చీమ కట్టని చీర

Literature On Kathasaram - Sakshi

కథాసారం
తను రోజంతా చీమలా శ్రమించే మనిషి. ఆ చీర కట్టుకుని తనేం పని చేస్తుంది? కట్టుకుని మడత నలగకుండా, పమిటె చెదరకుండా ఒక ఎల్తైన కుర్చీలో నేలని తాకకుండా కూర్చోవాలి! క్రమంగా ఆ చీరంటే ఉత్సాహం పోయింది. అంత పల్చటి చీరా బరువులా తోచింది.

ఇద్దరూ ఆ మధ్యాహ్నపు ఎండలో ఒక బట్టల దుకాణం ముందు ఆగిపోయారు. కన్నయ్య అలాంటి ‘షాపు’లోకి నడిచి ఎరగడు. తనకి కావలసిన ధోవతులు ఊళ్లోనే ఉన్న నేతగాళ్ల దగ్గరే కొనేవాడు. ఇక అతని పెళ్లాం చీరల మాటా? పుట్టింటినుంచి తెచ్చుకున్న వాటితోనే గడుపుతోంది.
కన్నయ్య చెప్పులు విడిచి లోపలికి నడిచాడు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా మనస్సులో జంకుగా ఉంది. వాళ్లు మెడ పట్టుకుని నెట్టేసినా ఆశ్చర్యపడేలా లేడు. ఏదో కొనడానికే వచ్చాడనీ, దారి తప్పి కాదనీ వెంటనే తెలియపర్చకపోతే అంతపనీ చేసేస్తారనుకుంటున్నట్లు ‘‘మా ఆడోళ్లకి చీరలు కొనాలండి–’’ అని ఏదో తప్పు ఒప్పుకుంటున్నవాడిలా చెప్పేశాడు గుమాస్తాని చూస్తూ. ఆ క్షణంలో దుకాణంలో ఉన్న ప్రతిమనిషి, తన భావిని శాసించేవాడిలా కనపడ్డాడు. వెనక్కి తిరిగి బుల్లెమ్మ నుద్దేశించి ‘‘లోపలికి రాయే. పర్లేదు’’ అని దుకాణం యజమాని మొహంలోకి చూశాడు. పై మీద గుడ్డతో మొహం తుడుచుకుంటూ భార్య రాకని పర్యవేక్షించాడు. అంతవరకు ఎండలో నిలుచున్న బుల్లెమ్మ సిగ్గుపడుతూ లోపలికి వచ్చింది.
‘‘ఎలాంటి చీరలు కావాలి?’’ గుమాస్తా మామూలుగానే అడిగాడు. రైతువేషం, రైతుమొహం, రైతుభయం చూసి  లోకువ కట్టలేదు. కాని కన్నయ్య మాత్రం వాళ్ల మెరిసే చొక్కాలనీ, ఇస్త్రీలో బిరుసెక్కిన పంట్లాలనీ చూస్తూ, వాటితో తన మురికిగుడ్డల్ని పోల్చుకుంటూ సిగ్గుపడ్డం మొదలెట్టాడు.
‘‘చీరలండీ మామూలియి. ఒద్దే అక్కల్లేదండి. ఒకటి చాలు’’ అని బుల్లెమ్మ మొహంలోకి చూశాడు. బుల్లెమ్మ తల ఆడించింది.
గుమాస్తా చీరలు తెచ్చి వెదురు పేలికల చాప మీద పరిచేస్తున్నాడు, చీరమీదున్న చీటీ చూడకుండానే దాని ఖరీదు చెప్పేస్తున్నాడు. ధరలు పది నుంచి పద్దెనిమిది రూపాయల వరకూ ఉన్నాయి. బుల్లెమ్మ మనస్సు కేరింతలు కొట్టింది. కుర్చీల మధ్య చోటు చేసుకుని కుదురుగా కూర్చొని ఎంచడం మొదలుపెట్టింది.
బుల్లెమ్మ చిన్న పిల్లలా చీరల్ని వేళ్లతో పట్టుకుని పరీక్షించడం కన్నయ్య సహించలేకపోతున్నాడు. వాళ్లు ‘‘ఎయ్‌. వాటిని తాకకు’’ అంటారని భయం. గుమాస్తా బుల్లెమ్మకు ప్రత్యేకం ఏ చీర ఎందుకు మంచిదో చెప్పుకుపోతున్నాడు. యజమాని టెలిఫోన్‌లో ఇంగ్లీష్‌ మాట్లాడేస్తున్నాడు. ‘‘నౌఎడేస్‌ టైమ్స్‌ వజ్‌ ఛేంజింగ్‌’’. 
కన్నయ్య దైవం మీద భారం వేసి చుట్టూ చూడటంలో పడిపోయాడు. చాలాకాలం గడిచేక బుల్లెమ్మ ఓ చీర ఎంచుకుంది. ముదురు నీలిరంగు. వెడల్పాటి అంచు. ఖరీదు పదిహేను రూపాయల పద్నాలుగణాలు. బేరం మాత్రం హుషారుగా చేశాడు కన్నయ్య. చివరకి వాళ్లను కిందపెట్టీ మీదపెట్టీ పదిహేనున్నరకి ఒప్పించాడు. డబ్బు చెల్లించారు. గుమాస్తా అది చాలా నాణ్యమైన సరుకనీ, చీరపోయినా రంగుపోదనీ హామీ ఇచ్చాక కాని వాళ్లు బయటకు కదల్లేదు. పొద్దు వాలింది. మధ్యాహ్నం కూడు తిని బయల్దేరినవాళ్లు తిరిగి పొయ్యి రాజేసే వేళకి ఇల్లు చేరుకున్నారు. అది కన్నయ్య, అతని తండ్రీ కలిసి ఒక్క ఇటుక వాడకుండా కట్టిన తాటాకుల ఇల్లు.
‘‘పదిహేను రూపాయలే!’’
‘‘నువ్వు మరీని, పదిహేనున్నర!’’
‘‘నా మతి మండా, ఇంకా పదిహేను రూపాయలే అనుకుంటున్నా.’’
బుల్లెమ్మ చీర గురించి తెలిసిన ఆడవాళ్లు అలాగా, ఇంకా అనేక విధాలుగా మాట్లాడుకున్నారు. వాళ్లెప్పుడూ చీర కోసం ఐదు రూపాయలు ఖర్చు పెట్టలేదు. ఒకసారి అచ్చమ్మ మొగుడు ‘రంగం’నించి వస్తూ ఏడు రూపాయల చీర తెచ్చినప్పుడు అందరూ వెళ్లి చూసి, తాకి, ఎన్నిక చేసి వచ్చారు. ఇప్పుడు బుల్లెమ్మ కొనుక్కున్న చీర వాళ్ల అనుభవాన్ని కాదు ఊహను కూడా మించిపోయింది.
అయితే ఇందులో బుల్లెమ్మ తప్పేం లేదు. బుల్లెమ్మ ఖరీదైన చీరల మీది మోజుని అవ్యక్తంలోనే దాచేసుకుంది. తను ఇంట్లో ఎంతో పొదుపుగానూ, తెలివిగానూ పనిచేసి లాభం చేసినా ‘‘అందుకు సొంతలాభం కావాలనుకోలేదు’’. కాని నిన్న రాత్రి కన్నయ్యే మొదలెట్టాడు. అతను ఈసారి ‘దార్ల’కి ఇవ్వాల్సింది ఇచ్చెయ్యగా బోలెడంత లాభం కనపడింది పొలం మీద. అదంతా బుల్లెమ్మ అదృష్టమని తోచింది. రాత్రి కూడు తింటూ ‘‘నీకేం బహుమతి కావాలో కోరుకోయే’’ అన్నాడు, ఇక మోటారుకారు కావాలన్నా ఇచ్చేసేవాడిలా. పైకి అలా అన్నా భయంగానే వుంది, తన తాహతుకి మించిన ఏ బంగారు నగో అడుగుతుందనీ తను చిన్నపుచ్చవలిసొస్తుందనీని. కాని బుల్లెమ్మ అతని భయం, అతని దగ్గరున్న డబ్బులన్నీ తెలిసినదానిలా ఒక ‘అలాంటి చీర’ కావాలంది. బుల్లెమ్మ తెలిసి బాధించదు; తెలియక కూడా బాధించదు. అంచేత బుల్లెమ్మ వద్దన్నా ఇంత ఖరీదు పెట్టి ఈ చీర కొనేశాడు.
∙∙ 
బుల్లెమ్మలో ముఖ్యమైన లక్షణం శాంతం. ఆమె మనస్సులో ఎంత ఉధృతమైన భావాలొచ్చినా ఆమె కదలికలో కనబడవు. పందొమ్మిదేళ్ల బుల్లెమ్మ అలా ఉండటం లోటో, గొప్పశక్తో తెలుసుకోవడం కష్టం. ఎప్పటిలాగే ఆ చీరను చూసి నిశ్శబ్దంగా ఆనందించింది. ఇంటికొచ్చాక ఒకటి రెండు సార్లు ఆ మడతల్లో ముఖాన్ని దాచుకుంది. ఆ చీరది ఒక రకం బిస్కెట్ల వాసన. కొంతసేపు చూసి జాగ్రత్తగా తన పెద్ద కొయ్యపెట్టెలో దాచేసింది.

సాయంత్రం ఇంకా పొద్దుగూకకుండానే అన్నం తినేసి వీధిలోకి వెళ్లిపోయాడు కన్నయ్య. చీకటిపడి అందరి ఇళ్లల్లోనూ పిల్లలు నిద్రకు తయారయ్యాక కూడా రాలేదు. బుల్లెమ్మ ఆరుబయట నులకమంచం వాల్చుకు పడుకుని ఆలోచన మొదలుపెట్టింది. మబ్బులేనిచోట నక్షత్రాలు ఎప్పుడూ లేని కాంతితో మెరుస్తున్నాయి. ఒకవైపు తృప్తి... మరోవైపు ఏదో దిగులు. తనా చీరను ఎప్పుడు ఎలా కట్టుకుంటుందో బుల్లెమ్మకు పాలుపోలేదు. తను రోజంతా చీమలా శ్రమించే మనిషి. ఆ చీర కట్టుకుని తనేం పని చేస్తుంది? కట్టుకుని మడత నలగకుండా, పమిటె చెదరకుండా ఒక ఎల్తైన కుర్చీలో నేలని తాకకుండా కూర్చోవాలి! 

క్రమంగా ఆ చీరంటే ఉత్సాహం పోయింది. అంత పల్చటి చీరా బరువులా తోచింది. తనుండే మట్టి ఇల్లూ, ‘తను’ అనబడే తన ఒళ్లూ ఆ చీరను మురికి చేస్తాయనుకుంది. బుల్లెమ్మ శుభ్రంగానే ఉంటుంది. కానీ ఆ చీరకు తగననుకుంది. అది ఆలోచన ఫలితం కాదు; అదో నమ్మకం; దానికి ఎదురెళ్లడం బుల్లెమ్మకు చేతకాదు. ఆ చీర మర్నాడు కట్టుకోలేదు. ఆ మర్నాడూ కట్టుకోలేదు. నెల్లాళ్లు గడిచినా కట్టుకోలేదు. పెద్ద పండుగ రోజున కన్నయ్య పట్టుపట్టాడు. బుల్లెమ్మ కూడా అతని మాటల ఆసరాతో సిద్ధపడింది కాని మనసు మార్చుకుని చీర పెట్టెలో పెట్టి ఏదో పని కల్పించుకుంది.
సంవత్సరాలు దొర్లిపోయాయి. కన్నయ్య ప్రతీ ఏటా పొలం మీద లాభం తీశాడు. పదేళ్లు గడిచేసరికి భూమి కొన్నాడు తనకు కౌలుకిచ్చిన వాళ్ల దగ్గర్నుంచి. బుల్లెమ్మ కొత్తలో ఆ చీర తరుచుగా పెట్లోంచి తీసి దాన్ని పసిపాపలా ముద్దు చేస్తుండేది.

పురుగు చేరకుండా కలరా ఉండలు ఉంచేది మడతల్లో. ఒక్కోసారి ఎండలో ఉంచి మళ్లీ జాగ్రత్తగా మడత పెట్టి దాచేసేది. ఆ చీరను చూస్తే, తాకితే, ఒళ్లు పులకించేది. కట్టుకోవాలని కోరిక కలిగితే, ‘‘ఆ రోజు వస్తుంది; అప్పుడు!’’ అని మనస్సును మరిపించేది. అదేదో అద్భుతమైన రోజు అని బుల్లెమ్మ నమ్మకం. ఆ రోజు ఎలా వస్తుందో మాత్రం ఊహ కూడా లేదు. ‘‘ఆ రోజూ’’ వచ్చింది. కన్నయ్య పెద్ద ‘‘ఖామందు’’ అయిపోయాడు. పెద్ద కూతురికి చాలా పెద్ద సంబంధం తెచ్చాడు. ఇప్పుడు కట్టుకోవచ్చు. ఇంటి లోపలా, వెలుపలా పెళ్లి సందడి. బుల్లెమ్మ కాస్త తీరిక చేసుకుని గదిలోకి వచ్చి తలుపు గడియ వేసింది. కొయ్యపెట్టె మూత తెరిచింది.

ఎప్పుడూ కట్టక పోవడం చేత ఆ చీర కొత్తదిగా ఉండిపోయింది. అది కొత్త చీరే...! పొందని ఆనందంలో విలువ ఏమంటే అది పాతబడదు. బుల్లెమ్మలా అలా చీరను పూజిస్తూ గడిపినవాళ్లెవరూ కనిపించకపోవచ్చు. అలా లేకపోవడం ఆమె అనుభవానికి మరీ విలువ ఇస్తుంది. కాని బుల్లెమ్మ అంతకంటే అదృష్టవంతురాలే. ఆ చీర ఇప్పుడు కట్టేసుకుని దాని మీదుండే పదిహేనేళ్ల మోజు పోయి ఆ వెలితిని భరించే యోగం ఆమెకు లేదు. ఆ చీర ఇప్పుడు చీరలా లేదు... జల్లెడలా వుంది. పురుగులు చక్కగా ఏవో డిజైన్లు చేసుకుని తినేశాయి. ఒక దీపం ముందుంచి చూస్తే చుక్కలతో నిండిన ఆకాశంలా ఉంటుంది. బుల్లెమ్మ గభాలున గుండెకు హత్తుకుని అక్కడ కూర్చుండిపోయింది. పెద్ద బరువు శాశ్వతంగా తీరిపోయినట్లైంది. ఆమెకు తెలీకుండా కళ్లు, చెక్కిళ్లు తడిసిపోయాయి.

జ్యేష్ఠ కథ ‘విలువలు’ సంక్షిప్త రూపం ఇది. రచనా కాలం: 1958. జ్యేష్ఠ పేరుతో రాసిన ఇవటూరి చిన వీర బసవరాజు తన పంతొమ్మిదేళ్ల వయసులో రాసిన కథ. ఆయన ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. మంచి చదువరి. మార్క్స్, హెగెల్, ఏంగిల్స్, కాంట్‌ సిద్ధాంతాల మీద సాధికారత ఉన్న వ్యక్తి. అనంతర కాలంలో ‘మార్క్సిజం బూజు’ వదిలించుకున్నారు. ధ్యానం వైపు ప్రయాణించారు. 1991లో మరణించారు. మోసపోయేవరకు ప్రతి మనిషినీ నమ్మాలి అనేవారట. సుమారు 75 కథలు రాశారు. ‘జ్యేష్ఠ కథలు’ ఆయన సంపుటి. ఎర్రతేలు ఆయన మరో కథ. ‘నాక్కొంచెం నమ్మకమివ్వు’ నవల. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top