పరి పరిశోధన

Periodical research - Sakshi

ఉపగ్రహాల మరమ్మతులకు డ్రోన్లు..
ఒకసారి కక్ష్యలోకి చేరిన తరువాత ఉపగ్రహాలు చెడిపోతే ఇక అంతే సంగతులు. వాటికి నీళ్లు వదులుకోవాల్సిందే. ఇకపై మాత్రం ఈ సమస్య లేదంటందోంది యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందని కంపెనీ ఒకటి. డ్రోన్ల సాయంతో అంతరిక్షంలోనే ఉపగ్రహాలను మరమ్మతు చేసేందుకు ఈ కంపెనీ వినూత్న పద్ధతిని ఆవిష్కరించింది మరి. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించినప్పుడు అవి నిర్దిష్ట కాలం మాత్రమే పనిచేస్తాయని అంచనా వేస్తారు. ఇంధనం ఖర్చయిపోవడం.. లేక ఉపయోగించిన పరికరాల్లో సమస్యలు రావడం వంటి కారణాలతో అవి కొంత కాలం తరువాత నిరుపయోగంగా మారిపోతాయి.

ఇంధనమైపోయిన ఉపగ్రహాలు నెమ్మదిగా జారిపోతూ భూమ్మీదకు పడిపోవడమూ కద్దు. ఈ నేపథ్యంలో ఎఫెక్టివ్‌ స్పేస్‌ అనే కంపెనీ కక్ష్యలోని ఉపగ్రహాల మరమ్మతుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇంకో రెండేళ్లలో అంటే 2020 నాటికి రెండు డ్రోన్లతో భూ స్థిర కక్ష్యలోని రెండు ఉపగ్రహాల్లో ఇంధనం నింపుతారు. ఫలితంగా అవి మళ్లీ పనిచేయడం మొదలుపెడతాయి. ఆ తరువాత తాము ఉపగ్రహ పరికరాల మరమ్మతు వంటివి కూడా చేపడతామని కంపెనీచ ఎబుతోంది. అంతరిక్షంలో పేరుకుపోతున్న ఉపగ్రహ వ్యర్థాలకు ఈ కొత్త పద్ధతి ఓ విరుగుడు అన్నమాట.

దోమలు మనల్ని గుర్తు పడతాయిట!
దోమలు ఎక్కువ కుడుతున్నాయని ఎవరైనా పిల్లాడు చెబితే.. నువ్వు స్వీట్‌ బాయ్‌వి రా అందుకే దోమలు నీపై మోజు పెంచుకున్నాయని అంటూ సరదాగా అంటూంటాం. అయితే ఇందులో వాస్తవం కూడా లేకపోలేదంటున్నారు వర్జీనియా టెక్‌ శాస్త్రవేత్తుల. మనుషుల తాలూకూ వాసనలను దోమలు గుర్తు పెట్టుకోవడం మాత్రమే కాకుండా.. ఎవరిని కుట్టాలన్న విషయంలో ఇష్టాఇష్టాలూ కలిగి ఉంటాయని క్లెమెంట్‌ వినాగర్‌ నేతత్వంలోని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు.

ఈడీస్‌ ఈజిప్టీ జాతి దోమలకు షాక్‌లు, ప్రకంపనల ద్వారా వాసనలు గుర్తు పెట్టుకునేలా చేసిన తరువాత  ఆయా వాసనలు చూపినప్పుడు దోమలు కొన్నింటిని ప్రత్యేకంగా ఎంచుకున్నట్లు ప్రయోగాల ద్వారా తెలిసింది. తమకు బాగా ఇబ్బంది కరమైన వాసనలను పట్టించుకోకుండా కొన్నింటిపై మాత్రమే మక్కువ చూపేందుకు వాటి మోదళ్లలోని డోపమైన్‌ అనే రసాయనం కారణమవుతోందని కెమెంట్‌ తెలిపారు. ఈ పరిశోధనల ఆధారంగా భవిష్యత్తులో దోమల నియంత్రణకు మరింత మెరుగైన పద్ధతులను అభివద్ధి చేయవచ్చునని ఆయన చెప్పారు. ఈడీస్‌ ఈజిప్టీ జాతి దోమలు డెంగీ మొదలుకొని జికా వైరస్‌ వరకూ అనేక వ్యాధి కారక సూక్ష్మజీవులను మనుషులకు అంటగడుతున్న విషయం తెలిసిందే.

మొక్కల కంటే.. చేపల ఒమేగా కొవ్వులు మేలు!
ఒమేగా –3 రకం కొవ్వులతో గుండెకు మేలు. కొన్ని రకాల కేన్సర్లను నివారించవచ్చు కూడా. అయితే వీటిని అవిశలు.. తదితర మొక్కల నుంచి కాకుండా చేపల ద్వారా తీసుకోవడం ఎక్కువ ఫలితాలిస్తుందని అంటున్నారు యూనివర్ఠిఈ ఆఫ్‌ గులెఫ్‌ శాస్త్రవేత్తలు. కేన్సర్‌ కణితుల పెరుగుదలను అడ్డుకునే విషయంలో చేపల నుంచి సేకరించే ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్లు మొక్కల కొవ్వుల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రభావశీలంగా ఉన్నట్లు తాము ప్రయోగాల ద్వారా తెలుసుకున్నామని అంటున్నారు ప్రొఫెసర్‌ డేవిడ్‌ మా! రెండు రకాల ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు కేన్సర్‌ నివారణకు ఉపయోగపడేవే అయినప్పటికీ దేని ప్రభావం ఎంతో నిర్ధారించేందుకు తాము ప్రయత్నించామని ఆయన చెప్పారు.

రొమ్ము కేన్సర్‌ కలిగిన ఎలుకలకు వేర్వేరు రకాల ఒమేగా 3 యాసిడ్లు అందించడం ద్వారా వారిలో కణితి పెరుగుదల ఎలా ఉందో చూశామని, మొత్తమ్మీద కణితుల సైజు 60 నుంచి 70 శాతం తగ్గగా.. సంఖ్య కూడా 30 శాతం వరకూ తగ్గిందని వివరించారు. ఒమెగా 3 యాసిడ్లు మొత్తం మూడు రకాలు కాగా.. ఆవిశగింజలతోపాటు సోయా, ఆవ నూనెల్లో ఉండే ఆల్ఫాలినోలెనిక్‌ యాసిడ్ల కంటే స్పిరులీనా వంటి నాచు, ఫైటోఫ్లాంక్టన్, చేపల్లో ఉండే ఈపీఏ, డీహెచ్‌ఏలు ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు తెలిసిందన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top