పెరుమాళ్లపురం గారెల రుచే వేరయా...

Perumallapuram Sweets Special Story - Sakshi

ఫుడ్‌  ప్రింట్స్‌

వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలన్నారు పెద్దలు. అయితే తింటే పెరుమాళ్లపురం బెల్లంపాకం గారెలే తినాలి అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందాయి పాకం గారెలు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన ప్రాంతం సమీపిస్తుండగానే పెరుమాళ్లపురం బెల్లం పాకం గారెల ఘుమఘమలు పట్టి లాగేస్తుంటాయి. తెలుగు సంప్రదాయ వంటకాల్లో బూరెలకు, గారెలకు  ఒక ఆదరణ ఉంది. పూర్వం బూరెలు, బెల్లంగారెలే పెళ్లివారి విందులో ఉండేవి. అత్తారింటికి అల్లుడు వచ్చాడంటే బెల్లం గారెలతో స్వాగతం పలికేవారు. ఇప్పటికీ నైవేద్యాలలో, విందు భోజనాల్లోనూ బెల్లం పాకం గారెలదే మొదటి స్థానం. నోరూరించే ఈ పాకం గారెను ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి. ఆహా! ఆ మధురానుభూతే వేరు. ఓ హోటల్‌లో సాయం  సమయంలో యాదృచ్ఛికంగా వేసిన బెల్లం గారెలకు డెబ్బై ఏళ్ల చరిత్ర ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.

ఇదీ అసలు కధ
తూర్పుగోదావరిజిల్లా సముద్ర తీరప్రాంతంలో తొండంగి మండలం పెరుమాళ్లపురం గ్రామానికి చెందిన పేరూరి కన్నయ్య, అప్పయ్యమ్మ దంపతులు 1940 కాలంలో  పెరుమాళ్లపురంలో అప్పట్లో పుంతరోడ్డుగా ఉన్న రహదారిలో చిన్న కాకా హోటల్‌ నడిపేవారు. ఉదయం పూట ఇడ్లీ, సాయంత్రం పకోడి వేసేవారు. ఎప్పుడూ పకోడీలేనా అని అక్కడివారు అనడంతో అప్పయ్యమ్మ మినప్పప్పు రుబ్బి ఆ పిండితో గారెలు వేసి, బెల్లం పాకంలో వేసి వండటం ప్రారంభించింది. అవి ఎంతో రుచిగా ఉండటంతో అప్పయ్యమ్మ బెల్లంపాకం గారెలకు క్రమంగా మంచి పేరు వచ్చింది. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి పాకం గారెల అమ్మకం జోరుగా సాగేది. అప్పట్లో అణాకు నాలుగు గారెలు అమ్మేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పయ్యమ్మ హోటల్‌ నిర్వహణతోనే ఇద్దరు కుమారులు, కుమార్తెలను పెంచి పెద్ద చేసింది. అమ్మాయికి వివాహం కూడా చేసింది. ఆ తరవాత నుంచి అప్పయ్యమ్మకు కుమారులైన సత్యనారాయణ, సూర్యనారాయణలు సహాయపడేవారు. శుభకార్యాలకు ఆర్టర్లు వస్తే ఇంటిల్లిపాదీ కష్టపడేవారు. పెద్దవారు గతించడంతో ప్రస్తుతం చిన్న కుమారుడు సూర్యనారాయణ తన కుమారుడితో కలిసి బెల్లం పాకం గారెలు వ్యాపారం కొనసాగిస్తున్నారు. నిత్యం హోటల్‌లో అమ్మడంతోపాటు శుభకార్యాలకు అర్డర్లు వస్తే వండి పంపిస్తున్నారు. నాయనమ్మ ప్రారంభించిన బెల్లం పాకం గారెలను నేటికీ నాణ్యత తగ్గకుండా తండ్రి సూర్యనారాయణ, మనమడు రాంబాబులు షాపును నిర్వహిస్తున్నారు. పెరుమాళ్లపురం పాకం గారెలకు ప్రసిద్దిగాంచడంతో ఇటీవల కాలంలో వీరితోపాటు స్థానికంగా మరో రెండు కుటుంబాల వారు గారెలు వండటం ప్రారంభించి స్వయం ఉపాధి పొందుతున్నారు. కాగా అప్పయ్యమ్మ శతాధిక వృద్దురాలిగా 105 ఏళ్ల వయస్సులో 2019 జూలైలో  కాలం చేశారు.

రోజుకి 1000 నుంచి1200 గారెల అమ్మకం
కిలో మినపగుళ్లు రుబ్బగా వచ్చిన పిండి నూనెలో వేయిస్తే 150 వరకూ గారెలు తయారౌతాయి. ఈ గారెలకు నాలుగు నుంచి ఐదు కిలోల బెల్లం పాకం సిద్ధం చేస్తారు. అప్పయ్యమ్మ తమ హోటల్‌లో పాకం గారెల వ్యాపారం చేయడం ప్రారంభించేనాటికి కిలో మినప్పప్పు రూపాయిన్నర ఉండేదని, బెల్లం కిలో అర్ధరూపాయి ఉండేదని గతంలోకి అనుభవాలను పంచుకుంటారు. పాకం గారెలను ప్రతీరోజూ సాయంత్రం హోటల్‌లో వేడివేడిగా వండి అమ్ముతారు. గతంలో సాధారణ రోజుల్లో ఐదొందలకు పైగా అమ్మేవారు. ప్రస్తుతం డిమాండ్‌ పెరగడంతో నిత్యం 1000 – 1200 గారెలు తయారుచేసి అమ్ముతున్నారు.

రుచి చూసిన ప్రముఖులు...
దీర్ఘకాలం నుంచి పేరూరి అప్పయ్యమ్మ వేసిన బెల్లం పాకం గారెలు కోనసీమ ప్రాంతంలో పేరొందడంతో ఎవరైనా ప్రముఖులు ఈ ప్రాంతానికి వస్తే పెరుమాళ్లపురం బెల్లం గారెలను రుచి చూపించేవారు. సినీనటులు జమున, నందమూరి తారకరామారావు, చిరంజీవి, ఇంకా పలువురు సినీ, రాజకీయప్రముఖులు రుచి చూశారు. ఉభయగోదావరి జిల్లాలకు ఎవరైనా ప్రముఖులు వస్తే ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజా, కాకినాడ గొట్టం కాజాతో పాటు పెరుమాళ్లపురం బెల్లం పాకం గారెలు తీసుకెళ్లి రుచి చూపించడం ఆనవాయితీగా మారిపోయింది.

సామాజిక మాధ్యమాల రాకతో పెరిగిన డిమాండ్‌
పెరుమాళ్లపురం పాకం గారెలకు ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఇతర తెలుగు ప్రాంతాలలో కూడా ప్రాచుర్యం పొందాయి. ఇటీవలి కాలంలో వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగడంతో శుభకార్యాలకు అర్డుర్లు ఎక్కువయ్యాయని నిర్వాహకుడు పేరూరి రాంబాబు అంటున్నారు.
– పోతుల జోగేష్,తొండంగి మండలం, తూర్పుగోదావరి జిల్లా.

పేటెంట్‌ హక్కుల కోసంప్రయత్నిస్తున్నాను...
మా నాయనమ్మ డెబ్బై ఏళ్ల క్రితం నుంచి బెల్లం పాకం గారెలు వండి అమ్మడం ప్రారంభించింది. వృద్ధురాలు కావడంతో పాకం గారెల తయారీ నా తండ్రి సహకారంతో కొన్నాళ్లు మేమంతా నిర్వహించాం. ఆయన కూడా వృద్ధుడు కావడంతో పూర్తిగా గారెల తయారీని నేనే నిర్వహిస్తున్నాను. బెల్లం పాకం గారెలకు పేటెంట్‌ హక్కులతోపాటు, జియోగ్రాఫికల్‌ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాను.
– పేరూరి రాంబాబు,(పేరూరి అప్పయ్యమ్మ మనమడు)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top