కళాధర్మం

mohan babuspecial interview - Sakshi

కళలకు కారకుడు కళాకారుడు... కళను అభ్యసించేవాడు కళాసాధకుడు. కళను ఆరాధించేవాడు కళాత్మకుడు... కళను పోషించేవాడు కళాభిలాషి. కళను ప్రేమించేవాడు కళాభిమాని. ప్రతి కళకు ఒక ధర్మం ఉంటుంది. ప్రవేశించిన ప్రతి కళలోనూ ఆ ధర్మాన్ని నెరవేర్చారు... మోహన్‌బాబు.

ఈ మధ్యే ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిధానానికి ఛైర్మన్‌ అయ్యారు.. ముందుగా దేవుడి గురించి రెండు మాటలు..
ఛైర్మన్‌ అనే పదం ఇక్కడ వాడలేను. దైవ సన్నిధానం ‘బాధ్యతలు’ అంటాను. చాలామంది మిత్రులు ‘ఈ బాధ్యత మీరు చేయాల్సిందే’ అని నా గొంతు మీద కూర్చున్నారు. అందుకని ఒప్పుకున్నాను. సినిమాలు, ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌.. ఇంకా చాలా పనుల మధ్య ఈ కొత్త బాధ్యత అంటే కష్టమే. ఇన్నేళ్లల్లో నేను ఒక గుడి బాధ్యతలు తీసుకోవాలని అనుకోలేదు. ఏ ఆలయమైనా ఒకటే.

‘దేవుడు ఇందుగలడు అందు లేడనే సందేహం లేదు. ఎందెందు వెతికినా అందందే గలడు’ అన్నట్లు ఇక్కడ పద్ధెనిమిది మంది దేవుళ్లు ఉన్నారు. కమిటీలతో గుడి పనులు మొదలుపెట్టాం. గుడిని శుభ్రంగా ఉంచాలని, లడ్డూ, పులిహోర వంటి ప్రసాదాలను భక్తులకు శుచిగా అందించాలనే దిశగా పని చేస్తున్నాం. మన ఇంట్లో మన తల్లి, మన భార్య ఎంత శుభ్రంగా, రుచికరంగా చేస్తారో అలా చేసి భక్తులకు పెడదామనుకున్నాం.
నటుడిగా 42 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇన్నేళ్లల్లో ఏదైనా క్యారెక్టర్‌ చేయడానికి కష్టపడటం కానీ ముందుగా హోమ్‌ వర్క్‌ చేసిన ఇన్సిడెంట్‌ కానీ ఉందా?
ఎప్పుడూ హోమ్‌వర్క్‌ చేయలేదు. చేయను కూడా. ముందు పాత్ర స్వభావాన్ని తెలుసుకుంటాను. కథ వింటాను. లొకేషన్‌లో డైరెక్టర్‌ చెప్పేవన్నీ శ్రద్ధగా వింటాను. డైలాగ్స్‌ని మాత్రం గురువుగారు దాసరిగారు ఒకలా, రాఘవేంద్రరావుగారు మరోలా, బాపుగారు ఇంకోలా చెప్పించేవారు. ఈ ముగ్గురి శైలీ మిగతా దర్శకులందరికీ ఇష్టం. మిగతావాళ్లంతా క్యారెక్టర్‌కి తగ్గట్టు చెప్పించేవారు.

దేశం గర్వించదగ్గ దర్శకులు మన దగ్గర ఉన్నారు. కానీ, నేటి తరం ఆ దర్శకులను గుర్తించడం లేదు. బాపుగారు ఎవరు? అని అడుగుతున్నారు. తల్లిదండ్రులను కూడా మరచిపోయే స్థితిలో ఉన్నారు. యుగం వేగంగా వెళుతోంది. అందరూ పరిగెడుతున్నారు. మాములుగా కాదు. చేతిలో ఆరేడు ఫోన్లు పట్టుకుని పరిగెడుతున్నారు. తలెత్తుకున్నవాళ్లను చూడలేకపోతున్నాం. తలదించుకుని సెల్‌ఫోన్స్‌లో మునిగిపోతున్నారు.
 

కొందరైతే సెల్ఫీలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా యూత్‌కి ఏదైనా సందేశం?
సెల్‌ఫోన్‌ తప్పని అనను. ఎందుకంటే నేనూ వాడుతున్నాను. అయితే నేను చేతిలో ఫోన్‌ పెట్టుకుని ట్రావెల్‌ చేయడాన్ని ఇష్టపడను. జేబులో పెట్టుకుంటాను. లేదా బ్యాగ్‌లో పెట్టుకుంటాను. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాను. కాల్‌ వస్తే తీస్తాను. అంతే. కానీ ఇప్పుడు ఫోన్‌ లేని చేతులను దాదాపు చూడలేం. టెక్నాలజీని సక్రమంగా  వాడుకోవాలి.

ఇవాళ సలహాలిస్తే వినేంత తీరిక ఎవరికీ లేదు. భేషజాలకు పోతున్నారు. అప్పట్లో చేతిలో సిగరెట్‌ పెట్టె, సిల్క్‌ చొక్కా వేసుకుని, వంద నోటు జేబులో కనిపించేలా పెట్టుకుని, దాని వెనకాల వైట్‌ పేపర్లు పెట్టుకునేవాళ్లు. అది ఆర్టిఫియల్‌ లైఫ్‌. ఇప్పుడు సెల్‌ఫోన్లు, కార్లు.. అవి ఓ ‘స్టేటస్‌’ అయిపోయాయి. చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అది తప్పు.

మీరు ఎక్కడైనా కనపడితే ‘సెల్ఫీ’ అడుగుతుంటారు కదా.. అప్పుడేమనిపిస్తుంది?
ఆలస్యం అయినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో హడావిడిగా వెళుతుంటాం. ఇంతలో ఒక అభిమాని వచ్చి ‘సార్‌ సెల్ఫీ’ అంటాడు. ఫ్లైట్‌కి టైమ్‌ అవుతుందంటే ‘కోపం’ అంటారు. పోనీ ఒకరికి ఇస్తే.. ఇంకొకరు తయారవుతారు. ఆ అభిమానం నాకు ఇష్టమే. మీ (ఫ్యాన్స్‌ని ఉద్దేశించి) అభిమానానికి మీ పాదాలకు నమస్కారం.

కానీ సమయం, సందర్భాన్ని వాళ్లు అర్థం చేసుకోవాలి. ఆ సంగతలా ఉంచితే అభిమానులు చూపించే ప్రేమ అంటే ఇష్టమే. వాళ్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అందుకే కొందరి అభిమానుల బిడ్డలను చదివించాను. వాళ్లు ప్రయోజకులయ్యారు. ఇంకొంతమందిని చదివిస్తున్నా.

వంద రూపాయల నోటు వెనకాల వైట్‌ పేపర్‌ పెట్టుకుని కొందరు భేషజాలకు పోయేవారన్నారు. ఒకప్పుడు మీకు ఆర్థిక కష్టాలుండేవి. అవి బయటకు తెలియనివ్వకుండా మీరూ అలా చేసిన సందర్భాలున్నాయా?
లేదు. ఎందుకు చెప్పాలి నేను డబ్బున్నవాడినని? ఎందుకు చెప్పాలి? నేను డబ్బు లేనివాడినని. పోనీ చెబితే ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా. మహా అయితే ఒక పూట భోజనం పెడతారు. రెండో పూట పెడతారా? పెట్టరు కదా. అలాంటప్పుడు నా విషయాలు ఎందుకు చెప్పాలి? నా దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నట్లు ఎందుకు నటించాలి? ఉన్నా లేన్నట్లు ఎందుకు నటించాలి?

అవునూ... ఇక్కడ వంద రూపాయల నోటు ఉన్న మూడు ఫ్రేములు కనిపిస్తున్నాయే.. ఆ నోట్ల స్టోరీ ఏంటి?
ఒకటి మా అత్తగారు ఇచ్చిన నోటు. ఇంకోటి మనోజ్‌ ఫస్ట్‌ సాలరీలోని వంద రూపాయల నోటు. మరోటి లక్ష్మీకి వాళ్ల అమ్మమ్మ ఇచ్చిన నోటు అనుకుంటా. గుర్తుగా ఫ్రేమ్‌ కట్టించి పెట్టాం.

ఇటీవల కొందరు హీరోయిన్లను ‘కాస్టింగ్‌ కౌచ్‌’ గురించి అడిగాం. అవకాశాలు రావాలంటే ‘సర్దుకుపోవాలి’ అని కొందరు రూల్‌ పెడతారట.. ఓ హీరోగా, నిర్మాతగా మీవైపు నుంచి కాస్టింగ్‌ కౌచ్‌కి సమాధానం?
నా బ్యానర్‌లో అలా జరగదు. బయటి బ్యానర్‌ల గురించి తెలియదు. తెలియకుండా మాట్లాడకూడదు. హీరోయిన్లు అంటే నా తోటి  నటీమణులు. వారిని గౌరవిస్తాను. వారి వ్యక్తిగత జీవితం నాకు అనవసరం. ‘నీకు వేషం ఇస్తాను. అలా చేయి.. ఇలా చేయి అనడం నీచం, నికృష్టం.

టైమ్‌ ప్రకారం రాకపోతే ఆర్టిస్టులను తిడతాడు అన్న పేరు వచ్చింది తప్ప ఆర్టిస్టులను అవమానిస్తాడు, ఫుడ్డు పెట్టడు, డబ్బులు ఇవ్వడు అన్న మాటలు రాలేదు. ఇకముందు కూడా రావు. అమ్మాయిల విషయంలో ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే మాత్రం వాళ్లు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండలేరు. అమ్మాయిల్ని బలవంతపెట్టి అనకూడని మాటలు అనడం, వెకిలిగా ప్రవర్తించడం తగదు. నా మనస్తత్వానికి వ్యతిరేకం. ఫలానా పని చేస్తేనే ఆ పాత్ర ఇస్తా అనడం చాలా చాలా తప్పు.

మెట్టు మీద మెట్టు ఎక్కిన ఇన్నేళ్ల ప్రయాణంలో నిర్ణయాలన్నీ మీవే అన్నారు. ఎప్పుడైనా ‘లోన్లీ’గా అనిపించిందా? కష్టాలన్నీ పంచుకునే మిత్రులు ఉన్నారా?
నాది సోలో జర్నీ. ఎవరూ తోడు లేరు. కానీ ఎవరైనా తోడు ఉంటే బాగుండు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది మిత్రులు లేరు. ఇండస్ట్రీలో నిజమైన స్నేహితులు అంతగా లేరు. ఎక్కువ శాతం మంది రియల్‌గా ఉండరు. కనిపించినప్పుడు ఓ నవ్వు నవ్వుతారు. అది వెకిలి నవ్వో, ప్రేమ నవ్వో అర్థం కాదు. ఓ నటుడిగా నా విషయాలను మరో నటుడితో పంచుకోవాలనుకోను. బహుశా వారికి కూడా ఉండకపోవచ్చు.

నేనీ మధ్య కొంతమందితో సాన్నిహిత్యంగా ఉండాలనుకున్నాను. కానీ కొందరి ఈగో చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. నేను ఫోన్‌ చేశాననుకోండి.. ఆ నిమిషం ఏదో పని మీద ఉండి స్పందించకపోయినా ఆ తర్వాత అయినా చేయాలి కదా. పేర్లు అనవసరం. ‘నీ సినిమా హిట్‌ అయితే ఏంటీ? ఆఫ్ట్రాల్‌. ప్రజలకు అందరూ ఒక్కటే. బాగుంటే చూస్తారు. బాగాలేకపోతే నువ్వైనా, నేనైనా ఒకటే.

వంద రూపాయలు సంపాదించి రెండొందలు అని చెప్పుకుని, డబ్బాలు కొట్టుకోవడం అంటే ప్రజలను మోసం చేయడమే. ప్రజలకు కూడా తెలుసు.. డబ్బా అని. ఇవన్నీ అనవసరం. టాపిక్‌ వచ్చింది కాబట్టి చెప్పాను. పబ్లిసిటీ కోసం లేనివి కూడా చెప్పుకుంటారు. నా సినిమా ఆడకపోతే ‘ఫెయిలైంది. ఎక్కడో లోపం జరిగింది. టైమ్‌ బాగాలేదేమో. కథ సరిగ్గా కుదరలేదేమో’ అని ఒప్పుకుంటా.

 పాలిటిక్స్‌ గురించి?
ఆ విషయం గురించి అడగొద్దు అందామనుకున్నా. అడిగేశారు. త్వరలో మాట్లాడతాను. ‘గాయత్రి’లో కొన్ని పొలిటికల్‌ డైలాగ్స్‌ని టచ్‌ చేశాను.

అవి పాలకవర్గంపైనా? ప్రత్యర్థివర్గం పైనా?
ఏ పార్టీ గురించి కాదు. భాష రాని వారి గురించి. ‘సార్వభౌమాధికారం’ అని కూడా పలకటం రాదు కొంతమందికి. డిగ్రీ చదివాం అంటారు. కానీ సబ్జెక్ట్‌పై పట్టు ఉండదు. మాది ఇంజనీరింగ్‌ కాలేజ్‌. కానీ కంప్యూటర్‌ సైన్స్‌లో ఏముంటుంది? అంటే నేను చెప్పలేను. ఏం కోర్స్‌లు ఉంటాయంటే నాకు తెలియదు. అవి చూసుకునేవాళ్లు ఉన్నారు. తెలియనిది తెలియదని ఒప్పుకుంటే సరిపోతుంది కదా.

నేను ఎంటెక్‌ చదివానయ్యా అంటుంటారు. ఎంటెక్‌లో ఏం ఉంటాయో చెప్పమని అడిగితే నీళ్లు నమలడం ఎందుకు? మన పెద్దలు పెద్ద బాల శిక్ష చదివితే చాలనేవారు. అందులో అచ్చులు, పొల్లులు, నీతి కథలు వంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు అవి చదవడంలేదు. ఒత్తులు, పొల్లులు అంటే ఏంటీ అని అడుగుతున్నారు. రోజులు అలా మారాయి.

నటుడిగా మీ తొలి సంపాదన ఏమో అనుకున్నాం. మీ మొదటి పారితోషికం?
ఫస్ట్‌ సినిమా ‘స్వర్గం నరకం’ చిత్రానికి ఏమీ ఇవ్వలేదు. ఆ తర్వాత ‘తూర్పు పడమర’  సినిమాలో మెయిన్‌ విలన్‌ రోల్‌ చేశాను. ఆ సినిమాకి 500 రూపాయలిచ్చారు. ఆ తర్వాత నిర్మాత డూండీగారి ‘భలే దొంగలు’లో మెయిన్‌ రోల్‌ ఇచ్చారు. ఆ సినిమాకి నా పారితోషికం 7,500. నా ఫస్ట్‌ భారీ పారితోషికం అదే. పారితోషికం మాత్రమే కాదు.. ఆ సినిమాకి నేను వాడిన డ్రెస్సులను కూడా అడిగి తీసుకున్నాను. బాగా నచ్చడంతో బయట కూడా వేసుకున్నాను.

వందల నుంచి వేలు.. వేల నుంచి లక్షలు... లక్షల నుంచి కోట్లకు వెళ్లారు. ఈ జీవితం ఎలా అనిపిస్తోంది?
నా జీవితం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. కష్టపడుతూనే ముందుకు వెళ్లాలనుకునేవాణ్ణి. టాలెంట్‌ను ఇంప్రూవ్‌ చేసుకుంటూనే ముందుకు వెళ్లాలనుకునేవాణ్ణి. ఈ రోజుకీ నా టాలెంట్‌ను ఇంప్రూవ్‌ చేసుకోవడానికే ట్రై చేస్తున్నాను. నాకు సర్వం తెలుసు అనుకోను. ఇప్పుడు మదన్‌తో ‘గాయత్రి’ చేశా. అతను ఏం చెబుతాడో విని .. అలా కాదు ఇలా అని వెళ్లానే తప్ప... నటుడిగా నేనే కరెక్ట్‌ అని ఎప్పుడూ అనుకోలేదు.

నిజజీవితంలో నాకు  సలహాలు ఇచ్చేవారు లేరు. గురువుగారు దాసరి నారాయణరావుగారు ఉన్నప్పుడు అడిగేవాణ్ణి. ఏదైనా నాకు నేనుగానే నిర్ణయాలు తీసుకునేవాణ్ణి. నటుడవ్వాలనుకున్నా. గురువుగారు ఆశీస్సులతో అయ్యాను. నాలో నటన ఉంది కాబట్టీ, నాలో సిన్సియార్టీ, టాలెంట్‌ ఉంది కాబట్టీ క్రమశిక్షణగా ఉంటూ అంచెలంచెలుగా పైకి ఎదిగాను. ఇది ఎవరి దయాదాక్షిణ్యాలు కావు. స్కూలు నాకు నేనుగా డిసైడ్‌ చేసుకున్నాను. నా తమ్ముడు కృష్ణకు నేను స్కూల్‌ పెట్టడం ఇష్టం లేదు. కానీ కట్టాను. నా వైఫ్, పిల్లలు దేనిలోనూ ఇన్‌వాల్వ్‌ అవ్వరు. నిర్మాత అవ్వాలనుకున్నాను.

1982లో ‘ప్రతిజ్ఞ’తో నిర్మాతగా మారాను. ఈ జీవితంలో ఇన్ని మెట్లు ఎదగడానికి కారణమైన ప్రజలకు ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే.. వారు నన్ను విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, హీరోగా, సపోర్టింగ్‌ యాక్టర్‌గా ఆశీర్వదించారు. ఇది భారతదేశంలో నాకు ఒక్కడికే దక్కింది. ఎందుకంటే... విలన్‌గా చేసినవారు హీరోలు అయ్యారు తెలుగులో. కానీ నేను ఒకసారి హీరోగా చేసేవాణ్ణి. ఆ వెంటనే విలన్‌గానూ చేసేవాణ్ణి.

నిజమే.. విలన్‌ అంటే అలానే కంటిన్యూ అవ్వాలి. మీరు అటు కథానాయకుడిగా ఇటు ప్రతినాయకుడిగా చేయడం విశేషమే...
ఇదే విషయం గురించి అన్నగారు ఎన్టీఆర్‌ ‘వారి జాతకం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అటు విలన్‌ అంటారు. ఇటు హీరో అంటారు’ అన్నారు. తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే నేనింత మంచి స్థాయిలో ఉన్నాను.

‘వారి జాతకం అర్థం కావడంలేదు’ అని ఎన్టీఆర్‌గారు అన్నారు. మీ జాతకం గురించి ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలున్నాయా?
కష్టాలు వచ్చినప్పుడు ఏంటీ జాతకం అనుకునేవాణ్ణి. సక్సెస్‌ వచ్చినప్పుడు అనుకునేవాణ్ణి  కాదు. ఓసారి లైఫ్‌లో వరుసగా ఫెయిల్యూర్స్‌ వచ్చాయి. ఆ టైమ్‌లో దాసరిగారు.. ‘‘మోహనా... మనకు తెలిసిన వ్యాపారం సినిమా. సినిమాల్లో సంపాదిస్తాం. ఇక్కడే పోగొట్టుకుంటే ఖర్మ అనుకోవాలి అంతే’’ అన్నారు.

నిజమే కదా.. కావాలని ఫెయిల్యూర్‌ సినిమా తీయాలనుకోం. అలాగే గుర్రపు పందేలు, వ్యసనాలతో డబ్బులు పోగొట్టుకుంటే అది తప్పు. నా విషయంలో అలా జరగలేదు. అందుకే ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు మళ్లీ విజయం సాధిస్తాం అనే నమ్మకంతోనే ప్రయాణం సాగించాను. సాధించాను కూడా.

ఇంతకీ ‘గాయత్రి’ సినిమాలో రెండు క్యారెక్టర్స్‌ చేశారా? లేక టూ షేడ్స్‌ ఉన్న ఒకే క్యారెక్టర్‌ చేశారా?
రెండు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేశాను. ఒక పాత్ర పేరు శివాజీ. కొంచెం రఫ్‌ అండ్‌ టఫ్‌. రెండోది గాయత్రీ పటేల్‌. విష్ణు యంగ్‌ శివాజీ. అతని భార్యగా శ్రియ నటించారు.

శివాజీ అనగానే మీ సెన్సేషనల్‌ హిట్‌ ‘అసెంబ్లీ రౌడీ’లో మీరు చేసిన శివాజీ క్యారెక్టర్‌ గుర్తుకొస్తోంది...
‘అసెంబ్లీ రౌడీలో’ని శివాజీకి, గాయత్రి సినిమాలోని శివాజీకి చాలా డిఫరెన్స్‌ ఉంది. ‘గాయత్రి’ సినిమాలోని శివాజీకి రెండో పేజీలు ఉంటాయి. ఇతని మొదటి పేజీలోకి వస్తే సైలెంట్‌గా ఉంటాడు. రెండో పేజీ జోలికి వస్తే అసలు రూపం బయటకి వస్తుంది. రప్ఫాడిస్తాడు. గాయత్రి పటేల్‌ కన్నింగ్‌ క్యారెక్టర్‌.

రియల్‌ లైఫ్‌లో స్ట్రెయిట్‌ ఫార్వార్డ్‌గా మాట్లాడేస్తారు. రీల్‌పై మీ మనస్తత్వానికి విరుద్ధంగా ‘గాయత్రి పటేల్‌’లాంటి క్యారెక్టర్‌ చేయడం ఎలా అనిపించింది?
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అందరికీ తెలుసు... ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని. అలా ముక్కుసూటిగా మాట్లాడతాను కాబట్టే, ఎదుటివాళ్లు ఈయనతో మనకెందుకులే అనుకుంటారు. గాయత్రి పటేల్‌ నాకు పూర్తి విరుద్ధం. అతనికి ఒకే పేజీ ఉంటుంది. అది వరస్ట్‌ క్యారెక్టర్‌. నటుడిగా ఏ పాత్ర అయినా నాకు ఒకటే. నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్నదైనా, కానిదైనా.. ఏదైనా పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటా.

అది సరే.. దర్శకుడు మదన్‌ పెద్దగా సక్సెస్‌లో లేరు కదా.. తనతో సినిమా ఎందుకు చేశారు?
మదన్‌ చాలా మంచివాడు. సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు అందరికీ సహజం. ‘అతను ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌. ఎందుకండి అతన్ని పెడుతున్నారు’ అన్నారు నాతో. ఈ సినిమాకు  మదన్‌ను దర్శకుడిగా పెట్టానని పిల్లలతో అంటే, ‘మీ ఇష్టం డాడీ. మీరు కావాలనుకున్నారు. ఓకే’ అన్నారు. ఇష్టం అన్నాను కానీ మనసులో ఇతనికి సక్సెస్‌ లేదు. నేనేమో ఎష్టాబ్లిష్‌ అయినవాణ్ణి.

ఇలా తక్కువ ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న దర్శకుణ్ణి పెట్టుకుంటే ఎలా? ఏం జరుగుతుంది? అనేది లోపల ఉండేది. అందుకే అతను ఏం రాశాడు? ఏం తీశాడని తెలుసుకున్నా. టాలెంట్‌ ఉందనిపించింది. ఇంతకు ముందు మా బ్యానర్‌లో వర్క్‌ చేసిన కొందరి దర్శకులతో కలిసి ఈ స్క్రిప్ట్‌ మీద దాదాపు 6 నెలలు వర్క్‌ చేశాం. పరుచూరి గోపాలకృçష్ణగారు కూడా డైలాగ్స్‌ రాశారు. డైమండ్‌ రత్నబాబు ఒరిజినల్‌ డైలాగ్‌ రైటర్‌. ఈ సినిమాకు స్క్రీన్‌ ప్లే నేనే అందించా. స్క్రీన్‌ప్లే అంటే ఇష్టం. స్క్రీన్‌ ప్లే ఇవ్వడం నాకు కొత్తేం కాదు. కోదండ రామిరెడ్డి ‘నేరస్తుడు’ సినిమాకు సహాయ సహకారాలతో నేనే స్క్రీన్‌ప్లే ఇచ్చా.

సో.. భవిష్యత్తులో మిమ్మల్ని డైరెక్టర్‌గా కూడా చూడొచ్చా?
దర్శకుడికి నాలుగు గోడల మధ్య చెప్పగలను నాకు ఇలా కావాలని. నా మనస్తత్వానికి కుదరదు డైరెక్షన్‌. ఒక బాపుగారు, దాసరిగారు, రాఘవేంద్రరావు, గోపాల్, రవిరాజా ఇలా ఎంతోమంది దర్శకులతో పని చేశాను. టేకింగ్‌ అంటే ఇష్టం. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. అన్ని శాఖల మీద పట్టు ఉంది. కానీ డైరెక్షన్‌ చేయను.

– డి.జి. భవాని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top