నిండు ప్రాణం బలి

నిండు ప్రాణం బలి


అంతా రహస్యంఉక్కులాంటి మనిషి... పిట్టపిడుగున పోయాడు. భార్యాపిల్లలు భోరుమని ఏడుస్తున్నారు. ఊహించని హటాత్పరిణామం వారిని ఒక్కసారిగా కుదిపేసింది. ఆ కుటుంబం ఒక్క క్షణంలో నిరాధారమైపోయింది. పోయింది జీవనాధారం మాత్రమే కాదు, పెద్ద ఆలంబన కూడా. ఎప్పుడూ జ్వరం, తలనొప్పి అని కూడా అనని మనిషికి ఉన్నట్లుండి ఒక చెయ్యి చచ్చుబడిపోయింది, పొట్ట ఉబ్బిపోయింది, కుప్పకూలిపోయాడు.ఇంతకీ ఎలా పోయాడంటారు? చూడడానికి వచ్చిన వాళ్లలో ఎవరో ఆరాగా అడుగుతున్నారు... దానికి సమాధానం లేదు. అవును, ఎవరి దగ్గరా జవాబు లేదు. ఒక్క ప్రాణాలు వదిలిన వ్యక్తి దగ్గర తప్ప. భార్యాపిల్లలకూ మిగిలింది ప్రశ్నలే. ఎలా దర్యాప్తు చేస్తే ఆధారం దొరుకుతుంది? ఇది కూడా బదులు దొరకని ప్రశ్నే.కరీంనగర్‌కు చెందిన వంగర నాగరాజుకు 39 ఏళ్లు. క్యాటరింగ్‌ పనులకు వెళ్లేవాడు. అలా క్యాటరింగ్‌ పనుల మీద పొరుగూళ్లకు పోవడం, నాలుగైదు రోజులకు రావడం మామూలే. అయితే బెంగళూరుకు పోయింది ఆహారాన్ని వడ్డించడానికి కాదు, ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడానికి అని అతడు చనిపోయిన తర్వాత బయటపడింది. పెద్దకొడుకు జగదీశ్‌కి తండ్రి మరణం అనుమానాస్పదంగా అనిపించింది. తల్లికి కూడా చెప్పకుండా ఇంట్లో తండ్రి వస్తువులన్నీ వెతికాడు. పెట్టెలో అట్టడుగున కొన్ని కాగితాలు దొరికాయి. ఆ దొరికిన కాగితాలు బెంగళూరులోని ఒక లాబొరేటరీకి సంబంధించినవి.అక్కడ ఏం జరుగుతుంది?

అది మందుల పనితీరును పరిశీలించే ప్రయోగశాల. ఆ ప్రయోగాలు మనుషుల మీదనే జరుగుతున్నాయి. ఒక కొత్త మందు తయారైన తర్వాత దాని పనితీరును నిర్ధారించుకోవడానికి మనుషులను పావులు చేస్తున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న వారికి డబ్బు ఎర వేస్తారు. ప్రయోగానికి నా దేహాన్ని ఉపయోగించుకోవచ్చు అని ఆ వ్యక్తి చేత సంతకాలు తీసుకుంటారు. ఇదొక విషవలయం. ఎక్కడో తయారయ్యే మందులను మార్కెట్‌లో విడుదల చేయడానికి ముందు జరగాల్సిన ప్రయోగాల కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బడా కంపెనీల మాయా నాటకమే ఇదంతా. తండ్రికి జరిగిన మోసం అర్థమైంది జగదీశ్‌కి.బెంగళూరులోని ల్యాబొరేటరీని ఫోన్‌లో సంప్రదించాడు. లాబ్‌ నిర్వహకులు ‘అతడికి సంబంధించిన డాక్యుమెంట్‌లను పోస్టులో పంపిస్తాం’ అని క్లుప్తంగా చెప్పి ఫోన్‌ పెట్టేశారు. ఒక ప్రాణం పోయినందుకు ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడం వంటి బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకునే దాఖలాలు కనిపించడం లేదు. ఇలాంటి ప్రయోగాల కోసం ఒక్కొక్కరికి ఐదు నుంచి పాతికవేల రూపాయలు ఇస్తుంటారని సమాచారం. కొంతమంది స్వచ్ఛందంగా ప్రయోగానికి అంగీకరిస్తుంటారు కూడ. నాగరాజుతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారనేది తెలియలేదు.ఎర వేస్తారు!

ఇందులో మందుల తయారీ కంపెనీల ప్రమేయం నేరుగా ఉండదు. ప్రయోగం, నిర్ధారణ మరొక కంపెనీకి అప్పగిస్తారు. ఆ కంపెనీలు అత్యంత రహస్యంగా పావులు కదుపుతాయి. ఇందుకోసం ఓ నెట్‌వర్క్‌ చాపకింద నీరులా పని చేస్తుంటుంది. దాదాపుగా కిడ్నీ రాకెట్‌లాంటిదే. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ... చేస్తున్న పనిలో వచ్చే సంపాదన ఇంటిని పోషించడానికి సరిపోక ఇబ్బందులు పడుతున్న వాళ్లనీ, వాళ్లలో ఆరోగ్యంగా ఉండే వారిని కనిపెడతారు. వారికి డబ్బు ఎర చూపించి వల వేస్తారు. సందిగ్ధంలో ఉన్న వారిని మాటలతో గారడీ చేస్తారు. ఒప్పించిన తర్వాత వాళ్లను బెంగళూరులో ఉన్న తమ ఏజెంటుతో కలుపుతారు. ఏజెంటు మనుషులు రైల్వేస్టేషన్‌లో వీరితో కలుస్తారు. అక్కడి నుంచి వాహనంలో ఎక్కించుకుని నేరుగా ల్యాబ్‌ దగ్గర దించుతారు. ఆరోగ్య పరీక్షలు, సంతకాలు పూర్తయ్యాక వారి మీద మందుల ప్రయోగం జరుగుతుంది. వాటి ఫలితాలను నమోదు చేసుకుని కొంత డబ్బిచ్చి పంపేస్తారు. మళ్లీ నెలకో, రెండు నెలలకో వాళ్లు చెప్పిన సమయానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ విషవలయంలో చిక్కుకున్న వాళ్ల పరిస్థితి దాదాపుగా నాగరాజులాగానే ఉంటుంది.చదవడానికి ఇదేదో సినిమా కథలా ఉందేమో కానీ, రీల్‌ కాదు... రియల్‌. అసలు విషయమేమిటంటే.... ఆయా కంపెనీలు ఇలాంటి క్లినికల్‌ ట్రయల్స్‌ని ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వాళ్లు నివేదిస్తారు. అయితే... అవన్నీ ప్రాణాల మీదకు రాకుండా బయటపడిన వాళ్ల రిపోర్టులే ఉంటాయి. మందులు ప్రాణం పోస్తాయి, ప్రయోగాల దశలో కొన్ని ప్రాణాలను తీస్తాయి కూడ!

Back to Top