వేదాంత శివుడు...

వేదాంత శివుడు... - Sakshi


రేపు మహాశివరాత్రి

 

సర్వాంతర్యామి... నిరాడంబరుడు...త్రినేత్రుడు... దిగంబరుడు...బోళాశంకరుడు... వరప్రదాత... అర్ధనారీశ్వరుడు... అభిషేకప్రియుడు... శివుడి గురించి ఇలా మనం ఎన్ని చెప్పుకున్నా మరెన్నో విశేషణాలు వస్తూనే ఉంటాయి...త్రిమూర్తులలో శివుడు లయకారుడు. ఆ కారణంగానే ఆయన తమో గుణ ప్రధానుడు. జ్ఞానానికి నెలవు. శివుని సగుణ బ్రహ్మగా కొలుస్తారు. రాముడు స్వయంగా శివుడిని రామేశ్వరంలో కొలిచినట్లు పురాణాలు చెబుతున్నాయి. మునులకు, యోగులకు అధినాయకుడు శివుడే. ఆయన దిగంబరుడు (దిక్కులే అంబరంగా కలిగినవాడు) ... అంటే సర్వవ్యాపి అని అర్థం. ఆయన రూపంలోని విశేషాలను అవలోకిద్దాం.

 

శివుని దక్షిణ హస్తంలోని త్రిశూలం...

సత్వరజస్తమో గుణాలు అనే త్రిగుణాలను సూచిస్తుంది. సార్వభౌమత్వానికి అది ప్రతీక. ఈ మూడు గుణాలతోనే సృష్టి నడుస్తుంది. ఎడమ చేతిలోని డమరుకం శబ్దబ్రహ్మాన్ని ప్రతిధ్వనిస్తుంది. సకల భాషలకూ ఆధారభూతమైన ఓంకారం, సంస్కృత భాష ఈ డమరుకం నుంచే ప్రభవించాయి.

 

శిరసులోని నెలవంక...

మనసును నియంత్రించే శక్తికి ప్రతీక. జటాజూటంలోని స్వర్గంగ... అమరత్వానికి నిదర్శనం. జంతువులలో ఏనుగు అభిమానానికి ప్రతీక. గజ చర్మాన్ని ధరించిన శివుడు స్వాభిమానానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాడు. శార్దూలం విషయవాంఛలకు ఆలవాలం. విషయ వాంఛలను జయించాడనడానికి సూచికగా పులి చర్మం మీద ఆశీనుడై ఉంటాడు శివుడు.



ఆయన శుభంకరుడు. సుందరాకారుడు, త్రిలోచనుడు. లలాటంలో ఉన్న అక్షం... వ్యవహారజ్ఞానం, సహజ వివేకానికి ఆలంబన. అంతటి మహనీయుని పాదపద్మాలకు నమస్కరించాలి. అద్వైతుడు, అధిష్ఠానుడు, సచ్చిదానందుడు, అధినాయకుడు, అంతర్యామి, సాక్షీభూతుడు, స్వయంప్రకాశకుడు, స్వయం ప్రతిపత్తి ఉన్నవాడు, పరిపూర్ణుడు, అవిద్యను తొలగించేవాడు, ఆదిగురువు, జగద్గురువు అయినవాడు శివుడు.



కంఠంలో సర్పాన్ని ధరించడం ద్వారా...

వివేకానికి, శాశ్వతత్వానికి ప్రతీకగా భాసిస్తాడు. సర్పం జీవాత్మకి ప్రతీకగా ఆయన కంఠంలో అలరారుతుంది. ఐదు తలలు పంచేంద్రియాలకు, పంచభూతాలకు (పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం), పంచప్రాణాలకు, పంచతన్మాత్రలకు, పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు నెలవు. పాము బుసలు ఉచ్ఛ్వాసనిశ్వాసలను ప్రతిబింబిస్తాయి. పరమశివుడు పంచ తన్మాత్రలకు స్వయంగా నెలవు. జితేంద్రియుడైనవాడు తనలోని పరమాత్మను గుర్తించగలుగుతాడని, తన శరీరం మీద సర్పాన్ని ధరించి శివుడు ఈ అంశాన్ని బోధిస్తున్నాడు.శివుడు నిర్భయుడని శ్రుతులు చెబుతున్నాయి. శివుడు అభయుడు, అమృతుడు. సామాన్య జనులు సర్ప దర్శనంతోనే భీతి చెందుతారు. అంతటి విషసర్పాన్ని తన మెడలో ధరించి అభయుడయ్యాడు శివుడు.

 

భస్మం...

నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రం శివుని ధ్యానించడానికి భక్తులకు సాధనం. ఇందులో ‘న’  భూమి బ్రహ్మకు ‘మ’ జలము విష్ణుమూర్తికి, ‘శి’ రుద్రాగ్నులకు, ‘వ’ వాయుమహేశ్వరులకు, ‘య’ ఆకాశం జీవుడికి ప్రతీక. శివుడు శ్వేతవర్ణుడు. ఈ వర్ణం ద్వారా... ప్రజలంతా పరిశుద్ధ అంతరంగులై, స్వచ్ఛమైన మసస్సును, ఉన్నతమైన ఆలోచనలు కలిగి, క్రూరత్వానికి, కపటత్వానికి, ఈర్ష్యాసూయలకు, ద్వేషానికి దూరంగా ఉండాలని తెలియచేస్తున్నాడు.లలాటం మీద అడ్డంగా మూడు విభూతి రేఖలు ధరించి, మానవులు వారిలోని త్రిదోషాలను తుడిచేసుకోవాలన్నాడు. శివాలయం ముందుగా ఉండే బలిపీఠం... ప్రజలంతా భగవంతుని చేరాలనుకునే ముందు అహంకారాన్ని, స్వార్థాన్ని విడిచిపెట్టాలని సూచిస్తోంది.

 

నంది...

శివలింగానికి అభిముఖంగా ఉండే నందీశ్వరుడు శివుని ద్వారపాలకుడు. ఆయన శివునికి వాహనం కూడా. నందీశ్వరుడు సత్సంగాన్ని బోధిస్తున్నాడు. సాధువులతో సత్సంగం కలిగి ఉంటే, పరమాత్మను సులువుగా చేరుకోవచ్చని చెబుతున్నాడు. భగవంతుని చేరుకునే సాధనాన్ని సన్యాసులు బోధిస్తారు. మన మార్గంలో ఉండే ముళ్లను, ఆటంకాలను వారు తొలగిస్తారు. మనకు కలిగే సందేహాలను తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. భగవంతుని చేరడానికి సత్సంగాన్ని మించిన నావ లేదని పెద్దలు చెబుతున్నారు., ఒక్క క్షణ కాలం వారితో గడిపినా జ్ఞానం అబ్బుతుందని పండితులు అభిప్రాయపడతారు. ప్రాపంచిక వాంఛలను తొలగించగల శక్తి సాధువులకు మాత్రమే ఉంది.  ఆయన కైలాస శిఖరం మీద లీనమైపోయి ఉంటాడు. వృషభవాహనం ధర్మదేవతకు ప్రతిరూపం. శివుడు నందిని వాహనంగా చేసుకుని ప్రయాణిస్తూ, ధర్మానికి, ఋజుత్వానికి ప్రతీకగా కనిపిస్తాడు.

 - డా. పురాణపండ వైజయంతి

 

ఈ కింది శివనామాలతో శివారాధన చేయడం పాప సంహారకం. శివాయ నమః; రుద్రాయ నమః పశుపతయేనమః; నీలకంఠాయ నమః; మహేశ్వరాయ నమః; హరికేశాయ నమః; విరూపాక్షాయ నమః; పినాకినే నమః; త్రిపురాంతకాయ నమః; శంభవే నమః; శూలినే నమః; మహాదేవాయ నమః  అశక్తులు ఈ పన్నెండు నామాలు మనసులో అనుకున్నా చాలు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top