ఉద్యోగం కావాలా? ముస్తాబు చేస్తాం

ఉద్యోగం కావాలా? ముస్తాబు చేస్తాం


కొత్త సేవఅన్నదానం చేయడమే ‘సేవ’ కాదు... అందంగా తయారు చేయడం కూడా సేవగా పారిస్‌లో భావిస్తున్నారు. దీనులైన స్త్రీలను అందంగా ముస్తాబుచేసి వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.ఈ ఫొటోలు ఇక్కడివి కావు. పారిస్‌వి. నిన్న మొన్న తీసినవి. ఏం జరుగుతున్నట్టు ఇక్కడ? ఇదో బ్యూటీ సెలూన్‌. దీని పేరు ‘జోసఫైన్‌’. పారిస్‌లో ప్రస్తుతం నిరుద్యోగం తారస్థాయిలో ఉంది. డబ్బున్న వాళ్లకు పేదవాళ్లకు మధ్య అంతరం పెరిగిపోతోంది. స్త్రీలు, పురుషులు అక్కడ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ఉద్యోగం రావాలంటే మనిషి చక్కగా ఉండాలి. చక్కగా తయారవ్వాలి. ఇది మామూలు స్త్రీలకు పెద్ద కష్టం కాదు. కాని అక్కడ డిప్రెషన్‌ వల్ల, విడాకుల వల్ల, డ్రగ్స్‌కు బానిసలుగా మారడం వల్ల, జైళ్లకు వెళ్లిరావడం వల్ల తమ మీద తాము శ్రద్ధ కోల్పోయి అందవిహీనంగా తయారైన ఆడవాళ్లకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఎవరు ఇంటర్వూ్యలకు రానిస్తారు? అందుకని పారిస్‌లో ఉన్న జోసఫైన్‌ అనే ఖరీదైన బ్యూటీ పార్లర్‌ తన వంతు సేవచేయడానికి ముందుకు వచ్చింది.జీవితంలో దెబ్బ తిని తమ మీద తాము ఆసక్తి కోల్పోయి అవస్థ పడుతున్న ఆడవాళ్లకును టీ నీళ్ల ఖర్చుతో శ్రద్ధగా తయారుచేస్తూ ఉంది. అంతే కాదు వాళ్లు ఉద్యోగం కోసం ఇంటర్వూ్యలకు వెళ్ల దలిస్తే కనుక అందుకు అవసరమైన బట్టలు కూడా ఇచ్చి పంపుతోంది. ఈ చర్యతో వాళ్లు తమలో తాము ఆత్మవిశ్వాసం తెచ్చుకుంటూ ఉన్నారు. ధైర్యంగా తమ కాళ్ల మీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ‘వెన్‌ లైఫ్‌ ఈజ్‌ అగ్లీ... మేక్‌ ఉమన్‌ బ్యూటిఫుల్‌’ అనే నినాదంతో ఈ సెలూన్‌ పని చేస్తోంది. అంటే జీవితం కళావిహీనంగా ఉన్నప్పుడు రూపం కళాత్మకంగా మార్చుకోవడం అవసరం అని ఇది చెప్తోంది. ఫ్రాన్స్‌లోనే కాదు అమెరికాలో కూడా ఈ తరహా సామాజిక సేవ ఇటీవల జరుగుతూ ఉంది. ఇండియాలో ఎవరూ ఇంకా నడుం బిగించలేదు. ఆ పని ఇక్కడ కూడా మొదలైతే జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొనడానికి మన స్త్రీలు వెనుకంజ వేయరు. కదూ?

Back to Top