ఆఖరి వాంగ్మూలం

Japanese Writer Soseki Natsume Kokoro Book - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

జపాన్‌ రచయిత సొసెకి నట్సుమే (1867–1916) గురించి ఎందుకో ఆసక్తి కలిగి వెతుకుతూవుంటే ఆయన ఒక పుస్తకం 1957లోనే తెలుగులోకి అనువాదమైందని తెలిసి ఆశ్చర్యానందాలు కలిగాయి. ఆ నవల పేరు కోకొరొ. ఈ జపనీస్‌ మాటకు విస్తృతమైన అర్థం ఉంది. హృదయం, ఆత్మ, మనసు– ఇవన్నీ కలిసినది. కోకొరో చెదిరిపోయిన ఒక ప్రొఫెసర్‌ కథ ఇది. ఈ నవలను ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ ప్రచురించింది. అనువాదకులు శ్రీనివాస చక్రవర్తి. 

నవల తొలి ప్రచురణ 1914లో. సొసెకి మరణానికి రెండేళ్ల ముందు. మూడు భాగాలుగా ఈ నవల ఉంటుంది. సెన్సే–నేను, నా తల్లిదండ్రులు–నేను, సెన్సే– అతని ఆఖరి ఉత్తరం. సెన్సే అనేది ఒక గౌరవసూచిక. గురువు అని అర్థం చెప్పుకోవచ్చు. ఈ నవల ఎంత ప్లెయిన్‌గా సాగుతుందంటే పెద్ద కథ ఒకటి ఉన్నట్టు అనిపించదు. మొదటి రెండు భాగాలు కూడా సెన్సే ఈ ప్రపంచంలోంచి వెళ్లిపోవడానికి ముందు తాను అంతకుముందు కథకుడితో వాగ్దానం చేసినట్టుగా రాయబోయే సుదీర్ఘలేఖకు తగిన ఉద్వేగాన్ని నిర్మించిపెట్టేవే. సెన్సే తనను తాను కూడా ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాడనే విషయానికి కారణమైన నైతిక అపరాధ భావనను ఈ నవల చిత్రించినట్టుగా కనబడుతుంది. కానీ దానికంటే కూడా మనిషికి ఒంటరితనమే ప్రధాన సమస్య అని అంతర్లీనంగా చెబుతుంది. 

నవలకు ముందుమాటలో శాంతా రంగాచారి ఇలా రాశారు: ‘నట్సుమె సొసెకీ మ్యూజీ యుగంలో జీవించడం వల్ల ఆ యుగానికి చెందిన సంస్కృతి, భక్తి విశ్వాసాలు, పాశ్చాత్య భావాల ప్రభావం ఈయన రచనలో ప్రతిబింబించాయి. వీరి ప్రారంభ రచనలో ఎక్కువగా హాస్యం, చమత్కారంతో కూడిన అవహేళన పొడగడుతుంది. ముక్తి, ఆత్మశాంతి కోసం అన్వేషణల విషయమై ఈయన మనసులో చెలరేగిన తుపాను ఈయన రచించిన మూడు నవలలోను ద్యోతకమవుతుంది. జీవిత దృక్పథంలో నిరాశా నిస్పృహలు ఈ కాలంలోనే ప్రారంభమయ్యాయి. ఈ నిరాశా నిస్పృహల మూలంగానే ‘కోకొరో’ అంతటా విధి సిద్ధాంతపు ప్రాబల్యంతో బాటు, అందులోని పాత్రలు జీవితానికి, విధికి ఏమాత్రం ప్రతిఘటించకుండా తల ఒగ్గినట్లు కనబడుతుంది’.

అయితే, జపనీస్‌ ఎటూ చదవలేనుగానీ ఇంగ్లిష్‌లో ఈ నవల ఎలా ఉందోనని చూస్తే గ్రహించిన విషయం– ఈ తెలుగు అనువాదం సంక్షిప్తంగానే చేసిందని. మూడింట ఒకటోవంతు మాత్రమే తెలుగులోకి వచ్చింది. అందుకే ప్రారంభ వివరాల్లో ఒక గొలుసు ఏదో తెగినట్టు అనిపించింది. కథేమీ జరగదు. కానీ కథకుడికీ సెన్సేకూ పరిచయం కావడానికి దారితీసిన పరిస్థితిని చాలా వాస్తవికంగా చిత్రిస్తాడు సొసెకి. కథకుడు ఒంటరిగా సముద్రానికి ఈతకని వెళ్లడం, సెన్సే ఓ తెల్లాయనతో రావడం, ఎవరు ఎవరినీ పట్టించుకోనంతటి గుంపులో ఒక కన్ను సెన్సే మీద పడటానికి అదో కారణం కావడం, రెండ్రోజుల తారసపాటు తర్వాత ఆ మాట్లాడుకునే మొదటిమాట... ఇదంతా. అయినా సారం గ్రహించడానికి తెలుగు అనువాదం సరిపోతుంది. 
https://archive.org/details/in.ernet.dli.2015.333881 లింక్‌లో ఉచితంగా చదవొచ్చు.
-ఎన్‌.ఎస్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top