ర్యూనొసుకె అకుటగవ

Great Writer Ryunosuke Akutagawa - Sakshi

గ్రేట్‌ రైటర్‌ 

ర్యూనొసుకె అంటే జపనీస్‌లో డ్రాగన్‌ కుమారుడు అని అర్థం. చైనీస్‌ క్యాలెండర్‌ ప్రకారం ‘డ్రాగన్‌’ సంవత్సరంలో డ్రాగన్‌ నెలలో డ్రాగన్‌ రోజున డ్రాగన్‌ గంటలో పుట్టాడు ర్యూనొసుకె అకుటగవ (1892–1927). అందుకే ర్యూనొసుకె అని పేరు పెట్టారు. అయితే ఆయన జన్మించాక వాళ్లమ్మ మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఇది ఆయన్ని జీవితాంతం వెంటాడింది. ర్యూనొసుకెను పసిప్రాయంలోనే బంధువులు దత్తత చేసుకున్నారు. అక్కడే పెరిగాడు. చిన్నతనంలోనే చైనీస్‌ క్లాసికల్‌ సాహిత్యం మీద ఆసక్తి పెంచుకున్నాడు. తన రెండో కథ ‘రషోమన్‌’ను 1915లో ప్రచురించినప్పుడు ఆయన స్నేహితులు తీవ్రంగా విమర్శించారు. కానీ తర్వాత వచ్చిన కథలతో నెమ్మదిగా పేరు రావడం మొదలైంది.

సుమారు 150 కథలు రాశాడు.  కథ కన్నా కథనానికి ప్రాధాన్యం ఉండాలని వాదించేవాడు. జపాన్‌ కథానికకు ఆద్యుడిగా ఆయన పేరు చెబుతారు. అకుటగవ కథ ‘ఇన్‌ ఎ గ్రోవ్‌’ ఆధారంగా 1950లో అకిరా కురసోవా తెరకెక్కించిన ‘రషోమన్‌’ ప్రపంచ ప్రసిద్ధ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. చిత్రంగా, అకుటగవ రెండో కథ ‘రషోమన్‌’నే కురసోవా తన సినిమా టైటిల్‌కూ కథానేపథ్యానికీ వాడుకున్నాడు. చైనాలో కొంతకాలం విలేఖరిగా పనిచేసినప్పుడు అకుటగవ ఆరోగ్యం దెబ్బతింది. అదీగాక తల్లిలాగా తనకూ మానసిక వైకల్యం సంభవించిందని ఆందోళనకు గురయ్యేవాడు. అవే భ్రాంతులు ఎక్కువవడంతో 35వ ఏటే ఆత్మహత్య చేసుకోవడం గొప్ప సాహిత్య విషాదం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top