రహదారి వడ

Famous Maddur Vada Special Story - Sakshi

బెంగళూరు–మైసూరు మధ్యన రోడ్డు మార్గంలో ప్రయాణించేవారు ఎన్నోఅనుభవాలను మూటకట్టుకుంటారు. రామనగరం పట్టుపురుగుల మార్కెట్, చెన్నపట్నం బొమ్మల దుకాణాలు, మైసూరు మహారాజా ప్యాలెస్, చారిత్రక శ్రీరంగపట్నం... ఇవన్నీ మదిలోకి చేరతాయి. వాటిని మాత్రమే చూసి వెళ్లిపోతే బాధపడకతప్పదు. మద్దూరు వడను వదిలేస్తే ఎలాగ. అక్కడ మాత్రమే దొరికే మద్దూరు వడను రుచి చూడకపోతే, ఆ ప్రయాణానికి పరిపూర్ణత ఉండదు. వాటిని రుచి చూసినప్పుడే ఆ ట్రిప్‌ పూర్తయినట్లు.

మద్దూరు వడను రుచి చూడటానికి ఇంకా కిలోమీటరు దూరాన ఉన్నప్పుడే, ఆ వంటకం తాలూకు ఘుమఘుమలను వాయుదేవుడు మన దగ్గరకు మోసుకొస్తాడు. బెంగళూరుకు 80 కి.మీ. దూరంలో ఉన్న మండ్యా జిల్లాలో ఉంది మద్దూరు. అక్కడకు వస్తుండగా అక్కడకు రకరకాల తినుబండారాలు అమ్మకానికి వస్తాయి. కాని అందరి మనసు 17 వ నంబరు జాతీయ రహదారి మీద ఉన్న మద్దూర్‌ టిఫిన్స్‌ మీదకే మళ్లుతుంది. 

ఇదీ చరిత్ర...
రామచంద్ర బుధ్యా అనే వ్యాపారి మద్దూరు రైల్వేస్టేషన్‌లో 1917లో వెజిటేరియన్‌ టిఫిన్‌ రూమ్‌ ప్రారంభించి, అక్కడ పకోడీలు, ఇడ్లీలు అమ్మడం ప్రారంభించారు. చాలా త్వరగా మంచి పేరు సంపాదించుకున్నారు. అటుగా వెళ్లే ప్రతిరైలు నీరు నింపుకోవడానికి అక్కడ ఆగవలసిందే. నీళ్లతో రైలు పొట్ట నింపి, టిఫిన్లతో వారి కడుపులు నింపుకునేవారు.

‘టిఫనీస్‌’లో దొరికే క్రిస్పీవడ గురించి, ‘‘1948 నుంచి 1973 వరకు ఈ క్యాంటీన్‌ను నేను నడిపాను’’ అంటారు డి.ఎన్‌.చతుర. మద్దూరు రైల్వేస్టేషన్‌లో తిండి దొరికేది కాదు. ఆ సందర్భంలోనే ఈ మద్దూరు వడ అక్కడి వారి ఆకలి తీర్చడానికి కొత్తగా అంకురించింది. అంతవరకు పకోరాలను మాత్రమే ప్రయాణికులకు అమ్మేవారు. ఒకరోజు ఒక రైలు నిర్దేశిత సమయం కంటె ముందుగా వచ్చేసింది. ఆ సమయానికి పకోరాలు సిద్ధంగా లేవు. కాని కస్టమర్లను వదలుకోవడానికి బుధ్యా మనసు అంగీకరించలేదు. అప్పటికప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన బయలుదేరింది. పకోరాలైతే ఎక్కువ సేపు వేయించాలి. అందుకని ఆ పిండిని చేతిలోకి తీసుకుని వడల మాదిరిగా ఒత్తాడు. నూనెలో వేసి వేయించాడు, అందరికీ అందించాడు. ఈ కొత్త స్నాక్‌ అందరికీ నచ్చేసింది. అలా మద్దూరు వడ రూపొందింది. ఇది అక్కడ బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది. క్రమేపీ ఆ మార్గంలో ప్రయాణించే బ్రిటిష్‌ ప్యాసింజర్లు కూడా వీటిని తినడం ప్రారంభించారు.

హై వే మీద...
జాతీయ ర హదారుల మీద వ్యాపారం బాగుంటుందనే ఉద్దేశంతో, వీరి కుమారుడు జయప్రకాశ్‌ ‘మద్దూర్‌ టిఫినీస్‌’ పేరుతో 1987లో ఒక క్యాంటీన్‌ ప్రారంభించారు. అయితే ఈ సంస్థ 2017లో కొన్ని కారణాల వల్ల మూతపడింది. అదే వందవ సంవత్సరం కావడం దురదృష్టం.

ఇందులో పదార్థాలు ఇవే...
బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, మసాలాల మిశ్రమం.

అందరికీ ఇష్టమే...
ఈ వడ ఇప్పటికీ అందరినీ ఆకర్షిస్తోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ, రైల్వే మాజీ మంత్రి జాఫర్‌ షరీఫ్, మాజీ ప్రధాని దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ... వంటి ప్రముఖులు ఈ వడలను రుచి చూశారు. టిఫియాన్స్‌లో ఏర్పాటు చేసిన చిన్న కిచెన్‌లో... ఉల్లిపాయలు తరగటం నుంచి వడలు ఒత్తి, నూనెలో వేయించేవరకు అక్కడ పనివారి పనితనాన్ని చూడటం సరదాగా ఉంటుంది. 1948లో వడ ఖరీదు 50 పైసలు. ఇప్పుడు పదిహేను రూపాయలు. స్పెషల్‌ వడ 20 రూపాయలు.

ఎందుకు రుచిగా ఉంటుంది...
ఈ వడకు ఇంత రుచి ఎందుకు వస్తుందంటే, ఇందులో ఉపయోగించే బొంబాయి రవ్వ,  మైదా, బియ్యప్పిండి, కొబ్బరి ముక్కలు, రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్, కరివేపాకు... వీటిన సరైన పాళ్లలో ఉపయోగిస్తాం. ఉల్లిపాయలను నాసిక్, పుణేల నుంచి తెప్పిస్తాం. నీళ్లను సరైన పాళ్లలో ఉపయోగిస్తాం. ఉల్లిపాయలను సన్నగా పల్చగా పొడవుగా తరగటం వల్ల మంచి రుచి వస్తుంది. జీడిపప్పుల విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటాం. గసగసాలు, నందిని వారి నెయ్యి, బటర్‌లను మాత్రమే ఉపయోగిస్తాం.– చతుర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top