ఆవలి తీరం నుంచి సేవల సేద్యం కోసం

Organic farming by Foreign womans - Sakshi

మదర్‌ థెరిస్సా ఒక మాట అనేవారు. ‘మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు. కానీ చేసే పనులను గొప్ప మనస్సుతో చేస్తే అదే మనిషి ఔన్నత్యానికి కొలబద్ద అవుతుంది’ అని! ఈ మాటలు క్లోవీ ఎలిజిబెత్, హన్నారోస్‌లలో స్ఫూర్తిని  నింపాయి. ఆ స్ఫూర్తితో వాళ్లిద్దరూ గత ఏడాది  ఇండియా వచ్చి తిరువళ్లూరు సమీపంలోని ‘సేవాలయ’ ఆశ్రమంలోని వృద్ధులకు సేవ చేస్తున్నారు. విద్యార్థులకు  ఆంగ్లం  బోధిస్తున్నారు. అంతేకాదు, సేంద్రీయ పద్ధతులలో వ్యవసాయం చేస్తూ  రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు! క్లోవీ ఇంగ్లండ్‌ యువతి. హన్నారోస్‌ స్కాట్‌లాండ్‌ అమ్మాయి.

క్లోవి తండ్రి జాన్‌ పర్యావరణ పరిరక్షణ అధికారి. తల్లి శారా ప్లేస్కూల్‌ నడుపుతున్నారు. అలాగే ఇంగ్లండ్‌లో ఓ అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. తల్లి పోలికే కూతురికీ వచ్చింది. పెరిగి పెద్దవుతున్న కొద్దీ క్లోవీ కూడా సేవారంగం వైపు మళ్లారు. ప్లస్‌ వన్‌ స్టడీస్‌ ముగింపు సమయంలో క్లోవీ ఒక ప్రత్యేక ప్రాజెక్టు చేయాల్సి వచ్చింది. ‘ఆహార పదార్థాలలో విషాలు – తరచూ అనారోగ్యం’ అనే అంశంపై ప్రాజెక్టు చేయడానికి 2016లో స్కాట్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడ క్లోవీకి హన్నారోస్‌తో పరిచయం ఏర్పడింది.

పేరెంట్స్‌ని ఒప్పించారు: క్లోవీ, హన్నా ఇద్దరూ కలసి ఆహార పదార్థాలలో రసాయనాల కలుషితాలకు, విషతుల్యతకు కారణం ఏమిటన్న దానిపై బ్రిటన్‌లోని ప్రముఖ వైద్య పరిశోధకుల నుండి వివరాలు సేకరించారు. ఆహారధాన్యాలు,  కూరగాయల సాగులో రసాయన ఎరువుల వాడకమే అనారోగ్యాలకు ప్రధాన కారణమన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ పరిస్థితి  భారత్‌లోనే ఎక్కువగా వుందని గుర్తించారు.

ఇద్దరి ఆలోచన విధానం ఒకటే అవడంతో ఇంటర్‌ పూర్తయ్యాక దొరికే ఏడాది సమయాన్ని సేంద్రియ సాగు కోసం ఉపయోగించుకోవాలనీ నిర్ణయించుకున్నారు క్లోవీ, హన్నా. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పారు. ‘మంచి నిర్ణయమే’నని వారు ప్రోత్సహించారు. అయితే శారీరక శ్రమను,  భారత్‌లో తీవ్రంగా వుండే ఎండలను, ఇతర సమస్యలను వీళ్లు తట్టుకోగలరా అని సందేహించారు వారి తల్లిదండ్రులు. వ్యవసాయం చేయాలంటే మెళకువలు అవసరం.

ఏయే పంటలు ఎప్పుడు వేయాలి? ఎలాంటి ఎరువులు వేయాలి? అనే విషయంపై అవగాహన ఉండాలి. అదే అడిగారు  ‘‘పర్లేదు, తెలుసుకుంటాం’’ అన్నారు వీళ్లు. మొత్తానికి పేరెంట్‌ చేత ‘ఎస్‌’ అనిపించుకున్నారు. తర్వాత గూగుల్‌లోకి వెళ్లి వ్యవసాయానికి, పంటల సాగుకు, నిరాశ్రయులకు సేవ చేయడానికి అనువైన ప్రాంతంగా భారత్‌లోని ‘సేవాలయ’ను  ఎంపిక చేసుకుని గత సెప్టెంబర్‌లో తిరువళ్లూరు వచ్చారు. ఈ ఆగస్టు వరకు ఇక్కడే ఉంటారు.

సేంద్రియం రప్పించింది!: సేంద్రియ సాగు చేయాలన్న ఉద్దేశంతో మొదట సేవాలయకు వచ్చినప్పుడు క్లోవీ, హనా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వెంటనే  తమ పనులను పక్కా ప్రణాళికతో ప్రారంభించారు కూడా. మొదట  కూరగాయలను సాగుచేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనువైన కొంత భూమిని చదును చేసి బెండకాయ విత్తనాలను వేశారు. అయితే మరుసటి రోజే వర్షం పడడంతో విత్తనాలు కుళ్లిపోయి వారిలో నిరాశను మిగిల్చాయి.

‘విత్తనాలను విత్తుతూనే వుండండి. మొలిస్తే చెట్టు. లేకుంటే భూమికి ఎరువు’ అన్న సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్త నమ్మళ్వార్‌ మాటలు వారికి గుర్తుకు వచ్చాయి. వ్యవసాయం అనేది వ్యాపారం కాదు, జీవించడానికి వున్న ఒక మార్గం అని మాత్రమే అనుకుని మళ్లీ పొలం బాట పట్టాం. స్థానిక రైతులు, ఆన్‌లైన్‌లో వున్న సాగు పద్ధతులపై వున్న సమాచారాన్ని సేకరించి బెండ, చిక్కుడు కాయల విత్తనాలను వేశాను. ప్రతి మొక్కకు రెండు అడుగుల దూరం పాటించడం, సేంద్రియ ఎరువుల వాడకం, బిందు సేద్యం కోసం పైపులు ఏర్పాటు చేసి నీరు పారించడం వంటి పనుల్లో గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలని అనుకున్నారు. 

ఎలాగైనా పంటల సాగులో విజయం సాధించాలన్న  పట్టుదల వారిలో పెరిగింది. ‘‘విజయం పక్కనే ఓటమీ పొంచి వుంటుందన్న విషయం మాకు తెలుసు. అందుకే పంటల సాగు కోసం శారీరకంగా మానసికంగా సిద్ధం అయ్యాం. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం ఆరు గంటల నుండి పదిన్నర వరకు అరకపట్టి దున్నడం, భూమికి నీళ్లు పారించడం, కలుపు తీయడం, పాడి పశువుల బాగోగులు చూసుకోవడం మా దినచర్యలో భాగమైంది. సేద్యపు పనులు పూర్తయిన తరువాత ఆశ్రమానికి వచ్చి సేవ చేసి, సాయంత్రం మళ్లీ వ్యవసాయంలో నిమగ్నమయ్యేవాళ్లం’ అని వివరించారు క్లోవీ.


(గడ్డిమోపుతో  క్లోవీ ఎలిజిబెత్, హన్నారోస్‌)

‘సేవాలయ’ను మెప్పించారు: క్లోవీ, హన్నా.. నాట్లు వేసి మూడు నెలలు దాటింది. ప్రస్తుతం కూరగాయల పంట (వంకాయ, ఉల్లి, టమాటా వగైరా) చేతికి వచ్చింది. తాము వేసిన పంటల ప్రతిఫలాన్ని సంతృప్తి నిండిన కళ్లతో ఆపేక్షగా చూసుకుంటున్నారు. వాటిని ఆశ్రమంలోని చిన్నపిల్లల ఆహారానికి వినియోగిస్తున్నారు. ఇక్కడ నేర్చుకున్న సాగు పద్ధతులను తమ దేశాలకూ అందివ్వాలన్నదే వీరి లక్ష్యం. అక్కడి ప్రజలకు సైతం సేంద్రియ సాగు విధానాలపై అవగాహన కల్పించాలని వారి సంకల్పం.

భారత్‌లో సాగు పద్ధతులతో పాటు నిండైన వస్త్రధారణ, సంప్రదాయం, ఆహారపు అలవాట్లు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.. క్లోవీ, హన్నాలకు బాగా నచ్చిందట. ‘సేవాలయ’ కూడా వారి పనితీరుకు, పట్టుదలకు ముగ్ధురాలైంది! మనవాళ్లు విదేశీ మోజులో పడి, ప్రపంచ దేశాలకే ఆదర్శంగా వున్న భారతీయ సంప్రదాయానికి, వ్యవసాయ పద్ధతులకు తిలోదకాలిస్తున్న తరుణంలో..  ఈ విదేశీ యువతులు మన సంస్కృతికి, సంప్రదాయానికీ, సేంద్రియ సాగుకు ప్రాముఖ్యాన్ని ఇవ్వడం అభినందనీయం.

– కోనేటి వెంకటేశ్వర్లు, తిరువళ్లూరు (తమిళనాడు)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top