రూపకాయంగా కాదు...ధర్మకాయంగా చూడాలి!

రూపకాయంగా కాదు...ధర్మకాయంగా చూడాలి!


బౌద్ధకేంద్రమైన శ్రావస్తిలో పుట్టి పెరిగిన సుభద్రకు పెళ్లయింది. అత్తవారిల్లయిన రమణక నగరానికి ఆమె తొలిసారి వచ్చింది. అది బుద్ధభగవానుల గురించి ఏమాత్రం తెలియని ఊరని కొద్దిరోజుల్లోనే ఆమె గ్రహించింది. శ్రావస్తిలో తరచు బుద్ధుని దర్శిస్తూ ఆయన బోధనలు వినడానికి అలవాటు పడిన సుభద్రకు అక్కడ ఉండటం కష్టమనిపించింది. ఒకరోజు ఆమె మిద్దెమీదికెళ్లి, శ్రావస్తి దిక్కుగా చూస్తూ, ‘‘భగవాన్‌! ఇక్కడ మీ గొంతు వినపడటం లేదు. మీరు కనపడటం లేదు. మీకు, మీ భిక్షుక సంఘానికి ఏ లోటూ రాకుండా నేను చూసుకుంటాను. నా గోడు విని సత్వరం మీరు రమణక నగరం రావాలి.ప్రాణం పోయినా సరే, మీకు ఆతిథ్యం ఇచ్చికానీ నేను భుజించను’’అని ప్రార్థించింది. విచిత్రంగా బుద్ధుడు భిక్షుక సంఘంతో ఆ నగరంలోకి ప్రవేశించి, నేరుగా ఆమె ఇంటికే భిక్షకు వచ్చాడు. మహదానందంతో వారికి ఆతిథ్యమిచ్చి, తన మనసులోని బాధను ఆయనకు చెప్పుకుంది సుభద్ర. అప్పుడు బుద్ధుడు ‘‘అమ్మా! సుభద్రా! నన్ను రూపకాయంగా చూడటం కాదు, ధర్మకాయంగా చూడు. రూపకాయం కొన్నాళ్లకు శిథిలమై అంతరించిపోతుంది. ధర్మకాయం శాశ్వతంగా ఉంటుంది.. ఈ సత్యాన్ని సదా గుర్తుంచుకో! నిజానికి మనం ఎక్కడున్నా సర్దుకుపోవడం నేర్చుకోవాలిన. భూమాతనే చూడు! ఒకచోట సమతలంగా; వేరొక చోట ఎత్తుపల్లాలుగా, ఇంకొక చోట కంటకమయంగా ఉంటుంది.భూమి ఎలా ఉన్నా, జత చెప్పులుంటే చక్కగా నడిచి పోవచ్చు. అలాగే జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా అధిగమించడానికి కుశల చిత్తం ముఖ్యం! చింతను దూరం చేసేది కుశల చిత్తమే! నీవు ఎల్లప్పుడూ కుశల చిత్తంతో ఉంటే శ్రావస్తి అయినా రమణక నగరమైనా ఒకేలా కనిపిస్తాయి’’అన్నాడు సుభద్రను వాత్సల్యదృష్టితో చూస్తూ! బుద్ధభగవానుల అమృతవాక్కులతో సుభద్ర మనసులోని బాధ తొలగిపోయింది. – చోడిశెట్టి శ్రీనివాసరావు

Back to Top