ఐ లవ్యూ చెప్పండి

love your body parts - Sakshi

మీ కళ్లకు.. మీ నోటికి.. మీ గోళ్లకు.. మీ పాదాలకు.. మీ చర్మానికి.. మీ శ్వాసకు!

కుటుంబం కోసం నిత్యం పరుగులు తీస్తుంటాం. వారిపై ప్రేమ మనల్ని మనం పట్టించుకునేలా చేయదు. అది ప్రమాదం. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా కుటుంబం కోసం ఏదైనా చేయగలుగుతాం. అందుకే మన ఆరోగ్య స్థితిని తరచు పరిశీలించుకుంటూ ఉండాలి. శరీర భాగాలిచ్చే సంకేతాల ద్వారా మన ఆరోగ్యం ఎలా ఉన్నదీ, ఉండబోతున్నదీ తెలుసుకోవచ్చు. సాధారణ పరీక్షలతో పొంచి ఉన్న ఆరోగ్య సమస్యలను తప్పించుకోవచ్చు.  

కళ్లు : కంటి కింది రెప్పలను సాగదీసి లోపల గులాబీరంగు ఉందా, తెల్లగా ఉందా గమనించాలి. ఐరన్‌ లోపం ఉంటే రెప్పల లోపలిభాగం తెల్ల రంగులో ఉంటుంది. అలాగే కళ్లు తెల్లగా ఉన్నాయా, పచ్చగా ఉన్నాయా తరచు గమనించుకోవాలి. పచ్చగా ఉన్నాయంటే నార్మల్‌గా లేవని గ్రహించాలి. కార్నియా మీద సన్నటి గీతలు ఉంటే, హెర్పిస్‌ వ్యాధి వస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. కంటి చుట్టూ బూడిద రంగు వలయాలు ఉంటే కనుక కొలెస్ట్రాల్‌ ఎక్కువవుతోందని.. ముఖ్యంగా 20 సంవత్సరాల వయసులో ఉన్నవారు తెలుసుకోవాలి.

గోళ్లు : పొరలుపొరలుగా ఎత్తుపల్లాలుగా గోళ్లు ఉంటే, పోషకాహార లోపం ఉన్నట్లు అర్థం. గోళ్లు బాగా కొరికినట్లుగా ఉంటే నరాల బలహీనతకు సూచిక. పగిలిన గోళ్లు హృదయ సంబంధ వ్యాధులకు సంకేతం. గోళ్లు సగ భాగం తెలుపు, సగ భాగం గులాబీ రంగులో ఉంటే మూత్ర పిండాల వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు. గోళ్లు ముదురు పసుపురంగులో ఉంటే, ఊపిరితిత్తులకు ముప్పు ఏర్పడుతోందని సంకేతం. 

పాదాలు : పాదాలు చల్లగా ఉండి, చర్మం ఎండిపోయినట్లుగా ఉంటే రక్తప్రసరణ సరిగా లేనట్లు! పాదాలు వేడిగా, చెమట పడుతూ ఉంటే నిరోధక శక్తి తగ్గి, బరువు పెరగబోతున్నారని అర్థం. ఇక మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా కాళ్లకు ఎక్కడైనా దెబ్బలు తగిలాయేమో గమనించుకుంటుండాలి. వాటి వల్ల రక్తప్రసరణలో లోపం ఏర్పడి, కాళ్లలో అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది.  

నోరు : నాలుక వెనుక భాగంలో, బుగ్గల లోపలి భాగంలో నల్ల చుక్కలు ఉంటే ఇన్‌ఫెక్షన్‌కు సూచిక. నోటిలో వచ్చిన అల్సర్లు రెండు మూడు వారాలకు కూడా తగ్గకపోతే అది తీవ్రమైన అనారోగ్యంగా మారే అవకాశం ఉందని గుర్తించాలి. బాగా పొగ తాగేవారు, మద్యం సేవించే 45 సంవత్సరాల లోపు వయసువారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తరచుగా అల్సర్లు వచ్చి, రక్తం కారుతుంటే మధుమేహం, అనీమియా, విటమిన్‌ సి లోపం వంటివని అర్థం చేసుకోవాలి.

చర్మం : మీ వయసు 25 దాటిందా? మీ చర్మం మీద మచ్చలు ఉన్నాయా! అయితే మీలో హార్మోనల్‌ ఇంబ్యాలెన్స్‌ ఏర్పడి, మహిళలైతే ఓవరిన్‌ సిస్టులు రావడానికి సూచిక అని గుర్తించాలి. మీరు తెల్లగా ఉంటారా, మీ ఇంట్లో వారికి చర్మవ్యాధుల చరిత్ర ఉందా? అయితే మీ ఒంటి మీద వచ్చే పుట్టుమచ్చలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. అవి అకస్మాత్తుగా పెరుగుతున్నాయా? బాగా ముదురు రంగులోకి మారుతున్నాయా? వాటి నుంచి రక్తం కారుతోందా? వెంటనే జనరల్‌ ఫిజీషియన్‌ను సంప్రదించి, అది క్యాన్సర్‌ కాదని నిర్ధారించుకోవాలి.

శ్వాస : నోటి దుర్వాసనను గుర్తించడం చాలా తేలిక. నాలుక వెనుక భాగంతో ముంజేతి చుట్టూ తాకాలి. సుమారు పది సెకన్ల పాటు లాలా జలాన్ని ఎండనిచ్చాక, అక్కడ నుంచి దుర్వాసన వస్తుంటే అనారోగ్యం అని అర్థం. మధుమేహం ఉన్నవారి లాలాజలం నుంచి దుర్వాసన వస్తుంది. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారి లాలాజలం మూత్రం వాసన వస్తుంది. 

ఇవన్నీ కూడా జాగ్రత్తపడమని సూచించే సంకేతాలు. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీ మీద మీకు ప్రేమ లేనట్లే! మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోనట్లే. మీరు ప్రేమించే వారి కోసమైనా.. మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా. 
– రోహిణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top