పాపం దేవుడు గారు!

Munipalle Raju Story Papam Devudu Garu - Sakshi

కథాసారం

‘‘ఎబ్బే ఇదేమంత భాగ్యమండీ. ఐతే ఇంకోమాట. యిక్కడ పెన్సిలిన్‌ బొత్తుగా దొరకదు. మా యింట్లో రొండు ట్యూబులుంటే పట్టుకు చక్కావచ్చాను. పోతే, మనకు డిస్టిల్డు వాటర్‌ కావాలి. 
మన డాక్టరు దగ్గిరుంటుంది. ఫరవా లేదనుకోండి.’’
నేను వద్దో కుయ్యో మొర్రో అంటున్నా– ఆ జిల్లాకు ఆర్గనైజరుగా పంపించారు మా కంపెనీ వాళ్లు. కొత్త వూరు. పరిచయం వున్న మనుషులెవ్వరూ లేరు. ఇళ్లు మాత్రం కొల్లలుగా ఖాళీగా వున్నై– అసలు రొండో ప్రపంచ యుద్ధం జరగనట్టే. ప్లీడర్ల బోర్డులు గూడా అంతే. కోకొల్లలు.
వెళ్లిన వారం రోజుల్లోనే పెద్దవాడికి జ్వరం పెట్టుకొచ్చింది. మా ఆవిడ గంపెడు దిగులుతో మంచం పక్కనే కూర్చొని వంట ప్రయత్నం గూడా చెయ్యలేదు పొద్దుట్నించీ. ఎరిగిన ఆడ దిక్కు లేదు– యిల్లాలిని ఓదార్చేందుకుగాని, కాస్త తోడు కూర్చునేందుకుగాని.
దారిన పోతున్న ఒక మాష్టరు గారిని చూసి (ఆయన కళ్లజోడు చూస్తే పంతులుగారే అనితోచింది) ‘‘ఈ వూళ్లో మంచి డాక్టరెవరండీ?’’ అని వినయంగా అడిగాను. ‘‘మంచి చెడ్డలు నిర్ణయించటానికి మనమెవరండీ?’’ అని ఆయన ఎదురు ప్రశ్న వేసి ఆగకుండా సాగిపోయాడు.
మా ఆవిడ అన్నది: ‘‘ఈ నీళ్లు పిల్లలకు పడలేదు.’’
‘‘కావచ్చు’’ అన్నాను.
‘‘కావచ్చేమిటండీ కావచ్చు. నీళ్లు వట్టి ముదనష్టపు నీళ్లంటుంటే.’’
‘‘నిజమేనే. మరి పిల్లవాడికి నిమ్మళించాలంటావా, మీరు బయలుదేరి వచ్చిన దారినే వెళ్లేందుకైనా?’’
ఆవిడకు యీ మాటేమీ నచ్చలేదు.
అటువంటి సమయంలో ఆ బట్టతలాయన దేవుడల్లే యింటిముందు ప్రత్యక్షమైనాడు.
‘‘ఈ వూళ్లో వున్నది ముగ్గురే డాక్టర్లు. ఒకాయన గవర్నమెంటు డాక్టరు. ఇంకో ఆమె లేడీ డాక్టరు. మూడో ఆయనకు యీ తాలూకా తాలూకా అంతా ప్రాక్టీసే.’’
మీరు నమ్మండి నమ్మకపోండి, మేం యిద్దరం కలుసుకోగానే, ఆ అపరిచిత పెద్దమనిషి నన్ను ఆ విధంగా పలకరించాడు. మా పెద్దవాడికి జబ్బుగా వున్న సంగతి ఆయనకు దేవుడే చెప్పివుండాలి.
‘‘మరేం చేద్దామంటారు? తమరే ఆలోచించాలి. నేను బొత్తుగా కొత్తవాణ్ణి యిక్కడ.’’
‘‘తొందర పడవాకండి. ఆ మూడో ఆయన యిప్పుడు వూళ్లోనే వున్నాడు. గుర్రబ్బండిలో కూర్చోబెట్టి యిలా చక్కా వచ్చాను. ఇదుగో వస్తూండాలి.’’
ఆయనకు ధన్యవాదా లర్పించటం ఎట్లాగో తెలీలేదు.
‘‘మీరు దయామయులు’’ అని మాత్రం ఆయన చేతిలో లెదర్‌ పోర్టు ఫోలియోను చూస్తూ అనగలిగాను.
‘‘ఎబ్బే ఇదేమంత భాగ్యమండీ. ఐతే ఇంకోమాట. యిక్కడ పెన్సిలిన్‌ బొత్తుగా దొరకదు. మా యింట్లో రొండు ట్యూబులుంటే పట్టుకు చక్కావచ్చాను. పోతే, మనకు డిస్టిల్డు వాటర్‌ కావాలి. మన డాక్టరు దగ్గిరుంటుంది. ఫరవా లేదనుకోండి.’’
‘‘తమరికి పెన్సిలిన్‌ కావాలని డాక్టరుగారు చెప్పాడన్నమాట.’’
‘‘ఎబ్బే ఎంతమాట. ఆయన జ్వరానికిచ్చే మందేమిటో మనకు తెలుసు కదండీ.’’
ఇంతలో డాక్టరు వచ్చాడు. గుర్రబ్బండి దిగుతూనే ‘‘ఎవర్నయినా పెన్సిలిన్‌ కోసం పంపించాలే’’ అన్నాడు. వారింకా రోగిని చూడలేదు.
‘‘పిల్లవాణ్ణి చూచింతర్వాత––’’ అని కొంచెం నసిగిన మాట నిజమే.
‘‘ఎబ్బే ఎందుకండీ?’’ అని మా పాలిట దైవం వెంటనే అని, తోలు సంచీలోంచి పెన్సిలిన్‌ ట్యూబులు తీశారు పైకి.
మా పూర్వజన్మ సుకృతం వల్ల నైతేనేం, మా దేవుడిగారి పట్టుదల వల్ల నైతేనేం, డాక్టరు గారి మతిమరుపువల్ల నైతేనేం– పిల్లవాడికి నాలుగు రోజుల్లోనే జ్వరం తగ్గింది. మా ఆవిడ పథ్యం పెట్టిన మర్నాడే పుట్టింటికి తట్టాబుట్టా వేసుక ప్రయాణం. అంతా అకస్మాత్తుగా జరిగింది. వేరే పురుక్కు తెలీదు. కాని రైలు స్టేషనులో ఆ బట్టతల దేవుడు తిరిగి కన్పించాడు.
‘‘సుఖంగా వెళ్లిరండమ్మా.’’
ఆయనే కూలీలనూ మాట్లాడాడు. సామాన్లు ఎత్తించి అన్నీ సర్దారు. కాని థాంక్సు చెప్పాలన్నా నాకు సిగ్గు అడ్డం వచ్చింది.
‘‘బాబాయి గారూ, మీ వుపకారానికి మీ కడుపున బుట్టి రుణం తీర్చుకుంటానండీ’’ అని నా బదులుగూడా ఆవిడే అనేసి రైలు కదలిపోయింది.
నేను పెన్సిలిన్‌ డబ్బు యిస్తానంటే ఆయన ససేమిరా పుచ్చుకోలేదు. మీ బిడ్డ ఒకటీ, నా బిడ్డ ఒకటీనా అండీ అని నన్ను నిలవదీసి అడిగారు.
ఆ తర్వాత ఒక పక్షం రోజులకుగాని వారి పునర్దర్శనం కాలేదు.
మళ్లీ చిరునవ్వు. ఉపోద్ఘాతం లేని ఆ పలకరింపే.
‘‘కథలు రాస్తారుగదూ మీరు?’’
‘‘ఏదో కులాసాకొద్దీ. పెద్ద విశేషంగా గాదు లెండి.’’
‘‘కాని బహుపసందుగా రాస్తారండీ.’’
‘‘తమరు ఏ కథ చదివి అలా అనుకొన్నారో.’’
‘‘ఎబ్బే. మనకా అలవాటెప్పుడూ లేదు సుమా. ఏదో అనుకోగా వింటం.’’
అప్పట్లో నేను రాయగా రాయగా అచ్చయినది ఒక్కగానొక్క కథ. అదీ ప్రవాసాంధ్రులు నడుపుతున్న రాష్ట్రేతరాంధ్ర సోదరుల లిఖిత మాసపత్రికలో.
‘‘తమరు బృహస్పతులు’’ అని నేను కాంప్లిమెంటు చెయ్యకుండా వుండలేకపోయాను.
‘‘అది సరేగాని మాష్టరుగారూ. ఓ విషయం చెప్పాలని మరిచాను. ఇక్కడ ఖర్చులు జాస్తి, మీరా హోటల్లో భోంచేస్తున్నారు. కాస్టు ఆఫ్‌ లివింగ్‌ మండిపోతున్నది. పిల్లామేకా వున్నవాళ్లు. రేపంటూ వుండాలి.’’
మా ఆవిడే ఆ మాటలు విన్నట్లయితే యింకోసారి ఆయన కడుపున పుడతాననేది. నేను చౌకగా ‘‘చిత్తం’’ అన్నాను సగం విస్తుపోయి. ఎందుకంటే ఆ వూరంత చౌకవూరు యిదివరకు లేదు. ఇక వుండదు. ఏమిటా యీ దేవుడు యిలా అన్నారు అని నాలో నేను మధనపడ్డ మాట నిజం.
∙∙ 
అక్టోబరులో మా బంధువులింట్లో పెళ్లికి నేను వుత్తర జిల్లాలు వెళ్లవలసి వచ్చింది. సరిగ్గా కట్నాలు చదివింపుల వేళకి పెళ్లిపందిరి చేరగలిగాను. పర్సులో చెయ్యిపెట్టి చిన్ననోట్లను లెక్కించుకొంటుంటే, వెనకనించి ఎవరో తట్టారు భుజం మీద. వారే, ఆ బట్టతలే. ఆ దేవుడే.
‘‘స్వామీ.’’
‘‘అమ్మాయివాళ్లు గూడా పెళ్లికి వచ్చారు. కన్పించారా?’’
నిజానికి నా భార్య ఆడపెళ్లివారి వేపు బంధువు. నేను మగ పెళ్లివారి తరఫున ఆతిథ్యం తీసుకొంటున్నాను.
‘‘తమరికి మా బావగారు బంధువులా?’’ అని దేవుడిగార్ని ధైర్యంచేసి అడిగాను.
‘‘పాపం ఏదో శుభకార్యమనుకోండి మాష్టారూ. మీకు ఖర్చుల మీద ఖర్చులు తగులుతున్నై.’’
అడిగిన ప్రశ్నకు అది సమాధానం తెలిసిగూడా నేను నోరు మూసుకు కూచున్నా. అయినా వారి మేలు నేను యి జన్మలో మరువగలనా? కాని నా భార్య నన్ను సాగదీసి అడిగింది:  ‘‘ఆయన్ని గూడా మీరే తెచ్చారా ఏమిటి?’’
‘‘ఇది మరీ బావుంది. ఏ పాపపుణ్యం నేనెరగను’’అని నా నిరపరాధం నిరూపించుకున్నా ననుకోండి. అది వేరే సంగతి.
కట్నాల పందిట్లో మాయమయిపోయి మళ్లీ ఆయన భోజనాలయిం తర్వాత తాంబూలం వేసుకుంటుండగా తేలారు.
‘‘మాష్టారూ’’
‘‘స్వామీ’’
‘‘చిన్న విషయం. చిన్నవారు. వున్నదంతా ముందేవుంది. మీరో అయిదు వేలకు ఇన్సూరెన్సు పాలసీ పుచ్చుకోండి. మా కంపెనీకి తిరుగులేదు. 14 డివిడెండు. హేమాహేమీ డైరెక్టర్లు.’’ ఒరలో నుంచి కత్తి వచ్చినట్లుగా తోలుసంచిలోంచి ఆయన విజిటింగు కార్డు పైకివచ్చింది.
‘బి.బృహస్పతి, ఏజెంట్‌
కల్పవృక్షా ఇన్సూరెన్సు కంపెనీ.’
నేను మూర్ఛపోక తట్టుకొని, లాల్జీ జేబులోకి చేయి జొనిపి నా విజిటింగు కార్డు పైకి తీశాను.
‘–– ఫలాని ఫలాని
డిస్ట్రిక్టు ఆర్గనైజర్‌
కామధేను ప్రూడెన్షియల్‌ బీమా కంపెనీ లిమిటెడ్‌.’
ఆయన కళ్లవంక చూడలేక తల దించుకొన్నాను. తల ఎత్తేసరికి ఆయనక్కడ లేడు.
∙∙ 
పెళ్లిళ్లు చేయించి మా ట్రూపంతా నీళ్లు పడని ఆ వూరికే వచ్చి చేరాం. తలుపులకు తాళాలు తీయగానే కాళ్లకు కార్డు తగిలింది.
‘ఆర్గనైజర్‌ గారూ, నా చేతిలోంచి ఎవరూ తప్పించుకోలేదు. నేను చేసిన పొరపాటల్లా– మీరు మా వూరి హైస్కూలుకు కొత్తగా బదిలీ అయివచ్చిన ఇంగ్లీషు టీచరనుకోవటం– ఒక్కటే. అయితేనేం అది చాలు. బి.బృహస్పతి. బీమా ఏజెంటు.’
నో కామెంట్స్‌ ప్లీజ్‌– అన్నాను నా భార్యను చూసి. ఆమె చేయబోయే కామెంటరీ నాకు తెలుసు గనక.

మునిపల్లె రాజు (1925–2018) కథ ‘కొత్త సీసా– పాత మందు’ ఇది. తాత్విక, మేజిక్‌ రియలిజం కథల కథకుడిగా ముద్ర వున్న మునిపల్లె ధోరణికి భిన్నంగా ఇది హాస్య కథ. 1955లో అచ్చయింది. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన మునిపల్లె బక్కరాజు ఉద్యోగరీత్యా రక్షణ శాఖలో పనిచేశారు. అస్తిత్వనదం ఆవలి తీరాన, దివోస్వప్నాలతో ముఖాముఖి, పుష్పాలు–ప్రేమికులు–పశువులు ఆయన కథాసంపుటాలు. అలసిపోయినవాడి అరణ్యకాలు, వేరొక ఆకాశం వేరెన్నో నక్షత్రాలు ఆయన కవితా సంపుటాలు. ఆయన పూజారి నవల పూజాఫలంగా తెరకెక్కింది.


మునిపల్లె రాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top