. మీరు ఎందుకిలా చేశారు?’ అని రెస్పెక్ట్‌గా తిడుతుంటాం (నవ్వుతూ). భలే కామెడీగా ఉంటుంది. మా అన్నయ్య భలే కామెడీ చేస్తారు.

∙ప్రభాస్‌గారు కామెడీ చేస్తారా.. బయటివాళ్లకు రిజర్వ్‌డ్‌గా, బిడియంగా కనిపిస్తారు కదా.. అదంతా బయటివాళ్లకు. అన్నయ్య ఎవరికైనా క్లోజ్‌ అయితే చాలు.. చాలా ఫ్రీగా మూవ్‌ అవుతారు. జోక్స్‌ వేస్తారు.



మీ అన్నయ్యలో మీ ముగ్గురికీ నచ్చే విషయాలు?

అన్నయ్యను డైరెక్ట్‌గా నేనెప్పుడూ పొగిడింది లేదు. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి, అన్నయ్య ఎంత మంచివాడో చెప్పాలనిపిస్తోంది. గుడ్‌ హ్యూమన్‌ బీయింగ్‌. తనో స్టార్‌ అనే ఫీలింగ్‌ లేదు. నార్మల్‌గా ఉంటారు. ఏదైనా సరే ఓపెన్‌గా మాట్లాడతారు. ఫ్యామిలీ మెంబర్స్‌ గురించి బాగా పట్టించుకుంటారు. అంత కేరింగ్‌ బ్రదర్‌ ఉంటే ఎవరైనా లక్కీయే.



మీకు గిఫ్ట్స్‌ అవీ ఇస్తుంటారా?

ప్రతి సంవత్సరం రాఖీ కడతాం. ఏదో ఒక గిఫ్ట్‌ ఇస్తుంటారు. మా అక్క (సాయి ప్రసీద)కు కుక్కపిల్లలంటే ఇష్టం. తన బర్త్‌డేకి అన్నయ్య కుక్కపిల్ల కొనిచ్చారు. నాకు వాచ్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. మా బర్త్‌డే అప్పుడు ఎవరి బర్త్‌డే అయితే వాళ్లకి తెలియకుండా మిగతా ఇద్దరు సిస్టర్స్‌తో  కలిసి, ‘ఏం గిఫ్ట్‌ ఇస్తే బాగుంటుంది?’ అని డిస్కస్‌ చేసి, ఇస్తుంటారు. నగలు, బొమ్మలు.. ఇలా చాలా గిఫ్టులు ఇచ్చారు. షూటింగ్‌కి వేరే కంట్రీస్‌కి వెళ్లినప్పుడు కూడా మాకు గిఫ్ట్స్‌ తెస్తుంటారు.



మరి.. మీ ముగ్గురూ గిఫ్టులు ఇస్తుంటారా?

అన్నయ్య ఏది కావాలనుకుంటే అది కొనుక్కోగలరు. అందుకని ‘మెటీరియల్స్‌’ కొనిస్తే, మాకు పెద్దగా శాటిస్‌ఫేక్షన్‌ ఉండదు. అందుకే మా అంతట మేం ఏదైనా క్రియేట్‌ చేసి ఇవ్వాలనుకుంటాం. నాకు పెయింటింగ్స్‌ అంటే ఇష్టం. నేను గీస్తాను కూడా. అన్నయ్య ప్రతి బర్త్‌డేకీ తన బొమ్మ గీసి, గిఫ్ట్‌గా ఇస్తుంటాను.



మీకేమైనా సలహాలిస్తుంటారా?

బాగా చదువుకుంటున్నారా? అని అడుగుతారు. ‘మీరేం చేయాలనుకుంటే అది చేయండి. బట్‌ బెస్ట్‌గా చేయండి’ అంటుంటారు. అమ్మానాన్నలతో మా విషయాలు మాట్లాడుతుంటారు. వెరీ లవింగ్‌ అన్నయ్య.



మీ ఫ్రెండ్స్‌తో బాగా మాట్లాడతారా?

ఎప్పుడైనా షూటింగ్‌ స్పాట్‌కి తీసుకెళతాం. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అన్నయ్య డౌన్‌ టు ఎర్త్‌. ‘బాహుబలి’తో ఇమేజ్‌ బాగా పెరిగిపోయింది. అయినా ఎప్పటిలానే ఉన్నారు.



మరి.. మీ అన్నయ్య పెళ్లెప్పుడు?

ఆ ప్రశ్న మా అన్నయ్యను అడిగితే, దాటేస్తుంటారు. మాకు మాత్రం అన్నయ్య పెళ్లి ఫిక్స్‌ అయితే సందడి చేయాలని ఉంది. మా ఫ్యామిలీలో రెండు విషయాలకు ఇంపార్టెన్స్‌ ఇస్తాం. ఒకటి ఫ్యామిలీ, రెండోది ఫుడ్‌. అన్నయ్యకు పెళ్లి కుదిరితే ఫ్యామిలీ అంతా కలుస్తాం. వెరైటీ ఫుడ్‌ ఉంటుంది. సంగీత్‌లో డ్యాన్స్‌ చేయొచ్చు. ఫుల్‌గా ఎంజాయ్‌ చేయొచ్చు. మేమంతా ఆ ఎంజాయ్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నాం. అయితే అన్నయ్య సినిమాలతో బిజీగా ఉంటున్నారు కాబట్టి, పెళ్లి గురించి ఆలోచించడం లేదనుకుంటా!



సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి ,సాయి ప్రసీద

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top