BREAKING NEWS

జోహార్‌...ది అరణ్యరోదన కాదు

జోహార్‌...ది అరణ్యరోదన కాదు


అయిదేళ్ల కిందట... ముంబై, బాంద్రా ప్రాంతంలోని ఐ బార్‌.. పొయెట్రీ నైట్‌ జరుగుతోందక్కడ. పద్దెనిమిదేళ్లు నిండిన వారికే ప్రవేశం... ఆ పొయెట్రీ నైట్‌లో పాల్గొనే అవకాశం. ఓ పదమూడేళ్ల పిల్ల... వాళ్లమ్మ, అన్నయ్యను తీసుకొని ఆ బార్‌కు వెళ్లింది. లోపలికి వెళ్లడానికి అమ్మ, అన్నయ్యకు అనుమతి దొరికింది. ఆ అమ్మాయిని ఆపేశారు. వయసు లేదని. తను బార్‌కు తాగడానికి రాలేదని...పొయెట్రీ నైట్‌లో కవిత చదవడానికి వచ్చానని... ఆర్గనైజర్స్‌ను ఒప్పించింది. వేదిక మీద తన కవితను చదివింది. అది స్లామ్‌ పొయెట్రీ..ఆ అమ్మాయే అరణ్య జోహార్‌.పిల్ల కాదు పిడుగు

అరణ్య చిన్నప్పటి నుంచే చాలా చురుకైన పిల్ల. కాలేజ్‌లో ప్రతి ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్‌ చేస్తుంది. ఒకవేళ వేదిక మీద కవిత చదువుతూ కనపడలేదు... అంటే ఆ షోను క్యురేట్‌ చేస్తూ ఉంటుందనుకోవచ్చు. మోర్‌దాన్‌ మైక్స్‌ అనే స్టార్టప్‌ ఈవెంట్స్‌ మేనేజమెంట్‌ కింద ఎన్నో కవితా సదస్సులు నిర్వహిస్తుంటుంది. మెంటల్‌ హెల్త్, జెండర్, ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి విషయాన్ని చర్చిస్తుంది.

స్ఫూర్తి...

కవిత్వం అంటే ఇలాగే ఉండాలి.. అలాగే ఉండాలి అనే ఛందోనియమాలేవీ లేకుండా కేవలం భావప్రకటనే ప్రధానంగా సాగే ఫిలిప్‌ లార్కిన్‌ రచనలంటే ఆమెకు ఇష్టం. ఆయనే ఆమెకు స్ఫూర్తి. ‘‘ఆలోచించే విధానం దగ్గర్నుంచి ఎంచుకునే విషయం, రాసే శైలి, వ్యక్తపరిచే తీరు... అన్నిట్లో ఫిలిప్‌ ప్రత్యేకమే. ఇదివరకే ఇంకొకరు చెప్పిన విషయాన్ని ఆయన మళ్లీ చెప్పాల్సి వచ్చినా..  టేకింగ్‌  చాలా కొత్తగా ఉంటుంది. అందుకే ఆయనంటే నాకు అంత ఇష్టం’’ అంటుంది అరణ్య.మేక్‌ డిఫరెన్స్‌...

ఇప్పటి తరం ఎల్‌జీబీటీ సమస్యలను అర్థం చేసుకుంటోంది. అలాగే డిప్రెషన్‌ అనేది ఒక మానసిక రుగ్మత అనీ గుర్తించ గలుగుతోంది. అందుకే ఈ రెండిటి మీదా మరింత అవగాహన కల్పించడానికి  ‘‘టీ టైమ్‌ విత్‌ డిప్రెషన్స్, గాడ్డమ్‌ మిల్లేనియల్స్‌’’ అనే రెండు కొత్త కవితలతో ప్రస్తుతం తన గొంతు సవరించుకుంటోంది  అరణ్య జోహార్‌. ‘‘ఐ హోప్‌ మై పోయెమ్స్‌ మేక్‌ డిఫెరెన్స్‌ ఎట్‌ సమ్‌లెవెల్‌’’  అంటుంది.సమాజానికి పట్టిన లింగవివక్ష పీడ, మానసిక ఆరోగ్యం మీదా రాసిన తన కవితలతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న పద్దెమినిదేళ్ల అమ్మాయి అరణ్యజోహార్‌. పదమూడో యేట తన కవితాప్రస్థానాన్ని మొదలుపెట్టింది. అయిదేళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోతోంది.ఎ బ్రౌన్‌ గర్ల్స్‌  గైడ్‌ టు జెండర్‌

మన సమాజానికి పీడ లింగ వివక్ష. నల్లటి ఒంటిరంగు, ఆడవాళ్ల వస్త్రధారణ మీద ఆంక్షలు, మగవాళ్ల వెకిలిచేష్టలు, రుతుచక్రం,  భర్తలు చేసే మ్యారిటల్‌ రేప్‌ వంటివన్నీ ఆమె స్లామ్‌ పొయెట్రీ అస్త్రాలే. ఇంతవరకు ఏ సీనియర్‌ రచయితా, రచయిత్రులు సిరాను దులపని విషయాలన్నిటి మీద ఆమె ధైర్యంగా... నిష్కర్షగా మాట్లాడుతుంది కవితా రూపంలో. దానికే ‘ఎ బ్రౌన్‌ గర్ల్స్‌ గైడ్‌ టు జెండర్‌’ అనే పేరు పెట్టింది. జనాల్లో జెండర్‌ సెన్సిటివిటీని కలగజేస్తోంది. ఆమె కవితా గానం చేసిన వీడియోలు ఇటు యూట్యూబ్‌లోనే కాదు.. ఫేస్‌బుక్‌లోనూ పోస్టై అరణ్య ఫాలోవర్స్‌ సంఖ్య పెరుగుతోంది. ఇటు దేశంలోనే కాదు.. సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి అక్కడా పాపులారిటీ సంపాదించుకుంటోంది.మోర్‌దాన్‌ మైక్స్‌

తాము చూసిన దాన్ని...ఆస్వాదించినదాన్ని, అనుభవించినదాన్ని లయబద్దంగా అక్షరీకరించడం కొందరికే చేతనవుతుంది. ఆ కొందరిలో అరణ్య జోహార్‌ ఒకరు. పెద్దపెద్దవాళ్లు... ఫెమినిస్ట్‌లం అని చెప్పుకునే వాళ్లూ మట్లాడ్డానికి సైతం జంకే విషయాలను కూడా  కవితాత్మకంగా వ్యక్తపరుస్తోందీ అమ్మాయి.అమ్మాయి బ్రా స్ట్రాప్‌ కనపడితే సెక్సీ గా ఉందని గుడ్లప్పగించి చూస్తారు. కాని అమ్మాయిల సెక్సువల్‌ రైట్స్‌ని మాత్రం ఒప్పుకోరు. రేప్స్‌కి ఆడపిల్లల వస్త్రధారణే కారణమంటూ సమాజం మైండ్‌ సైట్‌ మార్చేస్తారు మగవాళ్లు! పదకొండేళ్లకే ఆడపిల్లను సెక్సువలైజ్‌చేసేస్తారు... అంటూ ధ్వజమెత్తుతుంది అరణ్య. మ్యారిటల్‌ రేప్‌ అనేది నేరం కాదు.. దాన్ని మొగుడి అవసరంగా ఎలా చెలామణి చేస్తున్నారో అని ఎండగడుతుంది!ఇంకా ఆమె గురించి...

సైకాలజీ అరణ్యకు ఇష్టమైన సబ్‌జెక్ట్‌. సైకాలజీ లేదా లిటరేచర్‌లో డిగ్రీలో చేయాలనుకుంటోంది. ‘‘మనం మానసిక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాం. దీని మీద నా కవిత్వం తో చర్చ మొదలుపెట్టాలనుకుంటున్నా’’  అని చెప్తుంది. స్త్రీ వేధింపులను అనుభవించడానికే పుట్టింది. ఇంటికి రావడానికి డెడ్‌ లైన్స్, ఆమె వేషం, భాష, ప్రవర్తనకు సంబంధించిన నియమాలు.. వంటివన్నీ ఫెమినిజం ఆవశ్యకతను ఆమె గ్రహించేలా చేశాయి. అలాగే స్త్రీవాదం పట్ల సమాజంలో అవగాహన కల్పించాలనే నిర్ణయానికీ వచ్చేలా చేశాయి. అందుకే తన ఆలోచనలను జనంతో పంచుకోవడానికి కవిత్వాన్ని ఆమె వాహకంగా ఎంచుకుంది. కవితను లయబద్దంగా చదువుతూ చదువుతూ ఒక చోట ఆగిపోతుంది... అలా ప్రేక్షకుల ఏకాగ్రతను పరిశీలించడం ఆమెకు ఆసక్తి. ఎక్కడైనా మహిళా సమస్యకు సంబంధించి ఇబ్బందికర పంక్తులు అంటే... ‘‘అమ్మాయిల అవయవాలు ఉన్నవే మగవాళ్లకు ఆనందనివ్వడానికి అని మగవాళ్లు భావిస్తారు’’ అని అరణ్య కవితా రూపంలో వివరిస్తుంటే ప్రేక్షకులు ఆమె కళ్లలో కళ్లు పెట్టి చూడ్డానికి ఇబ్బందిపడ్తారుట. ఇవన్నీ తన భావవ్యక్తీకరణను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తున్నారో తెలిపే సూచికలటోంది అరణ్య.బ్లైండ్‌ పొయెట్రీ ... త్రోబ్యాక్‌ థర్స్‌ డే

రాత్రివేళ... ఒక చీకటి గదిలో నిర్వహించే కవితా సదస్సులే బ్లైండ్‌ పొయెట్రీ సెషన్స్‌. కవులు, కవయిత్రులకు ఇది ఒకరకంగా సవాలే. ఎందుకంటే చీకటిగా ఉంటుంది కాబట్టి పుస్తకం చూసుకుంటూ తమ కవితాపంక్తులను చదవడానికి వీలు ఉండదు. అలాగే ప్రేక్షకులు రచయితలను చూడలేరు కాబట్టి వాళ్ల మొహం, వయసు, ఆహార్యం చూసి కవితలను బేరీజు వేసి, వాటి మీద తీర్పు చెప్పే అవకాశమూ తప్పుతుంది. మరి ఆ ఆడియెన్స్‌ తమ స్పందనను ఎలా తెలుపుతారు?రేడియం స్టిక్కర్స్‌ ఉన్న చిన్న కర్రలను ఇస్తారు. కవిత నచ్చితే వాటిని అందరూ గాల్లో ఆడించి తమ అభినందన తెలుపుతారన్నమాట. ముంబైలో ఈ బ్లైండ్‌ పొయెట్రీ సెషన్స్‌ను నిర్వహిస్తోంది అరణ్యే.

‘త్రోబ్యాక్‌ థర్స్‌డే’ అనే ఇంకో కవితా సదస్సునూ నిర్వహిస్తోంది. ఇందులో ఆమె రచయితలను తమ మొదటి కవితను అలాగే తాజా కవితను చదివి వినిపించమని కోరుతుంది. దీనివల్ల వాళ్ల ఆలోచనల్లో, ఎక్స్‌ప్రెషన్‌లో వచ్చిన మార్పును గ్రహించగలుగుతారు అంటుందామె.బీబీసీ.. జర్మన్‌ న్యూస్‌ అవుట్‌లెట్స్‌..2017... జూన్‌ 9... ముంబై

లాడ్లీ పన్నెండో వార్షికోత్సవం... ఆ ఈవెంట్‌ను అరణ్యనే జ్యోతి వెలిగించి ప్రారంభించింది. ఆరంభానికి ముందు బ్యాక్‌ స్టేజ్‌లో తన కవితా పంక్తులను శ్రద్ధగా వల్లెవేసుకుంది. స్టేజ్‌ మీద పదాలతో మ్యాజిక్‌ చేసింది. వందల సంఖ్యలో హాజరైన ప్రేక్షకులు సూది మొన కిందపడ్డా కంగుమని మోగే నిశ్శబ్దంలో ఆమె కవిత్వాన్ని విన్నారు. మంత్రముగ్దులయ్యారు. ఆ వేడుకకు హాజరైన సినీ రచయితలు, దర్శకులు, స్కీన్ర్‌ ప్లే రైటర్స్‌.. ఆమె కవితలోని భావాలతో ఏకీభవిస్తున్నట్టుగా తలలూపారు.. చప్పట్లతో సంఘీభావం తెలిపారు. ఆమె పొయెట్రీ వాళ్లనే కాదు బీబీసీ లాంటి మీడియా హౌజెస్‌ అటెన్షన్‌నూ కొల్లగొట్టింది. జర్మనీలోని న్యూస్‌ అవుట్‌ లెట్స్‌నూ ఆకర్షించింది. జెండర్‌ మీద ఆమె రాసిన ఆ కవితలు జర్మన్‌ భాషలోకీ అనువాదమయ్యాయి.ప్రేమ గురించి

‘‘అవును.. నేను ఫెమినిస్ట్‌నే. అయితే నా కవితల్లో ఒక్క ఫెమినిజం గురించే చెప్పాలనుకోవడంలేదు. ఇంకా చాలా విషయాలను, సమస్యలనూ చర్చించాలనకుంటున్నా. నా కవిత్వం ద్వారా మెంటల్‌ హెల్త్‌ యాక్టివిజమ్‌ను ఎక్స్‌ప్లోర్‌ చేయాలనుకుంటున్నా. అలాగే ప్రేమ గురించీ రాయాలనుకుంటున్నా. కాంటెంపరరీ లవ్‌ గురించి. ఒక యాప్‌తో పార్టనర్‌షిప్‌ ఉంది. దాని కోసం ప్రేమ గురించి రాయాలనుకుంటున్నా. రచయితలందరూ నన్ను ఎంకరేజ్‌ చేస్తున్నారు. అంటే పోటీ లేదని కాదు. కాని ఆరోగ్యకరమైన పోటీ ఉంది అని. నిజానికి వాళ్లందరిలోకి నేనే చిన్నదాన్ని. అందుకే ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్‌ చేస్తున్నారు. ఇట్స్‌ ఎ గ్రేట్‌ ఎన్విరాన్‌మెంట్‌.

– అరణ్య జోహార్, పొయెట్‌ఒక గంటలో...

‘స్కర్ట్స్‌ వేసుకోకు... నిర్భయలాంటి ఇన్సిడెంట్స్‌ మర్చిపోయావా? నిజమే... మరో ఇండియాస్‌ డాటర్‌ కావాలని ఎవరికి మాత్రం ఉంటుంది? కాబట్టి బుద్ధిగా జీన్స్, ఎద కనిపించనివ్వకుండా హైనెక్‌తో మోకాళ్ల కిందికుండే టాప్‌ వేసుకోవడం మొదలుపెట్టా. చూసే మొగవాళ్లకు వాంఛలు పుట్టనివ్వకుండా తల నుంచి పాదాల దాకా నా శరీరాన్ని కవర్‌ చేసుకోవడం మొదలుపెట్టా’ అంటూ అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున తన కవితాపఠనాన్ని కొనసాగించింది. ఖార్‌లోని ట్యూనింగ్‌ పార్క్‌ హోటల్లో ఇచ్చిన అరణ్య ఈ పెర్ఫార్మెన్స్‌  వెంటనే యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయి వైరల్‌ అయిపోయింది. 20 రోజుల్లో దాదాపు 4 లక్షల 45 వేల 975 మంది వీక్షించారు. అదే బ్రౌన్‌ గర్ల్స్‌ గైడ్‌ టు జెండర్‌. దేశ, విదేశాల్లోని వేదికల మీదా వినిపిస్తోంది ఆ కవిత. ఫెమినిస్ట్‌ హీరోగా కీర్తినందుకుంటోంది అరణ్య జోహార్‌. ఈ కవితను ఒక గంటలోనే రాసిందట ఆమె.అంత తక్కువ వ్యవధిలో రాసిన ఆ కవితకు ఇంత ఆదరణ లభిస్తుందని అనుకోలేదట.   అయితే ఆ కవిత రాయడానికి ముందు కెండ్రిక్‌ లామన్, జె. కోల్‌ రచనలెన్నిటినో చదివింది అరణ్య.  ‘‘వాళ్ల కవితలను చదివి, విని అక్షరం ఎంత పదునైందో తెలుసుకున్నా. జాత్యహంకారాన్ని తుడిచిపెట్టిన ఆయుధం వాళ్ల కవిత్వం. అందుకే వాళ్ల రచనలతో ప్రేరణ పొందా’’ అని చెప్తుంది. ‘‘తెల్లవాళ్లను పల్లెత్తు మాట అనకుండానే జాత్యహంకారాన్ని ఎండగట్టారు. నల్లవాళ్లు ఎదుర్కొన్న సమస్యలను చెప్పారు’’ అంటూ అబ్బురపడుతుంది.

– శరాది

Back to Top