స్త్రీలోక సంచారం

News about womens - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

♦  స్త్రీలకు ఇండియా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశమని లండన్‌లోని థాంప్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ వెల్లడించిన సర్వే ఫలితాలను ‘నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌’ చెయిర్‌పర్సన్‌ రేఖాశర్మా తిరస్కరించారు. ఆరోగ్య సంరక్షణ, వివక్ష, సంప్రదాయ ఆచారాలు, లైంగిక హింస, లైంగికేతర హింస, మానవ అక్రమ రవాణా అనే ఆరు ప్రధాన అంశాల ఆధారంగా జరిగిన ఆ సర్వేలో.. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తొలి ఐదు దేశాలు అంటూ..  స్త్రీలు అసలు నోరెత్తేందుకే వీల్లేని ఆఫ్గనిస్తాన్, సిరియా, సోమాలియా, సౌదీ అరేబియా సరసన, అదీ అగ్రభాగాన చేర్చడాన్ని రేఖాశర్మ ఖండించారు
♦   శాంతాదేవినాథ్‌ అనే 45 ఏళ్ల యాచకురాలు మరో ముగ్గురితో కలిసి యాచన చేస్తుండగా, వాళ్లంతా పిల్లల్ని ఎత్తుపోడానికి వచ్చినవాళ్లుగా వదంతులు వ్యాపించడంతో గ్రామస్తుల మూకుమ్మడి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. అహ్మాదాబాద్‌లోని వదాజ్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శాంతాదేవిని కాపాడేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమై, మార్గం మధ్యలోని ఆమె చనిపోయింది
♦   గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్‌ బార్డోలీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అధికారులు ప్రయాణికురాలైన ఒక గర్భిణిని మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేసిన ఘటనపై ‘సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌’ దర్యాప్తు ప్రారంభించింది. గర్భస్థ శిశువుపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున్న గర్భిణులను మెటల్‌ డిటెక్టర్‌లతో తనిఖీ చేయరాదనే నిబంధనను ఉల్లంఘించడంపై.. ఆమె భర్త వివరణ కోరడంతో ఈ దర్యాప్తు అవసరమైంది
♦   జ్యోతీబెన్‌ పోపావాలా అనే సూరత్‌ మహిళ తన ఎడమ కంటి సర్జరీ కోసం కొనుగోలు చేసిన ఇంట్రాక్యులర్‌ లెన్స్‌ లోపభూయిష్టంగా ఉండడంతో తను చూపు కోల్పోవలసి వచ్చిందని ఆ కంపెనీపై 2003లో కన్సూ్యమర్‌ ఫోరమ్‌లో వేసిన కేసులో.. ఒక ఏడాది ఆలస్యంగా అమె ఫిర్యాదు చేశారు కనుక పరిహారానికి అర్హురాలు కాదని కోర్టు తీర్పు చెప్పింది. తను ఒక ఏడాది ఆలస్యం చేశానని అంటున్న కోర్టు, పదిహేనేళ్లు ఆలస్యంగా ఈ తీర్పుని ఇవ్వడాన్ని జ్యోతీబెన్‌ సవాల్‌ చేసే పరిస్థితిలో అయితే లేరు
♦   ప్రస్తుతం జరుగుతున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సిమారియా నియోజకవర్గం పాలకపక్ష బీజేపీ ఎమ్మెల్యే నీలమ్‌ అభయ్‌ మిశ్రా తన సొంత పార్టీకి వ్యతిరేకంగా అసెంబ్లీలోనే ధర్నాకు దిగారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటున్నందుకు తన నియోజకర్గంలో పలుకుబడి కలిగిన మంత్రి తనపై పగబట్టి రేవా పోలీసుల చేత తనను, తన కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేస్తున్నా, పార్టీ పెద్దలు పట్టనట్లు ఉండిపోయారని ఆమె ఆరోపించారు
♦  తెలుగులో యువ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న మలయాళీ నటి అనుపమ పరమేశ్వరన్‌ తొలిసారి కన్నడంలో నటించబోతున్నారు. తెలుగుతో (ఆ, ప్రేమమ్, శతమానంభవంతి ఫేమ్‌) పాటు, తమిళం, మలయాళం చిత్రాలతో దక్షిణాదిన నటిగా మంచి పేరు తెచ్చుకున్న అనుపమ కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కపూర్‌ సరసన కథానాయికగా నటించబోతున్నారు
♦  మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవల పెంపుతోపాటు అదనంగా అనేక సదుపాయాలు కల్పించే ‘ప్రసూతిబిల్లు’ గత ఏడాది అమల్లోకి వచ్చినప్పటి నుంచీ చిన్న కంపెనీల్లో మహిళా ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోయినట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. కనీసం 10 లక్షల 80 వేల మంది మహిళా ఉద్యోగులకు లబ్ది చేకూర్చే ఆ బిల్లు కారణంగా కనీసం పది కీలకమైన రంగాలలో మున్ముందు మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది
♦  పెళ్లిలో తన  తొడికోడలు మేఘన్‌ మార్కల్‌లకు ఎంతో సహాయంగా ఉన్న కేట్‌ మిడిల్టన్‌.. చిన్న కోడలిగా మేఘన్‌ అంతఃపురంలోకి ప్రవేశించాక ఆమె పట్ల ఉదాసీనంగా ఉంటోందన్న వార్తలు బ్రిటన్‌ నుంచి వెలువడుతున్నాయి. మేఘన్‌ ఎంతో స్నేహంగా, సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కేట్‌ ముభావంగా ఉంటూ, రాజప్రాసాద సంప్రదాయాలపై ఆమెకు కనీస సలహాలు, సూచనలైనా ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారని బ్రిటన్‌ మీడియా కథనాలు వండివార్చుతోంది

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top