లూపస్‌ వ్యాధిగ్రస్తులూ... కరోనాతో కాస్త జాగ్రత్త! 

Lupus Patients Be Carefull About Coronavirus - Sakshi

కీళ్లవాతాల్లో అతి ప్రధానమైనది లూపస్‌ వ్యాధి. దీన్నే ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథమెటోసిస్‌) అని కూడా అంటారు. మన వ్యాధి నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం వల్ల వచ్చే జబ్బులను ‘ఆటో ఇమ్యూన్‌ జబ్బులు’ అని అంటారు. లూపస్‌ కూడా ఓ ఆటో ఇమ్యూన్‌ జబ్బు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో లూపస్‌తో పాటు ఇతర ఆటో ఇమ్యూన్‌ వ్యాధులతో బాధపడేవారు కరోనా సంక్రమణను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేమిటో తెలుసుకుందాం.  

ఏ అవయవాన్నైనా కబళించే శక్తి లూపస్‌కుంది. దీని లక్షణాలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. విపరీతమైన అలసట, బరువు తగ్గడం, జుట్టు ఎక్కువగా రాలిపోవడం, జ్వరం, కీళ్లనొప్పులు, నోటిపూత వంటివి అతి సాధారణ లక్షణాలు. 

సీతాకోకచిలుక ఆకృతితో ముక్కుకు ఇరువైపులా బుగ్గల మీద ఎర్రని మచ్చ (బటర్‌ఫ్లై రాష్‌), సూర్యరశ్మికి అతి సున్నితంగా ప్రతిస్పందించడం, తరచూ గర్భస్రావాలు, రక్తహీనత, ఒంట్లోకి నీరు చేరడం కూడా జరుగుతాయి. జబ్బు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఒంట్లో రక్తకణాలు తగ్గవచ్చు.‘కోవిడ్‌–19’ వల్ల రుమాటిక్‌ జబ్బులకు సంబంధించిన లక్షణాలూ కనిపించవచ్చు. కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, చర్మం మీద మచ్చలు, జ్వరం వంటి లక్షణాలు కీళ్లవాపు లక్షణాల్లానే కనిపించే అవకాశం ఉంటుంది. 

సాధారణంగా ఇతర వైరస్‌ల ఇన్ఫెక్షన్లు లేదా ఎన్నో రకాల అంటువ్యాధుల తర్వాత రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటి కీళ్ల వాతాలు తరచూ ప్రారంభమవుతాయని గతంలోనే నిరూపితమైంది. ఇది ‘కోవిడ్‌–19’కి కూడా వర్తిస్తుందా లేదా అనే అంశంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత  సమయంలో ఆటోఇమ్యూన్‌ జబ్బులతో బాధపడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...  ∙సాధారణ ప్రజల్లాగానే వీరు తప్పక నోరు, ముక్కుకు అడ్డంగా మాస్క్‌ ధరించాలి. సామాజిక దూరం పాటించాలి ∙ చేతులు సబ్బుతో, శానిటైజర్‌తో శుభ్రపరచుకోవాలి.

చికిత్సలో భాగంగా అధిక మోతాదుల్లో స్టెరాయిడ్‌ తీసుకునేవారు, ఇటీవలికాలంలో మెథోట్రెక్సెట్, లెఫ్‌లూనమైడ్, సైక్లోఫాస్ఫమైడ్‌ వంటి మందులు మొదలుపెట్టినవారికి ‘కోవిడ్‌’ సంక్రమించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ∙స్టెరాయిడ్‌ తీసుకోవడం వల్ల ‘కోవిడ్‌’ సోకే ముప్పు ఎక్కువగానే ఉన్నప్పటికీ రుమాటిక్‌ జబ్బుల తీవ్రతను తగ్గించడానికి స్టెరాయిడ్‌లు తీసుకోవడం వంటి చికిత్సను కొనసాగించక తప్పదు ∙జ్వరం, లేదా ఇతర ఫ్లూ లక్షణాలు కనిపిస్తే కీళ్లవాత సంబంధిత వ్యాధులున్నవారు రుమటాలజిస్టుల సలహా మేరకు తాత్కాలికంగా మందులు ఆపాల్సి రావచ్చు.

అయితే రుమటాలజిస్ట్‌ సలహా తప్పనిసరి. మందులు మానేయడం వల్ల లూపస్‌ వ్యాధి తీవ్రత పెరిగి, ఇతర వైరస్‌లలోపాటు  కరోనా సంక్రమించే ప్రమాదం పెరుగుతుందని గుర్తుంచుకోవాలి∙లూపస్‌కు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వంటి మందులు రోగనిరోధక శక్తిని శరీరానికి అనుగుణంగా మారుస్తాయి. ఇవే మందులు కరోనా లక్షణాల నివారణ కోసం లేదా ఆ వ్యాధిని తగ్గించడం కోసం ఉపయోగపడతాయని అధ్యయనాల్లో కొంతవరకు తేలింది. మన దేశంలో కూడా ఇదే మందును మన ప్రభుత్వాలు కరోనా నివారణ/చికిత్స కోసం వాడుతున్న విషయం తెలిసిందే. కాబట్టి లూపస్‌ లేదా ఇతర రుమాటిక్‌ వ్యాధిగ్రస్తులు ఈ మందును వాడుతున్నట్లైతే... రుమటాలజిస్ట్‌ను సంప్రదించకుండా దాన్ని మానేయడటమో లేదా అధిక మోతాదుల్లో తీసుకోవడమో చేయవద్దు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top