ఆరోగ్యరంగంలో ఆరు అద్భుతాలు!

ఆరోగ్యరంగంలో ఆరు అద్భుతాలు! - Sakshi


అన్ని రంగాల్లోలాగే ఈ ఏడాది ఆరోగ్యరంగంలోనూ అద్భుతాలు జరిగాయి.  మరో రోజులో 2014 ముగుస్తున్నందున ప్రపంచవ్యాప్తంగా మెడికల్ రంగం ఈ ఏడాది ఆవిష్కరించిన  ఆరు అద్భుతాలను అవలోకిద్దాం.

 

1. కృత్రిమచేతిని అమర్చడానికి ఎఫ్‌డీఏ అనుమతి!

ఎనిమిదేళ్ల పరిశోధనల ఆధారంగా తయారైన కృత్రిమ చెయ్యిని అమర్చడానికి అమెరికాకు చెందిన వైద్య అంశాలకు అనుమతిని ఇచ్చే అత్యున్నత సంస్థ ‘ఎఫ్‌డీఏ’ ఈ ఏడాదే అనుమతినిచ్చింది. ‘డెకా’ ఆర్మ్ సిస్టమ్ అనే అత్యున్నత సాంకేతికతతో నిర్మించిన రొబోటిక్ చెయ్యి అనే కృత్రిమ హస్తాన్ని... చెయ్యి లేని ఒక వ్యక్తికి అమర్చి, దాని సహాయంతో అతడి పనులు అతడే చేసుకోగలిగేలా చేయడానికి ఈ ఏడాది అధికారికంగా అనుమతి లభించింది.



చూడటానికి అచ్చం సాధారణ చెయ్యిలాగే  ఉండే ‘డెకా’ ఆర్మ్ అనే ఈ కృత్రిమ చేతిని మంఛెస్టర్‌లోని డీన్ కామన్ నేతృత్వంలోని అతడి బృందం రూపొందించింది. యుద్ధాలలో చేతులను కోల్పోయిన డజన్లకొద్దీ సైనికులకు ఈ కృత్రిమ చేతిని అమర్చి దాని సాయంతో తాళం చెవులను సరిగ్గా తిప్పగలగడం, వంట చేయగలగడం, తినగడగడం సాధ్యమవుతుందో లేదో పరీక్షించారు. ఎఫ్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 90 శాతం మంది ఈ కృత్రిమ చేతితో సంక్లిష్టమైన పనులనూ అలవోకగా నిర్వహించాక ఒక విషయం ధ్రువీకరించారు.

 

2. మొట్టమొదటి పుర్రె మార్పిడి శస్త్రచికిత్స!

వైద్యచరిత్రలోనే తొలిసారిగా పుర్రె మార్పిడి శస్త్రచికిత్స ఈ ఏడాది మార్చిలో నెదర్లాండ్‌లో జరిగింది.  ఇరవై రెండేళ్ల వయసున్న ఒక మహిళకు పుర్రెలోని ఎముకలు పెళుసుబారి, గట్టిగా మారి, మెదడును నొక్కివేయడం ప్రారంభించాయి. దాంతో తొలుత చూపు సమస్యలూ, తర్వాత బ్యాలెన్సింగ్ సమస్యలు వచ్చాయి.



ఆమెకు పుర్రెను మార్చడం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. కొందరు నిపుణులు ఆమె పుర్రె కొలతలు తీసుకుని, 3డీ చిత్రం ద్వారా ఆమె పుర్రె నమూనాను ప్లాస్టిక్‌తో తయారు చేశారు. త్రీడీ ప్రింట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ... 23 గంటల వ్యవధిలో ఈ ప్లాస్టిక్ పుర్రెను అసలు పుర్రె స్థానంలో  అమర్చారు. ఈ సర్జరీ అయిన మూడు నెలల తర్వాత ఆమెకు చూపు మళ్లీ వచ్చింది. తన పనులు తానే చేసుకోగలుగుతోంది.

 

3. వైద్యశాస్త్రంలో రాబోయే విప్లవానికి అంకురం... కృత్రిమ కన్ను (బయోనిక్ ఐ)

చదవడానికి ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కథలా ఉండవచ్చు. కానీ ఈ ఏడాది సాకారమైన ఓ మెడికల్ అద్భుతమిది. ల్యారీ హెస్టెర్ అనే 66 ఏళ్ల వ్యక్తి తన 30వ యేట ‘రెటినైటిస్ పిగ్మెంటోజా’ అనే వ్యాధి కారణంగా చూపు కోల్పోయాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అతడికి ‘ఆర్గస్ ॥రెటినల్ ప్రోస్థెసిస్ సిస్టమ్’ అనే కృత్రిమ కళ్లను అమర్చారు.



ఈ ప్రక్రియలో అతడి కళ్లజోడుకు ఒక జత వీడియో కెమెరాలను అమర్చారు. ఈ కెమెరా కాప్చర్ చేసిన దృశ్యాలను వైర్‌లెస్ సాధనాలతో అతడి రెటీనాపై అమర్చిన బయోనిక్ ఇంప్లాంట్స్‌పై పడేలా చేశారు. ఈ ఇంప్లాంట్ ద్వారా ఆప్టిక్ నర్వ్‌కు అందిన సంకేతాలు అతడి మెదడులోని ‘చూసే కేంద్రం’ (విజువల్ సెంటర్)కు చేరతాయి. ప్రస్తుతం అతడు పూర్తిగా స్పష్టమైన దృశ్యాలను చూడలేకపోవచ్చు.



కానీ ఇప్పటివరకూ జరిగిన సైన్స్ పురోగతితో రాత్రీ పగళ్లు, వెలుగు చీకట్ల మధ్య తేడాను తెలుసుకోగలుగుతున్నాడు. కొన్ని వస్తువుల ఆకృతులను గ్రహిస్తున్నాడు. ఈ పురోగతిలో మరింత అభివృద్ధి సాధిస్తే... త్వరలో కళ్లు లేనివారూ చూడగలిగేలా చేయగలమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు కంటి వైద్య నిపుణులూ, ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న శాస్త్రజ్ఞులు.

 

4. యుటెరస్ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత మొట్టమొదటి గర్భం!

ఒక మహిళ పుట్టుకతోనే గర్భసంచి లేకుండా పుట్టింది. కానీ ఆమెకు ఓవరీస్ మాత్రం సాధారణంగానే ఉన్నాయి. ఈ కేసును పర్యవేక్షిస్తున్న స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు... 61 ఏళ్ల వయసున్న ఒక దాత నుంచి గర్భసంచిని తీసుకున్నారు. దాన్ని 36 ఏళ్ల ఆ మహిళకు అమర్చారు. ఆ తర్వాత ఆమె భర్త నుంచి వీర్యాన్ని సేకరించి, ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా గర్భధారణ జరిగేలా చూశారు.



గర్భం ధరించాక 32వ వారంలో ఆమెలో కొద్దిగా రక్తపోటు పెరిగింది. దాంతో డాక్టర్లు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. దాంతో ఇలా మొదటిసారి గర్భసంచి మార్పిడి చేసిన మహిళకు 1.8 కిలోల బరువున్న ఆరోగ్యకరమైన చిన్నారి జన్మించింది. ఈ తరహా చికిత్స వల్ల పుట్టుకతోనే గర్భసంచి లేనివారికి సైతం భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు.

 

5. పక్షవాతానికి తక్షణ చికిత్స అందించే... సంచార ఆసుపత్రులవి!


ఎవరైనా పక్షవాతపు రోగి విషయంలో అవయవాలు సాధ్యమైనంత మేరకు తక్కువ చచ్చుబడి, ఎక్కువ క్రియాశీలం కావాలంటే అతడికి ఎంత త్వరగా ఆసుపత్రి సేవలు అందాయన్నదే కీలక అంశం.



అందుకే పక్షవాతానికి తక్షణం చికిత్స అందించే  సంచార ఆసుపత్రులను యూఎస్‌ఏలోని క్లీవ్‌లాండ్ క్లినిక్, హ్యూస్టన్‌లోని టెక్సస్ మెడికల్ స్కూల్ సంస్థలు ఈ ఏడాది ప్రవేశపెట్టాయి. ఆ దేశంలో స్ట్రోక్ వచ్చిన వారు ఆసుపత్రికి చేరే సగటు వ్యవధి 60 నిమిషాలు కాగా... ఈ సౌకర్యం వల్ల 19 నిమిషాల్లోనే రోగికి తగిన చికిత్స అందుతుంది. అందుకే చాలా అవయవాలను క్రియాశీలం చేయగలిగే ఆ విలువైన సమయాన్ని కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చెంతో తెలుసా?... అక్షరాలా రూ. 25 కోట్లు!

 

6. ఆగిన 20 నిమిషాల తర్వాత గుండె మార్పిడి

సాధారణంగా జీవన్మృతుల నుంచి (బ్రెయిన్‌డెడ్ కేసుల్లో) గుండెను సేకరించి అవసరమైన వారికి అమర్చుతుంటారు. ఇలా బ్రెయిన్‌డెడ్ జరిగిన సందర్భంలో రోగి మెదడు పూర్తిగా మృతిచెందుతుంది. కానీ అవయవాలు సజీవంగానే ఉంటాయి. కాబట్టి మామూలు వ్యక్తుల్లోలాగే బ్రెయిన్‌డెడ్ వ్యక్తిలోనూ గుండె స్పందనలూ యథావిధిగా కొనసాగుతుంటాయి. అలాంటి గుండెను సేకరించి, ఐస్‌లో ఉంచి, అవసరమైన చోటికి సాధ్యమైనంత వేగంగా దాన్ని తరలించి, అతిత్వరగా ఈ గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తుంటారు.



కానీ ఈ ఏడాది సిడ్నీలోని సెయింట్ విన్సెంట్స్ హాస్పిటల్‌లోని ఒక వైద్యబృందం గుండె కొట్టుకోవడం ఆగిపోయిన 20 నిమిషాల తర్వాత కూడా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేయగలిగింది. దీనికి కారణం... ‘హార్ట్ ఇన్ ఏ బాక్స్’ అనే ప్రత్యేకమైన పెట్టె. ఇందులో బయట ఉంచిన అవయవాన్ని భద్రంగా చూసే ‘ఆర్గాన్ కేర్ సిస్టమ్’ (ఓసీఎస్) అనే ఒక సర్క్యుట్ ఉండటం వల్ల గుండెను అలా భద్రంగానూ, శరీరంలో ఉన్నప్పటి వేడినీ నిర్వహించే సౌకర్యం ఉంది.



ఈ సౌకర్యాన్ని ఉపయోగించి గుండెజబ్బుతో బాధపడుతున్న 57 ఏళ్ల ఒక మహిళకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు అక్కడి డాక్టర్లు. అంతకుముందు కనీసం 100 మీటర్ల నడక కూడా ఆమెకు నరకమయ్యేది. శస్త్రచికిత్స జరిగిన రెండు నెలల తర్వాత  ఆమె 3 కి.మీ. నడుస్తోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top