ఒక మగపురుగు

Haruki Murakami Story Janaza In Love Katha Saram - Sakshi

కథాసారం

మేల్కొనేసరికి తాను రూపాంతరం చెంది గ్రెగర్‌ జాంజా అయినట్టు అతడు గుర్తించాడు. మంచం మీద అలాగే వెల్లకిలా పడుకుని పైకప్పు కేసి చూశాడు. కాంతికి కళ్లు అలవాటుపడటానికి కొంత సమయం పట్టింది. పైకప్పుకు వేసిన రంగు తెల్లదే కావొచ్చు, కానీ ఏళ్లతరబడి మురికిపట్టడం వల్ల పాడైపోయిన పాలరంగులా కనబడుతోంది.

గదికి ఎడమవైపున ఉన్న పెద్ద కర్టెన్లు లేని కిటికీలోంచి పడుతున్న సూర్యకాంతి నేల మీద సమాంతర రేఖల్ని ఏర్పరుస్తోంది. కిటికీకి చుట్టూ మందపాటి చెక్క కొట్టివుంది. దాన్ని ఎందుకు రక్షణగా పెట్టివుంటారు? తుఫాను ఏమైనా రానుందా? ఎవరైనా లోపలికి రాకుండానా? ఎవరైనా(బహుశా, అతడు) బయటికి పోకుండానా?

కొద్దిగా తలతిప్పి గదిని పరికించాడు. కుర్చీలు, టేబుల్‌ ఏమీలేవు, తను పడుకున్న మంచం తప్ప. అక్కడ ఎందుకున్నాడో, ఏం చేయాలో అర్థం కాలేదు. అతడికి తెలిసిందల్లా తానొక మనిషి, తన పేరు గ్రెగర్‌ జాంజా. అదైనా ఎలా తెలిసింది? నిద్రిస్తున్నప్పుడు ఎవరో చెవిలో చెప్పివుంటారు. కానీ గ్రెగర్‌ జాంజా కాకమునుపు ఏమిటి? ఆ ప్రశ్న తలెత్తగానే తలలో దోమల రొద మొదలైనట్టు అనిపించింది. ఆలోచించడం అనవసరమైన ఒత్తిడి పెట్టుకోవడమే అని విరమించుకున్నాడు.

ఏదేమైనా శరీరాన్ని ఎలా కదపాలో అతడు నేర్చుకోవాల్సి ఉంది. పైకప్పును చూస్తూ ఎల్లకాలం పడుకోలేడు. పైగా పడుకుంటే దేన్నుంచీ కాపాడుకునే వీలు లేదు. పిట్టలేమైనా వచ్చి తినేస్తే? మొదటి ప్రయత్నంగా చేతివేళ్లను కదిలించి చూశాడు. రెండు చేతులకు కలిపి మొత్తం పదున్నాయి. మళ్లీ వాటికి కీళ్లుండటం వాటి కదలికను సంక్లిష్టం చేస్తోంది. పరిస్థితిని మరింత దిగజారుస్తూ శరీరం నిస్సత్తువగా అనిపించింది, ఏదో చిక్కటి ద్రవంలో తాను మునిగివున్నట్టూ, తన బలాన్ని చిట్టచివరి కొసదాకా అందించడంలో విఫలమైనట్టూ.

చాలా ప్రయత్నాల తర్వాత అతడు వేళ్లను నియంత్రించుకోవడంలో సఫలమయ్యాడు. చేతివేళ్లు కదలడం మొదలుకాగానే నిస్సత్తువ మాయమైంది. కానీ లోపలేదో నొప్పి పీడించసాగింది. కొంతసేపటికి ఆ నొప్పి ఆకలి అని గుర్తించాడు. ఆకలి కోసం అలమటించడం అతడికి కొత్త. కనీసం అలాంటిది ఒకటి అనుభవించినట్టు తన జ్ఞాపకాల్లో లేదు. ఒక వారంగా ఏమీ తిననంత ఆకలి. ఆ నొప్పిని ఇంకా భరించలేక మోచేతుల ఆసరాతో కొద్దికొద్దిగా లేచాడు. శరీరం ఎదురు తిరిగింది. అయినప్పటికీ శక్తినంతా కూడగట్టుకుని కూర్చోగలిగాడు.

తన నగ్నదేహాన్ని దిగులుగా చూసుకున్నాడు. ఎంత అనారోగ్యకరమైన ఆకృతి! ఏ విధమైన స్వీయరక్షణ వ్యవస్థ లేదు. బలహీనమైన నరాలు, కవచం లేని పొట్ట, ఇట్టే విరిగిపోగలిగే మెడ, కురూపి తల, నత్తపెంకుల్లాంటి రెండు చెవులు. నిజంగా ఇది తానేనా? ఇంత అసంగతమైన, ఇంత సులభంగా నాశనం చేయగలిగిన శరీరం ఈ ప్రపంచంలో బతికి బట్టకట్టగలదా? దీనికి బదులు తాను చేపగా ఎందుకు మారలేదు? కనీసం పొద్దుతిరుగుడు పువ్వు ఎందుక్కాలేదు?

కాళ్లను మంచం నుంచి కిందికి దించాడు. చాలా కష్టం మీద రెండు కాళ్ల మీద తన శరీరాన్ని నియంత్రించుకోగలిగాడు. తల మోయలేనంత బరువుగా అనిపించింది. ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో అతడు నడక నేర్చుకోవాల్సి ఉంది. కానీ అదెంత హింస! ముందు కుడి, తర్వాత ఎడమ కాళ్లను ఒకదానితర్వాత ఒకటి వేయడం అనేది అన్ని సహజ సూత్రాలను బేఖాతరు చేస్తోంది, పైగా ఇక్కడెక్కడో ఉన్న కళ్లతో కిందెక్కడో ఉన్న కాళ్లను  చూసుకోవడం అతణ్ని భయంతో వణికించింది. కానీ ఈ గదిలోనే ఎల్లకాలం ఉండలేనని అతడికి తెలుసు. నత్త వేగంతో అతడు అడుగులు ప్రారంభించాడు. తెలుస్తున్న నొప్పి తప్ప సమయాన్ని కొలిచే సాధనం లేదు.

తలుపు పిడి పట్టుకుని లాగాడు. చప్పుడు చేస్తూ తెరుచుకుంది. హాల్లో మొత్తం నాలుగు తలుపులున్నాయి ఒకేరకంగా. వాటి వెనక ఏమి ఉండివుంటాయి? కానీ పొట్ట నింపుకోవాల్సిన అవసరం అతడి కుతూహలాన్ని పక్కకునెట్టింది. ముక్కుతో వాసన పీలుస్తూ అది వస్తున్న దిశగా కదిలాడు. నోట్లో లాలాజలం ఊరింది. ఆ వాసన వస్తున్న దగ్గరికి చేరాలంటే ఏటవాలుగా ఉన్న మెట్లు దిగాల్సిందే. మొత్తం పదిహేడున్నాయి. జాంజా మనసులోకి మళ్లీ చేప, పొద్దుతిరుగుడు పువ్వు కదిలాయి. వాటిగా రూపాంతరం చెందివుంటే ఈ మెట్లు దిగే బాధ లేకుండా శాంతిగా ఉండగలిగేవాడిని అనుకున్నాడు.

అండాకారంలో ఉన్న టేబుల్‌ మీద ఆహారం పెట్టివుంది. చుట్టూ ఐదు కుర్చీలున్నాయి. కానీ మనుషుల జాడ లేదు. లిల్లీ పువ్వులున్న గ్లాసు వేజ్‌ టేబుల్‌ మధ్యలో ఉంది. వడ్డించిన పళ్లేల్లోంచి ఆవిర్లు లేస్తున్నాయి. న్యాప్కిన్లు, చంచాలు ఎవరూ తాకినట్టు లేదు. తినడానికి కూర్చుండగానే హఠాత్తుగా సంభవించినదేదో వాళ్లను పరుగెత్తించినట్టు కనబడుతోంది. వాళ్లు తినడానికి తిరిగొస్తారా?

సమీపంలో ఉన్న కుర్చీలో కూర్చుని తన చేతులతో అందుకోగలిగే పదార్థాల్ని నోట్లోకి కుక్కుకున్నాడు. బ్రెడ్డు, సాసేజులు, నలగ్గొట్టిన ఆలుగడ్డ కూరుకున్నాడు. ఉడికించిన గుడ్లను పొట్టు తీయకుండానే మింగాడు. తొక్కులను వేళ్లతో నాకాడు. పులుపు, కారం అన్నింటి రుచీ ఒకటే. అన్నింటినీ ఖాళీ చేసి, అలుపు తీర్చుకోవడానికి కుర్చీకి ఒరిగాక చూస్తే టేబుల్‌ మీద జగడాలమారి కాకులు కొట్లాడినట్టుంది. తాకనిది ఏదంటే ఆ లిల్లీలు మాత్రమే. తిండి గనక తక్కువ పడివుంటే వాటిని కూడా దిగమింగేవాడు.

ఉన్నట్టుండి అతడికి చలేసింది. ఆకలి తీవ్రత మిగతా ఇంద్రియాలను పనిచేయనీయలేదు. ఎప్పుడైతే తృప్తిగా తిని తేన్చాడో పొద్దుటి చలి వణికించింది. పైగా పూర్తి దిగంబరంగా ఉన్నాడు. చుట్టుకోవడానికి ఏదో కావాలి. 

మూలన కొన్ని వాకింగ్‌ స్టిక్స్‌ ఉన్నాయి. ఒకదాన్ని తీసుకున్నాడు. కనీసం పిట్టలు ఏవైనా దాడికొస్తే రక్షణగా పనికొస్తుంది. ఇంటికి ఎదురుగా ఒక వీధి ఉంది. మరీ పెద్దదేం కాదు, చాలామంది కూడా వెళ్లడం లేదు. కానీ వెళ్తున్నవాళ్లంతా పూర్తిగా బట్టలు వేసుకుని ఉన్నారు. కొందరు టోపీలు పెట్టుకున్నారు. నడవడం గురించి వాళ్లు పెద్ద ఇదిగా ఆలోచిస్తున్నట్టే లేదు. తనను తాను అద్దంలో చూసుకున్నాడు జాంజా. తొడుక్కోవడానికి ఏవైనా కావాలి.

మళ్లీ మెట్లు ఎక్కడం ప్రారంభించాడు. దిగడం కంటే పైకి ఎక్కడం సులభమనిపించింది. నొప్పి కూడా అంతగా లేదు. అదృష్టం అతడి పక్కన ఉంది. తలుపులు ఏవీ తాళం వేసి లేవు. తెరుస్తూ మూస్తూ వెతికాడు. ఒక పెద్ద గదిలో బట్టలు కనబడ్డాయి. కానీ వాటిని ఎట్లా వేసుకోవాలో అర్థం కాలేదు. ముందేది, వెనకేది? పైనేది, కిందేది?
నీలపు రంగు డ్రెస్సింగ్‌ గౌన్‌ అన్నింట్లోకీ తొడుక్కోవడానికి సులభంగా తోచింది. ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతిలో  వేసుకోగలిగాడు. అది చర్మానికి మృదువుగా అనిపించింది. గౌనుకు మేచ్‌ అయ్యే స్లిప్పర్స్‌ కూడా సంపాదించగలిగాడు.
∙∙l

డోర్‌ బెల్‌ మోగుతున్నప్పుడు ఆ ఇంట్లోని పెద్ద గదిలోని పెద్ద మంచంలో కునుకు తీస్తున్నాడు. ఆ దుప్పటి కింద వెచ్చగా పడుకోవడం కోడిగుడ్డులో నిద్రిస్తున్నట్టుగా ఉంది. ఉన్నట్టుండి ఏదో కలలోంచి మేల్కొన్నాడు. దాని వివరాలు గుర్తులేవు కానీ అది బాగుండింది. కానీ బెల్‌ మోత వాస్తవంలోకి తెచ్చింది. మంచంలోంచి లేచి, గౌనును కట్టుకుని, స్లిప్పర్స్‌ వేసుకుని, వాకింగ్‌ స్టిక్‌ పట్టుకుని, నెమ్మదిగా మెట్లు దిగాడు. మొదటిసారి దిగినదానికంటే ఈసారి మరింత సులభమైంది. డోర్‌ బెల్‌ మాత్రం అదేపనిగా మోగుతూనే ఉంది. వాళ్లెవరోగానీ సహనం లేనివారై ఉండాలి.

తలుపు తీసేసరికి అక్కడో పొట్టావిడ కనబడింది. చాలా పొట్టి మనిషి. అసలు ఆమెకు డోర్‌బెల్‌ ఎలా అందిందో ఆశ్చర్యమే. తర్వాత అర్థమైంది– ముందుకు వంగడం వల్ల చిన్నదిగా కనబడిందిగానీ లేదంటే మామూలు కొలతల అమ్మాయే. ముందుకు పడకుండా రబ్బరు బ్యాండుతో జుట్టు బిగించుకుంది. మెడకో గీతల కాటన్‌ స్కార్ఫ్‌ చుట్టుకుంది. ఇరవైల్లో ఉండొచ్చు. ఇంకా ఏదో ఉంది ఈ అమ్మాయిలో. కళ్లు పెద్దవి. ముక్కు చిన్నది. పెదవులు చంద్రవంకల్లా ఉన్నాయి.

‘‘ఇది జాంజా ఇల్లేనా?’’ అతడి వైపు మెడ ఎత్తి అడిగిందామె.
‘‘అవును’’అన్నాడు. తను గ్రెగర్‌ జాంజా అయినప్పుడు ఇది జాంజాల ఇల్లే అయివుండాలి.

(ఈ కథ ఇప్పటికి సగమే పూర్తయ్యింది. ఆమె నిజానికి పెద్ద అల్మారా తాళం బాగుచేయడానికి వచ్చిన అమ్మాయి. బయటంతా యుద్ధ ట్యాంకర్లు తిరుగుతుంటాయి. అమ్మాయి అయితే చెక్‌పాయింట్లను దాటడం సులభమని వాళ్ల కుటుంబం ‘అప్రెంటిస్‌’ అయిన ఈమెను పంపిస్తుంది. బయట అంత కాల్పులు జరుగుతున్నా కూడా బాగు చేయాల్సిన తాళాల గురించి పట్టించుకునేవాళ్లూ, వాటిని బాగుచేయడానికి ఇంత నిబద్ధతతో వచ్చేవాళ్లూ... ఇంత చిన్న విషయాల పట్ల నిజాయితీగా ఉండటం ద్వారానే ఈ విధ్వంసకర ప్రపంచంలో పిచ్చివాళ్లం కాకుండా కాపాడుకోగలం అని ఆమె వ్యాఖ్యానిస్తుంది. ఆమె పట్ల అతడి మగప్రాణం నెమ్మదిగా విప్పుకోవడం మొదలవుతుంది. జాంజా మాట్లాడే తీరు వల్ల అతడు మానసికంగా ఎదగలేదమో అని ఆమె ముందు అనుకుంటుంది, కానీ మనిషి మంచివాడే అని గ్రహిస్తుంది. చివరలో ఆమె తిరిగి వెళ్లిపోతున్నప్పుడు, మళ్లీ మిమ్మల్ని చూడొచ్చా అని అతడు అడుగుతాడు. గట్టిగా తలుచుకుంటే కలుసుకోవడం కష్టమేం కాదని ఆమె సెలవు తీసుకుంటుంది. చేపలాగో, పొద్దుతిరుగుడుపువ్వులాగో పుట్టివుంటే నేను ఈ ఉద్వేగాన్ని అనుభవించేవాడిని కాదని జాంజా అనుకోవడంతో కథ ముగుస్తుంది.)

హారుకి మురకామి (జననం: 1949) జపనీస్‌ కథ ‘జాంజా ఇన్‌ లవ్‌’ కథాసారం ఇది. దీన్ని ‘ద న్యూయార్కర్‌’ కోసం ఇంగ్లిష్‌లోకి అనువదించింది టెడ్‌ గూసెన్‌. తెలుగులో క్లుప్తంగా తిరిగి చెప్పింది: సాహిత్యం డెస్క్‌. ఫ్రాంజ్‌ కాఫ్కా ‘మెటమార్ఫసిస్‌’ నవలికకు ఈ కథ ట్రిబ్యూట్‌ అనుకోవచ్చు. దాన్నే నిర్ధారిస్తున్నట్టుగా కథ కాఫ్కా పుట్టిన చెకొస్లొవేకియా రాజధాని ప్రాగ్‌లోనే జరుగుతుంది. ఉన్నట్టుండి ఒకరోజు మనిషి (గ్రెగర్‌ జాంజా) కీటకంగా మారిపోవడం కాఫ్కా కథైతే, అలాంటి ఒక కీటకం మనిషిగా మారడం మురకామి కథ.


హారుకి మురకామి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top