ఎలా తెలిసింది?

 king is rushing to the horse for a stroll in the forest - Sakshi

చెట్టు నీడ / రంజాన్‌ కాంతులు

రాజుగారు అడవిలో షికారు కోసం గుర్రాన్ని వేగంగా దౌడు తీయిస్తున్నారు. వేట ధ్యాసలో పడి దారిని, సమయాన్ని కూడా మర్చిపోయినట్లున్నారు. వెనక్కి తిరిగి చూస్తే కనుచూపు మేరలో సైనికులెవ్వరూ లేరు. చుట్టూ చీకటి కమ్ముకుంటోంది. దానికితోడు వర్షపు జల్లులు కూడా మొదలయ్యాయి. తలదాచుకునే ప్రయత్నంలో చుట్టూ చూశారు. అల్లంత దూరాన ఓ పూరిగుడిసెలోనుంచి దీపపు కాంతులు కనబడుతున్నాయి. పాదుషాకు ప్రాణం లేచివచ్చినట్లయింది. వెంటనే ఆ గుడిసె ముందు ప్రత్యక్షమయ్యారు. గుడిసెలో ఒకామె కూర్చుని కూరగాయలు తరుగుతోంది. ఆ ముసలావిడ ముందు అణకువతో నిలబడి ఈ ఒక్కరాత్రి తలదాచుకుంటానని ప్రాధేయపడ్డారు. ఆవిడ పెద్దమనసుతో అతన్ని ఇంట్లోకి పిలిచింది. మరికాసేపటికి ఆ పెద్దమ్మ కూతురు ఆవుల మందను తోలుకుని ఇంటికి వచ్చింది.

రోజంతా ఆవులను మేపి అలసిపోయిన ఆ అమ్మాయి ఇంట్లోకి రాగానే మంచంపై మేను వాల్చింది. మేలుజాతి రకం ఆవులు... అందులోనూ పొదుగు నిండుగా ఉన్న ఆవులను పాదుషా ఇదివరకెప్పుడూ చూడలేదేమో! ఎలాగైనా ఈ ఆవుల మందపై పన్ను విధించి, వాటి పాలను రోజూ దర్బారుకు తెప్పించుకోవాల్సిందేననే దుర్బుద్ధి పుట్టింది. అంతలోనే ఆ పెద్దావిడ తన కూతురితో ‘అమ్మా ఆవుపాలు పిండి కాచి తీసుకురా! పాదుషా గారికి వేడి వేడి పాలు ఇద్దాం’’ అని చెప్పింది. ఆ అమ్మాయి ఆవుపాలు పిండేందుకు వెళ్లగా పొదుగులోనుంచి చుక్క పాలు కూడా రాలేదు. ‘‘అమ్మా నాకేదో కీడు శంకిస్తోంది’’ అని పెద్దగా కేకవేస్తూ చెప్పింది అమ్మాయి.. ముసలావిడ ఏమైందో ఏమోనని కంగారుగా వెళ్లింది. ‘‘అమ్మా కాసేపటి క్రితం వరకూ పాలతో పొదుగు నిండుగా ఉంది. ఇప్పుడేమో పాలు పిండుతుంటే చుక్క కూడా రావడం లేదు’’ అని ఆందోళనగా చెప్పింది.

‘‘ఈ రాత్రికి వదిలేయ్‌. తెల్లారాక చూద్దాం’’ అని కూతురికి నచ్చచెప్పింది. తల్లీకూతుళ్ల మాటలు వింటున్న పాదుషా వెంటనే తన మనసులోని పన్ను కట్టించాలన్న ఆలోచనను విరమించుకున్నాడు. ఆ రాత్రి అలసటతో నిద్రలోకి జారుకున్నాడు.‘‘అమ్మా ఇప్పుడు పాలు పితుకు’’ అని తన కూతురికి చెప్పింది ఆ ముసలావిడ. ఆ అమ్మాయి ఆవు పొదుగు పిండగానే పాలు పుష్కలంగా వచ్చాయి. రోజూలాగే నాలుగు చెంబులూ పాలతో నిండిపోయాయి. రాజుగారు వేడి వేడి పాలను సేవించారు. ఎంతో రుచికరంగా ఉన్నాయని కితాబు కూడా ఇచ్చారు. అంతలోనే సైన్యం పాదుషాను వెతుక్కుంటూ పూరిగుడిసెలో ప్రత్యక్షమయ్యింది.మర్నాడు పాదుషా ఆజ్ఞమేరకు తల్లీకూతుళ్లను దర్బారుకు తీసుకొచ్చింది సైన్యం. వారికి దగ్గరుండి అతిథి మర్యాదలు చేశాడు పాదుషా.

ఆ తరువాత ఆ పెద్దామెను ‘ఆ రోజు నా మనసులో దుర్బుద్ధి కలిగిన విషయం మీకెలా తెలిసింది’ అని అడిగారు కుతూహలంగా. ‘రాజదర్బారు నుంచి న్యాయపరమైన నిర్ణయాలు జరిగిన ప్రతీసారి పల్లెటూళ్లల్లో, అడవుల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రజలంతా హాయిగా ఉంటారు. ఏదైనా దౌర్జన్యపూరితమైన నిర్ణయం జారీ అయినప్పుడు మాత్రం లాభాల స్థానంలో నష్టాలు వస్తాయి. ఇదే సంకేతం. ఎప్పుడు ఎలాంటి ఆదేశాలు జారీ అయ్యాయో ఇట్టే పసిగట్టగలుగుతాము.’’ ఈ మాటలు విన్న పాదుషా నోరెళ్లబెట్టాడు. తల్లీ కూతుళ్లను మెచ్చుకుని సత్కరించి బహుమానాలిచ్చి పంపాడు.
– అబ్దుల్‌ మలిక్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top