కలల్ని కంటున్నారు తప్ప పిల్లల్ని కనడం లేదట!

Japan ministers worry on japan's population - Sakshi

జపాన్‌ మంత్రుల బెంగ

కంజీ కటో అనే పెద్దమనిషి జపాన్‌లో రూలింగ్‌ పార్టీ ఎంపీ. ఆయన వయసు 72 ఏళ్లు. ఎక్కడ పెళ్లిళ్లు జరిగినా ఆయనకు ఆహ్వానం అందుతుంటుంది. ఆయన్ని కూర్చొబెట్టి,  చక్కగా భోజనం పెట్టి, వధూవరులకు ఆయనచేత ఆశీర్వచనాలు ఇప్పించి నాలుగు మంచి మాటలు చెప్పమని కూడా అడుగుతుంటారు. అప్పుడు మిగతావేవీ మాట్లాడకుండా ఆయన ఒకటే మాట అంటారు. ‘సంతానప్రాప్తి రస్తు..’ అని!  

ఇది మంచి మాటే. అయితే ఆ వెంటనే ఆయన ఇంకో మాట కూడా అంటారు. కనీసం ముగ్గురు పిల్లల్నైనా కనమని! పెళ్లిళ్లలో ఫంక్షన్‌లలో అందరూ పిల్లల్ని కనే ఉద్దేశంలో ఉన్నవాళ్లే ఎదురౌతారా! అందుకే కొన్నిసార్లు మంత్రిగారికి ఎదురు దెబ్బ కూడా తగులుతుంటుంది. పెళ్లికాని అమ్మాయిల్ని పట్టుకుని ఆయన, ‘త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండడమ్మా’ అని సలహా ఇచ్చినప్పుడు ‘పెళ్లికేం తొందరండీ, ముందు లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలి కదా’ అంటారు వాళ్లు. అప్పుడు ఆయనకు కోపం వచ్చేస్తుంది.

‘మీరు లైఫ్‌లో సెటిల్‌ అవడం సరే, ముందు దేశాన్ని సెటిల్‌ చెయ్యండి. ఆ మాత్రం దేశభక్తి లేకపోతే ఎలా?’ అని చికాకు పడతారు కజీ కటో. కెరీర్‌ కోసం పెళ్లి చేసుకోకుండా అలా ఏళ్లకు ఏళ్లు ఉండేపోయే యువతులకు ఆయన ఆరోగ్య సలహాలు కూడా ఇస్తారు. ‘చూడండి అమ్మాయిలూ.. ఉద్యోగం, డబ్బు, అంతస్తు.. ఇవి మాత్రమే జీవితం కాదు. పిల్లలు కూడా ఉండాలి. పిల్లల్లేకపోతే కుటుంబానికైనా, దేశానికైనా నిండుదనం రాదు. రాకపోతే పోయింది, లేనిపోని సమస్యలు వస్తాయి’’ అని చెబుతారు.

ఆడవాళ్లు జన్మనిచ్చే యంత్రాలు – యకువో యనాగిసావా, ఆరోగ్యశాఖ మంత్రి (2007)

అంతవరకు పర్వాలేదు  
.. ఇప్పుడు ఇంకో మాట కూడా ఆయన అన్నారు. సింగిల్‌ ఉమన్‌ దేశానికి భారం అవుతారట! ‘‘శిశు సంక్షేమం కోసం వసూలు చేస్తున్న పన్నుల్ని, ఒంటరి మహిళల వృద్ధాప్య జీవితానికి వాడవలసిన పరిస్థితిని ప్రభుత్వానికి రానీయకండి.

పిల్లల్ని కననివాళ్ల వల్ల దేశానికి ఉపయోగం లేకపోగా, పిల్లల కోసం ఉంచిన డబ్బును కూడా పిల్లల్లేని మహిళలకు ఉపయోగించడం దేశానికి రెండు విధాల నష్టం’’ అని కజీ కటో మొన్న శుక్రవారం పార్టీ సమావేశంలో అన్న  మాట ఇప్పుడు ఆ దేశంలో రాద్ధాంతం అవుతోంది. మహిళా సంఘాలు కజీ కటోపై మండిపడుతున్నాయి. ఆయన అన్న రెండు విధాల నష్టం ఏంటంటే.. పిల్లల్ని కనకపోవడం ఒక నష్టం. పిల్లల్ని కనని వాళ్లను వాళ్ల చరమాంకంలో పిల్లల్లా చూడవలసి రావడం ఇంకో నష్టం!

పైగా సాధికార మంత్రి
ఇంతకీ ఈయన ఏ శాఖకు మంత్రనుకున్నారూ? మహిళా సాధికారత శాఖకు! 2007లో కూడా ఇలాగే ఒక  మంత్రి.. ఆయన ఆరోగ్య శాఖ.. ఇలాగే మహిళల మనోభావాల్ని నొప్పించేలా మాట్లాడారు. ఆయన పేరు యకువో యనాగిసావా. ‘మహిళలు జన్మనిచ్చే యంత్రాలు. ఆ యంత్రాలు తమ ధర్మాన్ని నిర్వర్తించడం పౌరధర్మం’ అని సెలవిచ్చారు.  
ఉద్దేశం మంచిదే అయినా చెప్పే పద్ధతి సవ్యంగా లేకపోవడంతో ఇదిగో ఇలాగే తలంటు పోయించుకోవలసి వస్తుంది.

ఒంటరి మహిళలు దేశానికి భారం – కజీ కటో, మహిళా సాధికార మంత్రి (2018)

ఏమన్నా బాగుందా?!
కజీ కటో ఇంత కఠినమైన వ్యాఖ్య చేయడానికి కారణం.. జపాన్‌ జనాభా దారుణంగా పడిపోయిందన్న ఓ అధికార నివేదిక! 2018 ఏప్రిల్‌ నాటికి 15 ఏళ్ల లోపు వయసున్న పిల్లల సంఖ్య సుమారు కోటీ యాభై లక్షలు. మునుపటి ఏడాది కంటే ఈ సంఖ్య లక్షా 70 వేలు తక్కువ! గత ఏడాది జపాన్‌లో 9 లక్షల 41 మంది శిశువులు జన్మించారు. 1899 తర్వాత ఇంత తక్కువ జనాభా నమోదు కావడం ఇదే మొదటిసారి.

పిల్లలి కనండి, జనాభాను పెంచండి అని వధూవరులకు ప్రభుత్వం ఎన్ని ప్రోత్సహకాలు కల్పించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. జపాన్‌ ప్రస్తుత జనాభా సుమారు 13 కోట్లు. జనాభా ఇంత మందకొడిగా, ఒకటీ అర శాతంగా పెరుగుతుండడంపై మొదట కలత చెందిన రాజకీయ నాయకుడు కూడా కజీ కటోనే. అందుకే ఆయన ఏ ప్రసంగంలో మాట్లాడినా.. పిల్లల్ని కనడమే జపాన్‌ మహిళ జీవిత ధ్యేయం కావాలి అనేవారు. ఇప్పుడిక లాభం లేదనుకుని.. మీరిలాగే ఒంటరిగా ఉండిపోతే మీరు ముసలివాళ్లైపోయాక ఆశ్రమాల్లో ఉంచి మిమ్మల్ని పోషించే శక్తి జపాన్‌కు లేదు అని హెచ్చరిస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top