రుద్ర ప్రయాగ చిరుతపులి

Kandukuri Ravindranath Writes On Gym Carbet - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం
జిమ్‌ కార్బెట్‌ వేట జీవితం ఒక అద్భుతం. ఆయన స్వీయ అనుభవాల నుంచి రాసిన పుస్తకం, ‘దమ్యాన్‌ ఈటింగ్‌ లెపర్డ్‌ ఆఫ్‌ రుద్రప్రయాగ్‌’(మనుషుల్ని తినే రుద్రప్రయాగ చిరుతపులి). వందలాది మనుషుల్ని తినమరిగిన ‘ఒకే ఒక’ చిరుతపులిని, వందల మామూలు చిరుతపులుల్లో విడిగా గుర్తించి, దానికోసం రాత్రుల్లో కొండల మీదా, అడవుల్లోనూ వందల మైళ్లు కాలినడకన తిరిగి, 65 రాత్రులు చలిలో, మంచులో, వర్షంలో కటిక చీకట్లో మాటువేసి చివరికి దాన్ని చంపిన వాస్తవ గాథ ఇది. ఈ ఒక్క పుస్తకమే పది ప్రేరేపణల పెట్టు.

కటిక చీకట్లో చిరుతపులి గడ్డిపరకల్ని రాసుకుంటూ వెళ్తే, ఆ శబ్దాల్ని పట్టుచీర రెపరెపలతో పోలుస్తాడు కార్బెట్‌. ఈ అడవిలో, ఈ వెన్నెలరాత్రిలో, చంద్రకాంతి క్షణమైనా దూరని కొన్ని మరుగుల్లోనే చిరుత నడిచిందంటాడు. అనుభవమైతేగానీ ఊహించలేని హడల్‌ని ఆ చిరుత కలిగించిందంటాడు. ఆయన చిరుతపులిని వేటాడ్డమొక్కటే కాదు, అదీ ఆయన్ని వేటాడుతుంది. ఒక మనిషికీ, చిరుతకీ మధ్య ఎత్తుకు పై ఎత్తు ఆట సాగుతుంది.

అడవిలోని మేఘాలనూ, సూర్యాస్తమయాన్నీ కార్బెట్‌ వర్ణించిన తీరు కవితాత్మకంగా ఉంటుంది. తీగతోకతురాయి పక్షి ఇతర పక్షుల ఆహారాన్ని ఎలా దొంగతనం చేస్తుందో చెప్తాడు. రెండు చిరుతపులులు పోట్లాడుకుంటుంటే, దూరంగా చీకట్లో వింటూ, ఆ పోరాటాన్ని వర్ణించిన తీరు టీవీలో చూస్తున్నట్టే ఉంటుంది.
‘పులికీ, చిరుతపులికీ మనుషులు ఆహారం కాదు. మనల్ని తినొచ్చని వాటికి తెలీనే తెలియదు’. ఇదీ జిమ్‌ కార్బెట్‌ సిద్ధాంతవాక్యం. అలాంటిది, నూటికో కోటికో ఒకటి మనుషుల్ని తినమరిగితే అది ఎంత భయోత్పాతాన్ని కలిగిస్తుంది!

ఇది చదువుతూంటే, మనం కూడా చిరుతపులిని వేటాడ్డానికి ఆయనతో ప్రయాణమైన అనుభూతి పొందుతాం. బోనుల్లోంచీ, విషప్రయోగాల నుంచీ, జిన్‌ట్రాప్‌ నుంచీ, బంధించిన గుహలోంచీ ఆ చిరుత తప్పించుకుంటుంటే– ఇంకా ఏం చెయ్యాలా? అని ఆలోచిస్తాం. అందుకే 72 సంవత్సరాలుగా ఈ పుస్తకాన్ని ఎన్నో భాషల్లో పాఠకులు చదువుతున్నారు. తెలుగులోనూ దాన్ని చదివించాలని నేను ‘రుద్రప్రయాగ చిరుతపులి’ పేరుతో అనువదించాను.
- కందుకూరి రవీంద్రనాథ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top