రుణమాఫీ పేరుతో నిండా ముంచారు

KV Ramana Reddy Article On Chandrababu Naidu - Sakshi

విశ్లేషణ

విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క రైతూ తాను తీసుకున్న రుణాలను చెల్లించవద్దని అధికారంలోకి రాగానే వాటిని మొత్తంగా మాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2012 డిసెంబర్‌లో జరిపిన పాదయాత్ర సందర్భంగానూ, తర్వాత 2014లో ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేస్తూవచ్చిన హామీ రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో రైతులు పాత రుణాల చెల్లింపును వాయిదా వేయడమే కాకుండా బంగారం తాకట్టు పెట్టి కొత్తరుణాలు తీసుకున్నారు. తర్వాత రుణమాఫీని చంద్రబాబు రూ.1,50,000లకే పరిమితం చేయడం ఏపీ రైతులకు షాక్‌ కలిగించింది. పాత రుణ బకాయిలు చెల్లించలేక పోవడంతో 2014–15లో రైతులకు బ్యాంకులు పంపిణీ చేయాల్సిన దీర్ఘ, స్వల్ప కాలిక రుణాలు దారుణంగా పడిపోయాయి. దాని దుష్ప్రభావాన్ని ఏపీ రైతులు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు.

విభజనాంతర ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణమాఫీ వ్యవహారం తీవ్రస్థాయి చర్చలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై లోతైన చర్చకు దిగేముందు  రుణమాపీ పథకం నేపధ్యం తెలుసుకోవాలి. 2012 డిసెంబర్‌లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర ప్రారంభించారు. తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అధికారం కట్టబెడితే రైతులు తీసుకున్న దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలను మొత్తంగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పైగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించవద్దని బాబు రైతులను ప్రలోభపెట్టారు. తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ స్థానిక నేతలు ఇల్లిల్లూ తిరుగుతూ ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టుగా పెట్టి బ్యాంకులనుంచి రుణాలు పొందాలని, టీడీపీ అధికారంలోకి వస్తే వాటిని కూడా మాఫీ చేస్తామని ప్రచారం చేస్తూ ప్రజలను ప్రోత్సహిం చాయి. 2014 ఏప్రిల్‌లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ తనకు అధికారమిస్తే అన్నిరకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని బాబు మళ్లీ హామీ ఇచ్చి గద్దెనెక్కాక దాన్ని తుంగలో తొక్కారు.  2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ, 2014 తర్వాత తెలంగాణలో కేసీఆర్‌ కానీ రుణమాఫీని బేషరతుగా అమలు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తన పాలనలో రుణమాఫీ అర్హులను గణనీ యంగా తగ్గించివేయడం గమనార్హం.

వ్యవసాయరంగ దుస్థితికి, రైతుల ఆత్మహత్యలకు అతి ముఖ్యమైన కారణాల్లో రుణగ్రస్తత ఒకటి. రైతాంగంపై రుణమాఫీ పథకం ప్రభావం గురించి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలతో కూడిన చర్చ జరుగుతోంది. రుణమాఫీ రైతులకు రుణ భారాన్ని తగ్గించి కాస్త మేలు చేసినప్పటికీ, రైతాంగ సంక్షోభానికి రుణమాఫీ పరిష్కారం కాదని, ఇది తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం తన ఎన్నికల హామీని నెరవేర్చడంలో భాగంగా 2014లో రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. రైతు రుణాల భారాన్ని ఈ పథకం తగ్గించి రైతులకు మేలు చేకూర్చిందని ఏపీ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకోగా,  2014 మార్చి 31 నాటికి రైతులపై ఉన్న మొత్తం రూ.82,000 కోట్ల రుణాలపై వడ్డీ చెల్లింపునకు కూడా అది సరిపోలేదని వైఎస్సార్‌సీపీ విమర్శ. రుణమాఫీ పథకం ఎలా అమలయ్యిందో తెలుసుకోవడానికి అనంతపురం జిల్లాలోనూ, ఆ జిల్లాలోని ఒక గ్రామంలోనూ రుణమాఫీ అమలు, ప్రభావం గురించి క్షేత్ర పరిశీలన చేయడమైంది. 2014లో రుణమాఫీ పథకం ప్రకటించడానికి ముందు రాష్ట్రంలోని రైతులపై ఉన్న రుణభారం ఎంత? రుణమాఫీ పథకంలో భాగంగా రైతులకు పంట రుణాలను కల్పించడంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది? రైతుల రుణభారంపై రుణమాఫీ ప్రభావం ఏమేరకు ఉంది? అనేవి ఈ అధ్యయనం పరిశీనాంశాలు.

ఏపీ రుణమాఫీ పథకం 2014 అమలు సమీక్ష
2014 ఎన్నికల హామీని అమలు చేయడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. దీనికోసం 02–08–2014న జీఓ నంబర్‌ 164 పేరిట, 2014 ఆగస్టు 14న జీవో నంబర్‌ 174 పేరిట రుణమాఫీ పథకం నిర్వహణ, అమలు మార్గదర్శకాలను ప్రకటించింది. రుణమాఫీ పథకం ప్రధానంగా పంట రుణాలకు సంబంధించింది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు మంజూరు చేసిన బంగారు రుణాలతోపాటు.. వైపరీత్యాల కారణంగా వాణిజ్య, ప్రాంతీయ, సహకార బ్యాంకులు (పట్టణ కోఆపరేటివ్స్‌తో సహా)  మధ్యస్థాయి రుణాలుగా మార్చిన రుణాలను కూడా ఈ పథకంలో భాగం చేశారు. అయితే స్పల్పకాలిక  పంట రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

వ్యవసాయం కోసమే తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను ఈ పథకం నుంచి మినహాయించారు. రుణమాఫీ కోసం ఎంచుకున్న కటాఫ్‌ తేదీని 2013 డిసెంబర్‌ 31 నుంచి 2014 మార్చి 31కి ముందుకు జరపడం ద్వారా మాఫీ చేయవలసిన మొత్తాన్ని గణనీయంగా తగ్గించివేశారు.  రైతులకు ఇక్కడే ప్రధానంగా షాక్‌ తగిలింది. అలాగే అన్ని వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామంటూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి భిన్నంగా కుటుంబానికి రూ. లక్షా 50 వేల రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం పరిమితి విధించింది. రుణమాపీ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం అవసరమైన డేటా అంతటినీ ఎన్‌ఐసీ పోర్టల్‌కి 34 కాలమ్‌ టెంప్లెట్‌లో అందించాలంటూ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులనూ ఆదేశించింది. సేకరించిన సమాచారాన్ని ప్రాసెస్‌ చేసి ఎన్‌ఐసీ రూపొందించిన ఐటీ అప్లికేషన్‌తో దాన్ని జాగ్రత్తగా పరిశీలించి అంతిమంగా నిర్ధారించారు. ఈ సమాచారం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల జాబితాను ఆమోదించి మూడు దశల్లో రుణమాఫీ మొత్తాన్ని పంపిణీ చేసింది.

నగదు పంపిణీ : ప్రభుత్వం నుంచి ఆదేశాలు, నగదు అందిన తర్వాత ప్రభుత్వానికి చెందిన రైతు సాధికారిక సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్‌) రుణమాఫీ నిధులను సంబంధిత బ్యాంకు శాఖలకు పంపించింది. రూ. 50 వేల లోపు రుణాలు ఉన్న రైతులకు మొత్తం నగదును ఒకేసారి ఆర్‌వైఎస్‌ఎస్‌ బదిలీ చేసింది. ఇక రూ. 50 వేల నుంచి రూ. 1.50,000 లోపు రుణాలున్న రైతులకు అయిదింట ఒకవంతును బదిలీ చేశారు. ఇలా రూ. 1.50,000 లోపు రుణాలు కలిగి ఉన్న రైతులకు తక్కిన నాలుగు వార్షిక ఇన్‌స్టాల్‌మెంట్లకు పది శాతం వార్షిక వడ్డీతో కూడిన సబ్సిడీ సర్టిఫికెట్లను కూడా ఆర్‌వైఎస్‌ఎస్‌ జారీ చేసింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని 2014 జనవరి నుంచి 2015 ఆగస్టు– సెప్టెంబర్‌ లోపు ప్రభుత్వం పూర్తి చేసింది..

రాష్ట్ర స్థాయిలో రుణమాఫీ పథకం సూక్ష్మ పరిశీలన
బ్యాంకులు మొత్తం 83.28 లక్షల రుణమాఫీ ఖాతాల వివరాలను ఎన్‌ఐసీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాయి. వీటిని సమగ్రంగా పరిశీలిస్తే, మొత్తం రుణ మాఫీ ఖాతాల్లో 35 శాతం అంటే 29.27 లక్షల ఖాతాలను తిరస్కరించారని తెలుస్తుంది. రేషన్‌ కార్డులకు, పట్టాదారు పాస్‌ పుస్తకాలకు ఆధార్‌ కార్డును లింక్‌ చేయడం వంటి డాక్యుమెంట్లను సరిగా పొందుపర్చలేకపోవడమే దీనికి కారణం. మొత్తం మీద 2015 జనవరి/ఫిబ్రవరి నుంచి 2015 ఆగస్టు/సెప్టెంబర్‌ మధ్యకాలంలో రూ. 7,565 కోట్లను చెల్లించడం ద్వారా 54.06 లక్షల మంది ఖాతాలను విముక్తి చేశారు. ఇకపోతే 2016 జూన్‌లో 36.40 లక్షల ఖాతాలకు రూ. 3,302 కోట్లను రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ నగదును ఆధారంగా చేసుకుని తదుపరి మూడు ఇన్‌స్టాల్‌మెంట్లకుగాను విడుదల చేయాల్సిన మొత్తాన్ని రూ. 24,000 కోట్లుగా నిర్దేశించారు. కానీ టీడీపీ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ కింద 36.40 లక్షల ఖాతాలకు రూ.3,600 కోట్లను పంపిణీ చేయవలసి ఉండగా, 26.23 లక్షల ఖాతాలకు రూ.3070 కోట్లను మాత్రమే విడుదల చేసింది. 10,16,000 ఖాతాలకు చెల్లించవలసిన రూ. 233 కోట్లను మాఫీకి అనర్హమైనవిగా కొట్టేశారు.

ఏపీలోని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకారం, 2014 మార్చి 31 నాటికి వ్యవసాయ పంటల కోసం తీసుకున్న రుణాల (తాత్కాలిక) మొత్తం రూ.59,105 కోట్లు. కానీ, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రుణ ఉపశమన పథకం కారణంగా రాష్ట్ర రైతులు తాము తీసుకున్న స్వల్పకాలిక రుణాలను చెల్లించడం లేదా రెన్యూవల్‌ చేయడానికి సిద్ధపడడం లేదని దీంతో బకాయిలు పెరిగిపోతున్నాయని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో బ్యాంకులు తమ వద్ద ఉన్న నిధులను తిరిగి పంపిణీ చేయలేకపోతున్నాయి. బ్యాంకుల లాభం కూడా తగ్గుముఖం పడుతోంది. ఇలా రైతులు రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో 2014–15 కాలంలో ప్రత్యేకించి ఖరీఫ్‌ సీజన్‌లో బ్యాంకుల రుణ కల్పనను బాగా దెబ్బ తీసింది. ఖరీఫ్‌ సీజన్‌లో బ్యాంకులు నిర్దేశించుకున్న లక్ష్యంలో 24 శాతాన్ని మాత్రమే పూర్తి చేశాయి. అంటే రుణమాఫీ రైతులకు లాభం కంటే ఎక్కువగా నష్టాన్నే తీసుకొచ్చిందని చెప్పాలి.

అనంతపురం జిల్లాలో రుణమాఫీపై సూక్ష్మ పరిశీలన :
నాటి టీడీపీ మేనిఫెస్టో ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ చేయాల్సిన మొత్తం రూ.81,730 కోట్లు కాగా, అనంతపురం జిల్లాలో రూ. 4,812 కోట్లను మాఫీ చేయాల్సి ఉంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని మార్తాడు గ్రామంలో రుణమాఫీకి చెందిన సమాచారాన్ని పరిశోధకులు సేకరించారు. ఇది సాపేక్షికంగా అభివృద్ధి చెందడమే కాకుండా జనాభాపరంగా పెద్ద గ్రామం. హెచ్‌ఎల్‌సీ కెనాల్‌ ద్వారా సాగునీటి కారణంగా అధిక విలువ కలిగిన వాణిజ్య పంటలను ఇక్కడ పండిస్తారు. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) డేటా ప్రకారం 2013 డిసెంబర్‌ 31 నాటికి గ్రామంలో వ్యవసాయ రుణాలు రూ.14.82 కోట్లుగా నమోదయ్యాయి. దీంట్లో అసలు మొత్తం రూ. 13.27 కోట్లు కాగా వడ్డీ రూ.1.55 కోట్లుగా ఉంది. 1,253 కుటుంబాలు 2,324 రుణాలను తీసుకున్నారు.  అయితే 2014 జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యలో గ్రామంలోని 160 మంది రైతులు వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.1.53 కోట్ల మేరకు అదనపు రుణాలు తీసుకున్నారు. దీంతో నాటి టీడీపీ మేనిఫెస్టో ప్రకారం 2014 మార్చి 31 నాటికి మాఫీ చేయవలసిన మొత్తం రుణం రూ. 16.35 కోట్లకు చేరింది (14.82+1.53 కోట్లు).

రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసిన జాబితాల ప్రకారం, 2013 మార్చి 31 నాటికి జిల్లాలో 6,43,548 కుటుంబాలు మొత్తం 10,20,940 రుణాలను తీసుకున్నాయి. ఈ రుణాల మొత్తం రూ. 4,760 కోట్లు. అంటే సగటున ఒక్కో కుటుంబం ఒకటి కంటే ఎక్కువగానే రుణాలు తీసుకుంది. వీరు చెల్లించాల్సిన తలసరి రుణం రూ. 80,056లు. జిల్లాలోని 21 శాతం రుణఖాతాలకు రుణమాఫీని తిరస్కరించారు. 2012–13లో జిల్లాలో అన్ని పరపతి సంస్థలు 1,794 కోట్ల దీర్ఘకాలిక రుణాలను, 83.60 కోట్ల స్వల్పకాలిక రుణాలను పంపిణీ చేశాయి. కానీ 2013–14లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు వరుసగా 3,441 కోట్లు, 290 కోట్లకు అమాంతంగా పెరిగాయి. అంటే 2012–13తో పోలిస్తే ఇది దాదాపుగా రెట్టింపు అన్నమాట.

టీడీపీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర, స్థానిక స్థాయిలో రుణమాఫీ గురించి ఊదరగొట్టడమే దానికి కారణం.  అధికారంలోకి రాగానే రైతు రుణాలను మొత్తంగా మాఫీ చేస్తానని బాబు ఇచ్చిన హామీని తదనంతరం నెరవేర్చలేదు. దీని ఫలితంగా 2014–15లో రైతులకు బ్యాంకులు పంపిణీ చేయాల్సిన దీర్ఘ, స్వల్ప కాలిక రుణాలు వరుసగా రూ. 1966 కోట్లు, రూ.152 కోట్లకు పడిపోయాయి. అంటే రుణకల్పనలో 43 శాతం, 48 శాతం ప్రతికూల వృద్ధి నమోదైంది. రుణమాఫీ అమలులో జాప్యం, రుణ మాఫీపై రైతాంగం పెట్టుకున్న ఆశలు కలిసి ప్రభావం చూపడంతో వ్యవసాయ రంగానికి రుణాల కల్పన దారుణంగా దెబ్బతింది. బాబు హామీ ప్రకారం మొత్తం రుణమాఫీ చేయకపోగా వాయిదాల ప్రకారం చేసిన మాఫీ పాత బకాయిలపై వడ్డీ భారాన్ని మరింతగా పెంచిందన్నది స్పష్టం. పైగా రుణమాఫీని వాయిదాల్లో అరకొరగా చెల్లించడం వల్ల మొత్తం రూ.82,000 కోట్ల రుణాలపై వడ్డీ చెల్లింపునకు కూడా అది సరిపోలేదని ప్రధాన ప్రతిపక్షం చేసిన విమర్శ వాస్తవదూరం కాదని గణాంకాలే తేల్చి చెబుతున్నాయి.

ప్రొ‘‘ కేవీ రమణారెడ్డి
వ్యాసకర్త విశ్రాంతాచార్యులు, ఎస్కే యూనివర్సిటీ
మొబైల్‌ : 91773 35604

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top