జెఫ్రీ బాయ్‌టాక్‌

Famous Women Cricket Comentators - Sakshi

ఈ పెద్దాయనేంటి.. పిల్లాడిలా మాట్లాడేశారు! పైగా పెద్ద క్రికెటర్‌.. పెద్ద క్రికెట్‌ కామెంటేటర్‌. పురుషుల గేమ్‌కి స్త్రీలు కామెంటరీ ఇవ్వలేరట! ఎందుకట! ‘‘అది పవర్‌ గేమ్‌.. పేస్‌ గేమ్‌.. ఆ ఎనాలిసిస్‌ను మహిళలివ్వలేరు’’ అంటాడు. ఎందుకివ్వలేరూ.. లీసా స్థలేకర్‌ ఇచ్చేశారు.. ‘‘తమరీ గేమ్‌కి అన్‌ఫిట్‌’’ అని ‘బాయ్‌టాక్‌’కి.

ఇంగ్లండ్‌లో.. వచ్చేనెల వెస్టిండీస్‌కి, ఇంగ్లండ్‌కీ టెస్ట్‌ మ్యాచ్‌లు మొదలౌతున్నాయి. ఇరవై రోజులు. బి.బి.సి. రేయో టీమ్‌ అక్కడ కూర్చొని కామెంటరీ ఇస్తుంది. అయితే ఈసారి ఆ కామెంటరీ టీమ్‌లో జెఫ్రీ బాయ్‌కాట్‌ ఉండటం లేదు! అవును.. వెయ్యి బంతుల్ని మింగిన 79 ఏళ్ల ఈ క్రికెట్‌ రాబందు.. తుపాను లాంటి బి.బి.సి. నిర్ణయానికి కొట్టుకుపోయాడు. ఇంగ్లండ్‌ జట్టు మాజీ ఓపనర్‌.. జెఫ్రీ బాయ్‌కాట్‌. అంతటివాడినా బి.బి.సి. పక్కన పెట్టింది! ఇదేమీ పెద్ద విషయం కాదు. లేదా అంతటి మనిషి చేత ప్రేక్షకులే లేని పిచ్‌లపై జరిగే మ్యాచ్‌ల గురించి ఏం కామెంటరీ చెప్పిస్తాంలెమ్మని బి.బి.సి. ఆయనను అలా గౌరవించి ఉండొచ్చు.

వెంటనే ‘ది టెలిగ్రాఫ్‌’ పత్రిక ఒక కాలమ్‌ కోసం బాయ్‌కాట్‌ను సంప్రదించింది. మైక్రోఫోన్‌ వెనుక తన సుదీర్ఘమైన కెరీర్‌ గురించి ఆ కాలమ్‌లో రాశారు బాయ్‌కాట్‌. ఇంకో మాట కూడా. ‘మహిళా కామెంటేటర్‌లు.. మగవాళ్ల మ్యాచ్‌లకు కామెంటరీ ఇవ్వడానికి సరిపోరు’ అనేశాడు! అంతే! మ్యాచ్‌ మొదలైంది. జెండర్‌ మ్యాచ్‌. లీసా స్థలేకర్‌ ఆయన మీదకు మొదటి బౌన్సర్‌ విసిరారు. 

లీసాతో (ఎడమ) మెలనీ జోన్స్‌ , ఇసా గుహా (కుడి)

లీసా భారతీయ సంతతి మాజీ ఆస్ట్రేలియన్‌ కెప్టెన్‌. సక్సెస్‌ఫుల్‌ కామెంటేటర్‌. ‘‘టెస్ట్‌ క్రికెట్‌ ఆడిన పురుషులు మాత్రమే పురుషుల టెస్ట్‌ క్రికెట్‌కు కామెంటరీ ఇవ్వగలరు’’ అని బాయ్‌కాట్‌ అన్న మాటను పట్టించుకో తగని విషయంగా ఆమె కొట్టేపారేశారు. ‘రబ్బిష్‌’ అనేశారు. అలాగైతే జిమ్‌ మాక్స్‌వెల్, హర్షాభోగ్లే అసలు క్రికెట్‌ కామెంటరీనే చెయ్యకూడదు అన్నారు. (క్రికెట్టే ఆడని కామెంటేటర్‌లు వాళ్లు). ‘‘మహిళల మ్యాచ్‌లకు పురుషులు కామెంటరీ ఇవ్వడానికి ఉవ్విళ్లూరుతున్నప్పుడు మేమేమీ వారికి అడ్డు చెప్పలేదు. మరి ప్రతిభను నిరూపించుకోడానికి ఉత్సాహపడుతున్న మమ్మల్నెందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు’’ అని లీసా అడుగుతున్నారు. ఆ మాట అడిగేందుకు ఆమెకు తగిన అర్హతలే ఉన్నాయి.

40 ఏళ్ల లీసాకు ఆల్‌ రౌండర్‌గా 8 టెస్ట్‌ మ్యాచ్‌లు, 125 వన్‌డే ఇంటర్నేషనల్స్, 54 టీ–ట్వంటీలు ఆడిన అనుభవం ఉంది. వ్యాఖ్యాతగా కూడా పేరు తెచ్చుకున్నారు. జెఫ్రీ బాయ్‌కాట్‌ ఆ కామెంట్‌ చేస్తున్నప్పుడు లీసాతో పాటు మెలనీ జోన్స్, ఇసా గువా, ఆలిసన్‌ మిచల్, అంజుమ్‌ చోప్రా, చార్లెట్‌ ఎడ్వర్డ్స్, ఉరూజ్‌ ముంతాజ్, మెరీనా ఇక్బాల్‌లను మర్చిపోయినట్లున్నారు. లేదా గుర్తించడానికి ఇష్టపడినట్లు లేరు. వీళ్లంతా మహిళా క్రికెట్‌ కామెంటేటర్‌లుగా తమ ప్రత్యేకతల్ని చాటినవారే.  

ఆలిసన్‌ మిచల్‌, అంజుమ్‌ చోప్ర, చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌

క్రికెట్‌ పవర్‌ గేమ్‌ అని, వేగం ఉన్న గేమ్‌ అని.. ఆ పవర్‌ని, వేగాన్ని మహిళా కామెంటేటర్‌లు సరిగ్గా క్యాచ్‌ చేసి, ఉన్నట్లుగా ప్రజెంట్‌ చెయ్యలేరని బాయ్‌కాట్‌ ఉద్దేశం. కాలమ్‌లో రాశాడు కాబట్టి ఉద్దేశం అనే అనుకోవాలి. నోటి మాటగా అని ఉంటే కామెంట్‌ అయి ఉండేది. లీసా ఆశ్చర్యం ఒకటే. ఈ పెద్దాయన.. ఈ జంటిల్‌మన్‌.. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని!! పైగా ఇలా కొట్టారు, అలా పట్టారు అని బంతి బంతికీ ఎవరైనా కామెంటరీ ఇవ్వొచ్చు.

ఎందుకు అలా కొట్టాడు, బంతి ఎలా వేస్తే అలా పట్టగలిగాడు అన్న ఎనాలిసిస్‌ని శక్తిమంతమూ, వేగవంతమూ అయిన ఆటతీరు గల పురుష అనుభవజ్ఞులు మాత్రమే ఇవ్వగలరు అని బాయ్‌కాట్‌ అంటాడు! ఇందుకు లీసా అన్న ఒక్క మాట చాలు.. మహిళలూ సమర్థంగా ఎనలైజ్‌ చేయగలరని చెప్పేందుకు. ‘‘అవును. మీరన్నట్లే క్రికెట్‌ అనేది పవర్‌ గేమ్, పేస్‌ గేమ్‌. కామెంటేటర్‌గా మీరీ గేమ్‌ను వదిలిపెట్టేందుకు తగిన సమయం ఇదే’’ అన్నారు లీసా స్థలేకర్‌.

ఉరూజ్‌ ముంతాజ్‌, మెరీనా ఇక్బాల్‌ (ఎడమ) 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top