ఇంద్రజాలం  కాదు...  ఇంద్రియాల గురించి  తెలుసుకోవాలి!

Need to know about magic and not sensory - Sakshi

బౌద్ధవాణి

ఒక ధనవంతుడున్నాడు. అతనికి పెద్ద ఇల్లు ఉంది కానీ దానికి ఒకే ఒక ద్వారం ఉంది. అది శిథిలావస్థకి చేరింది. అతనికి ఆరుగురు సంతానం. అందరూ అభం శుభం తెలియని చిన్న పిల్లలే. వాళ్లు ఒకరోజు నట్టింట్లో ఆడుకుంటున్నారు. ధనవంతుడు ఇంటి బైట ఉన్నాడు. ఏదో మూలన ఆ ఇంటికి నిప్పు అంటుకుంది. మొదట్లో దాన్ని యజమాని గమనించలేదు.  అంతలో గాలి వేగం పెరిగింది. ఒక్క సారిగా నిప్పు చెలరేగి ఇంటిని చుట్టుముట్టింది. ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలకు అగ్గి గొడవే లేదు. వాళ్ల ఆటల్లో వాళ్లు మునిగిపోయారు. ఉన్న ఒక్క ద్వారం వైపు మంట పెరిగిపోయింది. యజమాని చూసి గబగబా ఇంటికేసి పరుగుతీశాడు. కిటికీలోంచి పిల్లల్ని ‘‘బైటకు రండి, ఇల్లు తగలబడిపోతోంది’’అంటూ గావుకేకలు పెట్టాడు.  పిల్లలు ఆ మాటలు విన్నారేగాని, ఆ మాటల్లో ఉన్న ప్రమాద సంకేతాన్ని గుర్తించలేకపోయారు. వారికి ఆ మాటలు అర్థం కాలేదు. రమ్మంటున్నాడు అని మాత్రమే అనుకుని, ఆటల్లో మునిగిపోయారు. పైగా ఇంటిపైన కనిపించే అగ్ని శిఖల్ని చూసి ‘‘భలే భ లే...’ అనుకుంటూ చప్పట్లు చరిచి ఎగిరి గెంతుతున్నారు. 

తండ్రి ఆలోచించాడు. ‘‘ఓ పిల్లలూ: మీ కోసం మంచి మంచి బండ్లు తెచ్చాను. గుర్రాలు లాగే బండి తెచ్చాను జింకలు లాగే బండి తెచ్చాను. మేకలు లాగే బండ్లు తెచ్చాను. ఆ బండ్లు ఎవరికి కావాలోచ్‌.. ముందు వచ్చిన వారికే ఆ బండ్లు ఇస్తాను’’ అన్నాడు.  ‘‘ఆ.. బండ్లా? నాకు కావాలి. నాకు కావాలి’’ అనుకుంటూ ఒకరికంటే ఒకరు ముందు రావాలి అనుకుంటూ క్షణంలో పరుగు పరుగున బైటకొచ్చారు.  ఈ కథ చెప్పి బుద్ధుడు – భిక్షూ! ఈ కథలో కాలిపోతున్న ఇల్లు మన జీవితం. కాల్చే అగ్ని తృష్ణ. నట్టింట్లో అడుకునే పిల్లలు ఇంద్రియాలు. వారు ఆడుకునే ఆటలు ఇంద్రియాల ద్వారా మనం పొందే తాత్కాలిక ఆనందం. దీనిలోంచి బైటపడే మార్గం– ధర్మమార్గం. బైట ఉన్న బండి ‘నా మార్గం’కాబట్టి బుద్ధ ధర్మమార్గంలో జ్ఞానివై దుఃఖాన్నుండి బైటపడు. ఇంద్రియాల్ని జయించు’’ అని చెప్పాడు. ఆ భిక్షువు బుద్ధునికి నమస్కరించి ధ్యానసాధన చేసి, జతేంద్రియుడయ్యాడు. 
– డా. బొర్రా గోవర్ధన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top