సూపర్‌ ట్రెండ్‌ స్టార్‌

Krishna 76th birthday on May 31st - Sakshi

బుర్రిపాలెం నుంచి ఒక కుర్రాడు చెన్నై చేరుకుంటే ‘ఎవర్నువ్వు?’ అని అడిగింది సినీ పరిశ్రమ. ‘నేనంటే నేనే’ అన్నాడా కుర్రాడు. ఆ తర్వాత అతడు ‘అసాధ్యుడు’ అయ్యాడు. ‘అఖండుడు’ అయ్యాడు. ‘అల్లూరి సీతారామరాజు’ అయ్యాడు. సినీ పరిశ్రమ అతడి డేరింగ్‌ డాషింగ్‌ను చూసి అచ్చెరువొందింది. ‘సింహాసనం’ వేసి ‘సూపర్‌ స్టార్‌’ అనే కిరీటంతో సత్కరించింది. మే 31న కృష్ణ 76వ పుట్టిన రోజు.

‘ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ’... 1986. ‘సింహాసనం’ పాటలు విడుదలయ్యాయి. ఒక కొత్త గొంతు. మగ గొంతు. ‘శ’ అక్షరాన్ని ‘స’ అక్షరంగా పలుకుతున్న గొంతు. ముఖ్యంగా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం కాని గొంతు. ఈ గొంతు ఎవరిది? తెలుగు ప్రేక్షకులు చాలా కన్సర్వేటివ్స్‌. వాళ్లు ఘంటసాలను మాత్రమే విన్నారు. రామకృష్ణను మాత్రమే విన్నారు. బాలూను మాత్రమే విన్నారు. కొత్త వాడంటే వినరు. వినాల్సిందే అన్నారు కృష్ణ. ఆయనకు బాలూతో పేచీ వచ్చింది. బాలూకు పాటలు లేనప్పుడు కృష్ణ పాటలు ఇచ్చారు.

కృష్ణకు ఘంటసాల అంతగా మేచ్‌ కానప్పుడు బాలూ ప్రాణం పెట్టి పాడారు. ఇద్దరూ ఒకరి ద్వారా మరొకరు లబ్ధి పొందిన స్నేహితులే. కాని చిన్న మాట పట్టింపు వచ్చింది. బాలూ లేకుండా కృష్ణను ఊహించడం కష్టం. కాని కృష్ణ రాజ్‌ సీతారామ్‌ను తెచ్చారు. ఆకాశంలో ఒక తారగా మలిచారు. ముందు నుంచి కృష్ణ ధోరణి అది. ఆయన ట్రెండ్‌ను ఫాలో కారు. ట్రెండ్‌ ఆయనను ఫాలో అవుతుంది. అందుకే జనం ఆయనను కేవలం డేరింగ్‌ అని ఊరుకోలేదు. డాషింగ్‌ అని కూడా పిలవాలనుకున్నారు. డేరింగ్‌ డాషింగ్‌ కృష్ణ.

‘నట శేఖర’ అనేది ఆయన బిరుదు కావచ్చు. కాని డేరింగ్‌ డాషింగ్‌గా పిలుచుకోవడంలోనే ఒక తృప్తి ఉంది. 70 ఎం.ఎం స్టీరియోఫొనిక్‌లో ‘సింహాసనం’ సినిమా తీశారు కృష్ణ. అంటే ఏమిటో అప్పటి దాకా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. బప్పీలహరి తెలుగు ప్రేక్షకులకు తెలియదు. మందాకిని తెలియదు. అంజాద్‌ ఖాన్‌ తెలియదు. ఏక కాలంలో ఒక తెలుగు నటుడు తెలుగు, హిందీ సినిమాలను డైరెక్ట్‌ చేయడం తెలియదు. కృష్ణ అవన్నీ చేసి చూపించారు. జాతకం అలాంటిది. ‘సింహాసనం’ మీద కూర్చోవడానికే ఆయన పుట్టారు. సింహాసనాన్ని ఏలడానికి వచ్చారు. ప్రేక్షకుల హృదయ సింహాసనాన్ని ఏలుతూనే ఉన్నారు.

‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌’... గ్లాసు పట్టుకుంటే అక్కినేనే పట్టుకోవాలి. ‘కోటలోని చినదానా... వేటకు వచ్చాలే’... కత్తి తిప్పితే ఎన్టీఆరే తిప్పాలి. కాని కాలం అలా ఎల్లకాలం ఉండదే. గన్‌లొచ్చాయి. పిస్తోళ్లొచ్చాయి. రివాల్వర్‌లొచ్చాయి. తెర మీద వాటిని ఢామ్మని పేల్చే కత్తిలాంటి కుర్రాడు కావాలిప్పుడు. సాహసం చేయగలవాడు కావాలి. తెనాలి సమీపాన బుర్రిపాలెం నుంచి అలాంటి సాహసం ఒకటి ఎర్రగా బుర్రగా అందంగా అణకువగా మద్రాసు చేరుకుంది. అసలు కృష్ణ సినీ పుట్టుకే సాహసం అని చెప్పాలి.

పెద్ద పెద్ద హీరోలే సినిమాలు చేయాలని అనుకునే ఆ రోజుల్లో అంతా కొత్తవాళ్లతో సినిమా తీయాలని ఆదుర్తి సుబ్బారావు అనుకోవడం ఒక సాహసం. అదీ కలర్‌లో తీయాలనుకోవడం ఇంకా సాహసం. అందులో కృష్ణను ఒక హీరోగా తీసుకోవాలనుకోవడం ఇంకా సాహసం. సినిమా పెద్దలు చాలామంది దీనిని అనుమానంగా చూశారు. కాని రాబోయే కాలంలో చాలా సాహసాలు చేయబోయే హీరో ఒకడు ఈ సాహసవంతమైన ప్రయత్నం నుంచే పుట్టనున్నాడని వారికేం తెలుసు.

సినిమా రిలీజైంది. పెద్ద హిట్‌ అయ్యింది. జనం చప్పట్లు కొట్టారు. కృష్ణకు కాదు. రామ్మోహన్‌కు. అందులో నటించిన రామ్మోహన్‌ ఆంధ్రా దేవానంద్‌లా ఉన్నాడు భవిష్యత్తు అతనిదే అని అంతా అనుకున్నారు. డూండీ అనే నిర్మాత మాత్రం ఆ సినిమాలో వేగంగా స్కూటర్‌ నడుపుతూ మరో వాహనంలోకి జంప్‌ కొట్టిన కృష్ణ సాహసాన్ని గమనించారు. వెండితెర మీద ట్రిగ్గర్‌ను పేల్చే శక్తి అతనికే ఉందని కనిపెట్టారు. ‘చేస్తావా’ అని కృష్ణను అడిగితే ‘చేసేద్దాం’ అని కృష్ణ అన్నారు. గూఢచారి 116. సీన్‌ కానరీ ఉంటే ఉన్నాడు. ఈ శివరామకృష్ణ తెలుగువాళ్లకు దొరికాడు. ‘ఆంధ్రా జేమ్స్‌బాండ్‌’ కృష్ణ. అది ఆయన సృష్టించిన ట్రెండ్‌.

1967. అమెరికాలో ‘గుడ్‌ బ్యాడ్‌ అండ్‌ అగ్లీ’ రిలీజ్‌ అయ్యింది. 1969. ‘మెకన్నాస్‌ గోల్డ్‌’ విడుదలయ్యి గుర్రపు డెక్కల వెంట కలెక్షన్ల బంగారు నిధిని ఈడ్చుకెళ్లింది. కౌబాయ్‌ సినిమాలంటే గుర్రాలుంటాయ్‌. ఏం మనకు లేవా అనుకున్నారు కృష్ణ. కౌబాయ్‌ సినిమాలంటే ఔట్‌డోర్లుంటాయ్‌. మనకూ రాజస్తాన్‌ ఉంది, థార్‌ ఎడారి ఉంది అన్నారు కృష్ణ. కౌబాయ్‌ సినిమాలంటే డబ్బు మంచినీళ్లలా ఖర్చుపెట్టాలి. వెంటనే అయిదారు డ్రమ్ములు తెప్పించి అందులో నోట్లు కుమ్మరించారు కృష్ణ.

తెలుగులో కౌబాయ్‌ సినిమాయా? సినీ పండితుడిగా, సినీ మాంత్రికుడిగా పేరు గడించిన నిర్మాత చక్రపాణి ఈ సినిమా గ్యారంటీగా పోతుందని జోస్యం చెప్పారు. కాని తీస్తున్నవాడు కృష్ణ. తీసి చూపించాలనుకున్నవాడు కృష్ణ. ‘మోసగాళ్లకు మోసగాడు’. 1971లో రిలీజైంది. ఎంత పెద్ద హిట్‌ అంటే.. ఏ ఇంగ్లిష్‌ వాళ్ల స్ఫూర్తితో ఈ సినిమా వచ్చిందో ఆ ఇంగ్లిష్‌ వాళ్లే ఇంగ్లిష్‌ సబ్‌ టైటిల్స్‌ ‘ట్రెజర్‌ హంట్‌’ పేరుతో ఈ సినిమా చూశారు. ‘కోరినది దరి చేరినది ఓహో కలలు నిజమాయే’... ఆ సినిమాలో కృష్ణ పాడారు. కవి ఎందుకైనా రాసి ఉండవచ్చు. కోరినది దరి చేర్చుకోవడం కృష్ణ బలహీనత. ‘ఆంధ్రా కౌబాయ్‌’ కృష్ణది గురి తప్పని నిషానీ.

తెలుగు వాళ్లకు వీరులు లేరా? ‘కాల్చరా నీకు దమ్ముంటే కాల్చు’ అని ఛాతీ చూపించిన టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నాడు. గొప్ప. కాని అడవులలో ఉండి తుపాకులు పేల్చి, మందిని కూడగట్టి విప్లవం లేవదీసి, బ్రిటిష్‌ వారిని ముప్పు తిప్పలు పెట్టి, అతి పిన్న వయసులో దేశం కోసం ప్రాణాలను భరతమాత కాలి అందియలుగా మలచిన అల్లూరి సీతారామ రాజంటే చాలా క్రేజ్‌. గౌరవం. తీస్తే ఆయన కథ తీయాలి అనుకున్నారు కృష్ణ.

కాని ఆ క్యారెక్టర్‌ మీద ఎన్టీఆర్‌ కన్నుంది. ఆయన ఎప్పుడు తీస్తాడో తెలియదు. తానేమో తలుచుకున్నాక ఆగడు. అల్లూరి కథ తీయాలి. ఎలా తీయాలి? తెలుగువారు ఎల్లకాలం చెప్పుకునేలా తీయాలి. వెండితెర మీద వేయి దివిటీలు వెలుగుతున్నట్టుగా తీయాలి. లక్ష ఫిరంగులు మోగుతున్నట్టుగా తీయాలి. అలా తీయాలంటే ‘సినిమా స్కోప్‌’ కావాలి అనుకున్నారు కృష్ణ. అప్పటికి హిందీలో ఒకటో రెండో సినిమా స్కోప్‌ సినిమాలు వచ్చాయి. తెలుగులో ఇది చాలా పెద్ద వ్యవహారం అన్నారు అంతా.

మనం పెద్ద వ్యవహారాలు చేయడానికేగా ఉన్నాం అన్నారు కృష్ణ. ఏదో తిరునాళ్లకు బయలుదేరినట్టు యూనిట్‌ అడవులకు బయలుదేరింది. ఏదో వనవాసం చేస్తున్నట్టు యూనిట్‌ అడవుల్లో ఉంది. ఏదో మహా తపస్సు చేస్తున్నట్టు యూనిట్‌ తపస్సు చేసింది. ఆ తపస్సును చేయించినవాడు కృష్ణ. 1974. అల్లూరి సీతారామరాజు విడుదలైంది. ప్రేక్షకులు ఊగిపోయారు. తెలుగు వీరుడిని చూసి రేగిపోయారు. బొటన వేలికి గాటు పెట్టి రక్త తిలకాలు దిద్దారు. విప్లవజ్యోతి అల్లూరే కావచ్చు. వెండితెర విప్లవజ్యోతి మాత్రం కృష్ణే.

‘నేనే’ అని ఎవరైనా అంటే కృష్ణకు నచ్చదు. ‘నేను కానా’ అని ఎదురు నిలుస్తారాయన. ఈ తుపాకీ పేల్చేవాడు, విషాదం అస్సలు పలికించలేనివాడు ‘దేవదాసు’ చేయడమేమిటి? అని అందరూ అనుకుంటే ఆత్రేయ, రమేశ్‌నాయుడు, విజయ నిర్మలతో కలిసి ‘దేవదాసు’ చేసి చూపించాడాయన. ఆ దూకుడు కృష్ణది. పౌరాణికాలు కృష్ణ వల్ల కాదు అనంటే అంగరంగ వైభవంగా ‘కురుక్షేత్రం’ చేసి చూపించాడాయన. జయం అపజయం లెక్క కాదు. చేయగలం అని నిరూపించే పంతం. అక్కినేని, ఎన్టీఆర్‌ మంచి రైతు పాత్రలు పోషించి ఉండవచ్చు. 

కృష్ణకు ‘పాడిపంటలు’ వంటి పెద్ద హిట్‌ ఉంది. అక్కినేనికి, ఎన్టీఆర్‌కి మంచి ఫ్యామిలీ డ్రామాలు ఉండొచ్చు.  కృష్ణకు ‘పండంటి కాపురం’ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ ఉంది. అక్కినేని, ఎన్టీఆర్‌లకు స్టూడియోలు ఉండొచ్చు. కృష్ణకు ‘పద్మాలయ’ ఉంది. ఎన్టీఆర్, అక్కినేని... కృష్ణను పెట్టి సొంత నిర్మాణంలో సినిమాలు తీయలేదు.  కృష్ణ వాళ్లిద్దరితో తన బేనర్‌లో సినిమాలు తీశారు. వారితో సరిజోడుగా నటించి మెప్పించారు. ఎన్టీఆర్, అక్కినేని ఏనాటి నుంచో సూపర్‌స్టార్స్‌. కాని జనం ‘సూపర్‌స్టార్‌’ బిరుదుతో పిలుచుకుంది మాత్రం కృష్ణనే. ఆయన సూపర్‌ స్టార్‌ కృష్ణ.
  
రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉంటాయి. కాని వెండి తెర మీద ప్రతిపక్షంలా ఉండటానికి సాహసించినవాడు కృష్ణ. ఎన్టీఆర్‌ పాలన సమయంలో కృష్ణ ఆయన పాలన మీద విమర్శలు చేస్తూ సినిమాలు తీశారు. ‘ముఖ్యమంత్రి’, ‘నా పిలుపే ప్రభంజనం’, ‘రాజకీయ చదరంగం’, ‘సాహసమే నా ఊపిరి’... ఇవన్నీ అప్పట్లో న్యూస్‌ క్రియేట్‌ చేశాయి. ఎన్టీఆర్‌ పట్ల కొద్దో గొప్పో అసంతృప్తితో ఉన్నవారు ఈ సినిమాలతో సంతృప్తి పడ్డారు. ఒక కౌంటర్‌ ఉన్నందుకు ఆనందపడ్డారు. అభిమానులు మాత్రం తమ ఇష్టనటుల మధ్య సాగుతున్న ఒక సరదా ఫైటింగ్‌లా చూశారు. అదంతా ఒక కాలంలో నడిచిన కృష్ణమాయ.

కృష్ణ నిర్మాతల మనిషి. నిర్మాత మేలు కోరే మనిషి. సినిమా కొనసాగుతుండాలని కోరుకునే హీరో. అందుకే ఆయన పారితోషికాలు పట్టించుకోలేదు. ఫ్లాప్స్‌ పట్టించుకోలేదు. ఆర్థికపరమైన లాభనష్టాలను పట్టించుకోలేదు. సినిమాకు ఆయన భుజం ఇచ్చాడే తప్ప భుజం దించేసుకోలేదు. కొత్తగా చేస్తూ పోవడం, ప్రేక్షకులను రంజింప చేస్తూ పోవడం, ముఖానికి మేకప్‌తో కెమెరా ముందు తాను నిలబడితే ఆ పూట షూటింగ్‌ జరిగి వంద కుటుంబాల్లో మెతుకు నోట్లోకి వెళుతూ ఉండటం... ఇవీ ఆయన కోరుకుంది.

సుదీర్ఘమైన జీవితం. సుదీర్ఘమైన కెరీర్‌. సుసంపన్నమైన అభిమాన గణం. లోపలా బయటా ఏవో శక్తులు, సుగుణాలు ఉంటే తప్ప ప్రకృతి ఇవన్నీ సమకూర్చదు. కొత్త తరాలు ఎన్ని వచ్చినా తన ఇంటి నుంచే మహేశ్‌బాబు వంటి సూపర్‌ స్టార్‌ వచ్చినా ఇవాళ్టికీ ప్రత్యేక పాత్రలో కృష్ణ అని తెర మీద కనిపిస్తే టికెట్లు తెగడానికి తెంపడానికి వీలైన క్రేజ్‌ అలాగే ఉంది. కృష్ణ సినిమాకు చాలా ఇచ్చారు. సినిమా కృష్ణకు చాలా ఇచ్చింది. సంతృప్తికరమైన బ్యాలెన్స్‌షీట్‌తో ఉన్న కృష్ణ తన విశ్రాంత దశను హాయిగా గడుపుతుండటం చూసి ప్రేక్షకలోకం శతమానం భవతి అని ఆశీర్వదిస్తూ ఉంటుంది. శతమానం భవతి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top