ఇక మగాళ్లూ పుట్టరు

No Girl Born In 132 Villages Of Uttarakhand In last Two Months - Sakshi

ఉత్తరాఖండ్‌.. ఉత్తరకాశీ జిల్లాలోని 
132 గ్రామాల్లో రెండు నెలలలో రెండువందల పదహారు మంది 
పిల్లలు పుట్టారు.. అందరూ మగశిశువులే!
యాదృచ్ఛికమా? కాకపోయుండొచ్చు.. 
ఆడపిల్లలను కడుపులోనే చంపేసి ఉంటారు.. అందుకే పుట్టలేదు!
కొన్నాళ్లయితే ఆడపిల్లలు ఉండరు.. 
అప్పుడు కాన్పులూ ఉండవ్‌.. మగాళ్లుండరు!
ఇక మగాళ్లూ పుట్టరు!!

ఒక ఊళ్లో ఒక కుటుంబం. నాలుగు తరాల కిందట ఆ ఇంట్లో ఇద్దరు ఆడపడచులుండేవారు. అయిదుగురు మగపిల్లలు. ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేసి పంపారు. ఆ తర్వాత ఆ ఇంట్లో జరిగిన శుభకార్యాలకు తప్ప ఆ ఆడపడచులను ఈ ఇంటికి పిలిచిందిలేదు.. మంచిచెడు, కష్టంసుఖం అడిగింది లేదు. ఆ తర్వాత తరంలో ఒక అమ్మాయి, ముగ్గురు మగపిల్లలు. ఆ అమ్మాయినీ అంతే.. పెళ్లి చేసి పంపితే మళ్లీ ఆమె మొహం చూసి ఎరిగినవారు కాదు ఈ కుటుంబ సభ్యులు. ఆ తర్వాత తరంలో అమ్మాయిలే పుట్టలేదు. ముగ్గురూ మగపిల్లలే. ఉన్న చోట సంబంధాలు కరువై కర్ణాటక, కేరళ అమ్మాయిలను చూసి పెళ్లి చేశారు వాళ్లకు. ఈ తరానికి ఆ కుటుంబంలో ఒకే ఒక్క మగపిల్లాడు పుట్టాడు. వంశానికొక్కడే అని అల్లారుముద్దుగా పెంచారు. బాగా చదివించారు. మంచి ఉద్యోగమూ వచ్చింది. చూడచక్కగా ఉంటాడు. పెళ్లి చేయాలని ఏడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇంకా అమ్మాయి దొరకలేదు. కుల పట్టింపులూ సడలించుకున్నారు. స్థానిక మ్యారేజ్‌ బ్యూరోలు.. మ్యాట్రిమోనీల్లో జల్లెడ పట్టి గాలించారు. ఆ అబ్బాయి తండ్రి, పెద్దనాన్న, బాబాయ్‌లకు చూసినట్టే కర్ణాటక, కేరళే కాదు.. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌దాకా వెళ్లారు. అయినా అమ్మాయి దొరకలేదు. రెండు తరాల కిందటి ఆ ఇంటి ఆడపడచుల సంతతిలో వరసైన ఆడపిల్లల గురించీ వాకబు చేశారు. వరుస సంగతి బ్రహ్మ ఎరుగు.. అసలు ఆ ఇళ్లల్లోనూ ఆడనలుసే లేదని తెలిసింది. ఇప్పుడు ఆ అబ్బాయికి 37 ఏళ్లు. ఆ ఇంటికి ఏ చుట్టమొచ్చినా.. వధువు గురించి ఆరా తీస్తారు. ‘‘ప్చ్‌..’’ అనే పెదవి విరుపే అవతలి వైపు నుంచి. ‘‘మా ఇళ్లల్లోనూ పెళ్లికాని అబ్బాయిలున్నారు. మీ ఇంటికి వచ్చిందీ వధువుల వేటలోనే’’ అనే సమాధానం అదనంగా! ఇది కథలాగా అనిపిస్తున్న వాస్తవం. ఇలాంటి కుటుంబాలు కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా కొన్ని వందల్లో ఉన్నాయి. 

దేశంలో ఎక్కడిదాకో ఎందుకు తెలంగాణలోనే బోలెడు ఉదాహరణలు. సిద్దిపేటలో ఇలాగే మూడు తరాలుగా ఒకే కొడుకు పుడుతూ వస్తున్న ఒక కుటుంబం (పేరు, వివరాలు గోప్యం)లోని అబ్బాయికి ఎక్కడా అమ్మాయి దొరక్కపోయేసరికి అతని 34వ యేట ఉత్తరప్రదేశ్‌లోని ఓ పేద కుటుంబం నుంచి పదిహేడేళ్ల అమ్మాయిని తెచ్చి పెళ్లిచేశారు. గర్భవతి అయింది. రక్తహీనతతో బాధపడుతూన్న ఆ అమ్మాయికి ఆరునెలలకే ప్రసవమైంది. మృతశిశువును కన్నది. ఆ తర్వాత రెండు నెలలకే ఆమె చనిపోయింది. మరో జిల్లాలో... 30 ఏళ్లు పైబడ్డ యువకుడికి బిహార్‌కు చెందిన అమ్మాయితో కులాంతర వివాహం చేశారు. ఆ అబ్బాయి పెళ్లయ్యేంత వరకు ‘‘ఏ కులం అమ్మాయి అయినా సరే.. మా వాడికి పిల్ల దొరికితే చాలు.. పెళ్లయితే చాలు’’ అనే రాజీ ధోరణిలో ఉన్న ఆ కుటుంబం.. తీరా పెళ్లయ్యాక కులం, సంస్కృతీ సంప్రదాయాల పేరుతో ఆ పిల్లను దెప్పడం మొదలుపెట్టింది. ఆ హేళన భరించలేక ఆ అమ్మాయి పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు ఉదాహరణల్లో ఆడపిల్ల పుట్టని కుటుంబాలే అవి. ఆ ఇళ్లకొచ్చిన ఆడపిల్లలూ అనారోగ్యంతోనో, బలవన్మరణంతోనో తనువు చాలించిన వాళ్లే. 

ఈ మొత్తం ప్రస్తావనలో.. ఆడపిల్ల లేదు.. అంటే తల్లిలేదు.. ఇంకా చెప్పాలంటే మళ్లీ వంశాంకురాలు పుట్టే యోగ్యంలేని ఇళ్లన్నమాట!  లాల్‌.. అనుకుంటున్నారా తేలిగ్గా? కాదు సీరియస్‌. ఈ వారం మొదట్లో అన్ని పత్రికల్లో ‘నో గర్ల్స్‌ విలేజెస్‌’గా అచ్చయిన ఒక వార్త దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం, ఉత్తరకాశీ జిల్లాలోని 132 గ్రామాల్లో రెండు నెలల్లో రెండు వందల పదహారు మంది శిశువులు పుడితే వాళ్లంతా మగపిల్లలే అనేదే ఆ న్యూస్‌. కేవలం మగపిల్లలే పుట్టడం కాకతాళీయం కాదు కదా? అంటే కడుపులో ఉన్నది మగబిడ్డో.. ఆడబిడ్డో తెలుసుకొని ఆడబిడ్డ అయితే అబార్షన్‌ చేయించుకుని కేవలం మగపిల్లలనే కని ఉండాలి అనేది అవగతమైన నిజం. అయితే తర్వాత దీని మీద ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాధికారులు సర్వే నిర్వహించి.. ఆ జిల్లాలో కేవలం 132 గ్రామాల డాటా మాత్రమే తీసుకున్నారని, ఏప్రిల్, జూన్‌ నెలల్లోనే మరో 129 గ్రామాల్లో ఒక్క మగ శిశువు లేకుండా 189 మంది ఆడపిల్లలే పుట్టారనీ సవరించారు.

సత్యదూరమా?
సరే.. వార్తలు... సర్వేలు.. సవరణలు పక్కన పెడితే కనిపిస్తున్న ప్రాక్టికాలిటీ మాత్రం నో గర్ల్స్‌ విలేజెస్‌ అన్న మాటకు సత్యదూరంగా లేదు. అబద్ధమే అయినా .. పరిస్థితి అక్కడిదాకా రాకుండా అలర్ట్‌ అవడంలో తప్పులేదు. 2015– 2017.. ఈ రెండేళ్లలో ప్రతి వెయ్యి మంది మగశిశువులకు ఆడశిశువుల సంఖ్య 896కి పడిపోయింది. 2019 ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారమైతే లింగ నిష్పత్తిలో 201 దేశాల్లోకి మనది 191వ స్థానం. యాభైఒక్క ఆసియా దేశాలతో పోలిస్తే మనది 43వ స్థానం. కాబట్టి మొదట్లో చెప్పుకున్న కథలాంటి వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి కదా ఈ లెక్కలు?! 

పరాయి పెరట్లో మొక్కకు నీళ్లు పోసి పెంచినట్లే!
ఎవరిని? మన ఆడపిల్లలను! అవును.. మగపిల్లలకు చదువు చెప్పిస్తే చాలు... జీతం, కట్నంతో పాటు వంశం పేరూ మిగులుతుంది. ఎన్ని లాభాలు? మరి అమ్మాయిల విషయంలో? చదువు చెప్పించి.. కట్నమూ ఇచ్చి పంపిస్తే ఇంకో వంశం పేరు నిలబెట్టే నలుసును కని ఇస్తుంది. అంటే పరాయి పెరట్లో మొక్కకు నీళ్లు పోసి పెంచినట్టు కాదా’’ అని అంటోందట మన దేశం! 2018లో ఐక్యరాజ్యసమితి ‘‘మిస్సింగ్‌ డాటర్స్‌’’ పేరుతో చేసిన అధ్యయనంలో తేలిన విషయం. ఒళ్లు గగుర్పొడిచే మరిన్ని నిజాలూ వెల్లడయ్యాయి. మెట్రో నగరాల్లోని చాలా న్యుక్లియర్‌ ఫ్యామిలీస్‌.. అసలు ఆడపిల్ల గర్భంలో పడకుండా.. ప్రినాటల్‌ సెక్స్‌ సెలక్షన్‌ అనే అడ్వాన్స్‌డ్‌ మెథడ్‌తో మగ శిశువే కడుపులో పడేలా చూసుకుంటున్నారట.

అన్‌వాంటెడ్‌ డాటర్స్‌
ఈ టెక్నాలజీ అందుబాటులో లేనివాళ్లు, తెలియని వాళ్లు, గ్రామీణులు, లింగ నిర్ధారణ పరీక్ష కఠినంగా అమల్లో ఉన్న ప్రాంతాల వాళ్లు పుట్టిన ఆడపిల్ల మీద ప్రతాపం చూపిస్తున్నారట. పురిట్లోనే పిల్లను చంపేయడం, లేదంటే తల్లిపాలను ఆపేయడం, సంరక్షణ చేయకపోవడం, టీకాలు వంటివాటిని వేయించకపోవడం, పడేయడం, బిడ్డలకు ఇన్‌ఫెక్షన్స్‌ సోకేలా చూడ్డం.. వీటి బారినపడి ఆ బిడ్డ ప్రాణం పోయేలా చేస్తున్నారట. అబార్షన్‌తో సహా ఇలాంటి రకరకాల కారణాలతో యేటా ఆరు లక్షల ఇరవైతొమ్మిదివేల మంది (పాత లెక్కలు) ఆరేళ్లలోపు ఆడపిల్లలు అసువులుబాస్తున్నారట. ప్రతి యాభై సెకండ్లకొక ఆడపిల్లను చంపుతున్నారట. ‘‘మొదటిసారి ఆడపిల్ల పుట్టి రెండోసారి ప్రెగ్నెన్సీలో ఆడపిల్లే ఉంటే అబార్షన్‌ అనివార్యం. మూడోసారి కచ్చితంగా కొడుకునే కనాలి’’ అని చెప్తుంది రస్సమల్‌ అనే సంప్రదాయ వైద్యురాలు. ‘‘కొడుకు పుట్టకపోతే అత్తింటి నుంచే కాదు సమాజం నుంచీ ఛీత్కారాలు తప్పవు’’ అంటుంది హరియాణాకు చెందిన ఒక ఉన్నత కుటుంబపు కోడలు. ‘‘ఫస్ట్‌ టైమ్‌ కూతురు పుట్టింది. రెండోసారీ కూతురే అని తేలింది. దాంతో అయిదో నెలలో అబార్షన్‌ చేయించుకోమని బలవంతపెట్టాడు మా ఆయన’’ అంటూ తన బాధను పంచుకుంది అహ్మదాబాద్‌కు చెందిన పూజా సలోట్‌. ఆమె భర్త పెద్ద పారిశ్రామికవేత్త. ఈ అబార్షన్ల బాధ భరించలేక అత్తింటి నుంచి బయటకు వచ్చేసింది ఆమె. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. 

వద్దు...
తమిళనాడుతోపాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరుసగా ఆడపిల్లలు పుడితే చివరి ఆడపిల్లలకు ‘వద్దు’ (వేండామ్, నహీ) అనే పేర్లు పెట్టే సంప్రదాయం ఉంది. అలా వేండామ్‌ అనే పేరున్న తమిళనాడు నారాయణపురంలోని ఓS అమ్మాయి ఇంజనీరింగ్‌ చదివి, ఒక జపనీస్‌ కంపెనీలో సంవత్సరానికి 22 లక్షల రూపాయల జీతంతో ఉద్యోగాన్నీ సంపాదించి ఆ పేరును వెక్కిరిస్తోంది. అందుకే మగపిల్లలే అనే పక్షపాతం వద్దు! ఇద్దరూ మన పిల్లలే అనే మమకారం కావాలి!  
...
ఆడపిల్ల.. బ్యాలెన్సింగ్‌ ఫీచర్‌ను ప్రకృతి నుంచి పొందిన ఏకైక శక్తి. అది అర్థం చేసుకోకుండా ఆడపిల్లా అని నొసలు చిట్లించి పుట్టకుండా చూస్తే పుట్టగతులే లేకుండాపోతాయ్‌. 

– సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top