సెల్‌యో.. సెల్ల్‌కయో!

Mind Your Health:how cell use  - Sakshi

మైండ్‌ యువర్‌ హెల్త్‌

ఏదైనా చెల్లుద్ది నోరు బాగుంటే... ఊరు బాగుంటుంది. కానీ మాటల్లేవ్, మాట్లాడుకోడాల్లేవ్‌. ఇప్పుడన్నీ అన్నీ సెల్లాటలే! అంతా బాగానే ఉంది గానీ... హెల్త్‌ సిగ్నలే డ్రాప్‌ అవుతోంది. సెల్‌యో? సెల్ల్‌కయో...?  మీరే నిర్ణయించుకోండి. 

పన్నెండేళ్ల రాజు చదువులో వెనకబడిపోయాడు. నిజానికి అతడు చాలా చురుకైన వాడు. ఎప్పుడూ క్లాస్‌ఫస్టే. కానీ ఇప్పుడు ఇంటికి రాగానే పుస్తకాలకు బదులు చేతిలో సెల్‌ఫోన్‌ పట్టుకుంటున్నాడు. ఎప్పుడూ గేమ్స్‌ ఆడటమే. అదీ గంటల తరబడి. ఒకవేళ బలవంతాన చదువుకోడానికి కూర్చున్నా... చదివింది మెదడులోకి వెళ్లేలోపే... కొద్దిసేపటికే తనకు తెలియకుండానే సెల్‌ఫోన్‌ చేతిలోకి తీసుకుంటాడు. మళ్లీ ఆటలు మొదలు... పందొమ్మిదేళ్ల మహేశ్‌ ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో ఉన్నాడు. ప్రొఫెసర్‌ చెబుతున్నదేమీ చెవికెక్కడం లేదు. కారణం...  వెనకబెంచిలో కూర్చొని తన గర్ల్‌ఫ్రెండ్‌కు మెసేజ్‌లు పంపే కార్యక్రమంలో తలమునకలై ఉన్నాడు. ఇరవైరెండేళ్ల రాజు, పదహారేళ్ల నాని, పద్నాలుగేళ్ల ప్రభు... అంతా ఒకేచోట ఉంటారు. ఎందుకో ఏదో వెతుకుతూ వెతుకుతూ... గంజాయి గురించి ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేశారు. అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా సంపాదించాలి, ఎలా వాడాలి, వాడితే ఏం జరుగుతుంది... ఇవన్నీ చూసి సంపాదించి, ఆరోజు నుంచి గంజాయి వాడటం మొదలుపెట్టారు. శ్రుతి పరీక్షలో ఫెయిలయ్యింది. డిప్రెషన్‌లో కూరుకు పోయి సూసైడ్‌ చేసుకోవాలనుకుంది. అంతే... ఆత్మహత్య చేసుకునేందుకు రకరకాల పద్ధతులను ఇంటర్‌నెట్‌లో వెతకడం మొదలుపెట్టింది. ఇలా ఎందరో... దీనంతటికీ కారణం... ఇంటర్‌నెట్‌. అది అరచేతిలో అమరిపోయి ఎప్పుడూ అందుబాటులో ఉండటం. అస్తమానం దాన్నే చూస్తూ... దానిపైనే ఆధారపడిపోయి ఉండటం. ఇలా సెల్‌ఫోన్‌ బారిన పడటం వల్ల తలెత్తే అనర్థాలు, వాటినుంచి బయటపడటం ఎలా అన్నదే ఇవాళ్టి ప్రత్యేక కథనం.  

ఎవరు త్వరగా అడిక్ట్‌ అవుతారంటే... 
∙ఆత్మన్యూనతతో ఉండేవారు (లో సెల్ఫ్‌ ఎస్టీమ్‌తో ఉండేవారు) ∙ఒంటరితనంతో బాధపడేవారు  ఎప్పుడూ బంధువులు, స్నేహితులకు దూరంగా ఉండేవారు ∙హాస్టళ్లలో నివసించేవారు ∙చిన్న చిన్న కుటుంబాల్లోని  సభ్యులు 
∙తల్లిదండ్రులు ఎక్కువగా సెల్‌ఫోన్‌ వాడుతున్నప్పుడు వాళ్ల పిల్లలూ దానికి తేలిగ్గా అలవాటవుతారు. మన దేశంలోని సెల్‌ఫోన్‌ వాడకం దారుల్లో కనీసం 5 నుంచి 15 శాతం మంది దీన్ని అడిక్షన్‌ స్థాయిలో వాడుతున్నట్లు ఒక అంచనా. ఈ అడిక్షన్‌ స్థాయి వారిలో మొదట టీనేజీ పిల్లలు, ఆ తర్వాత స్కూల్‌ వయసు పిల్లలే ఎక్కువ. 
సెల్‌ఫోన్‌ కారణంగా కనిపించే  సమస్యలివి... 

►నోమోఫోబియా: ఇది నో మొబైల్‌ ఫోబియాకు సంక్షిప్త రూపం. ఒకవేళ తమకు సెల్‌ఫోన్‌ దొరకకపోతే తాము ఏమైపోతామో అన్న తీవ్ర ఆందోళనకు గురయ్యే సమస్య ఇది. 
► ఫోమో: ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌ అనే ఇంగ్లిష్‌ పదాల మొదటి అక్షరాలతో ఏర్పడ్డ అబ్రివియేషన్‌ ఇది. తమ మొబైల్‌కు ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ దొరకకపోతే... తమకు లోకంతో కనెక్టివిటీ తప్పిపోతామనే ఆందోళనతో తెచ్చుకునే సమస్య ఇది. 
► టెక్స్‌టాఫ్రీనియా: తమకు ఏదైనా మెసేజ్‌ వచ్చిందేమో, దాన్ని మిస్‌ అయ్యామోననే ఆందోళనతో సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌బాక్స్‌నూ, వాట్సాప్‌నూ పదేపదే చెక్‌ చేసుకోవడం అన్నది టెక్స్‌టాఫ్రీనియాకు గురైనవారు చేస్తుండే పని. 
► రింగై్జటీ: తమకు రాని కాల్‌ వచ్చిందేమోనని చూసుకోవడమే∙రింగై్జటీ. ఇందులోనే మరో రకం కూడా ఉంది. తమ సెల్‌ఫోన్‌ రింగ్‌ అవుతున్నట్లు మోగగానే తీవ్ర ఆందోళనకు గురికావడం. తమకు ఏదైనా ముఖ్యమైన కాల్‌ వచ్చిందేమోనంటూ ఆందోళనగా చెక్‌ చేసుకోవడం. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఒక్కోసారి వేరెవరైనా ఫోన్‌ తాలూకు రింగ్‌టోన్‌ మోగినా  యాంగై్జటీకి లోనవుతుంటారు. 
అడిక్షన్‌తో అనర్థాలు: సెల్‌ఫోన్‌ అడిక్షన్‌ వల్ల వచ్చేవి కేవలం మానసికమైన సమస్యలు మాత్రమే కావు. ఇతరత్రా ఎన్నో ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి. వాటిలో కొన్ని... 

∙స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించే సమయంలో బొటనవేలిని ఎక్కువగా వాడుతున్నప్పుడు దాని వెనకభాగంలో ఉన్న టెండన్‌కు వాపు వస్తుంది. అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం కాస్తా తిరగబెడుతుంది. దీన్నే బ్లాక్‌బెర్రీ థంబ్‌ లేదా గేమర్స్‌ థంబ్‌ అంటారు. వైద్యపరిభాషలో డీ–క్వెర్‌వెయిన్‌ సిండ్రోమ్‌ అంటారు. దీనితోపాటు ∙నిద్రలేమి  క్యాన్సర్‌ (ముఖ్యంగా మెదడు వెనకభాగంలో క్యాన్సర్లకు సెల్‌ఫోన్‌ మూలమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి). ∙జ్ఞాపకశక్తి తగ్గిపోవడం  తలనొప్పి ∙ఇంపల్స్‌ కంట్రోల్‌ డిజార్డర్స్‌ తరహా మానసిక సమస్యలకు లోనుకావడం ∙యాంగై్జటీ  త్వరత్వరగా మూడ్స్‌ మారిపోవడం  ∙డిప్రెషన్‌. 

ఇక ఈ అనర్థాల ప్రభావం వయసు తక్కువ వారిలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ వాడుతున్న 16 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలో... ఈ అనర్థాల ప్రభావాలు తర్వాతి కాలంలో అధికంగా కనిపిస్తుండటాన్ని అధ్యయనవేత్తలు గుర్తిస్తున్నారు. మనకు ఉపయోగపడే సాంకేతికతను కేవలం ఉపయోగించడం కోసమే వాడాలి. దాంతో మనం ప్రయోజనం పొందాలి. అంతేతప్ప... వినియోగాన్ని వ్యసనం స్థాయికి తీసుకెళ్లడం మనకే ప్రమాదమని గుర్తించాలి. అది మన మానసిక, శారీరక ఆరోగ్యాలను దెబ్బతీస్తుందని గ్రహించాలి. అందుకే మనం ప్రతి విషయంలోనూ విచక్షణ పాటించడం మంచిది. 

అడిక్షన్‌ అయేది దేనికి?
సెల్‌ఫోన్‌ అడిక్షన్‌ అనే ముందు... మనం అడిక్ట్‌ అయ్యేది సెల్‌ఫోన్‌కు కాదనీ... అందులో మనకు ఇష్టమైన అంశానికనీ గుర్తుపెట్టుకోవాలి. మన మొబైల్‌లోని ఇంటర్‌నెట్‌తో మనకు ఇష్టమైన వ్యాపకాన్ని కొనసాగిస్తున్నందుకే సెల్‌ఫోన్‌ పట్ల మనకు ఆ వ్యసనం అని గుర్తుపెట్టుకోవాలి. అది గ్యాంబ్లింగ్, గేమ్స్, పోర్న్, ఇంకా మరేదైనా కావచ్చు. మన మెదడులోని ప్లెజర్‌సెంటర్‌ ఇష్టమైంది దాంట్లో దొరుకుతున్నందుకే మనకు ఈ అడిక్షన్‌.

అడిక్షన్‌ ప్రక్రియ ఎలా?
మన మెదడులో న్యూక్లియస్‌ ఎకంబెన్స్‌ అనే కేంద్రం ఒకటి ఉంటుంది. అది మన మెదడులో ఒక ప్లెజర్‌ సెంటర్‌ ఏర్పాటయ్యేలా ఉపయోగపడుతుంది. ఏదైనా అంశం పట్ల మనకు సంతోషం కలిగిందనుకోండి. అప్పుడు మెదడులో మనకు ఆనందం కలిగించే డోపమైన్, సెరిటోనిన్‌ వంటి ఆహ్లాదకర రసాయనాలు వెలువడతాయన్నమాట. ఉదాహరణకు మీ టీచర్‌ మిమ్మల్ని మెచ్చుకుందనుకోండి, ఆ మెచ్చుకోలుతో మెదడులో కొన్ని సంతోష రసాయనాలు స్రవిస్తాయి. ఆ రివార్డును మళ్లీ మళ్లీ పొందాలనుకున్న సంకల్పంతో మీరు బాగా చదవడం అన్న పనిని మాటిమాటికీ చేస్తుంటారు. ఇలా మీ రివార్డ్‌ సర్క్యూట్‌ ప్రేరేపితమై మీకు ఆనందం లభించే పనిని తరచు చేయడం ద్వారా మీకు అది అలవాటుగా మారుతుంది. ఆ ప్రక్రియ అలవాటు స్థాయిని దాటి వ్యసనంగా కూడా మారే అవకాశం ఉంది. అది పాజిటివ్‌ అంశమైన చదువుకోవడం కావచ్చు. లేదా... పేకాట, మద్యం తాగడం, జూదం ఆడటం వంటి దురలవాటు అయినా కావచ్చు. ఉదాహరణకు మీరు ఏదైనా నెట్‌గేమ్‌ ఆడుతున్నప్పుడు మీ ప్లెజర్‌ సెంటర్‌లో డోపమైన్‌ పాళ్లు పెరుగుతాయి. దాంతో మీకు ఉత్సాహంగా ఉంటుంది. ఆహ్లాద భావన కలుగుతుంది. ఇలా మీకు ఆనందం ఇచ్చేదిగా మీలో మీ ప్లెజర్‌సెంటర్‌లో ఏ అంశం నమోదవుతుందో, అది వ్యసనంగా (అడిక్షన్‌గా) మారుతుందన్నమాట. ఇలా అడిక్షన్‌ ప్రక్రియ జరుగుతుంది. అందుకే దాన్ని సెల్‌ఫోన్‌ అడిక్షన్‌గా కాకుండా... సెల్‌ఫోన్‌లో లభ్యమయ్యే మీకు ఆనందానిచ్చే అంశం పట్ల అడిక్షన్‌గా చెప్పాల్సి ఉంటుంది. అందుకే మానసిక నిపుణులు దీన్ని సెల్‌ఫోన్‌ అడిక్షన్‌గా కాకుండా... సాధారణ అడిక్షన్లలాగే పరిగణిస్తున్నారు.  ఇలా చిన్నప్పట్నుంచీ సెల్‌ఫోన్‌ అందుబాటులో ఉండటంతో ఆటపాటలతో, కేరింతలతో గడపాల్సిన పసిపిల్లలు సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నారు. ఉత్సాహంతో ఉరకలేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన యువత తమ ఆరోగ్యాన్నీ, మానవసంబంధాలను, బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. ఇలా మనకు ఉపయోగపడాల్సిన ప్రస్తుత, ముందు తరాలు యంత్రాలతో స్నేహం చేస్తూ, యాంత్రికంగా మారిపోతున్నారు. 

అడిక్షన్‌గా మారినప్పుడు కనిపించే లక్షణాలు : 
∙సెల్‌ఫోన్‌ అడిక్షన్‌తో బాధపడేవారిలో నిద్రపట్టకపోవడం చాలా ముఖ్యంగా కనిపించే లక్షణం ∙ సెల్‌ఫోన్‌ వాడాలనే తహతహ పెరగడం, ఎంత వాడినా తృప్తి అనిపించకపోవడం ∙ఎవరైనా సెల్‌ఫోన్‌ లాక్కుంటే తమ మూడ్స్‌ చెడిపోతాయి ∙తీవ్రమైన బాధకూ, వేదనకు గురవుతారు ∙సెల్‌ఫోన్‌ లాక్కున్న వారితో గొడవకు దిగుతారు ∙తాము అనుకున్నట్లుగా సెల్‌ఫోన్‌ వాడలేనప్పుడు లేదా ఇతరులకు మెసేజ్‌ పంపలేనప్పుడు తీవ్రమైన ఆందోళనకు గురవుతారు ∙త్వరగా డిప్రెస్‌ అవుతుంటారు. 

సెల్‌ఫోన్‌ వినియోగాన్ని తగ్గించడం ఎలా?  
∙సెల్‌ను అత్యవసర పరిస్థితుల్లోనే వినియోగించండి. మెసేజ్‌లనే అలవాటు చేసుకోండి. 
∙సెల్‌ఫోన్‌ నంబరును బాగా సన్నిహితులకు మాత్రమే ఇవ్వండి. ఇలా చేయడం  ద్వారా అనవసరమైన కాల్స్‌ను తగ్గించుకోవచ్చు. 
∙పొద్దున్న లేవడానికి అలారంతో మొదలుపెట్టి  రిమైండర్లు, ఆటలు, పాటలు, కాలిక్యులేటర్‌... ఇలా ప్రతిదానికీ సెల్‌ఫోన్‌ మీదే ఆధారపడిపోతుంటే అది దురలవాటుగా పరిణమిస్తుంది. కాబట్టి ఫోన్‌ను సంభాషణలకు మాత్రమే పరిమితం చేయడం మంచిది.
∙ఎక్కువగా ఫోన్‌ వాడే అవసరం ఉన్నవాళ్ళు ఇంట్లో ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ తీసుకోవడం మేలు. కనీసం ఇంట్లో ఉన్నపుడైనా సెల్‌ఫోన్‌ వినియోగాన్ని తగ్గించవచ్చు. 
∙సిగ్నల్స్‌ సరిగా లేనపుడు దానితో కుస్తీ పట్టడం, లైన్‌ కలపడం కోసం ఆదుర్దా పడటం కన్నా, పూర్తిస్థాయి సిగ్నల్స్‌ అందుబాటులో ఉన్నపుడే మాట్లాడటం మంచిది. 
∙వీలున్న అన్ని సందర్భాలలో సాధారణ ఫోన్స్‌ (లైన్డ్‌ ఫోన్స్‌)లో మాట్లాడాలి. 
∙సంభాషణ క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలి. 
∙సెల్‌ఫోన్‌ వాడటం తప్పనిసరి అయినప్పుడు హ్యాండ్స్‌ ఫ్రీ అటాచ్‌మెంట్‌ను ఉపయోగించడం, చెవికి ఆనించి పెట్టుకోవడం కాకుండా కొద్ది సెంటీమీటర్ల దూరంలో ఉంచుకొని మాట్లాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 
∙రింగ్‌ చేసిన నంబరు, కనెక్ట్‌ అయిన తర్వాత మాత్రమే సెల్‌ఫోన్‌ను చెవి వద్దకు తీసుకెళ్లాలి. 
∙పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు... రోజు మొత్తం మీద కాల్స్‌ కలిసి, మూడునాలుగు గంటలు దాటుతున్నట్లు గమనిస్తే సెల్‌ఫోన్‌ వాడకాన్ని ప్రత్యేకంగా నియంత్రించడం మంచిది. వీలైన సందర్భాల్లో ఎస్‌ఎంఎస్, చాటింగ్, యాప్‌ బేస్డ్‌ మెసేజింగ్, డేటా సెర్చింగ్‌ వంటి అవసరాలకు మాత్రమే సెల్‌ఫోన్‌ను పరిమితం చేయాలి. 

డాక్టర్‌ శ్రీనివాస్‌ ఎస్‌ఆర్‌ఆర్‌వై
ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌ఓడీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైకియాట్రీ, కాకతీయ మెడికల్‌ కాలేజ్, వరంగల్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top