రక్త వడ్డీ

Family crime story in this week - Sakshi

అప్పు ఇస్తే పర్లేదు. కానీ వడ్డీకి అప్పు ఇస్తే? ఆగస్టు 5, 2016. ఉదయం 6 గంటలు.హైదరాబాద్‌లో ఉంటున్న కుమారికి ఉదయాన్నే తల్లిని పలకరించడం అలవాటు.తల్లి విజయవాడలో ఉంటుంది. కాల్‌ చేసింది.ఫోన్‌ స్విచ్‌డాఫ్‌ వస్తోంది. కుమారిలో ఆందోళన మొదలైంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. సాధారణంగా ఫోన్‌ ఆన్‌లో ఉంటుంది. రెండు మూడు రింగులకే తల్లి ఎత్తుతుంది. ఉదయాన్నే నిద్రలేవడం ఆమె అలవాటు.‘అమ్మకు బీపీ ఎక్కువై ఎక్కడైనా పడిపోయి ఉంటుందా’ కింది పోర్షన్‌లో అద్దెకుంటున్న స్వరూపకు ఫోన్‌ చేసింది. ‘అమ్మ  కింద ఉందా. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్విచ్‌డాఫ్‌ వస్తోంది’ అంది కుమారి. 
‘నేనింకా చూడలేదక్కా. కింద అయితే కనిపించలేదు. మా ఆయన ఊరెళ్లాడు. నేనే వెళ్లి చూద్దును కానీ బాత్రూమ్‌లో కాలు స్లిప్‌ అయ్యి బెణికింది. రెండు రోజులుగా కాలు కదపనీయడం లేదు. మెట్లెక్కలేను.కనుక్కొని ఫోన్‌ చేస్తానక్కా’ అంది స్వరూప. ‘సరే’ అని ఫోన్‌ పెట్టేసింది.మళ్ళీ మళ్ళీ ఫోన్‌ కలుపుతూనే ఉంది. తల్లి ఫోన్‌ లిఫ్ట్‌ చేయడంలేదు. అప్పటికి 8:30 అవుతోంది. ఆ ఏరియాలోనే ఉంటున్న తన బాబాయికి కుమారి చేద్దామని నెంబర్‌ కలుపుతుండగా బాబాయి నుంచే ఫోన్‌ వచ్చింది.‘హలో ..’  అంది ‘కుమారీ.. మీ అమ్మ.. ’ ఆ గొంతులోని ఆందోళన ఆమెకేదో కీడుశంకించింది.‘ఏమైంది బాబాయ్‌’ ‘ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. బీరువా లాకర్‌ కూడా తెరిచే ఉంది. మీ అమ్మ మంచమ్మీదే ప్రాణాలొదిలింది. ఎవరో ఇల్లంతా దోచేసినట్టున్నారు. మీ అమ్మ ప్రాణాలు తీశారు. నువ్వు త్వరగా బయల్దేరు. నేను పోలీసులకు ఫోన్‌ చేస్తా’..  బాబాయి మాటలు వింటూనే షాక్‌ అయ్యింది కుమారి. 

రాధానగర్‌లోని శాంతమ్మ(పేరు మార్చాం) ఇల్లు అది. రెండు అంతస్తుల ఇల్లు. కింది పోర్షన్‌ని వాటాకు ఇచ్చి, పై పోర్షన్‌లో శాంతమ్మ ఉంటోంది. వయసు 55 పైనే. భర్త చనిపోయి ఐదేళ్లు అవుతోంది. ఒక్కగానొక్క కూతురు కుమారి హైదరాబాద్‌లోని తన కుటుంబంతో ఉంటోంది. అప్పుడప్పుడూ తల్లిని చూడటానికి వచ్చిపోతుంటుంది. రోజుకు పదిసార్లైనా తల్లీ–కూతుళ్లు ఫోనులో మాట్లాడుకుంటూ ఉంటారు. తల్లికి ఎన్నోమార్లు చెప్పిచూసింది కుమారి ఒక్కదానివి ఇక్కడ ఎందుకు, తన వద్దకు వచ్చేయమని. కానీ, శాంతమ్మ వినిపించుకోలేదు. ‘మీ నాన్న కట్టించిన ఇల్లు ఇది. ఇక్కడ ఉంటే నాకదో ధైర్యం’ అనడంతో కుమారి మారు మాట్లాడలేకపోయేది.
 

ఉబికివస్తున్న కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ పోలీసులకు సమాధానమిచ్చింది కుమారి. గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తున్న తన తల్లి మీద దాడి చేసి 8 లక్షల రూపాయల విలువైన పాతిక తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయారని ఫిర్యాదులో రాసిచ్చింది. కేసు ఫైల్‌ చేసుకున్న పోలీసులు శాంతమ్మ బాడీని పోస్ట్‌మార్టంకి పంపించారు. దుండగులు శాంతమ్మ ముఖం మీద బలంగా కొట్టడం వల్ల ముఖమంతా ఉబ్బింది. కానీ రక్తం కనిపించడం లేదు. ఆధారాల కోసం వెతికారు. నిందితులు వేలిముద్రలు పడకుండా జాగ్రత్తపడ్డారని పోలీసుల దర్యాప్తులో తేలింది.‘బాబాయ్‌..., అమ్మకు ఎన్నిసార్లు చెప్పాను. ఒంటరిగా ఉండద్దు నా వద్దకు వచ్చేయమని. వినిపించుకుందా. కనీసం మీ వద్ద ఉన్నా అమ్మ క్షేమంగా ఉండేది. ఇప్పుడిలా అయ్యింది.. ’ బాబాయ్, పిన్నిలను పట్టుకొని ఏడుస్తున్న కుమారిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు.‘అక్కా. ఊరుకో. ఇలా జరుగుతుందని మనమేమైనా అనుకున్నామా’ అంది స్వరూప.‘స్వరూపా. అద్దె తక్కువ ఇచ్చినా పర్లేదు. అమ్మను జాగ్రత్తగా చూసుకోమని చెబుతూనే ఉన్నాను.. నువ్వైనా చూడొద్దా’ ఏడుస్తూనే ఉంది కుమారి. 

‘అక్కా.. రోజూ అమ్మను కలుస్తూనే ఉండేదాన్ని. ఈ కాలు నొప్పి వల్ల రెండ్రోజులుగా కాలు బయటపెట్టడం లేదు. మా ఆయన ఇంట్లో లేకపోవడంతో నేను బయటకు కూడా తొంగి చూళ్లేదు. ఈ ఖర్మ ఇప్పుడే రావాలా. కాలును భారంగా ఈడుస్తూ’ తిట్టుకుంటూ ఏడుస్తోంది స్వరూప.అప్పుడే ఊరి నుంచి వచ్చిన స్వరూప భర్త రవీంద్ర విషయం తెలుసుకొని నిర్ఘాంతపోయాడు.‘అయ్యో అమ్మా! ఎంత దారుణం జరిగిపోయింది.. మమ్మల్ని సొంత బిడ్డల్లా చూసుకున్న నిన్ను పొట్టనబెట్టుకున్నది ఎవరు.?’ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు రవీంద్ర. ఎవరెంత ఏడ్చినా పోయిన కాలం, ప్రాణం తిరిగిరావుగా అంటూ నిట్టూర్చారు అక్కడ చేరిన జనం.సంఘటన స్థలంలో దొరికిన వస్తువులను తీసుకొని చుట్టుపక్కల అందరినీ మరోమారు విచారించి పోలీసులు ళ్లిపోయారు. శాంతమ్మ కర్మకాండలు పూర్తయ్యాయి. 

ఆగస్టు 18.మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్వరూప, రవీంద్రలను అరెస్ట్‌ చేశారు పోలీసులు.విచారణలో నిందితులు చెప్పిన విషయాలు విన్న వారంతా నిర్ఘాంతపోయారు. ఆటోడ్రైవర్‌గా పనిచేసే రవీంద్రకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. స్వరూపతో పరిచయం ఏర్పడ్డాక భార్యాబిడ్డలను అత్తగారింట్లో పిల్లల చదువుకోసమంటూ ఉంచాడు. స్వరూపతో కలిసి శాంతమ్మ ఇంట్లో రెండేళ్ల క్రితం అద్దెకు దిగి, సహజీవనంచేస్తున్నాడు. అప్పుడప్పుడు అత్తగారింట్లో ఉన్న భార్యాబిడ్డల వద్దకు వెళ్లి వస్తుండేవాడు రవీంద్ర.శాంతమ్మకు కొన్ని రోజుల్లోనే బాగా చేరిక అయ్యింది స్వరూప. నమ్మకంగా అనిపించడంతో కుమారికూడా శాంతమ్మ బాధ్యతలను స్వరూపకు అప్పజెప్పుతూ ఉండేది. ఏమీ భయపడవద్దని కుమారికి భరోసా ఇస్తుండేది స్వరూప.శాంతమ్మ తన వద్ద ఉన్న డబ్బులను వడ్డీలకు తిప్పుతుండేది. ఏడాది క్రితం శాంతమ్మ వద్ద ఐదు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు స్వరూప, రవీంద్రలు. ఆర్నెల్లు వడ్డీ డబ్బులు సక్రమంగానే ఇచ్చారు. కానీ ఈ ఆర్నెల్లుగా వడ్డీ డబ్బులు అడిగితే అదిగో ఇదిగో అని దాటవేస్తున్నారు. కూతురికి ఈ విషయం చెబుదామంటే ‘వడ్డీల వ్యాపారం ఎందుకు చేస్తున్నావ’ని తననే కోప్పడుతుందని ఈ విషయాన్ని కుమారి వద్ద దాచింది శాంతమ్మ. వడ్డీకి ఇచ్చిన డబ్బు అసలుతో సహా తీర్చేయమని శాంతమ్మ రోజూ గొడవ పెట్టుకోవడంతో ఈ మధ్య రవీంద్ర ఇంటికి సరిగా రావడంలేదు. 

ఆగస్టు 4న మధ్యాహ్నం నుంచి స్వరూపతో గొడవ పడుతూనే ఉంది శాంతమ్మ. ఇల్లు ఖాళీ చేయమని, డబ్బులు ఇవ్వకపోతే పోలీసు కంప్లైంట్‌ ఇస్తానని బెదిరించి పై అంతస్తులోని తన వాటాలోకి వెళ్లిపోయింది. రాత్రికి బయట నుంచి వచ్చిన రవీంద్రకు విషయం చెప్పింది స్వరూప.‘రోజు రోజుకూ ఈ ముసల్దాని నస ఎక్కువైపోతుంది. ఈ రోజు అటో ఇటో తేలుద్దాం పద’... అంటూ కోపంతో పై పోర్షన్‌లో కెళ్లాడు రవీంద్ర. రవీంద్ర, స్వరూపలను చూసిన శాంతమ్మ ..‘ఏంటి మీరు.. పైకి ఎందుకొచ్చారు. రేప్పొద్దునే ఇల్లు ఖాళీ చేసేయండి. నా డబ్బులు నాకు పడేయకపోతే మీ అంతు తేలుస్తా’ అంది. ‘ముసల్దానివి నువ్వేం మా అంతు చూస్తావ్‌’ అంటూ పిడికిలి బిగించి శాంతమ్మ ముఖం మీద బలంగా కొట్టాడు రవీంద్ర. ఆ దెబ్బకు శాంతమ్మ వెళ్లి గోడకు కొట్టుకొని నేల మీద పడింది. అంతటితో ఆగకుండా స్వరూప, రవీంద్రలు నేలమీద పడిన శాంతమ్మ గొంతు పట్టి ఊపిరాడకుండా చేశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక ఈడ్చుకుంటూ లోపలి గదిలోకి తీసుకెళ్లారు. శాంతమ్మ శరీరాన్ని మంచం మీద పడుకోబెట్టి అక్కడే ఉన్న చీరతో రక్తం అంతా తుడిచేశారు. మంచం పక్కనే ఉన్న బీరువా చూశారు. ఆ బీరువాలోనే ఆమె బంగారం దాస్తుందని స్వరూపకు తెలుసు. ‘ఇది మన మీదకు రాకుండా ఉండాలంటే ఇంట్లో దొంగతనం జరగాలి’ అన్నాడు రవీంద్ర. అతని మాటలను అర్థం చేసుకున్న స్వరూప పరుపు కింద ఉన్న తాళం చెవులను వెతికి తీసి బీరువా తెరిచింది. బీరువాలోని బట్టలన్నీ చిందరవందంగా పడేసి, లోపలున్న పాతిక తులాల బంగారాన్ని, యాభై వేల రూపాయలను తీసుకున్నారు. ఎక్కడెక్కడైతే తమ వేలిముద్రలు పడే అవకాశం ఉందో అక్కడ జాగ్రత్తగా తుడిచేసి, ఆ బట్టలు తీసుకొని, తలుపులు దగ్గరగా వేసి, వెళ్లిపోయారు. రవీంద్ర ఆ బంగారాన్ని తీసుకొని, దానిని అమ్మేసి పూర్తిగా సద్దుమణిగాక వస్తానని స్వరూపకు చెప్పి వెళ్లిపోయాడు. స్వరూప ఇంట్లోనే ఉండిపోయింది. శాంతమ్మను చంపి రక్తం తుడిచిన గుడ్డను, ఆమె ఫోన్‌ను తనతో పాటు తీసుకెళ్లి ఎవరికీ అనుమానం రాకూడదని కృష్ణా నదిలో విసిరేసి వెళ్లిపోయాడు రవీంద్ర. ఉదయాన్నే కుమారి తల్లికి ఫోన్‌ చేస్తే తీయడం లేదని స్వరూపను అడిగింది. తను రెండు రోజులుగా కాలు కదపలేక నొప్పితో బాధపడుతున్నానని, భర్త ఊర్లో లేడని చెప్పింది స్వరూప.

ఘటనాస్థలంలో వేలిముద్రలు దొరక్కపోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. నేరస్తులు నేరం చాలా తెలివిగా చేయడానికి ప్రయత్నించారని అర్థం చేసుకున్నారు.కాని ఇంటి హాల్‌లో తుడిచినా పూర్తిగా పోని ఫ్లోరింగ్‌పై రక్తపు మరకలు వారి దృష్టిలో పడ్డాయి. అంటే అక్కడే శాంతమ్మ మీద దాడి జరిగిందని అర్థం చేసుకుని హాల్‌ అంతా జల్లెడ పట్టారు. ఓ మూలన మగవారి చెప్పుకున్న బొటనవేలి నాడ ఒకటి దొరికింది. దాడిలో ఊపిరి ఆడక శాంతమ్మ తన్నుకులాడినప్పుడు ఆమెపై దాడి చేసిన వ్యక్తి కాలుకి తెగడానికి సిద్ధంగా ఉన్న చెప్పు నాడ తెగిపోయి ఉంటుందని గ్రహించారు. లోపల గదిలో డబ్బు కోసం బీరువా చిందర వందర చేసి ఉండగా అక్కడ కూడా వెతికితే రెండు మట్టిగాజు ముక్కలు దొరికాయి. అంటే ఈ నేరం చేసింది ఓ ఆడ–మగ అనేది వీటి ఆధారంగా పోలీసులకు అర్థమైంది. చుట్టుపక్కలవాళ్లను ఎంక్వైరీ చేస్తే అద్దెకున్నవారితో అప్పుడప్పుడు శాంతమ్మ గొడవపడటం చూశామని చెప్పారు. పది రోజుల పాటు స్వరూప, రవీంద్రల మీద నిఘా పెట్టిన పోలీసులకు విషయమంతా స్పష్టమైంది. దీంతో పోలీసులు దోషులను పట్టుకొని బంగారం, నగదును స్వాధీనం చేసుకోవడమే కాకుండా శాంతమ్మను హత్య చేసిన నేరానికి ఇద్దరినీ కటకటాల వెనక్కి పంపించారు.
– నిర్మలారెడ్డి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top