సహజ వాతావరణంతో మేలైన యోగా ఫలితాలు

Nature Yoga Best For Health Special Story - Sakshi

సహజ వాతావరణంతో మేలైన ఫలితాలు

న్యూఇయర్‌లో తీర్మానాన్ని గెలిపించుకుందాం

యోగాను అలవాటుగా మార్చుకోవాలంటున్న నిపుణులు

‘యోగా సాధన అనేది శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా అనుసంధానించి జరగాలి’ అంటారు రీనా హిందోచా. నగరానికి చెందిన ఈ యువ యోగా గురు విభిన్న రకాల యోగా పద్ధతుల్ని నగరానికి పరిచయం చేయడంలో పేరొందారు. అనేక రకాల పరిమితుల దృష్ట్యా యోగా శిక్షణ అనేది ప్రస్తుతం నగరంలో పలు ఇనిస్టిట్యూట్స్‌లో నాలుగు గోడల మధ్యే జరుగుతున్నప్పటికీ.. అవకాశం దొరికినప్పుడల్లా సహజసిద్ధమైన వాతావరణంలో ఆసనాలు, ధ్యాన సాధన చేయాలని ఆమె సూచిస్తున్నారు.  

సోషల్‌లో హల్‌చల్‌..  
ఈ ఆలోచనను ప్రమోట్‌ చేయడానికి ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న యోగాసనాల చిత్రాలు ఎంతో మందిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోల కోసమే ప్రత్యేకంగా తాను యోగా షూట్స్‌ ప్లాన్‌ చేస్తున్నానని ఆమె చెప్పడం విశేషం. గోవా, అనంతగిరి హిల్స్‌ల్లోని బహిరంగ ప్రదేశాలు, నగరంలోని స్టార్‌ హోటల్స్‌లోని ఓపెన్‌ టెర్రస్‌లు.. ఇలా విభిన్న ప్రదేశాల్లో ఆమె యోగా షూట్స్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి నిర్వహిస్తున్న ఈ షూట్స్‌ కోసం అంతే విభిన్నమైన, ఆసక్తిని పెంపొందించే ఆసనాలను ఆమె అందిస్తున్నారు.  

వేయాలి.. హెల్త్‌ టూర్స్‌..
గాలి, వెలుతురు, మంచి వాతావరణంలో యోగా సాధన చేయడం ద్వారా మనసు బాగా ఉత్తేజితమవుతుందని, మరింతగా ఆరోగ్య లాభాలు చేకూరుతాయని అంటున్న రీనా.. నగరంలో కుదరకపోయినా దీని కోసం హెల్త్‌ టూర్స్‌ పేరిట సమీప ప్రాంతాలకు ప్రత్యేకంగా ట్రిప్స్‌ ప్లాన్‌ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ముందుగా యోగా సాధన ప్రారంభించడం అత్యంత ప్రధానమని ఆ తర్వాత దానిలో మేలైన మార్పుల కోసం ఇలాంటివి అలవరచుకోవచ్చంటున్నారు. ఈ కొత్త సంవత్సరంలో ఆరోగ్య యోగాన్ని అందుకోవాలనుకుంటున్నవారు క్రమం తప్పక యోగా చేయడం ద్వారా సులభంగా తమ తీర్మానాన్ని అమలు చేసుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. సో మైడియర్‌ సిటిజన్స్‌.. స్టార్ట్‌ యోగా.. ఒంటికి మంచిదేగా!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top