కుంభవృష్టి

A Monsoon Date Shortfilm Special Story - Sakshi

వెబ్‌ఫ్లిక్స్‌

ఆగి ఆగి పడే వర్షం కుంభవృష్టి అయ్యి గుండెలోని బాధను కడిగేస్తుంది!

అంతా  నలుపు తెలుపే  కాదు.. ఏదీ అంతా క్లియర్‌గా  అర్థం కాదు! పవిత్రంగా  వచ్చే స్వచ్ఛమైన వాన చినుకు ఎక్కడ పుట్టింది? బూడిద రంగు మేఘంలో  పుట్టింది! ఆ చినుకు నదిలో పడితే..నది ఇంకొంచెం పవిత్రమవుతుంది. అదే చినుకు బూడిదలో పడితే వృధా పన్నీరవుతుంది! అంతా నలుపు తెలుపే కాదు.. ప్రేమ వర్షించడానికి ఆడా.. మగే కాదు! అలాంటి కథే ఇది..

వర్షం, రొమాన్స్‌ అద్భుతమైన జంట. ఈ రెండింటి మధ్య ఉన్న అనుబంధాన్ని సొంతం చేసుకోవాలని కోరుకొనేదెవరు? అలాంటి వానాకాలంలోని ఒక సాయంకాలం మలుపు తిప్పిన జీవితమే.. ‘ఎ మాన్‌సూన్‌ డేట్‌’!

ముంబై... సాయంత్రం వేళ..ఆకాశంలో మబ్బులు ముసురుకున్నాయి. కళ్లకు కాటుక.. పెదవులకు లిప్‌స్టిక్‌.. రింగురింగుల జుట్టును భుజాల మీద అలా వదిలేసి... క్రీమ్‌ కలర్‌ మీద లేత గులాబీ రంగు పూలను అద్దిన ఫ్రాక్‌.. హై హీల్స్‌... హ్యాండ్‌ బ్యాగ్‌తో ఒక అమ్మాయి .. పదేపదే చేతికున్న వాచ్‌ చూసుకుంటూ వెయిట్‌ చేస్తోంది క్యాబ్‌ కోసం. అందమైన ఆ అమ్మాయిని చూసిన ఆకాశానికీ ముచ్చటేసినట్టుంది.. మెరిసింది. ఆ మెరుపుకి తల పైకెత్తిన ఆ పిల్ల నుదురు మీద టప్‌మంటూ చినుకునూ జారవిడిచింది తన ముద్దులా! మేఘాలూ మురిసి కరిగాయి. ఆ వాన నుంచి తప్పించుకోవడానికి గొడుగును తెరిచింది ఆమె. ఈలోపు క్యాబ్‌ కూడా వచ్చేసింది. ఆమె ప్రయాణం మొదలైంది.

గతంలోకి..
తనకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఇలాగే ఉండాలనుకుంది. కాటుక కళ్లంటే ఇష్టం. కాళ్ల పట్టీలంటే పిచ్చి. చెవులకు జూకాలు.. రంగురంగుల గౌన్లు అంటే చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ రాత్రి అవే కలలు. అందంగా తయారై బీచ్‌లో ఆడుకుంటున్నట్టు. హఠాత్తుగా కారు ఆగేసరికి ఆమె జ్ఞాపకాలకూ బ్రేక్‌ పడింది. ‘‘కారు ఆపావేం?’’ అడిగింది డ్రైవర్‌ను. ‘‘ఇక్కడ ఇంకో జంట ఎక్కుతారు మేడం’’ జవాబిచ్చాడు డ్రైవర్‌.
‘‘అదేంటి? ఇది షేరింగ్‌ క్యాబా..?’’ అడిగింది అసహనంగా. ‘‘యెస్‌ మేడమ్‌!’’ డ్రైవర్‌. ‘‘నేను షేరింగ్‌ క్యాబ్‌ బుక్‌ చేశానా?’’ తనలో తానే సణుక్కుంది. నడివయసు దాటిన ఒక జంట ఎక్కారు. వెనక సీట్లో ఈ అమ్మాయి పక్కన ఆవిడ.. ముందు సీట్లో అతను. కారు కదిలింది. ఆవిడ వాక్ప్రవాహమూ స్టార్ట్‌ అయింది. ఆ జంట గమ్యం వచ్చేవరకు ఆవిడ మాట్లాడిన మాటల్లో.. వాళ్లమ్మాయికి పెళ్లి కుదిరినట్టు, అత్తిల్లు ఎలా ఉంటుందో.. భర్త ఎలా ఉంటాడో అన్న బెంగ బయటపడింది. ఆవిడ దిగుతుంటే చెప్పింది ఆమె.. ‘‘టెన్షన్‌ పడకండి.. అంతా మంచే జరుగుతుంది’’ అని. నవ్వుతూ బై చెప్పింది ఆవిడ. మళ్లీ కారు కదిలింది.

ఈసారి ఆమె టీనేజ్‌ కళ్లముందుకొచ్చింది..
 ఆమె యవ్వనం అణువణువూ స్త్రీత్వంతో నిండిపోయింది. మెదడు ఆజ్ఞాపించినట్టుగానే మారింది. ఆగ్రహించిన తల్లిదండ్రులను వదులుకుంది. ఒంటరిగా ముంబైకి చేరింది. ఉద్యోగం వెదుక్కుంది. స్థిరత్వం వచ్చాక.. జీవితానికి ఓ తోడు కావాలన్న ఆశ పుట్టింది. తనకేం తక్కువ? తనూ అందరి అమ్మాయిల్లా ఓ మగతోడుతో జీవితాన్నెందుకు పంచుకోకూడదు? కళ్లల్లో ఊరిన నీళ్లు మెదడును ప్రశ్నించాయి. అది సమాధానం ఇచ్చేలోపే ఆమెను చూసి ఇష్టపడ్డ అబ్బాయిలు పలకరించారు.

ఈసారి ఓ గుంతలో పడి ఆగిన కారు ఆమెను ఈ లోకంలోకి తెచ్చింది. ‘‘మళ్లీ ఏమైంది?’’ ఆమె ప్రశ్న. ‘‘వర్షానికి గుంత కనపడలేదు’ డైవర్‌ ఇచ్చిన జవాబుతో అప్పుడు బయటకు చూసింది. బోరున వర్షం. ముందు దారి కనిపించట్లేదు. ట్రాఫిక్‌ కూడా జామ్‌ అయింది. టైమ్‌ చూసుకుంది. ‘‘లేట్‌ అవుతుందేమో’’ అనుకుంది మనసులో. మెల్లగా ట్రాఫిక్‌ క్లియర్‌ అయింది. ఫర్లాంగు సాగి మళ్లీ కారు ఆపాడు డ్రైవర్‌. ‘‘ఇప్పుడు ఎందుకు ఆగింది కారు’’ అని ఆమె అడిగే లోపలే ఇద్దరు అమ్మాయిలు కారు ఎక్కారు. అర్థమైన ఆమె.. ఆ ఇద్దరికీ చోటివ్వడానికి విండో వైపు ఇంకాస్త జరిగి సర్దుకుంది. కారు స్టార్ట్‌ అయింది.

ఆమె పక్కనున్న అమ్మాయి ఏడుస్తోంది. ఆ పక్కనున్న స్నేహితురాలు ఆ పిల్లను ఓదారుస్తోంది. ‘‘ ఊరుకో.. బ్రేకప్‌ అయినంత మాత్రాన లైఫ్‌ ఉండదా?’’ అంటూ. ‘‘నేనెంత సపోర్ట్‌ ఇచ్చా వాడికి? నాతో గేమ్‌ ఆడాలని ఎలా అనిపించింది?’’ అంటూ కుమిలిపోతోంది హార్ట్‌ బ్రేక్‌ అయిన ఆ పిల్ల. ‘‘అనవసరంగా కన్నీళ్లు వేస్ట్‌ చేసుకుంటున్నావ్‌. నువ్‌ బాధపడేంత డిజర్వ్‌ కాదు వాడు. అంత సీన్‌లేదు వాడికి’’ అంటూ ఆ పిల్లను హత్తుకుంది. వాళ్లను చూస్తుంటే ఆమెకు తన పాస్ట్‌ గుర్తొచ్చింది. ఏడుస్తున్న అమ్మాయి భుజం నొక్కింది ఆమె.. ధైర్యమిస్తున్నట్టుగా. నిజానికి తను ధైర్యం కూడదీసుకుంటోంది ఆ పిల్ల ఆసరాతో. కర్చీఫ్‌తో ముక్కు తుడుచుకుంటున్న ఆ అమ్మాయి.. ఈమె వంక చూసి మళ్లీ బోరుమంది. ఈలోపు వాళ్ల స్టాప్‌ రానే వచ్చింది. వాళ్లు కారు దిగి డోర్‌ వేస్తుంటే విండోలోంచి వంగి చెప్పింది ఆమె ‘‘డోంట్‌ వర్రీ.. ఎవ్రీ థింగ్‌ విల్‌ బీ ఓకే’’ అని. ‘‘థాంక్యూ’’ చెప్పి వెళ్లిపోయారు.

కారు కదిలింది ఆమె గమ్యం వైపు..
నెల రోజులుగా డేటింగ్‌ చేస్తున్న అబ్బాయి తనంటే ఇష్టమని చెప్పాడు. అతనికి ఈ రోజు తన గురించి నిజాలు చెప్పబోతోంది. బయట వర్షం... తన మనసులో ఆలోచనల తుఫాను. జరగబోయే దానిమీద స్పష్టత ఉంది తనకు. అయినా ఒక ఆశ... ఈదురు గాలికి రెపరెపలాడుతున్న చిగురుటాకులా. గతం తిరిగి వర్తమానం తలుపు తట్టింది. తనతో సీరియస్‌గా డేటింగ్‌ చేసిన ఇద్దరు అబ్బాయిలతో ఎదురైన అనుభవాలు ఒకలాంటి నిరాశను.. నిస్పృహను కలిగించాయి. అలజడి పెరిగింది. ఆ ఇద్దరు తన గురించి చెప్పిన నిజం విని.. చీదరించుకున్నారు. ఆ తిరస్కార చూపులు మళ్లీ ఇప్పుడు ఎదురైతే తను తట్టుకోగలదా? వద్దంటాడని భయమా? తన అస్తిత్వం పట్ల తనకే భయమా? చిన్నప్పటి నుంచీ కనిపిస్తున్న నిజం కంటే మెదడు చెప్పిన సత్యాన్నే ఒంటబట్టించుకుంది. తను ప్రాక్టికల్‌గా ఉన్నట్టా? లేనట్టా? ఎవ్వరైనా మెదడు సూచనలనే కదా పాటిస్తారు! తనూ అంతే కదా! మరి తననెందుకు గుర్తించట్లేదు? తనకో మగతోడు కావాలనే తపనను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? తననెంతగానో ప్రేమించి, ప్రాణం పెట్టిన బాయ్‌ ఫ్రెండ్స్‌.... తన గురించిన నిజం చెప్పగానే ఎందుకు రిజెక్ట్‌ చేశారు? నిజం ఎప్పుడూ భయంకరంగానే ఉంటుందా? తన బాల్యంలా? కానీ అబద్ధంతో సహజీవనం ఎంతకాలం సాగుతుంది? తనకు నిజమైన తోడు కావాలి.. జీవితాంతం ఉండే తోడు. తనను తననుగానే ఇష్టపడే.. ప్రేమించే తోడు కా...వా...లి...!

కారు ఆగింది. ఉలిక్కి పడింది ఆమె.
‘‘మేడం.. బ్రేక్‌ డౌన్‌ అయింది’’ చెప్పాడు డ్రైవర్‌. వాచీ చూసుకుంది. అతను వచ్చి ఉంటాడు. కారు దిగింది. ‘‘మేడం.. ఇంకో క్యాబ్‌ అరేంజ్‌ చేస్తా’’ అని డ్రైవర్‌ అంటూండగానే ‘‘అక్కర్లేదు’’ అంటూ అతనికి డబ్బులిచ్చేసి ఆటో మాట్లాడుకుని గమ్యం చేరుకుంది. ఒక నిర్ణయానికి వచ్చినదానిలా ఆటో దిగింది.

కాఫీ డే.. ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ఆమెకు లోపలున్న అతను కనిపించాడు. ఆమెను చూసిన అతని కళ్లల్లో ఆత్రం. వడివడి అడుగుల రూపంలో ఆమె దగ్గరకు చేర్చింది అతణ్ణి. ‘‘అయ్యో తడిసిపోయినట్టున్నవే’’ అంటూ జేబులోంచి రుమాలు తీసి తల తుడిచాడు. ఇబ్బంది పడుతూనే టేబుల్‌ దగ్గరకు నడిచింది ఆమె. అనుసరించాడు అతను. ఎదురెదురుగా కూర్చున్నారిద్దరూ. కాఫీ ఆర్డర్‌ చేసి చిలిపిగా చూశాడు ఆమె కేసి. గొంతు సవరించుకుంది ఆమె. ‘‘ఇప్పుడు నేను చెప్పబోయేది విని.. నీకు నచ్చకపోతే.. ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఇక్కడి నుంచి వెళ్లిపో ప్లీజ్‌’’ అంది ఆమె. ‘‘ఏం చెప్పబోతున్నావ్‌’’ అడిగాడు కొంటెగా. ‘‘నా గురించి’’ అంది ఆమె. ‘‘కొత్తగా తెల్సుకోవాల్సిందేముంది?’’ అన్నాడు అదే కొంటెతనాన్ని కంటిన్యూ చేస్తూ! జవాబుగా పెదవులు విడవడకుండానే నవ్వుతూ తన హ్యాండ్‌ బ్యాగ్‌ లోంచి అయిదేళ్ల బాలుడి ఫోటో తీసి చూపించింది అతనికి. ‘‘వావ్‌! సో క్యూట్‌.. ఈ పిల్లాడెవరు?’’ అడిగాడు ఆ ఫొటోని చేతుల్లోకి తీసుకుంటూ. ఏమీ మాట్లాడకుండానే ఆమె... పదకొండేళ్ల పిల్లాడి ఫొటో తీసి చూపించింది. ‘‘హేయ్‌.. వీడూ భలే ఉన్నాడే! ఎవరు?’’ అతను అదే ఉత్సాహంతో. అతని కళ్లల్లోకి చూస్తూ చెప్పింది ఆమె ‘‘నేనే’’ అని. అతని మొహంలో నవ్వు కంగారు పడింది.. ‘‘ఏంటీ’’ అన్న ప్రశ్నగా మారింది.
 ‘‘అవును.. నేనే’’ స్థిరంగా చెప్పింది ఆమె. ‘‘అంటే నువ్వు.. నువ్వు’’ ఆగిపోయాడు అతను. బదులుగా ఆమె కళ్లల్లో నీళ్లు. క్షణం స్థాణువయ్యాడు అతను. మరుక్షణానికే తేరుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆమె మనసులో చెలరేగిన తుఫాను ఆగిపోయింది. దుఃఖం పొంగకుండానే మనసు స్థిమిత పడింది. మెదడు తన రెక్కల్ని రెపరెపలాడించింది. ఆమె... ఆమెకు అర్థమైంది సంపూర్ణంగా. ఆమె... ఆమెను ఇష్టపడింది మనస్ఫూర్తిగా! ఆమెకు తోడుగా ఆమె ఉంటానంది జీవితమంతా! స్త్రీగానే తన ఉనికి! ఎవరు ఆమోదించినా ఆమోదించకపోయినా తను గౌరవించుకుంటుంది. ఆ స్త్రీత్వాన్ని తను కోరుకుంటుంది.. ఏ పురుషుడు కోరుకున్నా.. కోరుకోకపోయినా! చిరునవ్వుతో బయటకు నడిచింది ఆమె!

ఇదీ..‘ ఎ మాన్‌సూన్‌ డేట్‌’ అనే ట్రాన్స్‌ ఉమన్‌ స్టోరీ. ఇరోస్‌నౌలో స్ట్రీమ్‌ అవుతున్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు తనూజా చంద్ర దర్శకత్వం వహించారు. గజల్‌ ధాలివాల్‌ కథనందించారు. నిజానికి ఇది రచయిత గజల్‌ ధాలివాల్‌ జీవితమే. ట్రాన్స్‌ ఉమన్‌ పాత్రలో కొంకణ్‌ సేన్‌ శర్మ నటించారు.– సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top