హోల్ ఆంధ్రాలో సోలో అందగాడు

హోల్ ఆంధ్రాలో సోలో అందగాడు


హిట్ క్యారెక్టర్

 సినిమా పేరు    :    మామగారు (1991)

డెరైక్ట్ చేసింది    :    ముత్యాల సుబ్బయ్య

సినిమా తీసింది    :    ‘ఎడిటర్’ మోహన్

మాటలు రాసింది    :    తోటపల్లి మధు


 

‘హోల్ ఆంధ్రాలో సోలో అందగాడు’ ఎవరో తెలుసా? ఇంకెవరు మన బాబూమోహనే. ‘ఈ ప్రశ్నకి బదులేది?’ సినిమాలో రెండు సీన్ల రిక్షావాడి వేషంతో ఆయన కెరీర్ స్టార్ట్ అయ్యింది. ‘అంకుశం’లో ‘పాయే పాయే’ అంటూ ఓ మెరుపులా మెరిశాడు. ‘మామగారు’లో ముష్టివాడి వేషంతో గవర్నమెంట్ ఉద్యోగం మానేసేంత బిజీ అయిపోయాడాయన. కోట శ్రీనివాసరావు-బాబూమోహన్‌ల కాంబినేషన్ అంటే అప్పట్లో బాక్సాఫీస్‌కి ఓ మంచి కిక్. ‘మామగారు’ తర్వాత కోట-బాబూ మోహన్ కలిసి చాలా చాలా సినిమాలు చేశారు. బాబూమోహన్‌ను కోట కాలితో తన్నే సీన్లు, బాబూమోహన్ కౌంటర్లు... ఇవన్నీ ‘మామగారు’ విజయంలో మసాలా దినుసులు.

 

ఆ ఊళ్లో మోస్ట్ బిజీయెస్ట్ ఖాళీగా ఉండే పర్సన్ అంటే ఒకే ఒక్కడు. పేరు పోతురాజు. పైన పటారం లోన లొటారం టైపు. సిల్కు చొక్కా మడత నలగకుండా తెగ బిల్డప్పులిచ్చేస్తుంటాడు. ఇస్త్రీ లేకుండా చెడ్డీ కూడా వేసుకోనని తెగ కోతలు కూడా కోస్తుంటాడు. ఇలా ఎన్ని చేసినా ఊళ్లో ఒక్కడంటే ఒక్కడు కూడా రెస్పెక్ట్ ఇవ్వడు. వీధి అరుగు మీద కూర్చుని దారిన పోయే వాళ్లని పేకాట ఆడదాం రారండోయ్ అంటూ ఇన్వైటింగ్ చేసేస్తుంటాడు. అందరూ ఛీకొట్టి పోతుంటారు. దాంతో పోతురాజుకి ఎక్కడో కాలుతుంది. ఎవడో ఒకణ్ణి తన వెంట బంటులాగా తిప్పుకోవాలని ట్రయ్యింగ్ చేస్తుంటాడు. చివరకు ఒక బకరా దొరుకుతాడు. ఆ ఊరికి హోల్ అండ్ సోలో ముష్టివాడు. ఇతగాడికి నలుపు రంగెక్కువ. పొట్ట ఎక్కువ. దానికి ఆకలెక్కువ. ఫైనల్‌గా వీడికి టెక్కు కూడా ఎక్కువే. ఫర్ ఎగ్జాంపుల్...

   

ఓ ఇంటి ముందు నిలబడి ‘అంబే’ అని అరుస్తూ అడుక్కుంటుంటాడు. ఆ ఇంటావిడ పోన్లే పాపం అని ప్లేట్ నిండా ఫుడ్ ఐటమ్స్ తీసుకుని బయటికొస్తుంది.‘‘ఆ పిలుపేంట్రా..! ‘అంబే’ అని అరిచేది నువ్వో, గేదో తెలీక చస్తున్నాం’’ అంది కోపంగా.‘‘మా తాతల కాలం నుంచి ‘అమ్మా’ అని అడుక్కోవడం మామూలైపోయింది. అందుకే వెరైటీగా ఉంటుందని ‘అంబే’ అంటున్నా. ఏమ్మా! గొంతు బాలేదా?’’ అని గోరోజనంగా అడిగాడు వాడు. ఆవిడకు తిక్కరేగి, ‘‘నీది పెద్ద ఘంటసాల గొంతు మరీ’’ అని విసుక్కుని తాను తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అతని ప్లేట్‌లోకి వంపింది. వాడు చాలా చిరాగ్గా ఈ ఐటమ్స్ వంక చూసి ‘‘ఏంటమ్మా ఇది... చారా? ఈ చారులు, పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత చేపల కూరో, చికెన్ కూర్మానో వండొచ్చు కదా’’ అని గొణిగాడు.‘‘నిన్ను కాష్ఠంలో పెట్టా! నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగర్రా. పోరా పో’’ అని కోపంగా గుడ్లురిమిందామె. ‘‘పోతాం లేమ్మా! పోకపోతే నీతో కాపురం చేస్తామా... నీ ఇల్లు కాకపోతే వంద ఇళ్ళు’’ అని విసురుగా పోయాడు వాడు.

   

పోతురాజు అరుగు మీద దర్జాగా కూర్చుని ముష్టివాణ్ణి పిలిచాడు. ‘‘ఏంటన్నా’’ అంటూ వచ్చి సరాసరి పోతురాజు పక్కనే  సెటిలయ్యాడు వాడు.పోతురాజు వాడివైపు ఎగాదిగా చూసి ‘‘ఏంట్రా నల్లపెంకు... నా పక్కన కూర్చున్నావ్. నీకూ నాకూ ఎంత తేడా ఉందో తెలుసా?’’ అని హూంకరించాడు. వాడు ఏ మాత్రం తగ్గలేదు. ‘‘తెలుసన్నా... కనీసం నేను అడుక్కుంటున్నాను. నువ్వు అది కూడా చేయడం లేదు కదా’’ చెప్పాడు వాడు టెక్కుగా. ‘‘ఏంట్రోయ్... పది కొంపల పులుసు తినేసరికి ఒళ్లు బలిసిందిరా నాయాలా... వెళ్లు... కింద కూర్చో’’ అని గట్టిగా అరిచాడు పోతురాజు. దాంతో వాడు కింద కూర్చున్నాడు. ‘‘ఒరేయ్ సీమపంది... చిల్లర ఎంతుందిరా?’’ అడిగాడు పోతురాజు. వాడు ఏ మాత్రం తడుముకోకుండా ‘‘జేబులోనా? బ్యాంకులోనా?’’ అన్నాడు.‘‘ఆ... నీ మొహానికి బ్యాంకు ఎకౌంటు ఒకటా?’’

 

‘‘ఏం నీకు లేదా?’’‘‘ముయ్... ఎదవ ప్రశ్నలేశావంటే నరుకుతా. తొందరగా తినడం పూర్తి చేసిరా. ఒక ఆట వేసుకుందాం. చేయి గులగుల్లాడిపోతోంది.’’ ‘‘ఉండన్నా! ముందు అన్నం తినాలి. ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది.’’ ‘‘ఏం కూరల్రా?’’ ‘‘ఏం ఉందిలే అన్నా... చేపల పులుసు.. చింత చిగురు పప్పు.. కోడిగుడ్ల ఫ్రై... రెండు పచ్చళ్లు... మీ ఇంట్లోంచి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది.’’‘‘తమరు తినే భోజనం ప్రైమ్‌మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేడు. అదృష్టవంతుడివి.’’‘‘గొంతు సవరించి గట్టిగా ‘అబ్బా’ అని అరువ్. నా అదృష్టం నీక్కూడా పట్టుద్ది.’’ ‘‘అంటే నన్ను కూడా అడుక్కోమంటావా’’ అంటూ వాడి మీద ఇంతెత్తున లేచి కాలితో ఒక్క తన్ను తన్నాడు పోతురాజు.

   

పొలం గట్ల మీద పోతురాజు దొరబాబులాగా నడుస్తుంటే, వెనుక గొడుగు పట్టుకుని ముష్టివాడు. ఒకడెవడో తనను చూసి దణ్ణం పెట్టలేదని చాచి ఒక్క లెంపకాయ ఇచ్చాడు పోతురాజు. ఇంకొకడు నడుముకు తుండుగుడ్డ కట్టుకున్నాడని వాడికీ క్లాస్ పీకాడు. ఆ ఊరి ప్రెసిడెంట్‌కి సొంత బావనైన తనను అందరూ రెస్పెక్టింగ్ చేసెయ్యాలన్నది పోతురాజుగారి ఉద్దేశం. ఇది ముష్టివాడు కనిపెట్టేశాడు.



నీ అజమాయిషీ గురించి నువ్వే చెప్పుకుంటుంటే చీపుగా ఉంది. నీ లెవెల్‌ని నేను ఎడల్పు చేస్తా పదా’’ అన్నాడు ముష్టివాడు. పోతురాజు ముందు నడుస్తున్నాడు. వెనుక ముష్టివాడు.ఒకడు కాల్వలో ఎద్దును కడుగుతున్నాడు. వాడి ఒంటి మీద గోచి గుడ్డ మినహా ఇంకేం లేదు. ‘‘రేయ్ రా... అలా తుమ్మమొద్దులా నిలబడి చూస్తున్నావ్... రారా’’ అని పిలిచాడు ముష్టివాడు. వాడు దండాలు పెట్టుకుంటూ వచ్చాడు. ‘‘ఈయనెవర్రా? ప్రెసిడెంట్‌గారికి బావగారు. అంటే ఓసీగా తిని తిరిగే ఎదవ కాదుగా. ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోచీ కట్టుకుని నిలబడతావా? ముందా గోచీ తియ్యి’’ అని ముష్టివాడు మీద పడి రక్కినంత పని చేసేసరికి, వాడు విప్పేసి దీనంగా... నగ్నంగా పోతురాజు ముందు నిలబడ్డాడు. ఆ దివ్యమంగళ రూపాన్ని రెండు కళ్లతో చూడలేక కెవ్‌మని అరిచి, కయ్‌మని ముష్టివాడు మీద కాలెత్తాడు పోతురాజు.

   

పాపం పరిస్థితులు అనుకూలించక పోతురాజు కూడా వీధి అరుగు మీద పడుకోవాల్సిన పరిస్థితి. ఆ పక్క బెడ్ - ముష్టివాడిది.

 పొద్దునే ఒకడొచ్చి ముష్టివాణ్ణి నిద్రలేపి ‘‘అన్నా... నీకు టీ’’ అని ఇచ్చాడు. పక్కనే ఉన్న పోతురాజు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ‘‘ఈడు నా అసిస్టెంట్’’ అని పరిచయం చేసి ‘‘ఏరా పేపర్ తెచ్చావా?’’ అనడిగాడు ముష్టివాడు. ‘‘ఇంగ్లీషు పేపర్ రాలేదన్నా. తెలుగు పేపర్ తెచ్చా’’ చెప్పాడు వాడు వినయంగా. ముష్టివాడు విసుగ్గా ‘‘ఊ... తెలుగు పేపర్‌లో న్యూస్ ఏముంటాయ్’’ అనుకుంటూ ఆ పేపర్ తిరగేస్తుంటే పోతురాజు షాక్. ‘‘రేయ్... నువ్వెళ్లి కాకా హోటల్లో నా కోసం చికెన్ కూర్మా, పరోటాలు రాత్రివి ఉంటాయి. తీసుకొచ్చేశేయ్’’ అని అసిస్టెంటుకి పురమాయించి, ముష్టివాడు మళ్లీ పేపర్లో మునిగిపోయాడు. ఇదంతా చూసి పోతురాజుకు నోట మాట రాలేదు.

   

 రేడియోలో న్యూస్ వింటూ గుడి బయట దర్జాగా అడుక్కుంటున్నాడు ముష్టివాడు. ఒకతను వచ్చి 10 పైసలు దానం చేసి వెళ్లబోయాడు.

 ఈ ముష్టివాడు అతణ్ణి పిలిచాడు. ‘‘ఇదిగో పెద్దాయినా... పది పైసలు ముష్టి వేసి తార్రోడ్డు మీద డెరైక్ట్‌గా స్వర్గానికి వెళ్లిపోదామనే. చేయి చాపు... దీనికి యాభై పైసలు కలిపి ఇస్తున్నా. నా పేరు చెప్పి టీ తాగు పో..’’ అనేసి, అతణ్ణి పంపించేశాడు. పక్కకు తిరిగి చూస్తే పోతురాజు దేభ్యం మొహం వేసుకుని కూర్చున్నాడు.‘‘అన్నా! నీ వాటం చూస్తే తేడా కొడుతోంది. నీ మావ పోస్టు పాయే. నాన్న పోస్టు పాయే. పోన్లే... నా పోస్టు ఇస్తా... తీస్కో’’ అంటూ ముష్టివాడు తన అమ్ములపొదిలో అస్త్రం లాంటి బొచ్చెను పోతురాజుకు బహూకరించేసి వెళ్లిపోయాడు.

 ఆ బొచ్చెనూ, వాణ్ణీ అలాగే చూస్తూ శిలా విగ్రహంలా ఉండిపోయాడు పోతురాజు. అంతకు మించి ఏం చేయగలడు? ఎదుటోణ్ణి బకరా చేద్దామనుకుంటే మనమే బకరా అయిపోతాం మరి!

 - పులగం చిన్నారాయణ

 

ఈ పాత్రకు ముందు బ్రహ్మానందాన్ని అనుకున్నారు!

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘నాన్ పుడిచ్చ మాపిళ్లయ్’ని తెలుగులో ‘మామగారు’గా రీమేక్ చేశారు ‘ఎడిటర్’ మోహన్. ఒరిజినల్ వెర్షన్‌లో గౌండ్రమణి-సెంథిల్‌పై చిన్న కామెడీ ట్రాక్ ఉంది. దాన్ని ‘అహ నా పెళ్లంట’ తరహాలో కోట-బ్రహ్మానందంపై చేద్దామన్నారు ‘ఎడిటర్’ మోహన్. నాకేమో ఆ పాత్రకు బ్రహ్మానందం కంటే బాబూమోహన్ అయితే కరెక్ట్ అనిపించింది. అంతకు ముందే ‘అంకుశం’లో అతని యాక్టింగ్ చూసి ఇంప్రెసయ్యా. ‘ఎడిటర్’ మోహన్ కూడా కోట-బాబూమోహన్ కాంబినేషన్‌కు ఓకే చెప్పారు. తమిళ వెర్షన్ కన్నా బ్రహ్మాండంగా ట్రాక్ పెంచి రాశా. షూటింగ్ టైమ్‌లోనే అందరూ తెగ ఎంజాయ్ చేశారు. ఎక్స్‌ట్రార్డినరీగా వర్కవుట్ అయ్యిందీ ఎపిసోడ్. ఈ సినిమా తర్వాత కోట-బాబూమోహన్ కాంబినేషన్ లేకుండా దాదాపుగా ఎవ్వరూ సినిమాలు చేయలేదు. అంతలా సూపర్‌హిట్టయ్యిందీ కాంబినేషన్. ‘ఏ ముహూర్తాన రాశారో కానీ అదిరిపోయిందయ్యా’ అంటూ కోట-బాబూమోహన్ ఎప్పుడు కనిపించినా నన్ను అభినందిస్తుంటారు.

 - తోటపల్లి మధు, రచయిత

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top