రాణెమ్మ

ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తిమంతురాలైన చెస్ క్రీడాకారిణి ,  ఒకప్పటి హంగేరియన్ గ్రాండ్ మాస్టర్ జుడిత్ పోల్గార్ - Sakshi


మాధవ్ శింగరాజు



నైజల్ షార్ట్, గ్యారీ కాస్పరోవ్ ఇద్దరూ బద్ధ శత్రువులు. ఒకరు బ్రిటన్ గ్రాండ్ మాస్టర్. ఇంకొకరు రష్యన్ గ్రాండ్ మాస్టర్. ఆటలో శత్రుత్వం సహజమే కానీ, ఇప్పుడు ఒక విషయంలో మాత్రం ఈ ఇద్దరినీ ప్రాణ స్నేహితులు అనుకోవలసి వస్తోంది. చదరంగంలో రాణించడానికి అవసరమైన ‘లాజికల్ థింకింగ్’ స్త్రీలకు ఉండదట! ‘‘అబ్బే.. ఆడవాళ్లకు అంత బ్రెయిన్ ఎక్కడిదీ..’’ అని ఇద్దరిదీ ఒకే ఒపీనియన్. కాకపోతే నైజల్ ఈ మాటను ఇప్పుడు అంటున్నాడు. కాస్పరోవ్ ఎప్పుడో అనేశాడు. ఇద్దరూ ఇంచుమించు ఒక ఈడు వారు. 49, 52. ఇద్దరూ ఆట నుండి రిటైర్ అయినవారు. వేరే పనిలేక పోవడం వల్ల ఇలా అన్నారా అంటే అదీ కాదు. ఇద్దరికీ ఏవో వ్యాపకాలు ఉన్నాయి. నైజల్ చెస్ కామెంటేటర్, రైటర్. కాస్పరోవ్ రాజకీయ కార్యకర్త.



అప్పట్లో కాస్పరోవ్ చేసిన కామెంట్.. చెస్ క్రీడాకారిణులకు బాగా కోపం తెప్పించినట్లే, నైజల్ ఇప్పుడు చేసిన కామెంట్ కూడా ఆగ్రహం తెప్పించింది. ‘‘ఓహో.. అలాగైతే మరి జుడిత్ పోల్గార్ చేతిలో ఆ మగధీరుడు ఎందుకు ఓడిపోయినట్లో’’ అని లండన్ ‘క్యాజువల్ చెస్’ క్లబ్ లీడర్ అమందా రాస్ వెంటనే నైజల్‌కు ఒకటి అంటించారు. (జుడిత్ పోల్గార్ హంగేరియన్ గ్రాండ్ మాస్టర్. ఆమెతో జరిగిన ఎనిమిది మాచ్‌లలో నైజల్ మూడింట్లో ఓడిపోయాడు. ఐదు డ్రా అయ్యాయి. నైజల్ తన 19 ఏట గ్రాండ్ మాస్టర్ అయితే, జుడిత్ ఆయనకంటే చిన్న వయసులో 15 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ అయ్యారు).



 అమందా రాస్ అంటించిన ఈ చురక నైజల్ అహాన్ని దెబ్బతీసింది. ‘‘నా మాటల్ని అర్థం చేసుకునే బుర్ర కూడా లేదు నీకు’’ అన్నాడు రాస్‌పై ట్విట్టర్‌లో చికాకుపడుతూ. ఏం అర్థం చేసుకోవాలి నైజల్‌ను? మనలాంటి తెలివిమీరిన మగాళ్ల మాటల్ని అర్థం చేసుకోలేనంత తెలివితక్కువవాళ్లా ఆడవాళ్లు? ‘‘మగవాళ్లు బుద్ధిలో బలవంతులైతే, ఆడవాళ్లు ఎమోషనల్‌గా బలవంతులని చెప్పడం నా ఉద్దేశం. ఎక్కువ తక్కువల్ని పక్కన పెట్టి స్త్రీ పురుషులుగా మనకున్న వేర్వేరు బలాలను గౌరవించుకోలేమా?’’ అని అంతా విరుచుకుపడ్డాక ఇప్పుడు అంటున్నాడు నైజల్. అంతగా స్త్రీల ప్రత్యేక ప్రతిభల్ని గౌరవించే మనిషైతే - ‘‘చెస్‌లో ఎందుకింత తక్కువగా మహిళల సంఖ్య ఉంటోంది’’ అన్న ప్రశ్నకు సమాధానంగా మొదటే ఇలా అని ఉండాల్సింది. లాజికల్ థింకింగ్, మ్యాజికల్ థింకింగ్ అని నోరు జారకుండా. అప్పట్లో కాస్పరోవ్‌ది కూడా ఇదే మాట. ‘‘ఉమెన్ బై నేచర్ ఆర్ నాట్ గ్రేట్ ఫైటర్స్’’ అంటాడు కాస్పరోవ్!



ఎందుకిలా మనకు ప్రతిసారీ, ప్రతిచోటా ఆడవాళ్లను తీసిపారేయాలనిపిస్తుంటుంది? మనలో కొందరం అజ్ఞానంతోనో, అహంకారంతోనో ఏదో అంటుంటాం. జుడిత్ చేతిలో మూడుసార్లు పరాభవానికి గురైన అనుభవం ఉండి కూడా, స్త్రీల తెలివితేటల గురించి నైజల్ అంతమాట ఎలా అనేయగలిగాడు? ఆయన అభిప్రాయంలో మగాళ్లం.. బుద్ధిలో బలవంతులం కదా. అందుకే అలా అన్నాడా... వక్రించిన బుద్ధితో.

 ఆడవాళ్ల తెలివితేటల్ని ఒప్పుకోవలసి వచ్చినప్పుడు.. బై నేచర్ మగాళ్ల బుద్ధి మొరాయిస్తుందేమో అనిపిస్తుంది! చెస్ ఆటనే తీస్కోండి. ఆ గడులలో ‘రాణి’ (క్వీన్) మోస్ట్ పవర్‌పుల్. ముందుకీ, వెనక్కీ, మూలలకీ, నిలువుకీ, అడ్డానికీ ఎటైనా, ఎంత దూరమైనా వెళ్లొచ్చు. మిగతా బలాలకు అంత శక్తి ఉండదు. స్త్రీ ఏమిటి? యుద్ధం చేయడం ఏమిటి? ఆమెకు అన్ని అధికారాలేమిటి? అసలు అంత గొప్పతనం ఏమిటి అన్న ఫీలింగో ఏమో, క్వీన్‌ని మినిస్టర్‌గా మార్చేశాం! అందుకే చాలా దేశాల్లో ఇప్పటికీ ‘క్వీన్’ స్థానంలో ‘మినిస్టర్’ కనిపిస్తాడు. చదరంగంలో కేవలం ఒక పావుగా ఉన్న క్వీన్ గొప్పతనాన్నే భరించలేకపోతున్నామే, పావుల్ని కదిపి ప్రత్యర్థుల్ని ఒక ఆట ఆడించే చెస్ క్రీడాకారిణులను ఆ ఆటలో రాణులుగా అంగీకరించేంత బుద్ధిబలం మనకు ఉంటుందా?!

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top