ఇటలీలో పెళ్లి!

Italian wedding for Deepika Padukone-Ranveer Singh in November - Sakshi

చిలక చెప్పింది

ముందసలు ఇటలీ సంగతలా ఉంచండి. వీళ్లిద్దరికీ పెళ్లని ఎవరు చెప్పారు! ఎవరు చెప్తారు?! సెలబ్రిటీలు చేసుకోబోయే పెళ్లిళ్ల గురించి ఎవరైనా బాజాభజంత్రీలు మోగించి చెప్తారా! మనమే ఊహించుకోవాలి. ఎప్పట్నుంచి చూస్తున్నాం దీపికను, రణవీర్‌ని! ఫస్ట్‌ టైమ్‌ ఐదేళ్ల క్రితం సంజయ్‌ లీలా భన్సాలీ ‘గోలియోంకీ రాస్‌లీలా, రామ్‌లీలా’లో ఇద్దరూ కలిసి కనిపించినప్పట్నుంచీ ఆడపెళ్లి వాళ్లకు.. అంటే దీపిక ఫ్యాన్స్‌కు, మగ పెళ్లి వాళ్లకు.. అంటే రణ్‌వీర్‌ ఫ్యాన్స్‌కీ డౌట్‌ కొట్టింది. అంతలా ఆ మూవీలో ఇద్దరి మధ్యా రసాయనశాస్త్రం (కెమిస్ట్రీ) వర్కవుటైంది. తర్వాత రెండేళ్లకు ‘బాజీరావ్‌ మస్తానీ’లో దీపిక  ఏకంగా రణవీర్‌ రాజ్యానికే వచ్చేస్తుంది! అప్పుడూ కెమిస్ట్రీ వర్కవుటైంది. తర్వాత రెండేళ్లకు మళ్లీ ఇద్దరూ ‘పద్మావత్‌’లో కనిపించారు. కలిసికాదు. కలవకుండా! కలవకుండా కలిసి కనిపించినా కూడా  అందులో కెమిస్ట్రీ వర్కవుట్‌ అయింది. ఇన్నిసార్లు మూవీల్లో వీళ్లిద్దరికీ వర్కవుట్‌ అవడమే కానీ, మ్యారేజ్‌ వర్కవుట్‌ అవుతున్నట్లు ఎక్కడా కనిపించలేదు. 

2015 ఐఫా అవార్డు ఫంక్షన్‌లో మాత్రం వేదికపైన రణవీర్‌ దీపికు ప్రపోజ్‌ చేస్తున్నట్లుగా మోకాలిపై కూర్చున్నాడు. ఏదో ఫ్లర్ట్‌ చేస్తున్నాడు అనుకున్నారు కానీ, ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ రణవీర్, దీపిక విషయంలో సీరియస్‌గా కనిపించకపోయినా, సిన్సియర్‌గా ఉన్నాడని ముంబైలోని ఖర్‌ ఏరియాలో ఒకే బిల్డింగులో రెండు ఫ్లోర్‌లను కొన్నప్పుడే ఆ చుట్టుపక్కల ఉండే ఇద్దరి అభిమానులు పసిగట్టేశారు. రణవీర్‌ ఇప్పుడు అక్కడే ఉంటున్నాడు. అతడితో పాటు అతడి పేరెంట్స్‌ కూడా! అప్పుడప్పుడూ మాత్రం దీపిక ఒక విజిట్‌లా వచ్చి వెళ్లిపోతున్నారు. అలా వచ్చి వెళుతున్నప్పుడు రెండు రోజుల క్రితమే దీపిక తన తల్లితో కలిసి ఓ జ్యుయలరీ షాపులో ఆభరణాలు కొంటూ మీడియా కంట పడ్డారు. అబ్బాయి ఇల్లు కొన్నాడు. అమ్మాయి నగలు కొంది. ఇక మిగిలింది.. అమ్మాయి నగలు ధరించి, అబ్బాయి ఉన్న ఇంట్లోకి వచ్చేయడం. అలా వచ్చేయాలంటే ముందు పెళ్లి జరగాలి కదా! ఆ పెళ్లి కోసమే రణవీర్, దీపిక కలిసి.. ఇటలీలో ఓ మనోహరమైన ప్రదేశంలో పెళ్లి పందిరి వేసుకోడానికి ఇటలీ ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నారని ఆర్ణబ్‌ గోస్వామి నడిపే రిపబ్లిక్‌ చిలక కార్డు బయటికి తీసి చెప్పింది. మరి ఈ జంట ఇటలీనే ఎందుకు ఎన్నుకున్నట్లు? అనుష్క, విరాట్‌ల పెళ్లి అక్కడ ఎలాగైతే డీసెంట్‌గా, గుట్టుగా జరిగిపోయిందో అలాగే తమ పెళ్లీ జరిగిపోవాలని రణవీర్, దీపిక కోరుకుంటున్నారట! లేదంటే ఇటలీ అంటే అంతా నమ్మేస్తారని ఆర్ణబే ఇటలీ అని అన్నాడేమో! ఏమైనా మేడ్‌ ఫర్‌ ఈజ్‌ అదర్‌. పెళ్లి డిసెంబర్‌లోపే అయిపోతుందట. అదీ ఆర్ణబ్‌ చిలకే చెప్పింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top