ప్లాస్టిక్‌ భూతానికి చెక్‌పెట్టే నానో ఫిల్టర్‌!

nano filter for plastic - Sakshi

గుడికెళ్లినా..బడికెళ్లినా.. ఆఖరుకు సముద్రం లోపలికెళ్లి చూసినా కనిపించే సామాన్యమైన వస్తువు ఏదో తెలుసా? అవును.. మీ అంచనా నిజమే. ఆ వస్తువు పేరు ప్లాస్టిక్‌. ఈ కాలుష్య భూతానికి చెక్‌ పెట్టేందుకు స్వీడన్‌లోని కేటీహెచ్‌ రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఓ వినూత్నమైన ఆయుధాన్ని సిద్ధం చేసింది. కేవలం సూర్యరశ్మిని మాత్రమే వాడుకుంటూ నీటిలోని ప్లాస్టిక్‌ను విడగొట్టేయగల నానో ఫిల్టర్‌తో ప్లాస్టిక్‌ కాలుష్య సమస్యను పరిష్కరించవచ్చునని ఈ సంస్థ శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఓ సెమీ కండక్టర్‌ పదార్థం పూత పూసిన నానోసైజు తీగలతో తయారు చేసే ఈ ఫిల్టర్‌ సూర్యరశ్మి తాకగానే ఫిల్టర్, ప్లాస్టిక్‌ల మధ్య మార్పిడవుతాయి. ఈ క్రమంలో ప్లాస్టిక్‌ కాస్తా కార్బన్‌ డైయాక్సైడ్, నీరుగా విడిపోతుంది. ఈ ప్రక్రియ సహజసిద్ధంగా జరగాలంటే కొన్నేళ్లు పడుతుంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ నెలలోనే ఈ కొత్త టెక్నాలజీని పరీక్షించనున్నారు.

ఇళ్ల నుంచి బయటకువెళ్లే మురుగునీటి గొట్టాల్లో ఈ నానో ఫిల్టర్లను ఏర్పాటు చేస్తే నీటిలోని ప్లాస్టిక్‌ అక్కడికక్కడే నాశనమైపోతుందని... తద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జోయ్‌దీప్‌ దత్తా తెలిపారు. యూరోపియన్‌ ప్రాంతంలోని సముద్రాల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా దీన్ని స్వీడన్‌ పీపీ పాలిమర్‌ అనే సంస్థతో కలిపి అభివృద్ధి చేసింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top