ఏవని తడవనూ ఎన్నని చెప్పనూ


నాకు నచ్చిన 5 పుస్తకాలు


తేనెతుట్టె మీద రాయి విసిరితే తేనెటీగలు ఝమ్మని రొద చేస్తూ ఎంత కంగారు పెడతాయో, ఇష్టమైన పుస్తకాలు అనగానే మనం చదివిన పుస్తకాలు కూడా అంతే కంగారు పెడతాయి. అయినా అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సావకాశంగా ఆలోచించినప్పుడు మస్తిష్కాకాశంలో శుక్రుడిలా కొన్ని పుస్తకాలు మిలమిలా మెరుస్తాయి. అలా మెరిసిన కొన్ని తారకలు:



లస్ట్‌ ఫర్‌ లైఫ్‌

జీవితచరిత్రలంటే మొదటగా స్ఫురించే పేరు ఇర్వింగ్‌స్టన్‌. ఆయన రాసిన ‘లస్ట్‌ ఫర్‌ లైఫ్‌’ నన్ను నిలువెల్లా కదిలించింది. చిత్రకారుడు విన్నెంట్‌ వాంగో జీవితపు ప్రయాణాన్ని ఇది కళ్లముందుంచుతుంది. వాంగో బొమ్మలు వేసిన విధానం, ఉపయోగించిన గాఢమైన వర్ణాలు, అసామాన్యరీతిలో చేసిన వర్ణసమ్మేళనం చూస్తే నిశ్చేష్టులవుతాం. ఈ మాటలు అతిశయోక్తి కాదనడానికి ‘సన్‌ఫ్లవర్‌’, ‘బూట్స్‌’ చిత్రాలు చాలు! ఇంత ప్రతిభ గల వాంగో జీవితం ఆసాంతం విషాదభరితం. బొగ్గుగని పరిసరాలు, కార్మికుల రూపాలు, మండించే ఎండ... ఎక్కడా నాటకీయతను చొప్పించకుండా, రాగద్వేషాలకు అతీతుడైన యోగిలాగా ఇర్వింగ్‌స్టన్‌ ఈ రచన చేశాడు.



ఉన్నై పోళ్‌ ఒరువన్‌

తమిళంలో నా అభిమాన రచయిత జయకాంతన్‌. ఆయన నవల ‘ఉన్నై పోళ్‌ ఒరువన్‌’ నాకెంతో ఇష్టం. భర్త పోయిన ఒక స్త్రీ. ఆమెకో పదేళ్ల కొడుకు. చిలుకజోస్యం చెప్పేవాణ్ని ఆమె వలచింది. అతడూ వీరిద్దరినీ నిష్కల్మషంగా అభిమానిస్తాడు. కానీ పసివాడు అతడిని ద్వేషిస్తాడు. సంభ్రమాశ్చర్యాలకు లోనుగావించే సంఘటనలుగానీ, గొప్ప మలుపులుగానీ ఉండవు. ‘లీనియర్‌ ప్రోగ్రెస్‌’తో సాగిపోయే కథ. దీన్ని ఒక రచయిత(సారీ! పేరు జ్ఞాపకం లేదు) ‘నీలాంటి ఒకరు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ నవలను వేరొక దర్శకుడికి ఇవ్వడం ఇష్టంలేక జయకాంతనే అతితక్కువ ఖర్చుతో, సినీరంగంతో పరిచయం లేని నటులతో సినిమాగా రూపొందించి జాతీయ బహుమతి గెలుచుకున్నారు.



వాగ్దత్త

శరత్‌బాబు రాసిన నవలల్లో ‘వాగ్దత్త’ నాకు మధురస్మృతిగా మిగిలిపోయింది. ముగ్గురు స్నేహితులు ఒక గ్రామంలోని బళ్లో చదువుకుంటూ ఉంటారు. తమ తదనంతరం తమ పిల్లలు తమ స్నేహబంధాన్ని శాశ్వతంగా నిలపాలని వారు తపిస్తారు. ఇతివృత్తం చాలా తక్కువ. కథకంటే కథనం మనోహరంగా ఉంటుంది. ‘మనిషికి కావాల్సింది మతాచరణ కాదు. నిర్మల అంతఃకరణం’ అనే సందేశాన్నిచ్చే ఇది ‘దత్త’ పేరుతో బెంగాలీలో సినిమాగా రూపొందింది. నవల ఆధారంగా ఆత్రేయ తానే దర్శకుడై ‘వాగ్దానం’ నిర్మించారు. బెంగాలీ చిత్రంలోని నిజాయితీ ఇందులో లోపించడంవల్ల నిరాశ పరుస్తుంది.



చెమ్మీన్‌

మలయాళ సాహిత్యంలో తగలి శివశంకర్‌ పిళ్లై భీష్మాచార్యుని వంటివారు. భార్య తప్పు చేసినట్లయితే సముద్రం మీద వేటకు వెళ్లిన భర్తకు ప్రాణహాని జరుగుతుందని కేరళ మత్స్యకారుల కుటుంబాల్లో ఒక నమ్మకం ఉండేది. దాని ఆధారంగా రాసిన ముక్కోణపు ప్రేమ నవల చెమ్మీన్‌. మతాంతర ప్రేమను అటు సమర్థించకుండా, ఇటు నిరసించకుండా దానికి సమాంతరంగా నిలిచిన సంప్రదాయ సమాజాన్ని తగళి ఆవిష్కరించాడు. విజయా సంస్థతో అనుబంధమున్న దర్శకుడు రామూ కారియత్‌ మొండిమనిషి తగళిని ఒప్పించి దీన్ని తెరకెక్కించాడు. చిత్రం జాతీయ పురస్కారం గెలుచుకుంది. గన్నవరపు సుబ్బరామయ్య దీన్ని ‘రొయ్యలు’ పేరుతో తెలుగులోకి చక్కగా అనువదించారు.



కుట్ర

రంగనాయకమ్మ రాసిన నవలల్లో అంతగా ప్రాచుర్యం పొందని గొప్ప రచన ‘కుట్ర’. విప్లవకారుల నినాదాలనూ, వాళ్ల గోడలమీది రాతలనే ఆమె తన రచనకు ఆధారం చేసుకున్నారు. కేవలం భాషకు సంబంధించిన అంశాల మీద ఒక నవలను రాయడం సాహసమే. తెలుగు భాషలో చోటు చేసుకున్న కృత్రిమ వాక్య నిర్మాణాలను ఆమె తూర్పారబట్టారు. తెలుగుభాషా సంప్రదాయాలు బొత్తిగా తెలియని విప్లవకారులు ‘కుట్రలేం చేస్తారు?’ అని వాదిస్తారు. అసలు కుట్రే లేనప్పుడు వారిపై బనాయించిన కుట్ర కేసులన్నీ ‘ఉత్త హంబగ్‌’ అంటారు. ఇందులో ‘జడ్జి’ పాత్ర హాస్య, వ్యంగ్య వైభవంతో అలరారుతుంది.


కంపల్లె రవిచంద్రన్‌

9848720478


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top