కమిషనర్లను గుమాస్తాలుగా మార్చే కుట్ర

Madabhushi Sridhar Article On RBI - Sakshi

విశ్లేషణ

ఆర్టీఐని అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు నిరంతరంగా సాగుతున్నాయి. రాజకీయ ప్రభువులకన్నా అధికారులకు ఆర్టీఐ కంటగింపుగా తయారయింది. ఎంతో జాగ్రత్తగా మాజీ అధికారులను మన వాళ్లనుకుని ప్రభువులు నియమించుకున్న విధేయ అధికారులు కూడా కమిషన్‌ హోదాలో అప్పుడప్పుడు మెరుపులు కురిపిస్తున్నారు. అవినీతి ఆరోపణలున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల జాబితాను ప్రజలకు తెలపాలని ఇటీవల ఒక సమాచార కమిషనర్‌ ఆదేశించారు. ఎవరెవరిమీద ఏయే చర్యలు  తీసుకున్నారో చెప్పండి అని మరొక కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌ సర్వీసు అధికారులు ఆగ్రహించారు. ఏప్రిల్‌ 2న వచ్చిన ఒక వార్తా నివేదికలో ప్రభుత్వం అధికారులతో కూడిన రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నదనీ, ఇందులో ఒక కమిటీ ప్రధాన సమాచార కమిషన్‌ పైన వచ్చే ఫిర్యాదులను స్వీకరించి విచారించి చర్యలు తీసుకొనడానికేనని చెప్పారు. ఈ కమిటీలో కేబినెట్‌ సెక్రెటరీ, డీఓ పీటీ (ఉద్యోగులశాఖ) సెక్రటరీ, రిటైరయిన ప్రధాన సమాచార కమిషనర్‌ సభ్యులుగా ఉంటారట. మరొక కమిటీ సమాచార కమిషనర్లపై ఫిర్యాదులను

వింటుంది. ఇందులో కేబినెట్‌ సెక్రటేరియట్‌ కో ఆర్డినేషన్‌ కార్యదర్శి, డీఓపీటీ సెక్రటరీ, ఒక రిటైరైన సమాచార కమిషనర్‌ ఉంటారుట. రెండు కమిటీల్లో డీఓపీటీ సెక్రెటరీ సభ్యుడు.ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 14 ప్రకారం కమిషనర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలి. కేంద్ర కమిషనర్లు చట్టవ్యతిరేకంగా వ్యవహరించారని అనుకుంటే రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు దర్యాప్తు జరిపించాలి. ఆరోపణ రుజు వైతే సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆ కమిషనర్‌ను తొలగిస్తారు. ప్రధాని, కేంద్ర మంత్రి, ప్రతిపక్షనాయకుడితో కూడిన ఉన్నతాధికార సంఘం సిఫార్సుపై కేంద్ర సమాచార కమిషనర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి కన్న కింది స్థాయి అధికారులకు ఈ అధికారాన్ని ఇవ్వడం పరిపాలనా సూత్రాలకు విరుద్ధం. ఇప్పుడు సెక్షన్‌ 13(4) ప్రకారం సమాచార కమిషనర్‌ ఐసీ ఎన్నికల కమిషనర్‌ ఈసీతోనూ ప్రధాన సమాచార కమిషనర్‌ సీఐసీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సీఈసీతోనూ సమాన స్థాయి కలిగి ఉన్నారు.

 కేంద్ర అధికార గణం ప్రతిపాదించిన ఈ కమిటీలు అమలులోకి వస్తే చీఫ్‌ కమిషనర్‌ కూడా కేబినెట్‌ సెక్రటేరియట్‌ అడుగులకు మడుగులొత్తుతూ పనిచేయాల్సి ఉంటుంది. ఇక సమాచార కమిషనర్‌ను మరింత కిందస్థాయికి దించి కో ఆర్డినేటింగ్‌ సెక్రటరీకి లోబడి ఉండాలని నిర్దేశిస్తుంది. తమపైన ఫిర్యాదులు విని చర్యలు తీసుకునే అధికారం ఉన్న అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వగలరా? ఇచ్చి కమిషన్‌లో బతకగలరా? కమిషనర్ల స్థాయిని తగ్గించి ఎప్పటికప్పుడు వారి స్థాయిని, జీత భత్యాలను పదవీ కాలాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే వీలు కల్పించాలని కేంద్రం 2018 అక్టోబర్‌లో ఒక సవరణ బిల్లును ప్రవేశ పెట్టింది. ప్రతిపక్షాలు, మాధ్యమాలు, ఆర్టీఐ కార్యకర్తలు, ఆనాటి ఇద్దరు సమాచార కమిషనర్లు వ్యతిరేకించడంతో వెనుకడుగు వేసింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఇదే ప్రభుత్వం గెలిస్తే, ఈ సవరణ బిల్లు చట్టం కావడం, కమిషనర్ల స్థాయి తగ్గి గుమాస్తాలుగా మారిపోవడం, ఆర్టీఐ శక్తి నిస్సారమై పోవడం ఖాయం.

ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాజీ అధికారులతో కమిషన్లను నింపేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి. ప్రభుత్వ శాఖలను కాపాడడమే తమ ధ్యేయం అన్నట్టుగా చాలామంది వ్యవహరిస్తున్న విషయం వారి ఆదేశాలు పరిశీలిస్తే అర్థం అవుతుంది. సెక్షన్‌ 3 ప్రకారం సమాచారం అడిగితే ఇవ్వను పొమ్మని తిరస్కరిస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకమనీ, జరిమానా విధించవచ్చని అడిగితే వినే నాథుడు లేడు. ఆర్బీఐ వంటి పెద్ద సంస్థ కూడా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. మాజీ అధికారుల చేతిలో కమిషన్‌లు ఉన్నంత కాలం పౌరులకు సమాచారం అందడం సాధ్యమా అని భయపడుతున్న తరుణంలో కమిషనర్ల స్థాయి తగ్గించడానికి మొదట చట్టం సవరణ ద్వారా ప్రయత్నాలు చేసారు. అది సాధ్యం కాకపోతే ఫిర్యాదు కమిటీల రూపంలో కమిషనర్లను గుమాస్తాలుగా మార్చే కుట్ర మొదలు పెట్టారా?
ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే సమాచారాల వెల్లడి ఆర్టీఐ కింద సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయి.

ఒకవేళ ఏ కమిషనరయినా సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తే, అధికార వర్గంలో అలజడి మొదలవుతుంది. రాజకీయ నాయకులు అధికారులు కలిసి సమాచారం ఇవ్వకుండా ఏం చేయాలా అని ఆలోచిస్తారు. వారికి చేతనైన మార్గం ఏమంటే హైకోర్టుకు వెళ్లి రిట్‌ వేయడం, స్టే తెచ్చుకోవడం. ఇందులో కమిషనర్‌ను కూడా ఒక పార్టీగా చేర్చుతున్నారు. ఒక ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వశాఖ పక్షాన సమాచారం ఇవ్వకూడదని వాదిస్తే సమాచార కమిషనర్‌ తరఫున మరొక ప్రభుత్వ న్యాయవాది సమాచారం ఇవ్వాలని వాదిం చాలి. తాను కూడా సమాచార హక్కు చట్ట పరిధినుంచి తప్పుకోవాలని భావించే న్యాయస్థానం విచారణ జరిపి నిష్పాక్షికంగా తీర్పునిస్తుందన్నమాట. మేనిఫెస్టోలలో ప్రతి పార్టీ సమాచార హక్కును నీరు కార్చకుండా బతికిస్తానని ప్రజలకు హామీ ఇవ్వాలని జనం కోరాలి. గెలిచినా ఓడినా ప్రతి రాజకీయ పార్టీ పారదర్శకతకు కట్టుబడి ఉండాలి. లేకపోతే అవినీతిని దాచుకోవడానికి వీలుగా ఆర్టీఐని అంతం చేసే పాపానికి ఒడిగడతారు.

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top